‘దీపావళి’ సందర్భంగా ‘సత్యభామ’ పాత్ర మనోవిశ్లేషణ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ మాటల్లో... సాక్షికి ప్రత్యేకం.
సత్యభామది పరిపూర్ణమైన, మూర్తీభవించిన స్త్రీతత్వం. భారతీయులంతా వారు ఏ ఖండంలో ఏ దేశంలో ఉన్నా ఆమెనూ ఆమె పాత్రను ఎవరికివారు తమదిగా భావిస్తారు. మా అమ్మాయే అనుకుంటారు. తెలుగువారు మరో అడుగు ముందుకేసి సత్యభామది తెనాలో ఓరుగల్లో అని భావిస్తారు. సత్యభామ పాత్ర నృత్యరూపాల వల్ల, పౌరాణిక నాటకాల వల్ల, సినిమాల వల్ల మనకు అంత దగ్గర.
సత్యభామ మహాతల్లి
అసలు స్త్రీ ఎలా ఉండాలి? నా ప్రపంచానికి నేను అధినేతని అన్నట్లు ఉండాలి. గడప దాటి బయటికి వెళ్లిన భర్తకో ప్రపంచం ఉండొచ్చు... ఎంత పెద్ద సామ్రాజ్యం అయినా ఉండొచ్చు... కానీ ఒక్కసారి ఇంటి లోపలికి వచ్చాక అతన్ని పరిపాలించడానికి ఒక మనిషి కావాలి... ఆ మనిషిని నేను. మా ఆయన్ని నేను తప్ప ఇంకెవరు పరిపాలిస్తారు అనే భావన సత్యభామది. ఆమె భర్తని కొంగున కట్టేసుకుంది... భర్తని తనకు బానిసలా చేద్దామనుకుందని చాలామంది అనుకుంటారు. అయితే ఇవన్నీ ఆవిడకు తెలియదు. ఆమెకి తెలిసింది ఒక్కటే–అతను నా భర్త... నా సొంతం... నేనేమైనా చేస్తా... అంటే బిడ్డని తల్లి ఎలా చూసుకుంటుంది? తన మాట వినాలనుకుంటుంది కదా... భర్తను అలా చూసుకున్న ఇల్లాలు ఆమె... సత్యభామ మహాతల్లి.
అది అహం కాదు... ప్రేమ
సత్యభామది అహం అని చాలామంది అనుకుంటారు. అసలు ఆవిడ అహం ఎక్కడ చూపించింది? పరిచారిక చెప్పిన మాట కూడా విందామె. తన ఇంట్లో పని చేసే అందరితో స్నేహంగా ఉంది. భర్త మీద ఉన్న అదుపులేని ప్రేమలో అహం, కోపం, కామం, క్రోధం, లోభం... ఇలా అరిషడ్వర్గాలు ఉంటాయి. రామాయణంలో కైక పాత్ర సత్యభామకు దగ్గరగా ఉంటుంది. ఆమె కూడా తన భర్తను గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటుంది. అలాగే సత్యభామలా భర్త కోసం యుద్ధం చేసింది... భర్తను గెలిపించింది. అయితే సత్యభామ నుంచి కైకని విడదీసే అంశం ఏంటంటే స్వార్థం.
తన కొడుకు రాజు కావాలనే స్వార్థం కైకలో కనిపిస్తుంది. నా కొడుకుని రాజుని చేయా లంటే పెద్ద భార్య కొడుకు రాముడిని అడవులకు పంపాలనుకున్న స్వార్థం ఆమెది. కానీ సత్యభామలో ఆ కోణం కనిపించదు. రాముణ్ణి అడవులకు పంపితే రేపట్నుంచి తన భర్త దశరథుడు ఎప్పటిలా తనతో ఉంటాడా... ఉండడా... ఇవన్నీ కైక ఆలోచించలేదు. ఇదే సత్యభామ అయితే రేపట్నుంచి నా భర్త నాతో మాట్లాడడనే ఆలోచన వచ్చిందంటే దానికి కారణమయ్యే ఏ పనీ ఆ మహాతల్లి చెయ్యదు.
సత్యభామది అంత గొప్ప క్యారెక్టర్. ఆమెకు భర్తే సర్వస్వం. అయినా భర్త తప్పు చేస్తే ఒప్పుకోదు. బెత్తం పట్టుకుని కింద కూర్చోబెడుతుంది. సత్యభామ ప్రతి ఇంట్లో ఉన్న తల్లిలో కనిపిస్తుంది. ఎందుకంటే కృష్ణుడిలాంటి భర్త కావాలని ఏ భార్యా కోరుకోకపోవచ్చు... కానీ కృష్ణుడులాంటి కొడుకు కావాలనుకుంటుంది. సో... అలా కృష్ణుణ్ణి తన కొడుకులా చూసుకుంది సత్యభామ. బిడ్డని కొట్టినట్లే కొట్టింది... బిడ్డ దగ్గర అలిగినట్లే అలిగింది.
సత్యభామ బయటకు వచ్చి ఉంటే...
సత్యభామ నాలుగు గోడల మధ్యనే ఉండిపోయింది. అదే బయటకు వస్తే ప్రపంచాన్ని పరిపాలించి ఉండేది. కృష్ణుణ్ణి నరకాసురుడు పడేస్తే... నా భర్తను కొడతావా అంటూ ఆ నరకాసురుణ్ణి చంపేసింది. అంటే... అక్కడ ఆవిడ కృష్ణుడి కన్నా బలవంతురాలనే కదా అర్థం. కృష్ణుడు ఇంటికి రాకపోతే బాధ.. వస్తే ఆనందం... కృష్ణుడు పక్కన లేకపోతే ఆమెకు నరకమే! ఆవిడ సంతోషం, బాధ ఏ ఎమోషన్ అయినా కృష్ణుడే. అంత గొప్ప ఇల్లాలు. డెబ్భై అయిదు శాతం మంది భార్యలు సత్యభామలానే ఉంటారు. అలా ఉన్నారు కాబట్టే ప్రపంచం నడుస్తోంది.
కిరీటం వద్దు... నువ్వు చాలంది
కృష్ణుడు తన కిరీటాన్ని సత్యభామకు పెడతానన్నా ఒప్పుకోదు... నాకు నీ కిరీటం ఎందుకు? నాక్కావాల్సింది నువ్వు అంటుంది. సత్యభామలా స్వచ్ఛంగా ప్రేమించే భార్య దక్కినందుకు కృష్ణుడు ఎంతో అదృష్టవంతుడు. కృష్ణుడు ఎలా అయితే ప్రేమకు ప్రతి రూపమో... అలా సత్యభామ కూడా కృష్ణుడి ప్రేమకు ప్రతిరూపమే.
నచ్చినట్లుగా బతకాలి
ఈ తరం అమ్మాయిలు సత్యభామ నుంచి నేర్చుకోవాల్సిన విషయం స్త్రీ సాధికారత. ఆమెలా ధైర్యంగా, స్వేచ్ఛగా బతకాలి. కట్టుబాటు అనేది స్త్రీకి ఎలా ఉందో మగవాడికి కూడా అలానే ఉండాలి. స్వేచ్ఛ అంటే ఎవరిని పడితే వాళ్లని రేప్ చేయమనా? ఇష్టం వచ్చినట్లు రోడ్ల మీద తిరగ మనా? కాదు. స్వేచ్ఛ వేరు... విచ్చలవిడితనం వేరు. సత్యభామది స్వేచ్ఛ. ఆమెలా హద్దుల్లో ఉండు. ఆ హద్దులను అనుభవించు. నీకంటూ ఓ గీత ఉంది. ఆ గీత లోపల నీ ఇష్టం.
– ఇంటర్వ్యూ: డి.జి. భవాని
Comments
Please login to add a commentAdd a comment