పగిడ్యాల్ గ్రామంలో 90 శాతం ఇళ్లలో కృష్ణ పేరు
కృష్ణ తాతగా ప్రసిద్ధి చెందిన కృష్ణ బ్రహ్మేంద్రస్వామి
78 ఏళ్ల క్రితం సజీవ సమాధి..
గండేడ్ మండలం పగిడ్యాల్‌లో ఆలయ నిర్మాణం
ఏటా బ్రహ్మోత్సవాలు
మహబూబ్‌నగర్ జిల్లా: కృష్ణయ్య, కృష్ణప్ప, చిన్న కృష్ణయ్య, నడిపి కృష్ణయ్య.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ ఊరిలో.. ప్రతి ఇంట్లో వినిపించే పేరు ‘కృష్ణ’. అదే మహబూబ్‌నగర్ జిల్లా గండేడ్ మండలం పగిడ్యాల్ గ్రామ ప్రత్యేకత. కృష్ణ తాత మీద ఉన్న భక్తితో ఆ గ్రామంలో ప్రతి ఇంట్లో ఒకరిద్దరికి ఆయన పేరు పెట్టుకున్నారు. 78 ఏళ్ల క్రితం కృష్ణ తాత సజీవ సమాధి అయ్యారు. ఆయన పేరు మాత్రం ఇంటింటా మార్మోగుతోంది.
ఏటా జరిగే బ్రహ్మోత్సవాల్లో వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. పగిడ్యాల్‌లో కృష్ణ బ్రహ్మేంద్రస్వామి (కృష్ణ తాత) గుడి ఉంది. రామయ్య, భాగ్యమ్మల సంతానం అయిన కృష్ణ తాత.. వయసు పెరిగే కొద్ది ఆధ్యాత్మికంలో మునిగి తేలారు. వివాహానంతరం.. తన మహిమలు చూపడం ప్రారంభించారని భక్తులు చెబుతారు. నమ్మిన వారికి కొండంత అండగా ఉంటూ.. వారి కష్టాలను తీర్చడంలో ఆయన తనశక్తిని ఉపయోగించేవారని వారి నమ్మకం. 1856లో జన్మనిచ్చిన కృష్ణతాత 91 ఏళ్లు జీవించారు. కృష్ణ తాత లీలలు అపారమని ఆయన వంశస్తులు, భక్తులు స్పష్టం చేస్తున్నారు. అనారోగ్యం కలిగినవారు.. తాతను దర్శించుకొంటే తగ్గుతుందని వారి నమ్మకం.
నిద్రాహారాలు మాని..
కృష్ణతాత రోజుల తరబడి నిద్రాహారాలు మాని ధ్యానంలోకి వెళ్లిపోయేవారట. కొండలు, గుట్టలే కాక నీళ్లల్లో సైతం రోజుల తరబడి తిండి తిప్పలు లేకుండా ఉండేవారట. అప్పట్లో ఎవరూ వెళ్లని చెన్నరాయుడి గుట్టకు సైతం వెళ్లి రోజుల తరబడి ఉండేవారని.. రుషీశ్వరులతో కలిసి తపస్సు చేసేవారని చెబుతారు. మహబూబ్‌నగర్ అబ్దుల్‌ఖాదర్ దర్గాగా పిలిచే అబ్డుల్ ఖాదర్, షాషాబ్‌గుట్టగా పిలిచే షాషాబ్ వంటి ప్రముఖులు.. కృష్ణతాత దగ్గరకు వచ్చి వెళ్లేవారట. ఆయనకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భక్తులు, శిష్యులు చాలామంది ఉన్నారు. కులాలకతీతంగా అందరినీ చేరదీసేవారని.. సామూహిక అన్నదాన కార్యక్రమాలు నిర్వహించేవారని అంటారు. ఆధ్యాతి్మక సత్సంగాలతో పాటు భజన కార్యక్రమాలు నిర్వహించేవారు.
91వ ఏట సజీవ సమాధి
కృష్ణతాత తాను 91వ ఏటా సజీవ సమాధి అవుతానని ముందుగానే చెప్పారు. దీంతో దౌల్తాబాద్‌లో పొలం దగ్గర గుట్టమీద మూడుచోట్ల సమాధి తవి్వంచి పెట్టారు. అప్పట్లో రజాకార్ల హయాం కావడంతో కొంత ఆటంకం ఎదురైనా.. మూడు రోజుల ముందు సమాధిలోకి వెళ్తానని చెప్పారు. చెప్పినట్టే చివరిరోజు 1947లో సమాధి అయ్యారు. అనంతరం సమాధిపై గుడికట్టి ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పటినుంచి ఏటా రథసప్తమి సమయంలో కృష్ణతాత బ్రహోత్సవాలను మూడురోజులు పాటు నిర్వహిస్తారు.
ఊరంతా పండుగ..
పగిడ్యాల్ గ్రామం కృష్ణతాత పేరుతో ఇంటింటా మార్మోగుతోంది. గ్రామం అంతా ప్రతి ఇంట్లో ఒక్కరి పేరైన కృష్ణయ్య, కృష్ణప్ప, చిన్న కృష్ణయ్య, పెద్దకృష్ణయ్య, నడిపి కృష్ణయ్య, కృష్ణారెడ్డి.. ఇలా రకరకాలుగా తాతా పేరు వచ్చేలా పేర్లు పెట్టుకున్నారు. దీంతో పాటు మిగతా మండలాల్లో కూడా చాలామంది కృష్ణతాత పేరు పెట్టుకున్నారు. జాతర సమయంలో తమ బంధువులను ఆహ్వానించి.. ఊరంతా పండుగ చేసుకుంటారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇక్కడ తలనీలాలు, గోదానం, మొక్కులు తీర్చడం వంటివి చేస్తారు.
తాతపై భక్తితోనే..
అప్పట్లో తాతపై ఉన్న భక్తి, నమ్మకమే ఆయన పేరు పెట్టుకునేలా చేసింది. ఇప్పటికీ చాలామంది ఎలాంటి అనారోగ్యానికి గురైనా.. తాతను దర్శించుకొని.. అక్కడి విభూతి రాసుకుంటే తగ్గిపోతుందనే నమ్మకం. ఆయన వంశంలో పుట్టడం పూర్వజన్మ సుకృతం.
– కృష్ణవాసు, కృష్ణతాత మనవడు, పగిడ్యాల్
ఏ సమస్యకైనా గుడికెళ్లి..
కృష్ణ తాత అంటే మా ఇంట్లో వారందరికీ అమితమైన భక్తి. ఏసమస్య వచ్చిన.. అనారోగ్యానికి గురైనా తాత గుడికి వెళ్లి మొక్కుకుంటాం. ఏ ఇబ్బంది రాకుండా తాత చూసుకుంటాడని నమ్మకం. అమ్మానాన్నలు నాకు తాత పేరు పెట్టడం అదృష్టంగా భావిస్తున్నా. మా అక్కపేరు కూడా కృష్ణమ్మ అని పెట్టారు.
– అన్నసారపు కృష్ణారెడ్డి, పగిడ్యాల్
మా పాలిట దైవం
నేను పుట్టగానే కృష్ణయ్య అని పేరు పెట్టారు. మొదటి నుంచి తాతనే దేవుడిగా భావిస్తాం. అన్నింటికీ మాకు కృష్ణతాత అండగా ఉంటాడనేది నమ్మకం. ఆయన లీలలు మా పెద్దవారు చెప్పేవారు. అందుకే తాత అంటే ఎనలేని భక్తి.
– కావలి కృష్ణయ్య, పగిడ్యాల్
Comments
Please login to add a commentAdd a comment