2013లో హత్యకేసులో తిప్రాస్‌పల్లికి చెందిన భీమరాయుడు అరెస్టు
హైకోర్టులో యావజ్జీవ శిక్ష
ఆధారాలు సరిగా లేకపోవడంతో హైకోర్టు కేసును కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానం
మహబూబ్‌నగర్ జైలు నుంచి విడుదల
నారాయణపేట: హత్య కేసులో 11 ఏళ్లుగా జైలుశిక్ష అనుభవిస్తున్న వ్యక్తి నిర్దోషిగా తేలింది. ఈ మేరకు మంగళవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో బుధవారం ఆ వ్యక్తికి జైలు నుంచి విముక్తి లభించింది. వివరాల్లోకి వెళ్తే.. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం తిప్రాస్‌పల్లికి చెందిన భీమరాయుడు 2013 జనవరి 11న కుట్ర పూరితంగా సమీపంలోని రాయచూర్‌కు నాగేశ్ అనే వ్యక్తిని రప్పించి తన సోదరుడు, బావమరిదితో కలిసి హతమర్చినట్లు అభియోగం మోపారు. ఈ కేసులో మరో ఐదుగురు నిందితులు సహకరించినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
అయితే మహబూబ్‌నగర్ ట్రయల్ కోర్డులో ఏ–4 నుంచి ఏ–8 వరకు ఉన్న నిందితులను వదిలి.. ఏ–1, ఏ–2, ఏ–3లకు ఐపీసీ సెక్షన్ 302 కింద యావజ్జీవ శిక్ష, ఐపీసీ సెక్షన్ 364, 384, 201 కింద వివిధ శిక్షలను ఖరారు చేస్తూ 2016 అక్టోబర్ 13న తీర్పు ఇచ్చింది. దీంతో భీమరాయుడు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఏ–2, ఏ–3లను నిర్దోషులుగా విడుదల చేసి.. 2019 మార్చి 20న ఏ–1గా ఉన్న భీమరాయుడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో భీమరాయుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే కేసు పూర్వాపరాలు, దర్యాప్తు జరిగిన తీరు, సాక్ష్యాధారాలను పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం..
ఈ కేసులో పోలీసులు సేకరించిన ఆధారాలు సరిగ్గా లేవని, అతడిని నిర్దోషిగా విడుదల చేయాలని మంగళవారం తీర్పునిచ్చింది. సుప్రీం తీర్పు మేరకు భీమరాయుడిని బుధవారం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లా జైలు నుంచి విడుదల చేశారు. అతడు ఇది వరకు జిల్లా జైలు ఆధ్వర్యంలో నిర్వహించే పెట్రోల్ బంకులో పనిచేశారు. ఆయనకు పారితోషికంగా నెలకు రూ.9 వేల నుంచి రూ.12 వేల వరకు వేతనం పొందేవారు. 11 ఏళ్ల తర్వాత తమ కుమారుడు ఇంటికి వస్తున్నందున తమకు సంతోషంగా ఉందని తండ్రి బాల్‌రాం పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment