మహాభారతంలో ధనలక్ష్మి పూజ ప్రస్తావన ఉన్నది. తనకు లేదనకుండా మూడు అడుగుల నేలను దానమిచ్చిన బలి చక్రవర్తిని వామనమూర్తి ఏదైనా వరం కోరుకోమంటాడు. అప్పుడు బలి చక్రవర్తి "దేవా ! ఈ భూమిపైన ఆశ్వియుజ బహుళ త్రయోదశి నుండి మూడు రోజులు నా రాజ్యం ఉండేలాగా, దీపదానాలు దీపారాధనలు చేసుకున్న వారందరూ లక్ష్మీ కటాక్షం పొందే లాగాను అనుగ్రహించండి" అని కోరుకున్నాడు.
అప్పటినుంచి లక్ష్మీ పూజ జరుపుకోవడం ఆచారమైంది. దారిద్య్రం నశించి, ధనం సిద్ధించాలంటే ఆశ్వయుజ బహుళ అమావాస్యనాడు లక్ష్మీ పూజ చేయాలి. మార్వాడీవారు ఆ రోజున పగలంతా ఉపవసించి, చంద్రోదయమయ్యాక వంట చేసి, రాత్రి లక్ష్మీ పూజ చేసి, తరువాత టపాకాయలు కాలుస్తారు. "అమావాస్యా యదా రాత్రే దివా భాగే చతుర్దశీ ! పూజనేయా తదా లక్ష్మీః విజ్ఞేయా శుభరాత్రికాః"!! అని పద్మ పురాణం చెప్తోంది.
రాత్రి సమయంలో అమావాస్య ఉన్న రోజును దీపావళిగా భావించి, మహాలక్ష్మిని పూజించాలి. "నమస్తే సర్వదేవానాం వరదాసి హరిప్రియే ! యా గతిః త్వత్ప్రసన్నానాం సా మే భూయాత్వదర్చనాత్"!! సర్వ దేవతలకు వరములను ప్రసాదించే హరిప్రియా! మహాలక్ష్మీ ! నీకు నమస్కారము. నువ్వు ప్రసన్నులైన వారికి ఏ సద్గతి లభిస్తుందో, ఆ సద్గతి నీ అర్చన వలన నాకు లభించుగాక ! "ధనదాయ నమస్తుభ్యం నిధి పద్మాధిపాయ చ ! భవంతు త్వత్ప్రసాదాన్మే ధనధాన్యాది సంపదః"!! ధనమును ప్రసాదించు కుబేరా ! నీకు నమస్కారము. పద్మాది నిధులకు అధిపతివైన నీ అనుగ్రహం చేత ధన ధాన్యాది సంపదలు నాకు కలుగుగాక !! - అని ప్రార్థించాలి.
కుబేరునకు ధనాధిపత్యము శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో లభించింది. మనకు కూడా మహాలక్ష్మి అనుగ్రహంతో ధనం లభిస్తుంది. ధనమంటే డబ్బు మాత్రమే కాదు. "ధనమగ్నిర్ధనం వాయుః, ధనమింద్రో బృహస్పతిః..." అంటూ సుఖము, సంతోషము, శాంతి, ప్రేమ,, కరుణ, ఆత్మీయత, అనురాగము, ఆరోగ్యము, సౌభాగ్యము, సౌమనస్యము, అనుబంధాలు, విజ్ఞానము మొదలైనవన్నీ ధనాలే ! వీటన్నింటినీ మహాలక్ష్మి దేవి మనకు అనుగ్రహిస్తుంది.
కేదార గౌరీ వ్రతం
ధన త్రయోదశిని మార్వాడి వారు "ధన్ తెరస్" అంటారు. ఆరోజున కొత్త పద్దు పుస్తకాలకు పూజ చేస్తారు. దీపావళిని బెంగాలీలో కాళీ పూజగా భావించి చేస్తారు. ఆంధ్ర ప్రాంతాల్లో, తెలంగాణలో దీపావళి రోజున "కేదార గౌరీ వ్రతం" చేస్తారు. కేదారమంటే పంట పొలాలు. వ్యవసాయదారులు తమ శ్రమకు తగిన ఫలం లభించి పొలాలన్నీ పచ్చగా కన్నుల పండుగగా ఉండాలని, అలాగే తమ జీవితాలు కలకాలం కళకళలాడుతూ సాగాలని ఈ వ్రతం చేస్తారు.
కేదారేశ్వరుడు అంటే పరమేశ్వరుడు. జగన్మాత మంగళ గౌరీ దేవి పరమేశ్వరుని అనుగ్రహం కోసం గొప్పతపస్సు చేసి ఈశ్వరుని మెప్పించి పరమేశ్వరుని శరీరంలో అర్ధ భాగాన్ని పొందింది. ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడయ్యాడు. ఈ కేదారేశ్వర వ్రతం చేసిన దంపతులు అన్యోన్యంగా ఆనందంగా ఉంటారు. గుజరాత్ ప్రాంతంలో దీపావళి నుండి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది.
ఇంకా నాలుగవ రోజు బలిపాడ్యమినాడు అంటే దీపావళి మరునాడు సుతల లోకం నుంచి వచ్చిన అత్యంత మహనీయుడైన దాత బలి చక్రవర్తిని స్మరించుకోవాలి. ఆ రోజున అనే రకాల వంటకాలు చేసి, నరకుడిని వధించిన శ్రీకృష్ణ పరమాత్మను, గోవర్ధనగిరిని పూజించి, నివేదిస్తారు. ఆ రోజున యజ్ఞార్థము పంచగవ్యాలను ఇచ్చే గోమాతను వత్సతో కలిపి పూజించాలి.
ఇంక మరుసటి రోజును "యమ ద్వితీయ - భగినీ హస్త భోజనం" అంటారు. యమధర్మరాజు తన చెల్లెలైన యమునా దేవి ఇంటికి ఆ రోజున వచ్చాడని, ఆమె తన అన్నకు విందు భోజనము పెట్టిందని చెప్తారు. కనుక యమద్వితీయ నాడు అన్నతమ్ములందరూ భగినీ హస్త భోజనము చెయ్యాలి. దీపావళి పండుగ చేసుకోవటానికి శాస్త్రీయ కారణం కూడా కనిపిస్తుంది.
వర్షాకాలంలో పుట్టి పెరిగే దోమలు, ఈగలు, రోగకారక క్రిమి కీటకాదులన్నీ చెట్లనుంచి, పొలాల నుండి వచ్చి అనేక రోగాలు కలుగజేస్తాయి. ఈ బాణసంచా కాల్చినప్పుడు వచ్చే వెలుతురు, చప్పుళ్ళకి, గంధకం, సురేకారం వగైరా రసాయనిక పదార్థాలు కాల్చటం వల్ల వచ్చే వాయువుల వలన ఈ క్రిమి కీటకాలు నశించి రాబోయే రోగాలు అరికట్టబడతాయి. అయితే ఈ టపాకాయలు కేవలము గంధకము, సురేకారము వంటి వాటితో మాత్రమే తయారు చేయబడాలి.
అప్పుడు వాతావరణము శుభ్రం చెయ్యబడుతుంది, కలుషిత మవదు. పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది. రాత్రి పూట పది గంటల తరువాత శబ్దం చేసే బాంబులలాంటి వాటిని కాల్చరాదు. పసిపిల్లలకు, వృద్ధులకు, వ్యాధిగ్రస్తులు నిద్రాభంగం కలిగించి, ఇబ్బంది పెట్టరాదు. అందరూ ఇటువంటి నియమాలను పాటించాలి. దీపావళి పండుగ కుటుంబాలలో అనుబంధాన్ని, సాంఘిక సంబంధాలను పెంపు చేస్తుంది.
