పూర్ణాహుతితో పరిపూర్ణం | CM YS Jagan Sri Lakshmi Mahayagnam ended in Vijayawada | Sakshi
Sakshi News home page

పూర్ణాహుతితో పరిపూర్ణం

Published Thu, May 18 2023 4:19 AM | Last Updated on Thu, May 18 2023 4:21 AM

CM YS Jagan Sri Lakshmi Mahayagnam ended in Vijayawada - Sakshi

అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం జగన్, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి

సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అష్టోత్తర శత కుండాత్మక, చండీ, రుద్ర, రాజ­శ్యామల సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహా­యజ్ఞం బుధవారంతో ముగిసింది. వేద మంత్రోచ్ఛారణల నడుమ పీఠాధిపతులు ముందుండి నడిపించగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా మహా­యజ్ఞ అఖండ పూర్ణాహుతి కార్యక్రమం వైభవంగా పూర్తైంది. రాష్ట్ర సర్వతోముఖాభి­వృద్ధి, శాంతి సౌభాగ్యాలు, పాడిపంటలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలతో ప్రజలంతా వర్థిల్లాలని కాంక్షిస్తూ, ప్రకృతి అను­గ్రహం ఎల్లప్పడూ కొనసాగాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్‌ ఈనెల 12వ తేదీన  మహాయజ్ఞ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఆరు రోజులపాటు నిత్య పారాయణాలు, వైదిక క్రతువులు, వివిధ క్షేత్రాల కల్యాణోత్సవాలు, పీఠాధిపతుల అనుగ్రహభాషణలు, ప్రవ­­­చనాలు, పూర్తి ఆధ్యాత్మిక వాతావ­రణంలో నిర్వహించిన మహాయజ్ఞ క్రతువులో 600 మందికి పైగా రుత్వికులు, వేదపండితులు పాలుపంచుకున్నారు. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు, దేవదాయశాఖ కమిషనర్‌ ఎస్‌. సత్యనారాయణ దంపతులు దీక్షాధారణ చేపట్టి రోజువారీ యజ్ఞ కార్యక్రమాలలో పాల్గొన్నారు. 

అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం
మహాయజ్ఞం ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సీఎం జగన్‌కు వేద పండితులు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పాంచరాత్ర, వైదిక స్మార్త, వైఖానస, శైవ ఆగమ యాగశాలలను సందర్శించిన సీఎం జగన్‌ వేద పండితుల సూచనలకు అనుగుణంగా హోమగుండంలోకి సుగంధ ద్రవ్యాలను జారవిడిచి పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక మండపంలో ఏర్పాటు చేసిన అనంత(మహా)లక్ష్మీ అమ్మవారికి స్వయంగా పంచామృతాలతో అభిషేకం చేసి హారతి ఇచ్చారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులందరి పేర్లతో, గోత్రనామాలతో వేదపండితులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా రూపొందించిన దుర్గ గుడి మాస్టర్‌ ప్లాన్‌ నమూనాను యజ్ఞశాల వద్ద ముఖ్యమంత్రి పరిశీలించారు. 

ఆశీర్వదించిన పీఠాధిపతులు
మహాయజ్ఞం అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో విశాఖ శారదా పీఠాధిపతి శ్రీస్వరూపానందేంద్రస్వామి, మైసూరు దత్తపీఠాధిపతి శ్రీగణపతి సచ్చిదానందస్వామి, రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థస్వామి, విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీస్వాత్మానందేంద్ర స్వామితోపాటు శ్రీత్రిదండి దేవనాథ జియ్యర్‌ స్వామి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరి బాగోగులు కోరుతూ ప్రత్యేక సంకల్పం తీసుకుని మహాయజ్ఞ దీక్షను నిర్వహించిన సీఎం జగన్‌కు పీఠాధిపతులు వేర్వేరుగా వేదాశీర్వచనం అందజేశారు. ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు, మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, మంత్రులు తానేటి వనిత, జోగి రమేష్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

సంపూర్ణంగా ఫలప్రదం: ఉప ముఖ్యమంత్రి కొట్టు
వేదాలు సూచించిన ఎనిమిది ఆగమాల ప్రకారం దేశ చరిత్రలో తొలిసారిగా ఆరు రోజులు నిర్వహించిన మహాయజ్ఞం, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పం సంపూర్ణంగా ఫలప్రదమైందని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. దేవదాయశాఖ కమిషనర్‌ సత్యనారాయణ, ఇతర అధికారులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్‌ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ కార్యక్రమానికి ముందురోజు వరుణ దేవుడు వర్షం కురిపించి ఆశీస్సులు అందించినట్లు చెప్పారు.

ప్రత్యేకంగా శ్రీనగర్‌ నుంచి తెప్పించిన కల్తీ లేని కుంకుమ పువ్వు, ఎక్కడా దొరకని కస్తూరిని విశేష ద్రవ్యాలతో పూజల్లో ఉపయోగించినట్లు వెల్లడించారు. మహాయజ్ఞం విజయవంతంగా పూర్తి కావడం పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశార న్నారు. సనాతన హిందూ ధర్మం పట్ల ముఖ్యమంత్రికి ఉన్న గౌరవానికి ఇది నిదర్శనమని చెప్పారు. రాష్ట్రమంతా ధర్మ ప్రచారం కోసం ప్రభుత్వం ఇప్పటికే ధర్మపరి రక్షణ పరిషత్‌ను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.

ఈనెల 25 నుంచి 31వతేదీ వరకు శ్రీశైలంలోని శివాజీ రాజగోపురంపై బంగారు కలశం ఏర్పాటు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా మల్లిఖార్జునస్వామి వారికి మహా కుంభాభిషేకం నిర్వహిస్తామన్నారు. మహాయజ్ఞం క్రతువును నిర్విఘ్నంగా పూర్తి చేసిన అర్చన ట్రైనింగ్‌ అకాడమీ డైరెక్టర్‌ వేదాంత రాజగోపాల చక్రవర్తి, గోపాలాచార్యులు, కైతేపల్లి సుబ్రహ్మణ్యం, కండవల్లి సూర్యనారాయణాచార్యులు, మృత్యుంజయప్రసాద్, దుర్గగుడి స్థానాచార్యులు శివప్రసాద్‌ను ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, దేవదాయ శాఖ కమిషనర్‌ సత్యనారాయణ అభినందించారు.

ముఖ్యమంత్రి జగన్‌కు కాణిపాకం గణపతి ఆశీస్సులు
యాదమరి (చిత్తూరు జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులను వేదపండితులు అందచేశారు. బుధవారం విజయవాడలో శ్రీలక్ష్మీ మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్‌ను కాణిపాకం ఆలయం చైర్మన్‌ మోహన్‌రెడ్డి కలసి స్వామివారి తీర్థ ప్రసాదాలు, వేదపండితుల ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement