యావత్ భారత్ ఆనందోత్సాహాలతో జరుపుకొనే ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. మన మహర్షులు ఏర్పరచిన పండుగలన్నీ ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలు కలిగి, ఆచార వ్యవహారాలతో కలిసి ఉంటాయి. మన పండుగల వెనుక అపారమైన శాస్త్రీయత, సమాజానికి హితకరమైన అంశాలు అనేకం దాగి ఉంటాయి. కాలంలో వచ్చే మార్పులతో పాటు, ఖగోళంలో వచ్చే మార్పులను కూడా ఆధారంగా చేసుకుని మన మహర్షులు మనకు ప్రతి పండుగ లోనూ అమూల్యమైన సందేశాలు ఇచ్చారు.
వాటిని మనం అర్థం చేసుకుని ఆచరించాలి. శరత్కాలంలోని ఆశ్వయుజ మాసం ప్రారంభం నుంచి జగన్మాతను దేవీ నవరాత్రులలో ఆరాధిస్తాము, దశమినాడు విజయదశమి మహా పర్వదినముగా పండుగ చేసుకుంటాము. ఆ మాసం చివరిలో, అమావాస్య నాడు కూడా జగన్మాతనే ఆరాధిస్తాము. మహాలక్ష్మీ పూజను, కుబేరలక్ష్మీ పూజను చేసుకుంటాము.
మాస ప్రారంభంలోనూ, అంతమందు చివరి దినము నాడు కూడా జగన్మాతనే ఆరాధించడం వల్ల ఆశ్వయుజ మాసమంతా జగన్మాతను ఆరాధించిన ఫలం మనకు లభిస్తుంది. అమావాస్యను, పౌర్ణమిని కూడా "పూర్ణ తిథులు" అంటారు. అలాంటి ఆశ్వయుజ బహుళ అమావాస్యనాడు, స్వాతి నక్షత్రంతో కూడిన అమావాస్యనాడు మనము దీపావళి పండుగను జరుపుకొంటాము.
ఈ దీపావళి కూడా పెద్ద పండుగే ! ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలి పాడ్యమి, భగినీ హస్త భోజనము అని, తరువాత నాగుల చవితి, నాగ పంచమి, అని - ఇన్ని రోజులు పండుగ చేసుకుంటాము, దేవతలనారాధిస్తాము.
"దీపానాం ఆవళీ - దీపావళీ." దీపావళి అంటే దీపముల వరుస. దీపావళి రోజు రాత్రి సమయంలో యావత్ భారతదేశం అసంఖ్యాకమైన విద్యుద్దీపాలంకరణతోను, నూనె దీపాల ప్రమిదలతోనూ అత్యంత శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది.
దీపావళి పండుగనాడు విశేషంగా ఆచరించే పనులు
సూర్యోదయాత్పూర్వమే అభ్యంగన స్నానమాచరించటము, పితృ తర్పణాలివ్వటము, దానము చెయ్యటము, వత్తులు వేసి, నూనె దీపాలను వెలిగించటము, ఆకాశదీపము పెట్టటము. ఆకాశదీపం పెట్టడం వల్ల దూరప్రాంతాల వారికి కూడా ఈ దీప దర్శనమవుతుంది. దాని వెలుగు వలన మార్గ దర్శనమవుతుంది. మన సనాతన ధర్మంలో 'అగ్ని ఆరాధన' ముఖ్యమైనది.
"అగ్ని మిచ్ఛధ్వం భారత !" అన్నారు మహర్షులు. భా అంటే కాంతి, ప్రకాశము. కాంతి యందు, ప్రకాశమునందు, వెలుగు నందు అనగా జ్ఞానమునందు రతి కలవారు, అభినివేశము, ఇచ్ఛ కలవారు భారతీయులు. అంటే జ్ఞానాన్ని కాంక్షించేవారు. అసలైన జ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అని కోరి సాధన చేసేవారు భారతీయులు.
ప్రధానంగా మనది అగ్ని ఆరాధన సంప్రదాయము. మన పూర్వీకులు నిత్యాగ్నిహోత్రులు, నిరతాన్నదాతలు. నిత్యము 24 గంటలు 365 రోజులు ప్రతి ఇంట్లోనూ ఒక గదిలో - అగ్ని గృహంలో అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. అగ్ని అసలు ఎప్పుడూ నిధనమవదు. అది మన సంప్రదాయము. అగ్నిలో సర్వదేవతలు ఉంటారు. ఒక్క దీపము వెలిగించి అక్షింతలు వేసి నమస్కరిస్తే, సర్వదేవతలను ఆరాధించిన ఫలం లభిస్తుంది.
"అగ్ని ముఖా వై దేవాః" అన్నారు. మనము ప్రతిరోజు ఉభయ సంధ్యలలోను మన ఇంట్లో దీపం వెలిగిస్తాము. దీపమును, దీపజ్యోతిని ఆరాధిస్తాము. ఏ శుభకార్యములు చేసినా, ఏ వేడుకలు చేసినా, గొప్ప ఫంక్షన్స్ జరిగేటప్పుడు కూడా ముందుగా దీప ప్రజ్జ్వలన చేసి, దైవ ప్రార్థన చేసి, అప్పుడు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి జరుపుకుంటాము. వివాహములు కూడా అగ్నిసాక్షిగా చేసుకుంటాము.
అంటే దీపము, దీపములో ఉన్న దేవతలు మన ప్రతి కర్మకు సాక్షిభూతులుగా ఉంటారన్నమాట. వారు మనల్ని అనుగ్రహిస్తారు. కనుక దీపము వెలిగించటము అన్నది అత్యంత ప్రధానమైనది అని అందరికీ తెలియజేయటానికి, అందరి చేత దీపములు వెలిగించబడటానికి దీపావళి పండగను మన మహర్షులు ఏర్పాటు చేశారు. "దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః" దీపము సాక్షాత్తుగా పరబ్రహ్మ స్వరూపము. ఆశ్వయుజ బహుళ అమావాస్యకు ముందు మూడు రోజుల నుంచి ఇంటి ముందు దీపాలు పెట్టటం ప్రారంభిస్తాము.
వారి సంతానమే నరకాసురుడు
అలా వెలిగించడం ప్రారంభించిన ఈ దీపాలను కార్తీక మాసమంతా వెలిగిస్తాము. కార్తీకమాసం కూడా దీప ప్రజ్వలనకు అత్యంత ప్రధానమైన మాసము. ఆశ్వయుజ మాసంలో అమ్మవారిని, కార్తీకములో అయ్యవారిని - పరమశివుడిని ఆరాధిస్తాము. హిరణ్యాక్షుడు దేవతలను, ధర్మాత్ములైన మానవులను హింసిస్తూ, యావద్భూమండలాన్ని క్షోభిల్లజేస్తుంటే, శ్రీమన్నారాయణడు వరాహవతారంలో వచ్చి హిరణ్యక్షుడిని సంహరించాడు, భూమాతను రక్షించాడు.
ఆ సమయంలో భూదేవి తనకొక కుమారుడిని ప్రసాదించమని స్వామిని ప్రార్థిస్తుంది. వారి సంతానమే నరకాసురుడు. స్వామి రాక్షస సంహారం కోసం అవతరించిన తరుణంలో భూమాతకి కలిగిన పుత్రుడు కనుక, నరకుడు తమోగుణ భరితుడై రాక్షసుడయ్యాడు. అతడు బ్రహ్మ దేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి, మరణం లేకుండా వరం కోరాడు.
బ్రహ్మదేవుడు అది సాధ్యం కాదని అంటే, 'కన్నతల్లి బిడ్డలను పొరపాటున కూడా చంపదు కదా' అని ఆలోచించి, "నాకు మా అమ్మ చేతిలో తప్ప మరణం లేకుండా వరం ఇవ్వండి" అని కోరాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు. ఇంక తనకు చావే లేదు, అనే భ్రమతో నరకుడు లోక కంటకుడై వేద సంస్కృతిని వ్యతిరేకిస్తూ, యజ్ఞయాగాదులు జరగకుండా అడ్డుకుంటూ, బ్రాహ్మణులను బాధిస్తూ రావణాసురుని వలె పరస్త్రీ వ్యామోహంతో శీలవంతులైన 16 వేల మంది స్త్రీలను బంధించాడు.
దుష్ట శిక్షణ కోసం పరమాత్మ శ్రీకృష్ణునిగా అవతరించాడు. భూదేవి సత్యభామగా అవతరించింది. తన తల్లి అయిన సత్యభామ వదిలిన బాణాహతితో నరకుడు మృతి చెందాడు. శ్రీకృష్ణ పరమాత్మ నరకుని స్మృతిగా ఆ అమావాస్య నాడు దీపాలను వెలిగించి పండుగ చేసుకోవాలని నిర్దేశించాడు. నరకుని చెరలో ఉన్న 16,000 మంది స్త్రీలను విడిపించటమే కాక, నరకుని హస్తగతమైన ధనలక్ష్మిని విడిపించి, తన పాంచ జన్య శంఖంతో, కామధేను క్షీరంతో, చతుస్సాగర జలాలతో ధనలక్ష్మికి ఈ రోజునే సామ్రాజ్య పట్టాభిషేకం చేశాడు.
కనుకనే దీపావళి రోజున ప్రదోషకాలంలో లక్ష్మీ పూజ చేయాలి అని శాస్త్రం చెప్తోంది. నరకుడు చనిపోయిన రోజును నరక చతుర్దశిగాను, ఆ మరునాడు అమావాస్యను దీపావళి గాను పండుగ చేసుకుంటున్నాము. నరకుడు అజ్ఞానానికి ప్రతీక. నరకము అంటే దుర్గతి. అది కలవాడు నరకుడు. అంటే చెడు నడత కలవాడు. మానవులందరూ మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని గ్రహించి మంచి నడతను కలిగి ఉండాలి.
ఇంక, నరకుడి చెరలో ఉన్న 16 వేల మంది స్త్రీలను విడిపించినప్పుడు వారందరూ శ్రీకృష్ణ పరమాత్మనే భర్తగా వరించారు. 16 వేల మంది అంటే అర్థం ఏమిటి? అంటే, మనకు కల ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియాలు, ఐదు తన్మాత్రలు, మనోబుధ్యహంకార చిత్తములు అనబడే అంతరింద్రియము - అంతఃకరణము. ఇవన్నీ కలిసి 16. ఈ 16 అజ్ఞానంతో ఆవరించబడి ఉండటమే నరకుడు 16 వేల మందిని చెరబట్టటం.
ఎప్పుడైతే మన ఇంద్రియాలు, మనసు, అంతఃకరణము అన్నీ పరమాత్మ వైపు మరలుతాయో, అప్పుడు - ఆ జీవుడు పరమాత్మను ఆశ్రయించినప్పుడు, అతని అజ్ఞానము నశించి జ్ఞానవంతుడై పరమాత్మను చేరుతాడు. అదే శ్రీకృష్ణుడు విడిపించిన 16,000 మంది శ్రీకృష్ణుడిని వరించటము అని అంటే ! దీపావళి పండుగను అజ్ఞానము మీద జ్ఞానము యొక్క, అంధకారము మీద వెలుగు యొక్క విజయముగాను, నిరాశ మీద ఆశ సాధించిన విజయముగాను చెప్పవచ్చును.
"అసతోమా సద్గమయ. తమసో మా జ్యోతిర్గమయ. మృత్యోర్మా అమృతం గమయ." నరకాసురుడి పీడ వదలగానే ప్రజలందరూ మంగళ వాయిద్యములు మ్రోగించి సత్యభామా శ్రీకృష్ణులకు స్వాగతం చెప్పారు. ఆ మంగళ ధ్వనులే నేటికీ బాణసంచా రూపంలో ప్రతిధ్వనిస్తున్నాయి.
-రచన : సోమంచి రాధాకృష్ణ
చదవండి: Walnut Halwa: వాల్‌నట్ రుచి లేదని పక్కనపెడుతున్నారా? ఇలా హల్వా ట్రై చేయండి!
Comments
Please login to add a commentAdd a comment