Film Writer
-
ప్రేమమయి సత్యభామ
‘దీపావళి’ సందర్భంగా ‘సత్యభామ’ పాత్ర మనోవిశ్లేషణ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ మాటల్లో... సాక్షికి ప్రత్యేకం.సత్యభామది పరిపూర్ణమైన, మూర్తీభవించిన స్త్రీతత్వం. భారతీయులంతా వారు ఏ ఖండంలో ఏ దేశంలో ఉన్నా ఆమెనూ ఆమె పాత్రను ఎవరికివారు తమదిగా భావిస్తారు. మా అమ్మాయే అనుకుంటారు. తెలుగువారు మరో అడుగు ముందుకేసి సత్యభామది తెనాలో ఓరుగల్లో అని భావిస్తారు. సత్యభామ పాత్ర నృత్యరూపాల వల్ల, పౌరాణిక నాటకాల వల్ల, సినిమాల వల్ల మనకు అంత దగ్గర.సత్యభామ మహాతల్లిఅసలు స్త్రీ ఎలా ఉండాలి? నా ప్రపంచానికి నేను అధినేతని అన్నట్లు ఉండాలి. గడప దాటి బయటికి వెళ్లిన భర్తకో ప్రపంచం ఉండొచ్చు... ఎంత పెద్ద సామ్రాజ్యం అయినా ఉండొచ్చు... కానీ ఒక్కసారి ఇంటి లోపలికి వచ్చాక అతన్ని పరిపాలించడానికి ఒక మనిషి కావాలి... ఆ మనిషిని నేను. మా ఆయన్ని నేను తప్ప ఇంకెవరు పరిపాలిస్తారు అనే భావన సత్యభామది. ఆమె భర్తని కొంగున కట్టేసుకుంది... భర్తని తనకు బానిసలా చేద్దామనుకుందని చాలామంది అనుకుంటారు. అయితే ఇవన్నీ ఆవిడకు తెలియదు. ఆమెకి తెలిసింది ఒక్కటే–అతను నా భర్త... నా సొంతం... నేనేమైనా చేస్తా... అంటే బిడ్డని తల్లి ఎలా చూసుకుంటుంది? తన మాట వినాలనుకుంటుంది కదా... భర్తను అలా చూసుకున్న ఇల్లాలు ఆమె... సత్యభామ మహాతల్లి.అది అహం కాదు... ప్రేమసత్యభామది అహం అని చాలామంది అనుకుంటారు. అసలు ఆవిడ అహం ఎక్కడ చూపించింది? పరిచారిక చెప్పిన మాట కూడా విందామె. తన ఇంట్లో పని చేసే అందరితో స్నేహంగా ఉంది. భర్త మీద ఉన్న అదుపులేని ప్రేమలో అహం, కోపం, కామం, క్రోధం, లోభం... ఇలా అరిషడ్వర్గాలు ఉంటాయి. రామాయణంలో కైక పాత్ర సత్యభామకు దగ్గరగా ఉంటుంది. ఆమె కూడా తన భర్తను గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటుంది. అలాగే సత్యభామలా భర్త కోసం యుద్ధం చేసింది... భర్తను గెలిపించింది. అయితే సత్యభామ నుంచి కైకని విడదీసే అంశం ఏంటంటే స్వార్థం. తన కొడుకు రాజు కావాలనే స్వార్థం కైకలో కనిపిస్తుంది. నా కొడుకుని రాజుని చేయా లంటే పెద్ద భార్య కొడుకు రాముడిని అడవులకు పంపాలనుకున్న స్వార్థం ఆమెది. కానీ సత్యభామలో ఆ కోణం కనిపించదు. రాముణ్ణి అడవులకు పంపితే రేపట్నుంచి తన భర్త దశరథుడు ఎప్పటిలా తనతో ఉంటాడా... ఉండడా... ఇవన్నీ కైక ఆలోచించలేదు. ఇదే సత్యభామ అయితే రేపట్నుంచి నా భర్త నాతో మాట్లాడడనే ఆలోచన వచ్చిందంటే దానికి కారణమయ్యే ఏ పనీ ఆ మహాతల్లి చెయ్యదు. సత్యభామది అంత గొప్ప క్యారెక్టర్. ఆమెకు భర్తే సర్వస్వం. అయినా భర్త తప్పు చేస్తే ఒప్పుకోదు. బెత్తం పట్టుకుని కింద కూర్చోబెడుతుంది. సత్యభామ ప్రతి ఇంట్లో ఉన్న తల్లిలో కనిపిస్తుంది. ఎందుకంటే కృష్ణుడిలాంటి భర్త కావాలని ఏ భార్యా కోరుకోకపోవచ్చు... కానీ కృష్ణుడులాంటి కొడుకు కావాలనుకుంటుంది. సో... అలా కృష్ణుణ్ణి తన కొడుకులా చూసుకుంది సత్యభామ. బిడ్డని కొట్టినట్లే కొట్టింది... బిడ్డ దగ్గర అలిగినట్లే అలిగింది. సత్యభామ బయటకు వచ్చి ఉంటే...సత్యభామ నాలుగు గోడల మధ్యనే ఉండిపోయింది. అదే బయటకు వస్తే ప్రపంచాన్ని పరిపాలించి ఉండేది. కృష్ణుణ్ణి నరకాసురుడు పడేస్తే... నా భర్తను కొడతావా అంటూ ఆ నరకాసురుణ్ణి చంపేసింది. అంటే... అక్కడ ఆవిడ కృష్ణుడి కన్నా బలవంతురాలనే కదా అర్థం. కృష్ణుడు ఇంటికి రాకపోతే బాధ.. వస్తే ఆనందం... కృష్ణుడు పక్కన లేకపోతే ఆమెకు నరకమే! ఆవిడ సంతోషం, బాధ ఏ ఎమోషన్ అయినా కృష్ణుడే. అంత గొప్ప ఇల్లాలు. డెబ్భై అయిదు శాతం మంది భార్యలు సత్యభామలానే ఉంటారు. అలా ఉన్నారు కాబట్టే ప్రపంచం నడుస్తోంది.కిరీటం వద్దు... నువ్వు చాలందికృష్ణుడు తన కిరీటాన్ని సత్యభామకు పెడతానన్నా ఒప్పుకోదు... నాకు నీ కిరీటం ఎందుకు? నాక్కావాల్సింది నువ్వు అంటుంది. సత్యభామలా స్వచ్ఛంగా ప్రేమించే భార్య దక్కినందుకు కృష్ణుడు ఎంతో అదృష్టవంతుడు. కృష్ణుడు ఎలా అయితే ప్రేమకు ప్రతి రూపమో... అలా సత్యభామ కూడా కృష్ణుడి ప్రేమకు ప్రతిరూపమే.నచ్చినట్లుగా బతకాలిఈ తరం అమ్మాయిలు సత్యభామ నుంచి నేర్చుకోవాల్సిన విషయం స్త్రీ సాధికారత. ఆమెలా ధైర్యంగా, స్వేచ్ఛగా బతకాలి. కట్టుబాటు అనేది స్త్రీకి ఎలా ఉందో మగవాడికి కూడా అలానే ఉండాలి. స్వేచ్ఛ అంటే ఎవరిని పడితే వాళ్లని రేప్ చేయమనా? ఇష్టం వచ్చినట్లు రోడ్ల మీద తిరగ మనా? కాదు. స్వేచ్ఛ వేరు... విచ్చలవిడితనం వేరు. సత్యభామది స్వేచ్ఛ. ఆమెలా హద్దుల్లో ఉండు. ఆ హద్దులను అనుభవించు. నీకంటూ ఓ గీత ఉంది. ఆ గీత లోపల నీ ఇష్టం. – ఇంటర్వ్యూ: డి.జి. భవాని -
కల నెరవేరకుండానే ‘కథ’ ముగిసింది
కర్నూలు: ఎన్నో సినిమా కథలు రాశాడు. ఎన్నో పాత్రలు సృష్టించాడు. వాటికి ప్రాణం పోశాడు. వెండి తెర మీద చూసి మురిసిపోదామనుకున్నాడు. కానీ పరిస్థితులు కలిసిరాక అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయాడు. వందలాది కథలు రాసుకున్న ఆయన ‘కథ’ అర్ధాంతరంగా ముగిసింది. ఇది ఓ రచయిత విషాద గాథ. ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘటన వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లాకు చెందిన నేపల్లి కీర్తిసాగర్ (50) సినిమాల్లో కథలు రాయడంపై మక్కువతో చాలా ఏళ్ల క్రితం నగరానికి వచ్చాడు. షేక్ పేట్ పరిధిలోని ఓ పెంట్ హౌస్‌లో నివాసం ఉంటున్నాడు. సినిమా కథలతో పాటు సహాయ దర్శకుడిగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారు జామున టెర్రస్‌పై విగత జీవిగా కనిపించాడు. ఇది గమనించిన స్నేహితుడు 108 కు సమాచారం అందించాడు. వారు వచ్చి అప్పటికే మృతి చెందినట్టు నిర్దారించారు. గత కొంత కాలంగా సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్ళాడు. స్నేహితుడు రాధాకృష్ణ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతని గదికి వెళ్లి చూడగా తాను రాసుకున్న వందలాది కథలు గది నిండా ఉన్నాయి. వాటిని చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. అతని మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఎవరూ రాకపోవడంతో ఉస్మానియా మార్చురీలో భద్రపరిచారు. -
Hyderabad: అనుమానాస్పదంగా సినీ రచయిత మృతి
ఫిల్మ్ నగర్(హైదరాబాద్): ఎన్నో సినిమా కథలు రాశాడు. ఎన్నో పాత్రలు సృష్టించాడు. ఆ పాత్రలకు ప్రాణం పోశాడు. వాటిని వెండి తెర మీద చూసి మురిసిపోదామనుకున్నాడు. కానీ పరిస్థితులు కలిసిరాక అనుకున్న లక్ష్యాన్ని సాధించలేక పోయాడు. వందలాది కథలు రాసుకున్న ఆయన ‘కథ’ అర్ధాంతరంగా ముగిసింది. ఇది ఓ కథా రచయిత విషాద గాథ. ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘటన వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లాకు చెందిన నేపల్లి కీర్తిసాగర్ (50) సినిమాల్లో కథలు రాయడంపై మక్కువతో చాలా ఏళ్ల క్రితం నగరానికి వచ్చాడు. షేక్ పేట్ పరిధిలోని ఓ పెంట్ హౌస్‌లో నివాసం ఉంటున్నాడు. సినిమా కథలతో పాటు సహాయ దర్శకుడిగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారు జామున టెర్రస్‌పై విగత జీవిగా కనిపించాడు. చదవండి: హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన బుల్లితెర నటి! ఇది గమనించిన స్నేహితుడు 108 కు సమాచారం అందించాడు. వారు వచ్చి అప్పటికే మృతి చెందినట్టు నిర్దారించారు. గత కొంత కాలంగా సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్ళాడు. స్నేహితుడు రాధాకృష్ణ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతని గదికి వెళ్లి చూడగా తాను రాసుకున్న వందలాది కథలు గది నిండా ఉన్నాయి. వాటిని చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. అతని మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఎవరూ రాకపోవడంతో ఉస్మానియా మార్చురీలో భద్రపరిచారు. -
'నేను సంపాదించిందంతా ఒక్క సినిమాతో పోయింది'
భక్తి చిత్రాల రచయితగా జేకే భారవి ఎంతో పేరుప్రఖ్యాతలు సంపాదించాడు. అన్నమయ్య, రామదాసు, ఓం నమో వెంకటేశాయ, శ్రీ మంజునాథ వంటి ఎన్నో ఆధ్యాత్మిక చిత్రాలకు ప్రాణప్రతిష్ట చేసిన ఘనత ఆయనది. తెలుగు, కన్నడ భాషల్లో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలు తీసిన ఆయన ఒక్క సినిమాతో కుదేలయిపోయాడు. ప్రస్తుతం ఆయన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కెరీర్లో ఎన్నో కార్లు చూసిన నేను ఇప్పుడు బైక్ బుక్ చేసుకుని ఇంటర్వ్యూకి వచ్చాను. ఎన్నోఏళ్లుగా సంపాదించిందంతా ఒకే ఒక్క సినిమా జగద్గురు ఆదిశంకరతో పోయింది. తెలుగు, కన్నడ భాషల్లో నా కథలు ఓకే అయ్యాయి. కానీ కరోనా వల్ల డబ్బులు రావడం ఆలస్యమవుతోంది. నా ఆర్థిక పరిస్థితి బాగోలేదంటే నాగార్జున నాకు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉంటాడు, కానీ చేయి చాచి అడగడం నాకిష్టముండదు అని చెప్పుకొచ్చారు. -
అలాంటి కథలు నమ్మొద్దు
‘‘చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రకథ నాదే’’ అంటూ ఓ రచయిత (రాజేష్ మండూరి) ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే. అందులో ఎటువంటి నిజం లేదు అని ‘ఆచార్య’ చిత్రబృందం కొట్టిపారేసింది. దీనికి సంబంధించి చిత్రనిర్మాణ సంస్థల్లో ఒకటైన మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ ఓ లేఖను విడుదల చేసింది. అందులోని సారాంశం ఈ విధంగా... ‘‘ఆచార్య’ చిత్రం కాన్సెప్ట్, కథను ఒరిజినల్‌గా కొరటాల శివ తయారు చేశారు. ఈ కథ నాది అని ఎవ్వరు చెప్పినా అందులో ఎలాంటి నిజం లేదు. ఇటీవలే చిరంజీవిగారి పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశాం. దానికి చాలా మంచి స్పందన లభించింది. కానీ కొంతమంది రచయితలు ఈ కథ మాది అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అలాంటి కథలు నమ్మొద్దు. ‘ఆచార్య’ చిత్రకథ ఈ సినిమా చేస్తున్న చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఇంటర్నెట్లో వైరల్ అయ్యే కథలను ఆధారంగా కొరటాల శివ లాంటి దర్శకుడి మీద ఆరోపణలు చేయడం సరైనది కాదు’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా, మైత్రీ మూవీ మేకర్స్‌కే మండూరు రాజేష్ కథ చెప్పారట. ఈ నేపథ్యంలో ఆ నిర్మాణ సంస్థ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘ఆచార్య’ సినిమాపై రాజేష్ అనే వ్యక్తి చేసిన ఆరోపణలు అసత్యం. మేం అతని కథకు ‘అన్నయ్య’ అనే పేరు పెట్టాలని దర్శకుడు కొరటాల శివకు తెలియజేశామని చెప్పడం అబద్ధం. మా సంస్థలో నూతన దర్శకులు భరత్ కమ్మతో ‘డియర్ కామ్రేడ్’, రితేష్ రానాతో ‘మత్తువదలరా’ సినిమాలు నిర్మించాం. ప్రస్తుతం బుబ్చిబాబు సానాతో ‘ఉప్పెన’ వంటి సినిమా నిర్మించాం. రాజేష్ మాకు వినిపించిన కథ బాగుంటే అతనితో కూడా సినిమా నిర్మించేవాళ్లం. కానీ, కథ బాగాలేకపోవడంతో తిరస్కరించాం. సరిగ్గా లేని కథతో సినిమా తీయమని వేరేవాళ్లకు ఎందుకు చెబుతాం? కొరటాల శివ ప్రతిభ గురించి అందరికీ తెలుసు. తన సినిమాల్లో వాణిజ్య అంశాలతో పాటు సామాజిక ప్రయోజనం కూడా జోడించే కొరటాలగారిపై ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదు. రాజేష్ ఆరోపణలపై తగిన చర్యలు తీసుకుంటాం’’ అని ఆ ప్రకటనలో పేర్కొంది. -
రచయితలు సరస్వతీ పుత్రులు
‘‘రచయితల సంఘం అంటే సరస్వతీ పుత్రుల సంఘం. అలాంటి సరస్వతీపుత్రుల సంఘం లక్ష్మీదేవి కటాక్షంతో అద్భుతమైన సొంత భవనం కట్టుకునేలా అభివృద్ధి చెందాలి’’ అని సీనియర్ నటుడు కృష్ణంరాజు అన్నారు. ఈ ఏడాది నవంబరు 3న రచయితల సంఘం రజతోత్సవ వేడుక జరగనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ని ఫిలిం నగర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్లో జరిగిన కరై్టన్ రైజర్ వేడుకకు సంబంధించిన టీజర్‌ను కృష్ణంరాజు ఆవిష్కరించారు. 1932 నుంచి ఇప్పటి వరకు తెలుగు చిత్రపరిశ్రమ అభివృద్ధి కోసం సినీ రచయితల కృషిని గుర్తు చేసుకున్నారు కొందరు అగ్ర రచయితలు. ఈ వేడుకలో కృష్ణంరాజు మాట్లాడుతూ – ‘‘‘లక్ష్మీ ఎదురుగా వస్తే నమస్కరించు. కానీ సరస్వతి ఎక్కడ ఉన్నా వెతికి వెతికి నమస్కరించు’ అని మా నాన్నగారు చెప్పారు. అందుకే ఈ వేడుకకు వచ్చాను. రచయితలకు ఏకాగ్రత, అంకితభావం ఉండాలి. కాలంతో పాటు రచయిత రచనల్లోనూ మార్పు వచ్చింది. ఆ రచనలు మంచి మర్గానికి దోహదపడాలి. నేను పెద్ద పెద్ద మహానుభావులతో పని చేశాను. ఆత్రేయగారు ఏదైనా సీన్ రాసేప్పుడు ఆయన ఆ క్యారెక్టర్లోకి వెళ్లిపోయి డైలాగ్స్ రాసేవారు’’ అని అన్నారు. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సినిమా పుట్టుపూర్వోత్తరాల గురించి మాట్లాడారు. ఆ రోజుల్లో పద్యానికి దగ్గరగా పాట ఉండేదని అభిప్రాయపడ్డారు. రచయిత సముద్రాల రాఘవాచారి నుంచి చక్రపాణి వరకు సాగిన చరిత్రను గుర్తు చేశారు ఎస్.వి. రామారావు. పాతాళభైరవి, మిస్సమ్మ...వంటి నాటి ప్రముఖ సినిమాలు, దర్శకులు, రచయితల గురించి మాట్లాడారు నాగబాల సురేష్. 1 950 నుంచి 60వరకు వచ్చిన సినిమాల గురించి మాట్లాడారు. 1961–70 నాటి కాల సినిమాల గురించి ప్రస్తావించారు వడ్డేపల్లి కృష్ణమూర్తి. పాతతరం, కొత్తతరం రచయితలు కలిసి ముందుకు వెళ్లాల్సిన దశాబ్దం ఇదే అన్నారు చిలుకుమార్ నట్రాజ్. 1981–90 కాలంలో ఉన్న రచయితలు, దర్శకులు, సినిమాల గురించి మాట్లాడారు అనురాధ. ఈ కార్యక్రమంలో బలభద్రపాత్రుని రమణి, ప్రధాన కార్యదర్శి ఆకెళ్ల, పరుచూరి వెంకటేశ్వరరావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
బిల్డింగ్ పైనుంచి దూకి.. సినీ రైటర్ ఆత్మహత్య
ముంబై : బాలీవుడ్ సినీ రచయిత రవి శంకర్ అలోక్ బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పశ్చిమ అందేరీలో నివాసం ఉంటున్న అలోక్ బుధవారం మధ్యహ్నాం 2 గంటల ప్రాంతంలో తను ఉంటున్న బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అలోక్ మానసిక ఒత్తిడిలో ఉన్నాడని.. అందుకోసం చికిత్స తీసుకుంటున్నట్టు తెలిసిందన్నారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టమన్నారు. కాగా నానా పటేకర్ నటించిన అబ్ తక్ చప్పాన్ చిత్రాని రవి స్రీన్‌ప్లే రైటర్‌గా పనిచేశాడని సమాచారం. -
మాటల మాంత్రికుడు ఇకలేరు
* చెన్నైలో సినీ రచయిత గణేశ్ పాత్రో కన్నుమూత * 120కి పైగా చిత్రాలకు సంభాషణలు * మరో చరిత్ర, రుద్రవీణ వంటి చిత్రాలతో పేరు ప్రఖ్యాతులు చెన్నై: పాత్రోచిత మాటల మాంత్రికుడు, ప్రముఖ సినీ రచయిత గణేశ్ పాత్రో (69) సోమవారం చెన్నైలో కన్నుమూశారు. ఇక్కడి నందనంలో నివసించే గణేశ్ పాత్రో కొంతకాలంగా నోటి కేన్సర్‌తో బాధపడుతున్నారు. సోమవారం తెల్లవారుజామున ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో... ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా కొంతసేపటికే మరణించారు. ఆయనకు భార్య లక్ష్మీకుమారి, కుమార్తెలు కనక మహాలక్ష్మి, సంయుక్త, కుమారుడు సీతారామ పాత్రో ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం చెన్నైలోని కన్నమపేట శ్మశానవాటికలో గణేశ్ పాత్రో భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఏపీలోని విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన ఆదిలక్ష్మి నారాయణ పాత్రో, సూర్యకాంతం దంపతులకు గణేశ్ పాత్రో తొలి సంతానం. ఆయన పూర్తి పేరు బెహరా సత్యఘన గంగ పోలీస్ వెంకట రమణ మహాపాత్రో. చిన్నప్పటి నుంచే నాటకాలు రాయడం, నటనపై గణేశ్ పాత్రో ఆసక్తి పెంచుకున్నారు. ‘పావలా’, ‘కొడుకు పుట్టాల’, ‘ఆలోచించండి’ వంటి పలు నాటకాలతో రచయితగా ప్రాచుర్యం పొందారు. ఇందులో ‘కొడుకు పుట్టా ల’ నాటకానికి అంతర్జాతీయ పురస్కారం లభిం చింది. ఈ నాటకం పలు భాషల్లో అనువాదం కావడంతో పాటు రేడియోలో సైతం పలుమార్లు ప్రసారమైంది. ప్రముఖ నటుడు ప్రభాకరరెడ్డి 1965లో ‘పావలా’, ‘కొడుకు పుట్టాల’ కథలను కలిపి ‘నాకూ స్వాతంత్య్రం కావాలి’ అనే చిత్రా న్ని నిర్మించడంతో గణేశ్ పాత్రో సినీరంగంలో కాలు మోపారు. ఆ తర్వాత సుమారు 120 చిత్రాలకు పైగా కథ, మాటలు అందించారు. ప్రఖ్యాత తమిళ దర్శకుడు బాలచందర్ తీసిన తెలుగు చిత్రాలన్నింటికీ గణేశ్ పాత్రోనే రచయిత. తెలుగులో ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ, క్రాంతికుమార్ చిత్రాలకు పనిచేశారు. ‘గుప్పెడు మనసు, మనిషికో చరిత్ర, ఇది కథ కాదు, స్వాతి, మయూరి, మరోచరిత్ర, అత్తవారిల్లు, ప్రేమించి చూడు, రుద్రవీణ’ తదితర చిత్రాలు గణేశ్ పాత్రోకు ఎంతో పేరు తెచ్చాయి. చివరగా ఆయన సంభాషణలు రాసిన చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ఆ తరువాత అనారోగ్యం కారణంగా రచనకు దూరమయ్యారు. కాగా పాత్రో మరణ వార్తను తెలుగు సినీ పరిశ్రమ పెద్దగా పట్టించుకోలేదు. సినీ రచయితలు భువనచంద్ర, శశాంక్ వెన్నెలకంటి, మరికొందరు మాత్రమే నివాళులర్పించి, సంతాపం తెలిపారు. సీఎం సంతాపం: గణేశ్ పాత్రో మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన రాసిన సంభాషణలు కుటుంబవ్యవస్థలోని బంధాలకు, ఆత్మీయ భావనలకు అద్దం పట్టాయని... పాత్రో మృతి సినీ రంగానికి, సాహితీలోకానికి లోటు అని పేర్కొన్నారు. -
ఆరుద్ర
...లేదా, ఒకే ఒక్క వాక్యంతోనూ ఆయన్ని స్ఫురణకు తేవొచ్చు. ‘నీవు ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు’. ఆరుద్రకు ఒక ‘నేమ్‌ప్లేట్’ చేయించాలంటే, ఆయన పేరుముందు ఏం చెక్కించాలి? బహుముఖ ప్రజ్ఞాశాలి అనేయొచ్చు సింపుల్‌గా. కానీ ఆ ప్రజ్ఞ ఎన్నిరకాలు? కవి, కథకుడు, డిటెక్టివ్ నవలా రచయిత(నెలకొకటి చొప్పున రాస్తానని అలాగే రాయడం ఆయన చేసిన ఆరుద్రశపథం), గేయకర్త, గేయనాటకకర్త, వ్యాసకర్త, గడీనుడీకారుడు, మెజీషియన్, సంపాదకుడు, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు, అభ్యుదయ రచయితల సంఘం- అరసం వ్యవస్థాపకుల్లో ఒకరు(సంఘాల గొడుగు ఎందుకు? అంటే, వానపడకుండా ఉండటానికంటాడు!), చివరగా సినిమా రచయిత. అనగా, పాటలూ మాటలూ అనువాదాలూ. రాయినైనా కాకపోతిని రామపాదం సోకగా(గోరంతదీపం); అమ్మకడుపు చల్లగా (సాక్షి); కొండగాలి తిరిగింది (ఉయ్యాల జంపాల); వేదంలా ఘోషించే గోదావరి (ఆంధ్రకేసరి); ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం (ఎంఎల్ఏ); ఎదగడానికెందుకురా తొందర (అందాల రాముడు); ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ (ముత్యాలముగ్గు); శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది... (పెళ్లిపుస్తకం) ఆరుద్రను ఇలాంటి ఏ కొన్ని పాటలతోనైనా పరిచయం చేయొచ్చు; లేదా, ఒకే ఒక్క వాక్యంతోనూ స్ఫురణకు తేవొచ్చు. ‘నీవు ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు’. భాగవతుల సదా శివశంకరశాస్త్రిగా జన్మించి, జన్మనక్షత్రం పేరిట తన కలంపేరును స్వీకరించిన ఆరుద్ర- కవిత కోసం నేను పుట్టాను, క్రాంతి కోసం కలం పట్టాను అని చాటుకున్నాడు. ‘నాకోసం నేను రాసుకోను. అందరికోసం నేను రాస్తాను. అందరూ నావాళ్లే కాబట్టి, నాకోసం రాసింది అందరికోసం రాసిందే’ అంటాడు. తెలంగాణ పోరాట ఇతివృత్తంతో ఆరుద్ర రాసిన ‘త్వమేవాహం’ చదివి, ఇక నేను పద్యాలు రాయకపోయినా ఫరవాలేదు, అని ఆనందపడ్డాడట ఆరుద్రకు మేనమామైన శ్రీశ్రీ. ఇందులో ఆరుద్ర- సమాజాన్ని గడియారంతోనూ, ధనికుల్ని గంటల ముల్లుతోనూ, మధ్యతరగతివాళ్లని నిమిషాలముల్లుతోనూ, పేదల్ని సెకన్లముల్లుతోనూ, ‘కీ’ని విప్లవగొంతుకగానూ ప్రతీకిస్తాడు. అంత్యప్రాసల ముద్ర-ఆరుద్ర అనిపించుకున్న ఈ ‘సన్యాసి రూప’ కవి... ‘ఛందస్సులతో అడ్డమైన చాకిరీ అందంగా చేయించుకోగలడు’. శ్లేషలు, చమత్కారాలతో మురిపిస్తాడు. చెరిషించి, పెరిషించి లాంటి తెలుగు ఇంగ్లీషు పదాల కాక్టెయిల్ సృష్టిస్తాడు. ‘ఆ/ మెన్/ ఆమెన్/ చెరపట్టన్/ మ్రోగెన్/ నీగన్/ నా/ పెన్/ ఆపెన్’... లాంటి పదాల గారడీలో వస్తువుకు ఔచిత్యభంగం వాటిల్లుతోందా? అనే మీమాంస ఒకటి కలిగినప్పటికీ! ‘చిన్ని పాదములందు/చివరి ప్రాసల చిందు/ చేయు వీనులవిందు/ ఓ కూనలమ్మా’ అంటూ కూనలమ్మ పదాలు ప్రారంభించాడు ఆరుద్ర. ‘ఆలి కొన్నది కోక/ అంతరిక్షపు నౌక/ అంతకన్నను చౌక/ ఓ కూనలమ్మా’ అని నవ్విస్తూనే, ‘కోర్టుకెక్కినవాడు/ కొండకెక్కినవాడు/ వడివడిగ దిగిరాడు’ అన్న సత్యాన్నీ చెబుతాడు. ‘అంతుచూసేవరకు/ అకట ఆంధ్రుల చురుకు/ నిలువ ఉండని సరుకు’ అని తెలుగువారి ఆరంభశూరత్వాన్ని వెక్కిరిస్తాడు. ‘అణువు గుండెను చీల్చి/ అమితశక్తిని పేల్చి/ నరుడు తన్నును బాల్చి’... చిన్న పదాల్లో పెద్ద భావాన్ని ఇముడుస్తాడు. ‘పరుల మేలును కోరి/ పదములల్లెడు వారి/ పథము చక్కని దారి’ అనిపిస్తాడు. ప్రయోగశీలత ఆయన కథల్లోనూ కనిపిస్తుంది. ‘సుబ్బారావున్నరగంటలసేపు’ అంటాడొకచోట. తన పురుషుడిని తన పూర్తి ప్రపంచంగా మలచుకున్న స్త్రీ హృదయానికి ఈ కొలత సులభంగా అర్థమవుతుంది! ‘రాముడికి సీత ఏమౌతుంది?’ లాంటి ఆసక్తికర శీర్షికతో సకల రామాయణాల్ని తవ్విపోశాడాయన. శ్రీకృష్ణుడు అసలుసిసలు ఆంధ్రుడనీ, ఏకలవ్యుడు కుంతీదేవి అక్క కొడుకనీ, పుత్రికకూ కుమార్తెకూ భేదముందనీ, పుత్రిక అంటే సహోదరులు లేనిదనీ, కుమార్తె అంటే తోడబుట్టినవారిని కలిగినదనీ తేల్చిచెప్పాడు. ‘సినీవాలి’, ‘ఇంటింటి పజ్యాలు’, ‘గాయాలు-గేయాలు’, ‘పైలాపచ్చీసు’, ‘శుద్ధ మధ్యాక్కరలు’, ‘గుడిలో సెక్స్’, ‘వేమన్న వాదం’, ‘తిరుక్కురళ్’అనువాదం, చదరంగ పుస్తకం, ‘సినీ మినీ కబుర్లు’... ఇక, రాయడం అటుండనీ, చదవడానికే జీవితకాలం చాలదనిపించే బృహత్తరమైన ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ ఆయన పరిశోధనాశక్తికి పరాకాష్ఠ! సంస్థలుగా మాత్రమే చేయగలిగిన పనిని ఒక్కడే పూనిక వహించి పూర్తిచేశాడు. ‘నాకు స్పష్టంగా తెలుసు అనుకున్నదాన్ని పాఠకులకు స్పష్టంగా’ చెప్పదలిచాడు. చాళుక్యుల నుండి ఆధునిక కాలం వరకు ‘ఆర్థికసంబంధాల ప్రాతిపదికన యుగవిభజన’ చేసిన ఈ పుస్తకం కోసం- ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నాడు. మధుమేహం పెరిగి మూత్రపిండాలు పనిచేయడం మానేశాయి. కంటిచూపు తగ్గిపోయింది. అయినా అన్ని కష్టాలనూ ఓర్చి వెయ్యేళ్ల చరిత్రను తెలుగువాళ్లకు అందించగలిగాడు. ‘సాహిత్యం అర్ణవమైతే, ఆరుద్ర మథించని లోతుల్లేవు. సాహిత్యం అంబరమైతే ఆరుద్ర విహరించని ఎత్తుల్లేవు. అతడు పట్టి బంగారం చేయని సాహిత్య శాఖ లేదు; ఆ శాఖపై అతడు పూయించని పువ్వుల్లేవు’.