ఆరుద్ర | arudra birth day special | Sakshi
Sakshi News home page

ఆరుద్ర

Published Sun, Aug 31 2014 1:00 AM | Last Updated on Tue, Oct 16 2018 8:42 PM

ఆరుద్ర - Sakshi

ఆరుద్ర

...లేదా, ఒకే ఒక్క వాక్యంతోనూ ఆయన్ని స్ఫురణకు తేవొచ్చు. ‘నీవు ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు’.

ఆరుద్రకు ఒక ‘నేమ్‌ప్లేట్’ చేయించాలంటే, ఆయన పేరుముందు ఏం చెక్కించాలి? బహుముఖ ప్రజ్ఞాశాలి అనేయొచ్చు సింపుల్‌గా. కానీ ఆ ప్రజ్ఞ ఎన్నిరకాలు? కవి, కథకుడు, డిటెక్టివ్ నవలా రచయిత(నెలకొకటి చొప్పున రాస్తానని అలాగే రాయడం ఆయన చేసిన ఆరుద్రశపథం), గేయకర్త, గేయనాటకకర్త, వ్యాసకర్త, గడీనుడీకారుడు, మెజీషియన్, సంపాదకుడు, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు, అభ్యుదయ రచయితల సంఘం- అరసం వ్యవస్థాపకుల్లో ఒకరు(సంఘాల గొడుగు ఎందుకు? అంటే, వానపడకుండా ఉండటానికంటాడు!), చివరగా సినిమా రచయిత.

అనగా, పాటలూ మాటలూ అనువాదాలూ. రాయినైనా కాకపోతిని రామపాదం సోకగా(గోరంతదీపం); అమ్మకడుపు చల్లగా (సాక్షి); కొండగాలి తిరిగింది (ఉయ్యాల జంపాల); వేదంలా ఘోషించే గోదావరి (ఆంధ్రకేసరి); ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం (ఎంఎల్‌ఏ); ఎదగడానికెందుకురా తొందర (అందాల రాముడు); ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ (ముత్యాలముగ్గు); శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది... (పెళ్లిపుస్తకం)
 
ఆరుద్రను ఇలాంటి ఏ కొన్ని పాటలతోనైనా పరిచయం చేయొచ్చు; లేదా, ఒకే ఒక్క వాక్యంతోనూ స్ఫురణకు తేవొచ్చు. ‘నీవు ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు’.
భాగవతుల సదా శివశంకరశాస్త్రిగా జన్మించి, జన్మనక్షత్రం పేరిట తన కలంపేరును స్వీకరించిన ఆరుద్ర- కవిత కోసం నేను పుట్టాను, క్రాంతి కోసం కలం పట్టాను అని చాటుకున్నాడు. ‘నాకోసం నేను రాసుకోను. అందరికోసం నేను రాస్తాను. అందరూ నావాళ్లే కాబట్టి, నాకోసం రాసింది అందరికోసం రాసిందే’ అంటాడు.
 
తెలంగాణ పోరాట ఇతివృత్తంతో ఆరుద్ర రాసిన ‘త్వమేవాహం’ చదివి, ఇక నేను పద్యాలు రాయకపోయినా ఫరవాలేదు, అని ఆనందపడ్డాడట ఆరుద్రకు మేనమామైన శ్రీశ్రీ. ఇందులో ఆరుద్ర- సమాజాన్ని గడియారంతోనూ, ధనికుల్ని గంటల ముల్లుతోనూ, మధ్యతరగతివాళ్లని నిమిషాలముల్లుతోనూ, పేదల్ని సెకన్లముల్లుతోనూ, ‘కీ’ని విప్లవగొంతుకగానూ ప్రతీకిస్తాడు.
 
అంత్యప్రాసల ముద్ర-ఆరుద్ర అనిపించుకున్న ఈ ‘సన్యాసి రూప’ కవి... ‘ఛందస్సులతో అడ్డమైన చాకిరీ అందంగా చేయించుకోగలడు’. శ్లేషలు, చమత్కారాలతో మురిపిస్తాడు. చెరిషించి, పెరిషించి లాంటి తెలుగు ఇంగ్లీషు పదాల కాక్‌టెయిల్ సృష్టిస్తాడు. ‘ఆ/ మెన్/ ఆమెన్/ చెరపట్టన్/ మ్రోగెన్/ నీగన్/ నా/ పెన్/ ఆపెన్’... లాంటి పదాల గారడీలో వస్తువుకు ఔచిత్యభంగం వాటిల్లుతోందా? అనే మీమాంస ఒకటి కలిగినప్పటికీ!

‘చిన్ని పాదములందు/చివరి ప్రాసల చిందు/ చేయు వీనులవిందు/ ఓ కూనలమ్మా’ అంటూ కూనలమ్మ పదాలు ప్రారంభించాడు ఆరుద్ర. ‘ఆలి కొన్నది కోక/ అంతరిక్షపు నౌక/ అంతకన్నను చౌక/ ఓ కూనలమ్మా’ అని నవ్విస్తూనే, ‘కోర్టుకెక్కినవాడు/ కొండకెక్కినవాడు/ వడివడిగ దిగిరాడు’ అన్న సత్యాన్నీ చెబుతాడు. ‘అంతుచూసేవరకు/ అకట ఆంధ్రుల చురుకు/ నిలువ ఉండని సరుకు’ అని తెలుగువారి ఆరంభశూరత్వాన్ని వెక్కిరిస్తాడు.

‘అణువు గుండెను చీల్చి/ అమితశక్తిని పేల్చి/ నరుడు తన్నును బాల్చి’... చిన్న పదాల్లో పెద్ద భావాన్ని ఇముడుస్తాడు. ‘పరుల మేలును కోరి/ పదములల్లెడు వారి/ పథము చక్కని దారి’ అనిపిస్తాడు. ప్రయోగశీలత ఆయన కథల్లోనూ కనిపిస్తుంది. ‘సుబ్బారావున్నరగంటలసేపు’ అంటాడొకచోట. తన పురుషుడిని తన పూర్తి ప్రపంచంగా మలచుకున్న స్త్రీ హృదయానికి ఈ కొలత సులభంగా అర్థమవుతుంది!
 
‘రాముడికి సీత ఏమౌతుంది?’ లాంటి ఆసక్తికర శీర్షికతో సకల రామాయణాల్ని తవ్విపోశాడాయన. శ్రీకృష్ణుడు అసలుసిసలు ఆంధ్రుడనీ, ఏకలవ్యుడు కుంతీదేవి అక్క కొడుకనీ, పుత్రికకూ కుమార్తెకూ భేదముందనీ, పుత్రిక అంటే సహోదరులు లేనిదనీ, కుమార్తె అంటే తోడబుట్టినవారిని కలిగినదనీ తేల్చిచెప్పాడు.
 
‘సినీవాలి’, ‘ఇంటింటి పజ్యాలు’, ‘గాయాలు-గేయాలు’, ‘పైలాపచ్చీసు’, ‘శుద్ధ మధ్యాక్కరలు’, ‘గుడిలో సెక్స్’, ‘వేమన్న వాదం’, ‘తిరుక్కురళ్’అనువాదం, చదరంగ పుస్తకం, ‘సినీ మినీ కబుర్లు’... ఇక, రాయడం అటుండనీ, చదవడానికే జీవితకాలం చాలదనిపించే బృహత్తరమైన ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ ఆయన పరిశోధనాశక్తికి పరాకాష్ఠ! సంస్థలుగా మాత్రమే చేయగలిగిన పనిని ఒక్కడే పూనిక వహించి పూర్తిచేశాడు.
 
‘నాకు స్పష్టంగా తెలుసు అనుకున్నదాన్ని పాఠకులకు స్పష్టంగా’ చెప్పదలిచాడు. చాళుక్యుల నుండి ఆధునిక కాలం వరకు ‘ఆర్థికసంబంధాల ప్రాతిపదికన యుగవిభజన’ చేసిన ఈ పుస్తకం కోసం- ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నాడు. మధుమేహం పెరిగి మూత్రపిండాలు పనిచేయడం మానేశాయి. కంటిచూపు తగ్గిపోయింది. అయినా అన్ని కష్టాలనూ ఓర్చి వెయ్యేళ్ల చరిత్రను తెలుగువాళ్లకు అందించగలిగాడు. ‘సాహిత్యం అర్ణవమైతే, ఆరుద్ర మథించని లోతుల్లేవు. సాహిత్యం అంబరమైతే ఆరుద్ర విహరించని ఎత్తుల్లేవు. అతడు పట్టి బంగారం చేయని సాహిత్య శాఖ లేదు; ఆ శాఖపై అతడు పూయించని పువ్వుల్లేవు’.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement