Mythological drama
-
ప్రేమమయి సత్యభామ
‘దీపావళి’ సందర్భంగా ‘సత్యభామ’ పాత్ర మనోవిశ్లేషణ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ మాటల్లో... సాక్షికి ప్రత్యేకం.సత్యభామది పరిపూర్ణమైన, మూర్తీభవించిన స్త్రీతత్వం. భారతీయులంతా వారు ఏ ఖండంలో ఏ దేశంలో ఉన్నా ఆమెనూ ఆమె పాత్రను ఎవరికివారు తమదిగా భావిస్తారు. మా అమ్మాయే అనుకుంటారు. తెలుగువారు మరో అడుగు ముందుకేసి సత్యభామది తెనాలో ఓరుగల్లో అని భావిస్తారు. సత్యభామ పాత్ర నృత్యరూపాల వల్ల, పౌరాణిక నాటకాల వల్ల, సినిమాల వల్ల మనకు అంత దగ్గర.సత్యభామ మహాతల్లిఅసలు స్త్రీ ఎలా ఉండాలి? నా ప్రపంచానికి నేను అధినేతని అన్నట్లు ఉండాలి. గడప దాటి బయటికి వెళ్లిన భర్తకో ప్రపంచం ఉండొచ్చు... ఎంత పెద్ద సామ్రాజ్యం అయినా ఉండొచ్చు... కానీ ఒక్కసారి ఇంటి లోపలికి వచ్చాక అతన్ని పరిపాలించడానికి ఒక మనిషి కావాలి... ఆ మనిషిని నేను. మా ఆయన్ని నేను తప్ప ఇంకెవరు పరిపాలిస్తారు అనే భావన సత్యభామది. ఆమె భర్తని కొంగున కట్టేసుకుంది... భర్తని తనకు బానిసలా చేద్దామనుకుందని చాలామంది అనుకుంటారు. అయితే ఇవన్నీ ఆవిడకు తెలియదు. ఆమెకి తెలిసింది ఒక్కటే–అతను నా భర్త... నా సొంతం... నేనేమైనా చేస్తా... అంటే బిడ్డని తల్లి ఎలా చూసుకుంటుంది? తన మాట వినాలనుకుంటుంది కదా... భర్తను అలా చూసుకున్న ఇల్లాలు ఆమె... సత్యభామ మహాతల్లి.అది అహం కాదు... ప్రేమసత్యభామది అహం అని చాలామంది అనుకుంటారు. అసలు ఆవిడ అహం ఎక్కడ చూపించింది? పరిచారిక చెప్పిన మాట కూడా విందామె. తన ఇంట్లో పని చేసే అందరితో స్నేహంగా ఉంది. భర్త మీద ఉన్న అదుపులేని ప్రేమలో అహం, కోపం, కామం, క్రోధం, లోభం... ఇలా అరిషడ్వర్గాలు ఉంటాయి. రామాయణంలో కైక పాత్ర సత్యభామకు దగ్గరగా ఉంటుంది. ఆమె కూడా తన భర్తను గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటుంది. అలాగే సత్యభామలా భర్త కోసం యుద్ధం చేసింది... భర్తను గెలిపించింది. అయితే సత్యభామ నుంచి కైకని విడదీసే అంశం ఏంటంటే స్వార్థం. తన కొడుకు రాజు కావాలనే స్వార్థం కైకలో కనిపిస్తుంది. నా కొడుకుని రాజుని చేయా లంటే పెద్ద భార్య కొడుకు రాముడిని అడవులకు పంపాలనుకున్న స్వార్థం ఆమెది. కానీ సత్యభామలో ఆ కోణం కనిపించదు. రాముణ్ణి అడవులకు పంపితే రేపట్నుంచి తన భర్త దశరథుడు ఎప్పటిలా తనతో ఉంటాడా... ఉండడా... ఇవన్నీ కైక ఆలోచించలేదు. ఇదే సత్యభామ అయితే రేపట్నుంచి నా భర్త నాతో మాట్లాడడనే ఆలోచన వచ్చిందంటే దానికి కారణమయ్యే ఏ పనీ ఆ మహాతల్లి చెయ్యదు. సత్యభామది అంత గొప్ప క్యారెక్టర్. ఆమెకు భర్తే సర్వస్వం. అయినా భర్త తప్పు చేస్తే ఒప్పుకోదు. బెత్తం పట్టుకుని కింద కూర్చోబెడుతుంది. సత్యభామ ప్రతి ఇంట్లో ఉన్న తల్లిలో కనిపిస్తుంది. ఎందుకంటే కృష్ణుడిలాంటి భర్త కావాలని ఏ భార్యా కోరుకోకపోవచ్చు... కానీ కృష్ణుడులాంటి కొడుకు కావాలనుకుంటుంది. సో... అలా కృష్ణుణ్ణి తన కొడుకులా చూసుకుంది సత్యభామ. బిడ్డని కొట్టినట్లే కొట్టింది... బిడ్డ దగ్గర అలిగినట్లే అలిగింది. సత్యభామ బయటకు వచ్చి ఉంటే...సత్యభామ నాలుగు గోడల మధ్యనే ఉండిపోయింది. అదే బయటకు వస్తే ప్రపంచాన్ని పరిపాలించి ఉండేది. కృష్ణుణ్ణి నరకాసురుడు పడేస్తే... నా భర్తను కొడతావా అంటూ ఆ నరకాసురుణ్ణి చంపేసింది. అంటే... అక్కడ ఆవిడ కృష్ణుడి కన్నా బలవంతురాలనే కదా అర్థం. కృష్ణుడు ఇంటికి రాకపోతే బాధ.. వస్తే ఆనందం... కృష్ణుడు పక్కన లేకపోతే ఆమెకు నరకమే! ఆవిడ సంతోషం, బాధ ఏ ఎమోషన్ అయినా కృష్ణుడే. అంత గొప్ప ఇల్లాలు. డెబ్భై అయిదు శాతం మంది భార్యలు సత్యభామలానే ఉంటారు. అలా ఉన్నారు కాబట్టే ప్రపంచం నడుస్తోంది.కిరీటం వద్దు... నువ్వు చాలందికృష్ణుడు తన కిరీటాన్ని సత్యభామకు పెడతానన్నా ఒప్పుకోదు... నాకు నీ కిరీటం ఎందుకు? నాక్కావాల్సింది నువ్వు అంటుంది. సత్యభామలా స్వచ్ఛంగా ప్రేమించే భార్య దక్కినందుకు కృష్ణుడు ఎంతో అదృష్టవంతుడు. కృష్ణుడు ఎలా అయితే ప్రేమకు ప్రతి రూపమో... అలా సత్యభామ కూడా కృష్ణుడి ప్రేమకు ప్రతిరూపమే.నచ్చినట్లుగా బతకాలిఈ తరం అమ్మాయిలు సత్యభామ నుంచి నేర్చుకోవాల్సిన విషయం స్త్రీ సాధికారత. ఆమెలా ధైర్యంగా, స్వేచ్ఛగా బతకాలి. కట్టుబాటు అనేది స్త్రీకి ఎలా ఉందో మగవాడికి కూడా అలానే ఉండాలి. స్వేచ్ఛ అంటే ఎవరిని పడితే వాళ్లని రేప్ చేయమనా? ఇష్టం వచ్చినట్లు రోడ్ల మీద తిరగ మనా? కాదు. స్వేచ్ఛ వేరు... విచ్చలవిడితనం వేరు. సత్యభామది స్వేచ్ఛ. ఆమెలా హద్దుల్లో ఉండు. ఆ హద్దులను అనుభవించు. నీకంటూ ఓ గీత ఉంది. ఆ గీత లోపల నీ ఇష్టం. – ఇంటర్వ్యూ: డి.జి. భవాని -
దేవతలు పంపిన రాయబారి!
కెంపరాజ్ నిర్మాణ, దర్శకత్వంలో భానుమతి ప్రధాన పాత్ర పోషించిన సినిమాలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... ‘‘నారద మునీంద్రులకు నమస్కారం. విశేషములు ఏమైనా కలవా?’’ నారదుడిని అడిగారు అగ్నిదేవుడు, వరుణదేవుడు, దేవేంద్రుడు, యమధర్మరాజు. ‘‘త్రిభువనసుందరి, విదర్భ రాజకుమారి స్వయంవరమే ఒక అపూర్వవిశేషం. ఆమె రూపలావణ్యాల ముందు రంభ, ఊర్వశీ, మేనక దిగదుడుపు’’ అని చెప్పాడు నారదుడు. ‘‘అయితే నేను ఆమెను వివాహమాడతాను’’ అన్నారు ఆ నలుగురిలో ఒకరు. ‘‘అదిమాత్రం సాధ్యం కాదు’’ అని చెప్పాడు నారదుడు. ‘‘ఎందువల్ల?’’ మూకుమ్మడిగా అడిగారు ఆ నలుగురు. ‘‘ఆమె ఏనాడో నలసార్వభౌముడిని మనసారా ప్రేమించి అతనినే వివాహమాడాలని త్రికరణశుద్ధిగా నిర్ణయించుకుంది’’ అసలు విషయం చెప్పాడు నారదుడు. ‘‘మునీంద్రా! స్వయంవరంలో నా ముఖం చూసిన తక్షణం నన్నే వరిస్తుంది’’ ధీమాగా అన్నాడు యమధర్మరాజు. ‘‘ఆమె దృఢసంకల్పం మార్చడం ఎవ్వరికీ సాధ్యం కాదు’’ తనకు తెలిసిన సత్యాన్ని చెప్పాడు నారదుడు. ‘‘మాకంటే అతడే ఎక్కువా?’’ నలమహారాజును దృష్టిలో పెట్టుకొని అడిగాడు దేవేంద్రుడు. ‘‘ఎక్కువో తక్కువో మీరే నిశ్చయించుకోండి’’ అని ఆ బాధ్యత వారి భుజాల మీదే పెట్టి అక్కడి నుంచి కదిలాడు నారదుడు. అగ్నిదేవుడు, వరుణదేవుడు, దేవేంద్రుడు, యమధర్మరాజులు నలమహారాజు ముందు ప్రత్యక్షమయ్యారు. ‘‘తాము ఎవరో తెలుసుకోవచ్చా?’’ అడిగాడు నలుడు. ‘‘వీరు వరుణదేవుడు’’ ‘‘వీరు అగ్నిదేవుడు’’ ‘‘వీరు దేవేంద్రుడు’’ ‘‘వీరే యమధర్మరాజు’’ పరిచయాలు పూర్తయ్యాయి. ‘‘ఆహా! దేవతామూర్తులా... అనేక జన్మల పుణ్యఫలం వల్ల కూడా లభించని మీ దర్శనభాగ్యంతో నా జన్మ చరితార్థం అయింది. ఏ సేవలు చేసి మిమ్మల్ని రంజింప చేయాలో ఆజ్ఞాపించండి’’ సంతోషంగా అడిగాడు నలమహారాజు. ‘‘నలరాజా! నీవల్ల మాకో ఉపకారం కావాలి’’ అడిగాడు దేవేంద్రుడు. ‘‘కామధేనువు, కల్పవృక్షం పెరట్లో ఉన్న మీకు సామాన్య మానవుడి వల్ల కావలసిన ఉపకృతి ఏముంటుంది స్వామి! నన్ను పరీక్షిస్తున్నారా? పరిహసిస్తున్నారా!’’ అడిగాడు నలమహారాజు. ‘‘పరీక్ష కాదు పరిహాసం కాదు. చేస్తానని వాగ్దానం చెయ్యి’’ అడిగాడు యమధర్మరాజు. ‘‘ఎందుకా సందేహం? ఇక ఆనతి ఇవ్వండి’’ అని అడిగాడు నలమహారాజు. ‘‘చక్రవర్తీ! నువ్వు దమయంతిని చూశావా?’’ అడిగాడు దేవేంద్రుడు. ‘‘లేదు స్వామి!’’ అని బదులిచ్చాడు నలుడు. ‘‘నిన్నే వరించి వివాహమాడబోతున్నదట’’ ఒకింత ఈర్ష్యతో అన్నాడు వరుణుడు. ‘‘అయితే నేను చాలా అదృష్టవంతుడిని. ఆమె అనురాగానికి పాత్రుడిని కావడం తమవంటి అమరుల ఆశీర్వాద ఫలితం. నా జన్మ పావనం అయింది’’ అని సంతోషంలో తేలిపోయాడు నలమహారాజు. ‘‘చక్రవర్తీ! సంతోషంతో మైమరచిపోతున్నావు. మరచిపోవాల్సింది దమయంతిని’’ కఠినంగా అన్నాడు యమధర్మరాజు. ‘‘దమయంతి సౌందర్యం గురించి మేము ఆలకించాం. ఆమెను వరించాలనుకుంటున్నాం. ఆమెను సమీపించి మాలో ఏ ఒకరినైనా వరించమనే సందేశం అందించాలి. చెప్పి ఒప్పించాలి’’ అన్నాడు దేవేంద్రుడు. ‘‘స్వామీ! ఏమిటీ పరీక్ష? నేను దమయంతిని గాఢంగా ప్రేమిస్తున్నానని తెలిసి కూడా నన్ను ఈ కార్యభారానికి వినియోగించడం సమంజసమా?’’ బాధగా అన్నాడు నలమహారాజు. ‘‘వాగ్దానం చేశావు. మాట నిలుపుకోవడం నీవంతు’’ గుర్తు చేశాడు యమధర్మరాజు. ‘‘దమయంతిపై మరులుగొన్న చక్రవర్తికి తన వాగ్దానం జ్ఞాపకం ఉంటుందా?’’ వెటకారంగా నవ్వాడు దేవేంద్రుడు. ‘‘హరిశ్చంద్రునితోనే సత్యం స్వర్గానికి వేంచేసింది’’ అంటూ దేవేంద్రుడి వెటకారానికి శ్రుతి కలిపాడు వరుణదేవుడు. ‘‘క్షమించండి. ఆడి తప్పే అధముడిని కాదు’’ అన్నాడు నలమహారాజు. ఈ మాటతో దేవతల కళ్లు సంతోషంతో వెలిగాయి. ‘‘కానీ అంతఃపురంలో నివసించే రాకుమారిని ఏకాంతంలో సందర్శించడం ఎలా సాధ్యం?’’ తన మనసులోని సందేహాన్ని దేవతల ముందు పెట్టాడు నలుడు. అప్పుడు వారు అతని చేతిలో ఒక ముద్రిక పెట్టి.... ‘‘ఇదిగో శంబరీ ముద్రిక. దీనిని ధరించి అదృశ్యరూపుడవై అంతఃపురంలో ప్రవేశించు. నీ ధర్మం, మా వాంఛ నెరవేరుతుంది’’ చెప్పారు దేవతలు. శంబరీ ముద్రిక సహాయంతో దమయంతి ఏకాంత మందిరంలోకి ప్రవేశించాడు నలమహారాజు. అతడిని చూసి ‘‘ఎవరు మీరు?’’ అని ఆశ్చర్యపోయింది దమయంతి. ‘‘నేను దేవదూతను. నీతో ఏకాంతంగా సంభాషించడానికి రాచమర్యాదను ఉల్లంఘించాను’’ చెప్పాడు నలుడు. ‘‘ఏకంత ప్రసంగమా? ఏమది?’’ అడిగింది దమయంతి. ‘‘ఈ కమనీయ విగ్రహం, చందమామలాంటి ముఖం, అందాలు చిందే నీ చిరునవ్వులు అపూర్వం, అనిర్వచనీయం. సురలకు కూడా అలభ్యమైన ఈ సుందరాకృతి, సుగుణసంపత్తి...’’ చెప్పుకుపోతున్నాడు నలుడు. ‘‘చాలించండి మీ వర్ణన’’ మధ్యలోనే ఆపేసింది దమయంతి. ‘‘ఈ వర్ణన విని ఇంద్రుడు, అగ్ని, యముడు, వరణుడు ముగ్ధులై మైమరిచి...’’ అంటుండగానే మళ్లీ అడ్డుపడి– ‘‘మీరు మైమరచిపోతున్నారే’’ అన్నది దమయంతి. ‘‘వారు మైమరచిపోయి నీ ప్రేమభిక్ష కోరుతున్నారు. వారి వలపు వేడుకోలు విన్నవించమని నన్ను రాయబారిగా పంపారు. మహత్తరశక్తులు కలిగిన దేవతలు బలాత్కారంగా నిన్ను తీసుకువెడితే చేయగలిగింది ఏముంది?’’ అన్నాడు నలుడు. ‘‘ప్రాణత్యాగం చేస్తాను. నా మనసును ఏనాడో ఆ నలసౌర్వభౌమునికే అర్పించాను’’ దృఢంగా చెప్పింది దమయంతి. ‘‘ఒకవేళ నలసార్వభౌముడే నీ ప్రేమను నిరాకరిస్తే?’’ ఆమె కళ్లలోకి చూస్తూ సూటిగా అడిగాడు నలుడు. -
నవయుగ నటులు
‘ఇవేమైనా ఆర్చేవా తీర్చేవా.. ఎందుకొచ్చిన నాటకాలర్రా...’ నాటకరంగం పీక్ స్టేజ్‌లో ఉన్న కాలంలోనే వినిపించిన డైలాగ్ ఇది. నానాటికీ ప్రాభవం కోల్పోతున్న రంగస్థలంపైకి రావడానికి అడుగులు పడటమే భాగ్యం అయిపోయిన ఈ రోజుల్లో.. మేమున్నాం అంటున్నారు కుర్రకారు. ఓ వైపు చదువుకుంటూనే కళలపై దృష్టి సారిస్తున్నారు. తొలిసారి ఓ పౌరాణిక నాటకంతో తమ ప్రతిభ చాటారు భవన్స్ వివేకానంద కాలేజ్ విద్యార్థులు. బుధవారం రవీంద్రభారతిలో ధర్మవీర్ భారతి రాసిన ‘అంధయుగ్’ నాటకాన్ని ప్రదర్శించి అందరి మన్ననలు అందుకున్నారు. - కోన సుధాకర్‌రెడ్డి అంధయుగ్ ఓ పౌరాణిక నాటకం. కురుక్షేత్ర సంగ్రామం తర్వాత చరిత్రను వివరిస్తుంది. ఈ నాటకం వేయాలంటే.. మాటల్లో గాంభీర్యం వినిపించాలి. అభినయంతో అదరగొట్టాలి. స్మార్ట్ ఫోన్లు.. ఫేస్‌బుక్‌లు.. వాట్స్ యాప్‌లతో రోజూ కబుర్లాడే ఈ కాలేజ్ ఫ్రెండ్స్ ఇవన్నీ చేయడం వెనుక పెద్ద పరిశ్రమే ఉంది. పుస్తకాలతో కుస్తీ పడుతూనే.. రాజీ పడకుండా నాటకం స్క్రిప్ట్‌ను ఔపోసనపట్టారు. శిక్షణ తీసుకున్నారు. అరంగేట్రంలోనే తమ ఆంగికవాచకాభినయాలతో అందరి ప్రశంసలు అందుకున్నారు. అశ్వత్థామ ఆగ్రహ.. కురుక్షేత్ర సంగ్రామం పూర్తి కావడంతో ఈ కథ మొదలవుతుంది. యుద్ధం ముగిశాక పాండువంశ నాశనానికి అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగిస్తాడు. ఈ సమయంలో ధృతరాష్ట్రుడు, శ్రీకృష్ణుడు.. వంటి మహామహులు కూడా అతనిని అడ్డుకోరు. ఇదే ఇతివృత్తంతో నాటకం సాగుతుంది. కురుక్షేత్ర యుద్ధ ప్రభావం, దాని ఫలితాలను ఇందులో ప్రదర్శించారు. హింసాత్మక సంఘటనలు మానవీయ విలువలు తగ్గించేవే అని నాటక సారాంశం. పురాణోక్తమైన ఈ నాటకాన్ని నేటి సమాజానికి అన్వయిస్తూ భవన్స్ వివేకానంద విద్యార్థులు ప్రదర్శించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అన్నీ తామై.. అలహాబాద్‌కు చెందిన ప్రఖ్యాత రచ యిత, పద్మశ్రీ అవార్డు గ్రహీత ధర్మవీర్ భారతి అంధయుగ్ నాటకాన్ని హిందీలో రాశారు. భారత్-పాక్ విభజన సమయంలో ఇది రూపుదిద్దుకుంది. పౌరాణిక నాటకంగా ప్రశస్తి పొందిన అంధయుగ్ దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా ఎన్నో వేదికలపై ప్రదర్శితమైంది. భవన్స్ విద్యార్థులు అన్నీ తామై ఈ నాటకాన్ని రక్తి కట్టించారు. డెరైక్టర్‌గా డిగ్రీ విద్యార్థి కృష్ణ చైతన్య, అసిస్టెంట్ డెరైక్టర్‌గా శ్వేత వ్యవహరించారు. లైటింగ్, సౌండింగ్, విజువల్ హెల్ప్, లైవ్ మ్యూజిక్ అన్నీ వారే నిర్వహించారు. కళాశాల లెక్చరర్ల ప్రోత్సాహం వీరికి అదనపు బలమైంది. గర్వంగా ఉంది.. గాంధారి పాత్రను వేసినందుకు చాలా గర్వంగా ఉంది. భర్త అంధుడని.. తనూ లోకాన్ని చూడకూడదని కళ్లకు గంతలు కట్టుకుంటుంది. ఆమెలోని సద్గుణాలు ఈ తరానికి ఆదర్శం కావాలి. - పి.ఆకాంక్ష, బీఏ, సెకండియర్ ఎంత కష్టం.. ధృతరాష్ట్రుడిగా నటించడం కత్తి మీద సామే. అంధుడిగా అభినయించడం కష్టంగా అనిపించింది. మొదటిసారైనా మా నటనకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన మరువలేను. ముందు ముందు మరింత మెరుగ్గా నటిస్తాను. - డి.హేమంత్ గోపాల్, బీఏ, థర్డ్ ఇయర్ ఆ గుణాలు నాకు రావాలి.. నేను స్టేజ్ ఎక్కడం ఇదే తొలిసారి. ధర్మరాజు పాత్ర వేయడం గొప్ప అనుభూతినిచ్చింది. 130 రోజులుగా ప్రాక్టీస్ చేశాను. ధర్మరాజులోని సద్గుణాలు కొన్నయినా నాకు అలవడితే అంతే చాలు. - కిషన్, బీఏ, సెకండియర్. నాలుగు నెలలుగా అశ్వత్థామ పాత్ర కోసం నాలుగు నెలలుగా రిహార్సల్స్ చేశాను. నా శక్తి మేరకు నటించాను. డ్రామా చూసిన సహచరులు అభినందించడం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. లెక్చరర్ల ప్రోత్సాహం మరువలేనిది. - వినయ్ సింగ్, బీబీఏ ఫైనల్ ఇయర్.