అంతేకాకుండా ఇటువంటి పండుగల వల్ల ఆర్థిక అభ్యుదయం కూడా కలుగుతుంది. దీపావళి టపాకాయలను తయారుచేసి, అమ్మి, ఎన్నో కుటుంబాల వారు ఈ సమయంలో ఆర్థికంగా లబ్ధి పొందుతారు. అంటే దీనివల్ల సంఘానికి కూడా మేలు కలుగుతుంది. దీపావళి మానసిక వికాసాన్ని కలిగించే పండుగ. అజ్ఞానము అనే చీకట్లు తొలగాలి అంటే జ్ఞానము అనే సూర్యుడు ప్రకాశించాలి. జ్ఞాన జ్యోతి వెలగాలి.
"తమసోమా జ్యోతిర్గమయ" అంటే అర్థం ఇదే ! అమావాస్య నాటి చీకటిని చిరు దివ్వెల వెలుగుతో పారద్రోలాలి, అని మన పెద్దలు చెప్పారు. ఎప్పటికైనా అధర్మం నశించి, ధర్మం ఉద్ధరింపబడుతుందని, మంచి అన్నదే శాశ్వతమని చాటి చెప్పేదే దీపావళి పండుగ. కుల మత వర్ణ వర్గ జాతి విభేద రహితంగా సర్వ జనావళీ జరుపుకుని ఆనందించేది ఈ దీపావళి పండుగ.
దీపము చైతన్యానికి ప్రతీక. దీపావళి ఉత్సవాలను "కౌముది ఉత్సవాలు" అంటారు. ఈ దివ్వెల పండుగ వచ్చినప్పుడు నాలుగైదు రోజులు ఆనందోత్సాహాలు ఉరకలు వేస్తూ గడపటం, నువ్వుల నూనె దీపాలు వెలిగించి, దైవరాధన చేయటం వంటి ఆధ్యాత్మిక ఆనంద వాతావరణం వల్ల శరీరం చురుకుదనాన్ని పొందుతుంది. మనసుకు ఆహ్లాదం కలుగుతుంది.
ఈ విశ్వమంతా ఆనంద డోలి కలలో తేలియాడుతున్న భావనతో అందరి హృదయాలలో ఆధ్యాత్మిక ఆనంద తరంగాలు జాగృతమై, సత్యము, ధర్మము, సమతా, ప్రేమ, భూత దయ, సౌమనస్యము వంటి సాత్విక గుణాలు ఉదయించి, ఒక విధమైన ప్రశాంతతని అనుభవిస్తాము.
దీపావళి నాడు పగలంతా బంధుమిత్రుల ఆనందోత్సాహాల పలకరింపులు, బహుమతులు ఇచ్చి పుచ్చుకోవటాలతోను, రాత్రంతా అద్భుతమైన ప్రకాశవంతమైన జ్యోతుల దర్శనంతో, మతాబుల వెలుగుల తేజస్సుతో మనలోని ఆధ్యాత్మిక చీకట్లు తొలగినట్లు, జ్ఞాన ఆనందములు కలిగినట్లుగా ఆత్మానందానుభూతి కలుగుతుంది.
దివిలోని తారలన్నీ భువికి దిగి వచ్చినట్లుగా లోకం వెలిగిపోతుంది. ఆనందోత్సాహాలు ఉరకలేస్తాయి. మన హృదయాలు ఆనందమయ మయినప్పుడు మనం ఆ ఆనందాన్ని సర్వప్రాణి కోటికి పంచగలుగుతాము. పరమాత్మ అనుగ్రహముతో యావద్విశ్వము ఆనందమయమగు గాక !
-రచన : సోమంచి రాధాకృష్ణ
చదవండి: Naraka Chaturdashi: నరక చతుర్ధశి.. అనేక పేర్లు... అనేక ఆచారాలు.. ఈ విషయాలు తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment