మాటల మాంత్రికుడు ఇకలేరు
* చెన్నైలో సినీ రచయిత గణేశ్ పాత్రో కన్నుమూత
* 120కి పైగా చిత్రాలకు సంభాషణలు
* మరో చరిత్ర, రుద్రవీణ వంటి చిత్రాలతో పేరు ప్రఖ్యాతులు
చెన్నై: పాత్రోచిత మాటల మాంత్రికుడు, ప్రముఖ సినీ రచయిత గణేశ్ పాత్రో (69) సోమవారం చెన్నైలో కన్నుమూశారు. ఇక్కడి నందనంలో నివసించే గణేశ్ పాత్రో కొంతకాలంగా నోటి కేన్సర్‌తో బాధపడుతున్నారు. సోమవారం తెల్లవారుజామున ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో... ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా కొంతసేపటికే మరణించారు. ఆయనకు భార్య లక్ష్మీకుమారి, కుమార్తెలు కనక మహాలక్ష్మి, సంయుక్త, కుమారుడు సీతారామ పాత్రో ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం చెన్నైలోని కన్నమపేట శ్మశానవాటికలో గణేశ్ పాత్రో భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.
ఏపీలోని విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన ఆదిలక్ష్మి నారాయణ పాత్రో, సూర్యకాంతం దంపతులకు గణేశ్ పాత్రో తొలి సంతానం. ఆయన పూర్తి పేరు బెహరా సత్యఘన గంగ పోలీస్ వెంకట రమణ మహాపాత్రో. చిన్నప్పటి నుంచే నాటకాలు రాయడం, నటనపై గణేశ్ పాత్రో ఆసక్తి పెంచుకున్నారు. ‘పావలా’, ‘కొడుకు పుట్టాల’, ‘ఆలోచించండి’ వంటి పలు నాటకాలతో రచయితగా ప్రాచుర్యం పొందారు. ఇందులో ‘కొడుకు పుట్టా ల’ నాటకానికి అంతర్జాతీయ పురస్కారం లభిం చింది. ఈ నాటకం పలు భాషల్లో అనువాదం కావడంతో పాటు రేడియోలో సైతం పలుమార్లు ప్రసారమైంది. ప్రముఖ నటుడు ప్రభాకరరెడ్డి 1965లో ‘పావలా’, ‘కొడుకు పుట్టాల’ కథలను కలిపి ‘నాకూ స్వాతంత్య్రం కావాలి’ అనే చిత్రా న్ని నిర్మించడంతో గణేశ్ పాత్రో సినీరంగంలో కాలు మోపారు. ఆ తర్వాత సుమారు 120 చిత్రాలకు పైగా కథ, మాటలు అందించారు. ప్రఖ్యాత తమిళ దర్శకుడు బాలచందర్ తీసిన తెలుగు చిత్రాలన్నింటికీ గణేశ్ పాత్రోనే రచయిత. తెలుగులో ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ, క్రాంతికుమార్ చిత్రాలకు పనిచేశారు.
‘గుప్పెడు మనసు, మనిషికో చరిత్ర, ఇది కథ కాదు, స్వాతి, మయూరి, మరోచరిత్ర, అత్తవారిల్లు, ప్రేమించి చూడు, రుద్రవీణ’ తదితర చిత్రాలు గణేశ్ పాత్రోకు ఎంతో పేరు తెచ్చాయి. చివరగా ఆయన సంభాషణలు రాసిన చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ఆ తరువాత అనారోగ్యం కారణంగా రచనకు దూరమయ్యారు. కాగా పాత్రో మరణ వార్తను తెలుగు సినీ పరిశ్రమ పెద్దగా పట్టించుకోలేదు. సినీ రచయితలు భువనచంద్ర, శశాంక్ వెన్నెలకంటి, మరికొందరు మాత్రమే నివాళులర్పించి, సంతాపం తెలిపారు.
సీఎం సంతాపం: గణేశ్ పాత్రో మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన రాసిన సంభాషణలు కుటుంబవ్యవస్థలోని బంధాలకు, ఆత్మీయ భావనలకు అద్దం పట్టాయని... పాత్రో మృతి సినీ రంగానికి, సాహితీలోకానికి లోటు అని పేర్కొన్నారు.