Lakshmi pooja
-
వైభవంగా దీపావళి లక్ష్మీపూజలు
సోలాపూర్: దేశవ్యాప్తంగా అందరూ అంగరంగ వైభవంగా జరుపుకునే దీపావళి పర్వ దినోత్సవాన్ని సోలాపూర్ పట్టణం, జిల్లా వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా జరుపుకున్నారు. ఆవు లేగ దూడల ధూళి సంప్రదాయ కార్యక్రమంతో గోపూజలతో ప్రారంభమైన దీపావళి ధన త్రయోదశి, నరక త్రయోదశి తదుపరి దీపావళి పర్వదినానికి ఆకర్షణీయమైన లక్ష్మీ పూజలు శుక్రవారం రాత్రులతోపాటు శనివారం వేకువ జాము నుంచి తెల్లవారే వరకు వ్యాపారులు కోలాహలంగా జరుపుకున్నారు. వ్యాపారులు లక్ష్మీ పూజలను తమ తమ షాపులలో సాక్షాత్తు లక్ష్మీదేవిని హోటల్లో ప్రతిష్టించి సాంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించి వ్యాపారాలు సజావుగా లాభాల బాటలో కొనసాగాలని అలాగే ఆరోగ్యం, అందరి శ్రేయస్సు కోసం ప్రారి్థస్తుంటారు. పూజా కార్యక్రమాలు పిదప బాణసంచా టపాకాయలు పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. వీధి వీధిలో టపాకాయల మోత మోగింది. ఈ సందర్భంగా గత మూడు నాలుగు రోజులుగా పట్టణం, జిల్లా వ్యాపార కూడళ్లు పూజాసామగ్రి, అలంకరణ వస్తువుల విక్రయాలతో కిటకిటలాడాయి. ఇదీ చదవండి: అవి రెండే.. కానీ ఒకటయిపోతాయి! -
పూర్ణాహుతితో పరిపూర్ణం
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అష్టోత్తర శత కుండాత్మక, చండీ, రుద్ర, రాజశ్యామల సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం బుధవారంతో ముగిసింది. వేద మంత్రోచ్ఛారణల నడుమ పీఠాధిపతులు ముందుండి నడిపించగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా మహాయజ్ఞ అఖండ పూర్ణాహుతి కార్యక్రమం వైభవంగా పూర్తైంది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, శాంతి సౌభాగ్యాలు, పాడిపంటలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలతో ప్రజలంతా వర్థిల్లాలని కాంక్షిస్తూ, ప్రకృతి అనుగ్రహం ఎల్లప్పడూ కొనసాగాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్ ఈనెల 12వ తేదీన మహాయజ్ఞ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆరు రోజులపాటు నిత్య పారాయణాలు, వైదిక క్రతువులు, వివిధ క్షేత్రాల కల్యాణోత్సవాలు, పీఠాధిపతుల అనుగ్రహభాషణలు, ప్రవచనాలు, పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించిన మహాయజ్ఞ క్రతువులో 600 మందికి పైగా రుత్వికులు, వేదపండితులు పాలుపంచుకున్నారు. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు, దేవదాయశాఖ కమిషనర్ ఎస్. సత్యనారాయణ దంపతులు దీక్షాధారణ చేపట్టి రోజువారీ యజ్ఞ కార్యక్రమాలలో పాల్గొన్నారు. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం మహాయజ్ఞం ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సీఎం జగన్‌కు వేద పండితులు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పాంచరాత్ర, వైదిక స్మార్త, వైఖానస, శైవ ఆగమ యాగశాలలను సందర్శించిన సీఎం జగన్ వేద పండితుల సూచనలకు అనుగుణంగా హోమగుండంలోకి సుగంధ ద్రవ్యాలను జారవిడిచి పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక మండపంలో ఏర్పాటు చేసిన అనంత(మహా)లక్ష్మీ అమ్మవారికి స్వయంగా పంచామృతాలతో అభిషేకం చేసి హారతి ఇచ్చారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులందరి పేర్లతో, గోత్రనామాలతో వేదపండితులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా రూపొందించిన దుర్గ గుడి మాస్టర్ ప్లాన్ నమూనాను యజ్ఞశాల వద్ద ముఖ్యమంత్రి పరిశీలించారు. ఆశీర్వదించిన పీఠాధిపతులు మహాయజ్ఞం అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో విశాఖ శారదా పీఠాధిపతి శ్రీస్వరూపానందేంద్రస్వామి, మైసూరు దత్తపీఠాధిపతి శ్రీగణపతి సచ్చిదానందస్వామి, రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థస్వామి, విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీస్వాత్మానందేంద్ర స్వామితోపాటు శ్రీత్రిదండి దేవనాథ జియ్యర్ స్వామి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరి బాగోగులు కోరుతూ ప్రత్యేక సంకల్పం తీసుకుని మహాయజ్ఞ దీక్షను నిర్వహించిన సీఎం జగన్‌కు పీఠాధిపతులు వేర్వేరుగా వేదాశీర్వచనం అందజేశారు. ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు, మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, మంత్రులు తానేటి వనిత, జోగి రమేష్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంపూర్ణంగా ఫలప్రదం: ఉప ముఖ్యమంత్రి కొట్టు వేదాలు సూచించిన ఎనిమిది ఆగమాల ప్రకారం దేశ చరిత్రలో తొలిసారిగా ఆరు రోజులు నిర్వహించిన మహాయజ్ఞం, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం సంపూర్ణంగా ఫలప్రదమైందని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. దేవదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ, ఇతర అధికారులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ కార్యక్రమానికి ముందురోజు వరుణ దేవుడు వర్షం కురిపించి ఆశీస్సులు అందించినట్లు చెప్పారు. ప్రత్యేకంగా శ్రీనగర్ నుంచి తెప్పించిన కల్తీ లేని కుంకుమ పువ్వు, ఎక్కడా దొరకని కస్తూరిని విశేష ద్రవ్యాలతో పూజల్లో ఉపయోగించినట్లు వెల్లడించారు. మహాయజ్ఞం విజయవంతంగా పూర్తి కావడం పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశార న్నారు. సనాతన హిందూ ధర్మం పట్ల ముఖ్యమంత్రికి ఉన్న గౌరవానికి ఇది నిదర్శనమని చెప్పారు. రాష్ట్రమంతా ధర్మ ప్రచారం కోసం ప్రభుత్వం ఇప్పటికే ధర్మపరి రక్షణ పరిషత్‌ను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఈనెల 25 నుంచి 31వతేదీ వరకు శ్రీశైలంలోని శివాజీ రాజగోపురంపై బంగారు కలశం ఏర్పాటు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా మల్లిఖార్జునస్వామి వారికి మహా కుంభాభిషేకం నిర్వహిస్తామన్నారు. మహాయజ్ఞం క్రతువును నిర్విఘ్నంగా పూర్తి చేసిన అర్చన ట్రైనింగ్ అకాడమీ డైరెక్టర్ వేదాంత రాజగోపాల చక్రవర్తి, గోపాలాచార్యులు, కైతేపల్లి సుబ్రహ్మణ్యం, కండవల్లి సూర్యనారాయణాచార్యులు, మృత్యుంజయప్రసాద్, దుర్గగుడి స్థానాచార్యులు శివప్రసాద్‌ను ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ అభినందించారు. ముఖ్యమంత్రి జగన్‌కు కాణిపాకం గణపతి ఆశీస్సులు యాదమరి (చిత్తూరు జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులను వేదపండితులు అందచేశారు. బుధవారం విజయవాడలో శ్రీలక్ష్మీ మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్‌ను కాణిపాకం ఆలయం చైర్మన్ మోహన్‌రెడ్డి కలసి స్వామివారి తీర్థ ప్రసాదాలు, వేదపండితుల ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు. -
Kedareswara Vratham: కేదారేశ్వర వ్రతం ఎందుకు చేసుకుంటారంటే!
మహాభారతంలో ధనలక్ష్మి పూజ ప్రస్తావన ఉన్నది. తనకు లేదనకుండా మూడు అడుగుల నేలను దానమిచ్చిన బలి చక్రవర్తిని వామనమూర్తి ఏదైనా వరం కోరుకోమంటాడు. అప్పుడు బలి చక్రవర్తి "దేవా ! ఈ భూమిపైన ఆశ్వియుజ బహుళ త్రయోదశి నుండి మూడు రోజులు నా రాజ్యం ఉండేలాగా, దీపదానాలు దీపారాధనలు చేసుకున్న వారందరూ లక్ష్మీ కటాక్షం పొందే లాగాను అనుగ్రహించండి" అని కోరుకున్నాడు. అప్పటినుంచి లక్ష్మీ పూజ జరుపుకోవడం ఆచారమైంది. దారిద్య్రం నశించి, ధనం సిద్ధించాలంటే ఆశ్వయుజ బహుళ అమావాస్యనాడు లక్ష్మీ పూజ చేయాలి. మార్వాడీవారు ఆ రోజున పగలంతా ఉపవసించి, చంద్రోదయమయ్యాక వంట చేసి, రాత్రి లక్ష్మీ పూజ చేసి, తరువాత టపాకాయలు కాలుస్తారు. "అమావాస్యా యదా రాత్రే దివా భాగే చతుర్దశీ ! పూజనేయా తదా లక్ష్మీః విజ్ఞేయా శుభరాత్రికాః"!! అని పద్మ పురాణం చెప్తోంది. రాత్రి సమయంలో అమావాస్య ఉన్న రోజును దీపావళిగా భావించి, మహాలక్ష్మిని పూజించాలి. "నమస్తే సర్వదేవానాం వరదాసి హరిప్రియే ! యా గతిః త్వత్ప్రసన్నానాం సా మే భూయాత్వదర్చనాత్"!! సర్వ దేవతలకు వరములను ప్రసాదించే హరిప్రియా! మహాలక్ష్మీ ! నీకు నమస్కారము. నువ్వు ప్రసన్నులైన వారికి ఏ సద్గతి లభిస్తుందో, ఆ సద్గతి నీ అర్చన వలన నాకు లభించుగాక ! "ధనదాయ నమస్తుభ్యం నిధి పద్మాధిపాయ చ ! భవంతు త్వత్ప్రసాదాన్మే ధనధాన్యాది సంపదః"!! ధనమును ప్రసాదించు కుబేరా ! నీకు నమస్కారము. పద్మాది నిధులకు అధిపతివైన నీ అనుగ్రహం చేత ధన ధాన్యాది సంపదలు నాకు కలుగుగాక !! - అని ప్రార్థించాలి. కుబేరునకు ధనాధిపత్యము శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో లభించింది. మనకు కూడా మహాలక్ష్మి అనుగ్రహంతో ధనం లభిస్తుంది. ధనమంటే డబ్బు మాత్రమే కాదు. "ధనమగ్నిర్ధనం వాయుః, ధనమింద్రో బృహస్పతిః..." అంటూ సుఖము, సంతోషము, శాంతి, ప్రేమ,, కరుణ, ఆత్మీయత, అనురాగము, ఆరోగ్యము, సౌభాగ్యము, సౌమనస్యము, అనుబంధాలు, విజ్ఞానము మొదలైనవన్నీ ధనాలే ! వీటన్నింటినీ మహాలక్ష్మి దేవి మనకు అనుగ్రహిస్తుంది. కేదార గౌరీ వ్రతం ధన త్రయోదశిని మార్వాడి వారు "ధన్ తెరస్" అంటారు. ఆరోజున కొత్త పద్దు పుస్తకాలకు పూజ చేస్తారు. దీపావళిని బెంగాలీలో కాళీ పూజగా భావించి చేస్తారు. ఆంధ్ర ప్రాంతాల్లో, తెలంగాణలో దీపావళి రోజున "కేదార గౌరీ వ్రతం" చేస్తారు. కేదారమంటే పంట పొలాలు. వ్యవసాయదారులు తమ శ్రమకు తగిన ఫలం లభించి పొలాలన్నీ పచ్చగా కన్నుల పండుగగా ఉండాలని, అలాగే తమ జీవితాలు కలకాలం కళకళలాడుతూ సాగాలని ఈ వ్రతం చేస్తారు. కేదారేశ్వరుడు అంటే పరమేశ్వరుడు. జగన్మాత మంగళ గౌరీ దేవి పరమేశ్వరుని అనుగ్రహం కోసం గొప్పతపస్సు చేసి ఈశ్వరుని మెప్పించి పరమేశ్వరుని శరీరంలో అర్ధ భాగాన్ని పొందింది. ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడయ్యాడు. ఈ కేదారేశ్వర వ్రతం చేసిన దంపతులు అన్యోన్యంగా ఆనందంగా ఉంటారు. గుజరాత్ ప్రాంతంలో దీపావళి నుండి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇంకా నాలుగవ రోజు బలిపాడ్యమినాడు అంటే దీపావళి మరునాడు సుతల లోకం నుంచి వచ్చిన అత్యంత మహనీయుడైన దాత బలి చక్రవర్తిని స్మరించుకోవాలి. ఆ రోజున అనే రకాల వంటకాలు చేసి, నరకుడిని వధించిన శ్రీకృష్ణ పరమాత్మను, గోవర్ధనగిరిని పూజించి, నివేదిస్తారు. ఆ రోజున యజ్ఞార్థము పంచగవ్యాలను ఇచ్చే గోమాతను వత్సతో కలిపి పూజించాలి. ఇంక మరుసటి రోజును "యమ ద్వితీయ - భగినీ హస్త భోజనం" అంటారు. యమధర్మరాజు తన చెల్లెలైన యమునా దేవి ఇంటికి ఆ రోజున వచ్చాడని, ఆమె తన అన్నకు విందు భోజనము పెట్టిందని చెప్తారు. కనుక యమద్వితీయ నాడు అన్నతమ్ములందరూ భగినీ హస్త భోజనము చెయ్యాలి. దీపావళి పండుగ చేసుకోవటానికి శాస్త్రీయ కారణం కూడా కనిపిస్తుంది. వర్షాకాలంలో పుట్టి పెరిగే దోమలు, ఈగలు, రోగకారక క్రిమి కీటకాదులన్నీ చెట్లనుంచి, పొలాల నుండి వచ్చి అనేక రోగాలు కలుగజేస్తాయి. ఈ బాణసంచా కాల్చినప్పుడు వచ్చే వెలుతురు, చప్పుళ్ళకి, గంధకం, సురేకారం వగైరా రసాయనిక పదార్థాలు కాల్చటం వల్ల వచ్చే వాయువుల వలన ఈ క్రిమి కీటకాలు నశించి రాబోయే రోగాలు అరికట్టబడతాయి. అయితే ఈ టపాకాయలు కేవలము గంధకము, సురేకారము వంటి వాటితో మాత్రమే తయారు చేయబడాలి. అప్పుడు వాతావరణము శుభ్రం చెయ్యబడుతుంది, కలుషిత మవదు. పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది. రాత్రి పూట పది గంటల తరువాత శబ్దం చేసే బాంబులలాంటి వాటిని కాల్చరాదు. పసిపిల్లలకు, వృద్ధులకు, వ్యాధిగ్రస్తులు నిద్రాభంగం కలిగించి, ఇబ్బంది పెట్టరాదు. అందరూ ఇటువంటి నియమాలను పాటించాలి. దీపావళి పండుగ కుటుంబాలలో అనుబంధాన్ని, సాంఘిక సంబంధాలను పెంపు చేస్తుంది. అంతేకాకుండా ఇటువంటి పండుగల వల్ల ఆర్థిక అభ్యుదయం కూడా కలుగుతుంది. దీపావళి టపాకాయలను తయారుచేసి, అమ్మి, ఎన్నో కుటుంబాల వారు ఈ సమయంలో ఆర్థికంగా లబ్ధి పొందుతారు. అంటే దీనివల్ల సంఘానికి కూడా మేలు కలుగుతుంది. దీపావళి మానసిక వికాసాన్ని కలిగించే పండుగ. అజ్ఞానము అనే చీకట్లు తొలగాలి అంటే జ్ఞానము అనే సూర్యుడు ప్రకాశించాలి. జ్ఞాన జ్యోతి వెలగాలి. "తమసోమా జ్యోతిర్గమయ" అంటే అర్థం ఇదే ! అమావాస్య నాటి చీకటిని చిరు దివ్వెల వెలుగుతో పారద్రోలాలి, అని మన పెద్దలు చెప్పారు. ఎప్పటికైనా అధర్మం నశించి, ధర్మం ఉద్ధరింపబడుతుందని, మంచి అన్నదే శాశ్వతమని చాటి చెప్పేదే దీపావళి పండుగ. కుల మత వర్ణ వర్గ జాతి విభేద రహితంగా సర్వ జనావళీ జరుపుకుని ఆనందించేది ఈ దీపావళి పండుగ. దీపము చైతన్యానికి ప్రతీక. దీపావళి ఉత్సవాలను "కౌముది ఉత్సవాలు" అంటారు. ఈ దివ్వెల పండుగ వచ్చినప్పుడు నాలుగైదు రోజులు ఆనందోత్సాహాలు ఉరకలు వేస్తూ గడపటం, నువ్వుల నూనె దీపాలు వెలిగించి, దైవరాధన చేయటం వంటి ఆధ్యాత్మిక ఆనంద వాతావరణం వల్ల శరీరం చురుకుదనాన్ని పొందుతుంది. మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. ఈ విశ్వమంతా ఆనంద డోలి కలలో తేలియాడుతున్న భావనతో అందరి హృదయాలలో ఆధ్యాత్మిక ఆనంద తరంగాలు జాగృతమై, సత్యము, ధర్మము, సమతా, ప్రేమ, భూత దయ, సౌమనస్యము వంటి సాత్విక గుణాలు ఉదయించి, ఒక విధమైన ప్రశాంతతని అనుభవిస్తాము. దీపావళి నాడు పగలంతా బంధుమిత్రుల ఆనందోత్సాహాల పలకరింపులు, బహుమతులు ఇచ్చి పుచ్చుకోవటాలతోను, రాత్రంతా అద్భుతమైన ప్రకాశవంతమైన జ్యోతుల దర్శనంతో, మతాబుల వెలుగుల తేజస్సుతో మనలోని ఆధ్యాత్మిక చీకట్లు తొలగినట్లు, జ్ఞాన ఆనందములు కలిగినట్లుగా ఆత్మానందానుభూతి కలుగుతుంది. దివిలోని తారలన్నీ భువికి దిగి వచ్చినట్లుగా లోకం వెలిగిపోతుంది. ఆనందోత్సాహాలు ఉరకలేస్తాయి. మన హృదయాలు ఆనందమయ మయినప్పుడు మనం ఆ ఆనందాన్ని సర్వప్రాణి కోటికి పంచగలుగుతాము. పరమాత్మ అనుగ్రహముతో యావద్విశ్వము ఆనందమయమగు గాక ! -రచన : సోమంచి రాధాకృష్ణ చదవండి: Naraka Chaturdashi: నరక చతుర్ధశి.. అనేక పేర్లు... అనేక ఆచారాలు.. ఈ విషయాలు తెలుసా? -
సన్మార్గం: ఐశ్వర్యాన్నిచ్చే ఐదువారాల అద్భుత వ్రతం
హేమంతం వచ్చిందంటే చాలు కోటి శుభాల మార్గశీర్షం వచ్చేసినట్టే. లక్ష్మీకళతో లోగిళ్లన్నీ కళకళలాడినట్టే. ఎటు విన్నా ‘లక్ష్మీ నమస్తుభ్యం...’ ఎటు చూసినా ‘నమస్తేస్తు మహామాయే...’ అంటూ ఆ అమ్మను ఆర్తితో స్తుతించడం, పూజించడం వీనుల విందుగా వినిపిస్తూ, నయనారవిందంచేస్తుంటుంది. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ మాసం ఆయన సతీమణి మహాలక్ష్మికీ మక్కువైనదే! నిన్న అంటే డిసెంబర్ 3, మంగళవారంతో మొదలైన మార్గశిరమాసం జనవరి 1, బుధవారంతో ముగియనుంది. ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి ఐదు వారాలపాటు తనను నియమనిష్ఠలతో కొలిచినవారికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది కనకమహాలక్ష్మి. మార్గశిరమాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో, పూజిస్తారో సంవత్సరంలోని మిగిలిన పదకొండు మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మీవైభవం సమకూరుతుంది. వారి మార్గం విజయపథమై విరాజిల్లుతుంది. ఆ వ్రతవిధానం అందరి కోసం... లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు పొందాలనుకునేవారంతా మార్గశిరంలో ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారికి దగ్గరవుతుంటారు. ఈ మాసంలో ప్రధానంగా చెప్పుకోదగింది లక్ష్మీవార వ్రతమే. దీన్నే కొందరు గురువార లక్ష్మీపూజ అని, లక్ష్మీదేవి నోము అని పిలుస్తారు. మార్గశిర లక్ష్మీవార వ్రతం, ఈప్సితాలను ఈడేర్చుకునేందుకు మహిళలకు, లోకానికి దక్కిన మహోత్కృష్టమైన వరం. ఐదువారాల అద్భుత వ్రతం... మార్గశిర లక్ష్మీపూజ ఐదు గురువారాలు చేయాల్సిన ఐశ్వర్య వ్రతం. ఈ నెలలో గనుక నాలుగే లక్ష్మీవారాలు వస్తే, ఐదవ వారంగా పుష్యమాసం తొలి గురువారం నాడు కూడా నోము నోచుకోవాలి. వ్రతవిధానం: ముందుగా ప్రాతఃకాలాన నిద్రలేచి తలారా స్నానం చేసి ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దాలి. లక్ష్మీదేవి ప్రతిమను పూజా మందిరంలో ప్రతిష్ఠించుకోవాలి. దేవి కొలువున్న ప్రదేశాన్ని పూలతో, బియ్యప్పిండితో వేసిన ముగ్గుతో అలంకరించాలి. మహాగణపతి పూజతో వ్రతం మొదలవుతుంది. విఘ్నేశ్వరార్చన అనంతరం మహాలక్ష్మికి షోడశోపచార పూజ నిష్ఠగా నిర్వహించాలి. ‘హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత స్రజాం’ అంటూ ప్రార్థన చేసి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి. ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, శుద్ధోదక స్నానం, వస్త్రం, చామరం, చందనం, ఆభరణం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలాదులు, కర్పూరనీరాజనాన్ని యథావిధిగా సమర్పించాలి. ‘ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్’ అంటూ లక్ష్మీగాయత్రి పఠిస్తూ అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పించాలి. అనంతరం ‘సహస్రదళ పద్మస్థాం పద్మనాభ ప్రియాం సతీం’ అనే సిద్ధలక్ష్మీ కవచాన్ని సభక్తికంగా చదువుకోవాలి. తరువాత అష్టోత్తర నామావళి పూజ చేసి, మహానైవేద్యం సమర్పించాలి. నైవేద్యానంతరం లక్ష్మీవారవ్రత కథ చెప్పుకుని అక్షతలు శిరసున ధరించాలి. చివరగా క్షమాప్రార్థన చేయాలి. అమ్మవారికి సమర్పించే మహానైవేద్యం విషయంలో కొన్ని నియమాలు పాటించాలని పెద్దలు చెబుతారు. తొలి గురువారం అమ్మవారు పుట్టినవారంగా ప్రఖ్యాతమైంది. కాబట్టి ఈ రోజు నోము సందర్భంగా పులగం నివేదన చేయాలి. రెండవవారం క్షీరాన్నం (పరమాన్నం), మూడోవారం అట్లు, తిమ్మనం, నాలుగోవారం గారెలు, అప్పాలు నైవేద్యం పెట్టాలి. ఐదోవారం నాడు అమ్మవారికి పూర్ణం బూరెలను నివేదించాలి. ఆ రోజు ఐదుగురు ముత్తయిదువులను ఆహ్వానించి వారికి స్వయంగా వండి వడ్డించాలి. అనంతరం దక్షిణ తాంబూలాదులిచ్చి వారి ఆశీస్సులు పొందాలి. దీంతో మార్గశిర లక్ష్మీవ్రతం పూర్తయినట్టే. మంగళగౌరీవ్రతంలాగ పూజపూర్తయ్యాక ఉద్యాపన చెప్పే క్రియ ఈ నోములో ఉండదు. ఎందుకంటే మన ఇంట్లోసౌభాగ్యలక్ష్మి నిత్యం విలసిల్లేందుకే ఈ పద్ధతిని పాటించాలనేది పండితుల ఉవాచ. నియమనిష్ఠలు కీలకం గురువార వ్రతం అత్యంత భక్తిశ్రద్ధలతో నియమంగా ఆచరించాల్సిన గొప్ప నోము. కాబట్టి ఈ నోము నోచేస్త్రీలు ఆయా లక్ష్మీవారాల్లో శుచిగా ఉండాలి. తలకు నూనె రాయడం, జుట్టు దువ్వుకోవడం, చిక్కులు తీసుకోవడం నిషిద్ధం. తొలిసంధ్య, మలిసంధ్య నిదురపోకూడదు. కల్లలాడకూడదు. నియమనిష్ఠలతో, భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారి ఇంట లేమి అనే శబ్దం పొడసూపదు. ఐశ్వర్యదేవత వరాలు కురిపించి విజయాలను చేకూరుస్తుంది. ఒక్క గురువారాలలోనే కాకుండా ఈ మాసంలోని ప్రతిరోజూ లక్ష్మిని పూజిస్తే విష్ణుసతి దీవెనలతో పదికాలాలు పచ్చగా వర్ధిల్లవచ్చని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారికి పూలు, పండ్లు, సువాసనలిచ్చే అగరుధూపం, పరిమళద్రవ్యాలు ప్రీతికరం. వీటితో ఆమె అనుగ్రహాన్ని అవలీలగా పొందవచ్చు. ఈ సువాసనలతో మన ఇంటిని లక్ష్మీప్రసన్నంగా మార్చుకోవచ్చు. - డి.వి.ఆర్.భాస్కర్ -
మంచి కోసమే దారాలమ్మ ఆలయంలో పూజలు
సీలేరు, న్యూస్‌లైన్: శ్రీదారాలమ్మ ఆలయంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో బుధవారం పంచాయతీ నిర్వహించారు. ఆలయంలో క్షుద్ర పూజలు చేసి, నరబలి ఇస్తున్నారని వారం రోజులుగా రేకెత్తిన ఆరోపణలకు ఎట్టకేలకు తెరపడింది. సీలేరులోని మారమ్మ ఆలయం లో పది గ్రామాల గిరిజనులు, పూజలు చేసిన అర్చకు లు, పూజలు చేయించిన వ్యక్తి సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. ఆలయంలో అమావాస్య రోజున పూజ లు చేయడం వాస్తవమేనని అర్చకులు తెలిపారు. మంచి పనికోసమే అమ్మవారికి కుంకుమ పూజ, హోమం నిర్వహించామని చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన బాల కృష్ణ అనే వ్యక్తి అమ్మవారికి ఈ విధంగా మొక్కుకోవడం వల్లే రాత్రి వేళల్లో పూజలు చేశామని వివరణ ఇచ్చారు. 101 పట్టు చీరలు కాల్చడం అవాస్తవమని, జాకెట్ ముక్కలు కాల్చడం జరిగిందని తెలిపారు. నరబలులు, కోళ్లు కోయడం వంటివి హిందు సంప్రదాయ ప్రకారం నేరమని, అలాంటి పనులు తామెప్పుడు చేయలేదని వారు చెప్పారు. అమావాస్య రోజును గిరిజనులు చెడు గా భావిస్తారని, అలాంటి రోజున పూజలు చేయడమేమిటంటూ గ్రామస్తులు నిలదీశారు. కొందరు అమావాస్యను చెడుగా భావించిన తాము పవిత్రంగా భావిస్తామని అందుకే ఆ రోజున పూజలు చేశామని పూజారులు తెలిపారు. ఈ పంచాయతీకి దారకొండ, సీలేరు గ్రామపెద్దలు, ఇరు ప్రాంతాల ముఖ్య పురోహితులను తీసుకువచ్చి వారి సమక్షంలో విచారణ జరిపారు. అమ్మవారి ఆలయంపై వచ్చిన అపనిందలు పోగొడుతూ శాంతి జరిపేందుకు కుంకుమ పూజలు, లక్ష్మీపూజలు చేయాలని పురోహితులు సూచించారు. దీంతో అమ్మవారి భక్తు లు శాంతించి అక్కడ నుంచి వెనుదిరిగారు. ఈ పంచాయతీ వ్యవహారంలో పోలీసులు జోక్యం చేసుకోలేదు. దారకొండ అటవీ ప్రాంతంలో లభించిన మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.