
కీర్తిసాగర్ (ఫైల్)
ఫిల్మ్ నగర్(హైదరాబాద్): ఎన్నో సినిమా కథలు రాశాడు. ఎన్నో పాత్రలు సృష్టించాడు. ఆ పాత్రలకు ప్రాణం పోశాడు. వాటిని వెండి తెర మీద చూసి మురిసిపోదామనుకున్నాడు. కానీ పరిస్థితులు కలిసిరాక అనుకున్న లక్ష్యాన్ని సాధించలేక పోయాడు. వందలాది కథలు రాసుకున్న ఆయన ‘కథ’ అర్ధాంతరంగా ముగిసింది. ఇది ఓ కథా రచయిత విషాద గాథ.
ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘటన వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లాకు చెందిన నేపల్లి కీర్తిసాగర్ (50) సినిమాల్లో కథలు రాయడంపై మక్కువతో చాలా ఏళ్ల క్రితం నగరానికి వచ్చాడు. షేక్ పేట్ పరిధిలోని ఓ పెంట్ హౌస్‌లో నివాసం ఉంటున్నాడు. సినిమా కథలతో పాటు సహాయ దర్శకుడిగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారు జామున టెర్రస్‌పై విగత జీవిగా కనిపించాడు.
చదవండి: హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన బుల్లితెర నటి!
ఇది గమనించిన స్నేహితుడు 108 కు సమాచారం అందించాడు. వారు వచ్చి అప్పటికే మృతి చెందినట్టు నిర్దారించారు. గత కొంత కాలంగా సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్ళాడు. స్నేహితుడు రాధాకృష్ణ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతని గదికి వెళ్లి చూడగా తాను రాసుకున్న వందలాది కథలు గది నిండా ఉన్నాయి. వాటిని చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. అతని మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఎవరూ రాకపోవడంతో ఉస్మానియా మార్చురీలో భద్రపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment