నరకాసురుని వధను స్మరించటమంటే మనలో ఉన్న దుర్గుణాలను దగ్ధం చేసి, సద్గుణాలను పొంది ఉన్నతుల మవాలి అని సంకల్పించుకోవటమే ! మనలోని అజ్ఞానం పోయి జ్ఞాన జ్యోతి ప్రకాశించాలి. అదే దీపావళి పండుగ. నరక చతుర్దశి నాడు యమ ప్రీతికై పూజలు నిర్వహించి దీపాలను వెలిగించాలి.
అలా చేస్తే పితృదేవతలు నరక విముక్తులై స్వర్గానికి చేరుతారు. "నరకాయ ప్రదాతవ్యో దీపాన్సంపూజ్య దేవతాః ! చతుర్దశ్యాం తు యే దీపాన్ నరకాయ దదన్తి చ !! తేషాం పితృగణాస్సర్వే నరకాత్స్వర్గమాప్తుయాత్"!! దీపావళి నాడు పితృదేవతలు సాయం సంధ్యా సమయాన ఆకాశంలో దక్షిణ దిక్కుగా వచ్చి, తమ సంతానాల గృహాలను సందర్శిస్తారట. వారికి దారి కనిపించటం కోసమే దివ్వెలు కొట్టే సంప్రదాయం ఏర్పడింది.
ఇంట్లోని పెద్దవారు పిల్లలతో ఈ దివిటీను కొట్టిస్తారు. పొడుగాటి గోంగూర కాడలకు నూనెతో తడిపిన బట్ట వత్తులు కట్టి, వాటిని పిల్లల చేతులకిచ్చి, వారిని వీధి గుమ్మం ముందు నిలబెట్టి దివిటీలను వెలిగించి, ఆకాశంలో దక్షిణం వైపుకి చూపిస్తూ గుండ్రంగా మూడుసార్లు తిప్పి, నేలకు వేసి కొట్టిస్తూ, "దుబ్బు దుబ్బు దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి" అని అనిపిస్తారు.
ఆ తరువాత ఆ కాడలను ఒకపక్కగా పడేస్తారు. పిల్లల కాళ్లు చేతులు కడిగి, కళ్ళు తడి చేతితో తుడిచి, నోరు పుక్కిలించి శుభ్రం చేసుకోమని, తరువాత ఆ పిల్లలకు నోట్లో మిఠాయిలు పెట్టి తినిపిస్తారు. తరువాత ఇంటిల్లిపాది టపాకాయలు కాల్చడం ప్రారంభిస్తారు. ఆనందంగా ఎంత సేపన్నా చిచ్చుబుడ్లు, మతాబులు, కాకరకడ్డీలు, అగ్గిపెట్టెలు, విమానాలు, రాకెట్లు, వెన్న ముద్దలు మొదలైనవన్నీ కాల్చవచ్చు. కానీ "బాణసంచా కాల్చటం లాంటి సంబరాలు పూర్తయ్యాక, అర్ధరాత్రి దాటాక, ఇళ్ళు వాకిళ్ళను తుడిపించుకోవాలి" అని ధర్మశాస్త్రం చెప్తోంది.
సాధారణంగా అందరూ దీపావళికి ముందే ఇంటికి వెల్ల వేయించుకుంటారు. పండుగనాడు ఇంటి గుమ్మాలకు మామిడాకుల తోరణాలు, బంతిపూల మాలలు కడతారు. పెద్ద పెద్ద రంగవల్లులతో ఇంటి ప్రాంగణమంతా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ముగ్గుల మధ్యలో పసుపు, కుంకుమలతో, పూలతో అలంకరించి దీపాలు పెడతారు. ఈ పండుగ ఐదు రోజులు, కార్తీక మాసమంతా సూర్యోదయాత్పూర్వము, సూర్యాస్తమయ సమయంలోను దేవుని దగ్గర, తులసి కోట దగ్గర దీపాలు పెట్టడమే కాక, ఇంటి గుమ్మాలకి ఇరువైపులా దీపపు ప్రమిదలు పెడతారు.
మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ వేసి, వత్తులు వేసి వెలిగించి - "దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్ధన ! దీపో మే హరతు పాపం దీపజ్యోతీ నమోऽస్తు తే"!! అని పగలు, "....సంధ్యా దీపం నమోస్తు తే" అని సాయంత్రము ప్రార్థిస్తాము. దీపావళి నాడు సాయంత్రం ప్రమిదలలో దీపాలు వెలిగించాక, "శుభం కురుధ్వం కళ్యాణ మారోగ్యం ధన సంపదం ! శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతీ నమోऽస్తు తే"!! అని ఆ జ్యోతులను ప్రార్థించాలి.
ఆ తరువాత దీపాలను వరుసగా ఇంటి లోగిళ్ళలో పిట్టగోడల మీద, డాబా మీద పెడతాము. జ్యోతులను వెలిగించటం మన సనాతన సంప్రదాయము. అది మన భారతీయ సంస్కృతి. అందుకే రోజూ పూజా గృహంలోనూ, తులసి కోట దగ్గర దీపాలు పెడతాము. అన్ని శుభకార్యాలలో, శుభ సందర్భాలలో వేదికల మీద కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు దీప ప్రజ్వలనము చేస్తాము.
ఎట్టి పరిస్థితులలోనూ మనము దీపాలను కొండెక్కించము. వాటంతర అవే నిధనమవాలి. కొన్ని ప్రాంతాలలో బాణసంచా కాల్చి ఇంట్లోకి వచ్చాక, ఆడవాళ్ళందరూ కలిసి చేటలు, పళ్ళాలు వాయిస్తారు. అది దరిద్ర దేవతను తరిమి వేయటమన్నమాట. దీనిని "అలక్ష్మీ నిస్సరణము" అంటారు.
దీపావళి పండుగకి ముందే అనేక రకాలైన మిఠాయిలు - అరిసెలు, లడ్డూలు, మైసూర్ పాకులు, జిలేబీ, కజ్జికాయలు, బూందీ, జంతికలు, కాజాలు మొదలైనవి ఎన్నో రకాలు తయారుచేసి, వాటితో పాటు దీపావళి నాడు ఇంట్లో వండిన పులిహోర, పరమాన్నము, గారెలు, బూరెలు లేక బొబ్బట్లు లాంటి వాటిని ఇరుగుపొరుగు వారికి ఇచ్చి, బంధువులతో కలిసి భోజనం చేస్తాము.
ఒక్కరే తినటం అన్నది మన సంస్కృతి కాదు. "సహనౌ భునక్తు" అని మనకు వేదం చెప్తోంది. కలిసి మెలిసి ఉండటమన్నది సృష్టి ధర్మం. దీపావళి నాడు ప్రతి ఒక్కరూ కూడా తమకు సహకరించే వారికి - అంటే ఇంట్లో పని చేసే వారికి, చాకలి వారికి, పోస్ట్ మాన్ కి, పాలు పోసే వారికి, పూలను ఇచ్చేవారికి, ఇలా అందరికీ కూడా కొత్త బట్టలు ఇచ్చి, బహుమతులు, మిఠాయిలు, బాణసంచా పంచిపెట్టి మన ఆనందాన్ని వారికి పంచుతాము.
దీపావళి పండుగకు రెండు రోజుల ముందు ధన త్రయోదశిని, తర్వాత నరక చతుర్దశిని, అమావాస్యనాడు దీపావళిని, ఆ తరువాత రోజును బలిపాడ్యమిని, ఆ మరుసటి రోజును భగినీ హస్త భోజనము లేక యమద్వితీయ అని, వరుసగా ఐదు రోజుల పండగ చేసుకుంటాము. ధన త్రయోదశి నాడు ధనలక్ష్మితో పాటుగా ధన్వంతరిని కూడా పూజించాలి. ఆయన క్షీరసాగర మథన సమయంలో అమృతభాండంతో పాలసముద్రంలోనుంచి ఆవిర్భవించాడు. ఆయన ఆరోగ్య ప్రదాయకుడు, రోగనివారకుడు, అమృత ప్రదాత.
-రచన : సోమంచి రాధాకృష్ణ
చదవండి: Bellam Gavvalu Recipe: బెల్లం గవ్వలు తయారీ విధానం ఇలా!
Comments
Please login to add a commentAdd a comment