Detective novelist
-
బైబిల్... షేక్స్పియర్... అగథా క్రిస్టీ!
ఎప్పటికీ గుర్తుండిపోయే నా టీనేజ్ జ్ఞాపకం: నేను అగథా క్రిస్టీ నవలల్ని చదవటం! అంతుచిక్కని క్రిస్టీ హత్యోదంతాలలో గల్లంతవుతూ ఉక్కపోత వేసవి మధ్యాహ్నాలను గడిపేవాడిని. ప్రధానంగా హెర్క్యూల్ పాయ్రోట్, మిస్ మార్పుల్ (క్రిస్టీ నవలల్లోని కల్పిత డిటెక్టివ్ పాత్రలు)ల అపరాధ పరి శోధనలు నన్ను కదలనివ్వకుండా చేసేవి. తక్కిన డిటెక్టివ్ పాత్రలు... టామీ, టపెన్స్ బెరెస్ఫోర్డ్; పార్కర్ పైన్, హార్లీ క్విన్ అనే వాళ్ల గురించి నాకసలు ఏమీ తెలియకపోయినా... క్రిస్టీ 66 డిటెక్టివ్ నవలలు రాశారనీ, అవి 200 కోట్ల కాపీలకు పైగా అమ్ముడయ్యాయనీ; బైబిలు, షేక్స్పియర్ రచనలు మాత్రమే ఆ సంఖ్యను దాటిన ప్రచురణలనీ, క్రిస్టీ నవలలు వందకు పైగా భాషలలోకి తర్జుమా అయ్యాయనీ అస్పష్టంగానైనా తెలుసు. అగథా క్రిస్టీ వ్యక్తిగత విషయాలు మాత్రం నాకు దాదాపుగా ఏమీ తెలియదు. అయితే ఆ లోటును, గత వారం నేను అనుకోకుండా చూసిన రెండేళ్ల నాటి లూసీ వర్స్‌లీ ‘అగథా క్రిస్టీ’ జీవిత చరిత్ర భర్తీ చేసింది. ఆమె ఇంగ్లండ్ రచయిత్రి. ఆమె తండ్రి అమెరికన్. క్రిస్టీ అనే పేరు ఆమెకు మొదటి భర్త నుండి వచ్చింది. వాళ్ల ఏకైక సంతానం కుమార్తె రోసాలిండ్. వారి వైవాహిక జీవితం 1914 నుండి 1928 వరకు కొనసాగింది. భర్తకున్న వివాహేతర సంబంధం చివరికి ఆమె చేత అత్యంత బాధా కరమైన విడాకులకు దారి తీయించింది. ఆ తర్వాత రెండేళ్లకు క్రిస్టీ తనకన్నా పదేళ్లు చిన్నవాడైన ఒక పురావస్తు శాస్త్రవేత్తను పెళ్లి చేసుకున్నారు. మధ్య ప్రాచ్యంలో అతడు జరిపిన తవ్వకాల ద్వారానే క్రిస్టీ ఇరాక్ (మెసపటేమియా), ఈజిప్టుల గురించి తెలుసుకున్నారు. భర్త తవ్వకాల పనికి చాలా వరకు క్రిస్టీనే డబ్బును సమ కూర్చారని పుస్తక రచయిత్రి వర్స్‌లీ రాశారు. ప్రతిఫలంగా ఆమెకు ‘డెత్ ఆన్ ద నైల్’, ‘మర్డర్ ఇన్ మెసపటేమియా’, ‘మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్‌ప్రెస్’ అనే మూడు పుస్త కాలు రాసేందుకు ముడి సరకు లభించింది. ఆమె తరచూ భర్త పాల్గొనే పురావస్తు త్రవ్వకాల దగ్గరకు వెళుతూ ఉండేవారు. బహుశా మీలో చాలామందికి అగథా క్రిస్టీ అనే ఆవిడ ‘థ్రిల్లర్’ల నవలా రచయిత్రి అని తెలిసి ఉండొచ్చు. కానీ ఆమె గురించి తెలుసుకోవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. ‘మేరీ వెస్ట్మెకాట్’ పేరుతో ఆమె ఆరు రొమాంటిక్ నవలలు రాశారు. ఆమె నిష్ణాతురాలైన నాటక రచయిత్రి కూడా! వాటిల్లో ప్రసిద్ధి చెందిన రెండు నాటకాలు ‘మౌస్ ట్రాప్’, ‘విట్నెస్ ఫర్ ద ప్రాసిక్యూషన్’. మొదటి నాటకాన్ని లండన్ వెస్ట్ ఎండ్ థియేటర్లో 1952 నుండి 2020 వరకూ ప్రద ర్శించారు. ఇంకా నడిచేదే కానీ, కోవిడ్ రాకతో తాత్కాలి కంగా నిలిపి వేయవలసి వచ్చింది. తిరిగి 2021 నుండి నిరవధికంగా ప్రదర్శిస్తూ ఉన్నారు. హెర్క్యూల్ పాయ్రోట్ ఆమె అత్యంత ప్రసిద్ధ కాల్ప నిక డిటెక్టివ్ పాత్ర. అయితే ఆ పాత్రను మోయటం ఆ ‘కల్పితుడికి’ తలకు మించిన పనైపోయిందని క్రిస్టీ తల పోశారు. 1975 నాటి ‘కర్టెన్’ నవలలో చివరిసారి అతడు కనిపించాక, ‘న్యూయార్క్ టైమ్స్’ తన మొదటి పేజీలో అతడికి శ్రద్ధాంజలి ఘటించింది. అగథా 86 సంవత్సరాలు జీవించారు. ఆమె తన 80లలో కూడా రాస్తూనే ఉన్నారని వర్స్‌లీ వెల్లడించారు. ‘‘ఆమె చనిపోయాక, ఆమె చివరి రాత పుస్తకాల్లో సైతం, తర్వాత రాయబోయే నవల కోసం తన ఆలోచనల్ని రాసి పెట్టుకున్నారు. అవి పూర్తిగా కొత్త ఆలోచనలు. ఇద్దరు విద్యార్థులు ఒక బాలుడిని ఏ కారణం లేకుండానే ఒక ప్రయోగంలా హత్య చేయటం గురించిన ఐడియాలు అవి...’’ అని రాశారు వర్స్‌లీ. అగథా క్రిస్టీ జీవితాన్ని కూడా రహస్యాలు చుట్టు ముట్టాయంటే ఆశ్చర్యంగా ఏమీ అనిపించదు. మొదటి భర్త క్రిస్టీతో తన వివాహ బంధం ఊగిసలాడుతూ ఉన్న సమ యంలో 1926లో ఆమె పది రోజుల పాటు అదృశ్యమై పోయారు. ఆమె కోసం భారీ ఎత్తున గాలింపు జరిగింది కానీ, ఆమె జాడ తెలియలేదు. ‘‘నమ్మకద్రోహం చేసిన తన భర్తపై ప్రతీకారం తీర్చుకోటానికి ఈ మాయలాడి ఏదో పథకం వేసి ఉంటుంది’’ అని విమర్శకులు కొందరు ఆమె గురించి మాట్లాడినట్లు వర్స్‌లీ రాశారు. మహోజ్వలమైన అగథా రచనా జీవితం... ఆరంభంలోనే తడబాటుకు లోనైంది. ఆమె తొలి పుస్తకం ‘ద మిస్టీరియస్ ఎఫైర్స్ ఎట్ స్టైల్స్’ను ఇద్దరు ప్రచురణకర్తలు తిరస్కరించారు. ఆ తర్వాత ‘ద బాడ్లీ హెడ్’ అనే సంస్థ ప్రచురణకు తీసుకుంది. 36 ఏళ్ల వయసులో అగథా 70 కిలోల బరువు ఉండే వారు. తర్వాత సంవత్సరాలలో ఆ బరువు 82 కిలో లకు చేరుకుంది. ఆమె భారీ మనిషి అనడంలో సందేహం లేదు. అగథాకు నివాస గృహాలంటే ఇష్టం. ఆమెకు ఎనిమిది ఇళ్లు ఉండేవి. ఆమె చాలాసార్లు నిర్లక్ష్యపూరితంగా రచన చేసేవారు. వర్సిలీ చెప్పినదాని ప్రకారం... పాయ్ రోట్ ‘ వైట్హెవెన్ మాన్షన్స్‘లో నివసిస్తాడు, కానీ కొన్నిసార్లు అతను ‘వైట్‌హౌస్ మాన్షన్స్‘లో కూడా ఉన్నట్లు చూపిస్తారు. ‘స్లీపింగ్ మర్డర్‘లో, ఒక క్లర్క్, రిసెప్ష నిస్ట్, రైలు ప్రయాణీకుడు... ముగ్గురికీ యాదృచ్ఛికంగా ఒకే పేరు ‘నార్రాకాట్’ పెట్టారు. ఈ పేరు మరో మూడు వేర్వేరు పుస్తకాల్లో ఒక చాంబర్మేడ్, పడవవాడు, పోలీసు అధికారి పేరుగా కూడా కనిపిస్తుంది. 1974లో గుండెపోటు వచ్చి కోలుకున్నాక, ఒక సందర్భంలో అగథా క్రిస్టీని ‘‘మీరెలా గుర్తుండిపోవాలని కోరు కుంటున్నారు?’’ అని ప్రశ్నించారు. ‘‘డిటెక్టివ్ కథలు రాసిన ఒక మంచి రచయిత్రిగా’’ అని ఆమె చెప్పారు. ఆశించినట్టే ఆమె డిటెక్టివ్ కథారచయిత్రిగా చరిత్రలో నిలిచిపోయారు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఆరుద్ర
...లేదా, ఒకే ఒక్క వాక్యంతోనూ ఆయన్ని స్ఫురణకు తేవొచ్చు. ‘నీవు ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు’. ఆరుద్రకు ఒక ‘నేమ్‌ప్లేట్’ చేయించాలంటే, ఆయన పేరుముందు ఏం చెక్కించాలి? బహుముఖ ప్రజ్ఞాశాలి అనేయొచ్చు సింపుల్‌గా. కానీ ఆ ప్రజ్ఞ ఎన్నిరకాలు? కవి, కథకుడు, డిటెక్టివ్ నవలా రచయిత(నెలకొకటి చొప్పున రాస్తానని అలాగే రాయడం ఆయన చేసిన ఆరుద్రశపథం), గేయకర్త, గేయనాటకకర్త, వ్యాసకర్త, గడీనుడీకారుడు, మెజీషియన్, సంపాదకుడు, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు, అభ్యుదయ రచయితల సంఘం- అరసం వ్యవస్థాపకుల్లో ఒకరు(సంఘాల గొడుగు ఎందుకు? అంటే, వానపడకుండా ఉండటానికంటాడు!), చివరగా సినిమా రచయిత. అనగా, పాటలూ మాటలూ అనువాదాలూ. రాయినైనా కాకపోతిని రామపాదం సోకగా(గోరంతదీపం); అమ్మకడుపు చల్లగా (సాక్షి); కొండగాలి తిరిగింది (ఉయ్యాల జంపాల); వేదంలా ఘోషించే గోదావరి (ఆంధ్రకేసరి); ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం (ఎంఎల్ఏ); ఎదగడానికెందుకురా తొందర (అందాల రాముడు); ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ (ముత్యాలముగ్గు); శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది... (పెళ్లిపుస్తకం) ఆరుద్రను ఇలాంటి ఏ కొన్ని పాటలతోనైనా పరిచయం చేయొచ్చు; లేదా, ఒకే ఒక్క వాక్యంతోనూ స్ఫురణకు తేవొచ్చు. ‘నీవు ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు’. భాగవతుల సదా శివశంకరశాస్త్రిగా జన్మించి, జన్మనక్షత్రం పేరిట తన కలంపేరును స్వీకరించిన ఆరుద్ర- కవిత కోసం నేను పుట్టాను, క్రాంతి కోసం కలం పట్టాను అని చాటుకున్నాడు. ‘నాకోసం నేను రాసుకోను. అందరికోసం నేను రాస్తాను. అందరూ నావాళ్లే కాబట్టి, నాకోసం రాసింది అందరికోసం రాసిందే’ అంటాడు. తెలంగాణ పోరాట ఇతివృత్తంతో ఆరుద్ర రాసిన ‘త్వమేవాహం’ చదివి, ఇక నేను పద్యాలు రాయకపోయినా ఫరవాలేదు, అని ఆనందపడ్డాడట ఆరుద్రకు మేనమామైన శ్రీశ్రీ. ఇందులో ఆరుద్ర- సమాజాన్ని గడియారంతోనూ, ధనికుల్ని గంటల ముల్లుతోనూ, మధ్యతరగతివాళ్లని నిమిషాలముల్లుతోనూ, పేదల్ని సెకన్లముల్లుతోనూ, ‘కీ’ని విప్లవగొంతుకగానూ ప్రతీకిస్తాడు. అంత్యప్రాసల ముద్ర-ఆరుద్ర అనిపించుకున్న ఈ ‘సన్యాసి రూప’ కవి... ‘ఛందస్సులతో అడ్డమైన చాకిరీ అందంగా చేయించుకోగలడు’. శ్లేషలు, చమత్కారాలతో మురిపిస్తాడు. చెరిషించి, పెరిషించి లాంటి తెలుగు ఇంగ్లీషు పదాల కాక్టెయిల్ సృష్టిస్తాడు. ‘ఆ/ మెన్/ ఆమెన్/ చెరపట్టన్/ మ్రోగెన్/ నీగన్/ నా/ పెన్/ ఆపెన్’... లాంటి పదాల గారడీలో వస్తువుకు ఔచిత్యభంగం వాటిల్లుతోందా? అనే మీమాంస ఒకటి కలిగినప్పటికీ! ‘చిన్ని పాదములందు/చివరి ప్రాసల చిందు/ చేయు వీనులవిందు/ ఓ కూనలమ్మా’ అంటూ కూనలమ్మ పదాలు ప్రారంభించాడు ఆరుద్ర. ‘ఆలి కొన్నది కోక/ అంతరిక్షపు నౌక/ అంతకన్నను చౌక/ ఓ కూనలమ్మా’ అని నవ్విస్తూనే, ‘కోర్టుకెక్కినవాడు/ కొండకెక్కినవాడు/ వడివడిగ దిగిరాడు’ అన్న సత్యాన్నీ చెబుతాడు. ‘అంతుచూసేవరకు/ అకట ఆంధ్రుల చురుకు/ నిలువ ఉండని సరుకు’ అని తెలుగువారి ఆరంభశూరత్వాన్ని వెక్కిరిస్తాడు. ‘అణువు గుండెను చీల్చి/ అమితశక్తిని పేల్చి/ నరుడు తన్నును బాల్చి’... చిన్న పదాల్లో పెద్ద భావాన్ని ఇముడుస్తాడు. ‘పరుల మేలును కోరి/ పదములల్లెడు వారి/ పథము చక్కని దారి’ అనిపిస్తాడు. ప్రయోగశీలత ఆయన కథల్లోనూ కనిపిస్తుంది. ‘సుబ్బారావున్నరగంటలసేపు’ అంటాడొకచోట. తన పురుషుడిని తన పూర్తి ప్రపంచంగా మలచుకున్న స్త్రీ హృదయానికి ఈ కొలత సులభంగా అర్థమవుతుంది! ‘రాముడికి సీత ఏమౌతుంది?’ లాంటి ఆసక్తికర శీర్షికతో సకల రామాయణాల్ని తవ్విపోశాడాయన. శ్రీకృష్ణుడు అసలుసిసలు ఆంధ్రుడనీ, ఏకలవ్యుడు కుంతీదేవి అక్క కొడుకనీ, పుత్రికకూ కుమార్తెకూ భేదముందనీ, పుత్రిక అంటే సహోదరులు లేనిదనీ, కుమార్తె అంటే తోడబుట్టినవారిని కలిగినదనీ తేల్చిచెప్పాడు. ‘సినీవాలి’, ‘ఇంటింటి పజ్యాలు’, ‘గాయాలు-గేయాలు’, ‘పైలాపచ్చీసు’, ‘శుద్ధ మధ్యాక్కరలు’, ‘గుడిలో సెక్స్’, ‘వేమన్న వాదం’, ‘తిరుక్కురళ్’అనువాదం, చదరంగ పుస్తకం, ‘సినీ మినీ కబుర్లు’... ఇక, రాయడం అటుండనీ, చదవడానికే జీవితకాలం చాలదనిపించే బృహత్తరమైన ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ ఆయన పరిశోధనాశక్తికి పరాకాష్ఠ! సంస్థలుగా మాత్రమే చేయగలిగిన పనిని ఒక్కడే పూనిక వహించి పూర్తిచేశాడు. ‘నాకు స్పష్టంగా తెలుసు అనుకున్నదాన్ని పాఠకులకు స్పష్టంగా’ చెప్పదలిచాడు. చాళుక్యుల నుండి ఆధునిక కాలం వరకు ‘ఆర్థికసంబంధాల ప్రాతిపదికన యుగవిభజన’ చేసిన ఈ పుస్తకం కోసం- ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నాడు. మధుమేహం పెరిగి మూత్రపిండాలు పనిచేయడం మానేశాయి. కంటిచూపు తగ్గిపోయింది. అయినా అన్ని కష్టాలనూ ఓర్చి వెయ్యేళ్ల చరిత్రను తెలుగువాళ్లకు అందించగలిగాడు. ‘సాహిత్యం అర్ణవమైతే, ఆరుద్ర మథించని లోతుల్లేవు. సాహిత్యం అంబరమైతే ఆరుద్ర విహరించని ఎత్తుల్లేవు. అతడు పట్టి బంగారం చేయని సాహిత్య శాఖ లేదు; ఆ శాఖపై అతడు పూయించని పువ్వుల్లేవు’.