తెలతెలవారుతోంది. సత్యభామ నెమ్మదిగా మేల్కొంటోంది. నిద్ర మంచం మీద నుంచే ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడికి ప్రణామం చేసి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరించి, నెమ్మదిగా లేచి వచ్చింది. ఆ రోజు సత్యభామ మనసును బాధ, ఆనందం రెండూ కష్టపెడుతూనే సంతోషపెడుతున్నాయి. మానసిక సంఘర్షణతో నిండిన ఎదతో సత్యభామకు ఏ పని చేయటానికీ తోచట్లేదు.
తలారా స్నానం చేసి, పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి శ్రీకృష్ణుని మందిరానికి బయలుదేరింది సత్యభామ. ఎన్నడూ లేనిది ఆ రోజు తెలుపునలుపుల సమ్మిళితమైన పట్టు బట్టలు ధరించింది. తల నిండా మల్లెలు తురుముకుంది. ముత్యాల హారం ధరించింది. సత్యభామ ముగ్ధలా ముద్దుగా మురిపెంగా కనిపస్తూనే అంతలోనే ఆమెలో ఏదో తెలియని దిగులు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. గమనము విడిచిపెట్టకుండా వేగంగా శ్రీకృష్ణ మందిరం చేరింది సత్యభామ.
ఆమె రాక కోసమే ఎదురు చూస్తున్నాడు అన్నట్టుగా శ్రీకృష్ణుడు గుమ్మం దగ్గరే స్వాగతం పలకటానికి సిద్ధంగా ఉన్నాడు.సత్యలోని రెండు భావాలను వెంటనే గమనించాడు నల్లనివాడు. ఆమె కుడి చేతిని తన చేతిలోకి తీసుకుని, నడిపించుకుంటూ తీసుకువెళ్లి, తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. అంతవరకు ఎంతో కొంత గంభీరంగా ఉన్న సత్య కళ్లలో నీళ్లు ఊటలా ఊరి ఒక్కసారిగా ఒళ్లంతా తడిపేశాయి.
ఈమె నా సత్యభామేనా, ఇంత బేలగా విలపిస్తోంది. ఎంతటి ధైర్యవంతురాలు, యుద్ధం చేసిన అరివీరభయంకర నారి.. అనుకుంటూ తన చేలాంచలముతో ఆమె కన్నీరు మృదువుగా తుడిచాడు. ఆశ్వాసన లభించటంతో ఆమెలోని దుఃఖం వరదలా పొంగుకొచ్చింది. ఆమెను పూర్తిగా దుఃఖపడనిచ్చాడు. కొంత సేపటికి ఆమె మనసు కొద్దిగా కుదుటపడింది.
కొంత సేపటికి తన మనసును తానే కుదుటపరచుకుని... శ్రీకృష్ణా.. నన్ను ఇలా చూస్తే నీకు కొత్తగా అనిపిస్తోంది కదూ... నిజమే.. నేను ధైర్యవంతురాలినే కాని, భీరురాలిని కానని నీకు తెలుసు. అటువంటి నేను కంటనీరు పెట్టుకోవటం నీకు ఆశ్చర్యంగా అనిపించటంలో తప్పులేదులే...అంటూ - తన దుఃఖానికి కారణం నెమ్మదిగా వివరించటం ప్రారంభించింది.
శ్రీకృష్ణా... ఈ రోజు ప్రత్యేకత నీకు తెలుసు కదూ.. అంటూ తన ఖేదానికి కారణం చెప్పడానికి సన్నద్ధురాలైంది. ఎందుకు తెలీదు. నువ్వు నాకు విజయం తెచ్చిపెట్టిన రోజు ఈ రోజే కదా... అన్నాడు నవ్వురాజిల్లెడు మోముతో. అవును.. అది ఒక విషయం. ఆ విషయం తలచుకున్నప్పుడల్లా నా మనసు సంబరపడుతుంది. అదొక్కటే కాదు కదా... మరో విషయం కూడా ఉంది కదా.. అంది మనసులోని దుఃఖాన్ని మాటల ద్వారా పలుకుతూ... ఎందుకు గుర్తు లేదు.. నరకాసుర సంహారం జరిగింది ఈ రోజే కదా.. అన్నాడు గంభీరంగా.
అదే.. అదే.. ఆ సంఘటనే నా మనసుని కలవరపెడుతుంది.. అంది కంట నీరు బయటకు రానీయకుండా తడిసిన గుండెతో. అలా అంటావెందుకు. స్వయంగా నువ్వే కదా నరకాసురుని సంహరించడానికి సహకరించావు... అన్నాడు ఏమీ తెలియనట్లుగా ఆ లీలామానుష విగ్రహుడు. సత్యభామ అదేమీ గమనించనట్లుగా... నిజమే... ఎంతైనా వాడు నా పుత్రుడు కదా. ఒక తల్లిగా నాకు ఆ బాధ ఉంటుంది కదా. లోకరక్షణ కోసం నేను నరకుడిని సంహరించినా, కన్నప్రేమ ఒక పక్కన బాధిస్తూనే ఉంటుంది కదా.. అంది గద్గద స్వరంతో సత్యభామ.
సత్యా... ఇక్కడ మనం ఒక విషయం చర్చించుకుందామా. నరకుడిని అసురుడు అన్నాం. అంటే వాడిలో రాక్షస గుణాలు ఉన్నాయనే కదా అర్థం. మనం రాక్షస గుణాలను సంహరించాం. అందుకే నరకుడి పేరు మీదనే కదా నరక చతుర్దశి అని ఈ పండుగను జరుపుకుంటున్నాం. ఇతర పండుగలన్నింటికీ ఇలా అసురుల నామాలు లేవు కదా. మనం మనలోని రాక్షస లక్షణాలను పోగొట్టుకుని, మనలో ఉన్న జ్ఞానజ్యోతిని దేదీప్యమానంగా వెలిగించుతూనే ఉండాలి కదా... అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడాడు జగద్గురువు.
అసలు నువ్వు ఇలా మాట్లాడటమే నాకు వింతగా ఉంది. ఈ సృష్టికి మూలమైన లలన ఇంత బేలగా మాట్లాడొచ్చా... అంటుంటే సత్యభామ.. వెంటనే తనలోని బేలతనాన్ని పక్కకు పెట్టి, గంభీరంగా..నిజమే కృష్ణా.. వాస్తవానికి ఈ రోజు నీతో ఈ విషయమే మాట్లాడాలనుకున్నాను. కాని ఎందుకో నా మనసు తడి కావటంతో, ముందుగా నాలోని బాధను నీతో పంచుకున్నాను. నువ్వన్నది నిజమే. ఈ సృష్టికి కారణమైన స్త్రీకి ఇప్పుడు ఎందుకు సముచిత స్థానం లేదో అర్థం కావట్లేదు.
మానవులందరూ పూజించే దేవుళ్లందరూ తమ భార్యల పేరుతోనే ప్రసిద్ధులు కదా. పార్వతీపరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, వాణిబ్రహ్మలు.. ఇలా.. మరి ఈ తేడాలు ఎందుకు వచ్చాయో అర్థం కావటం లేదు.. అంటూ సందేహం వెలిబుచ్చింది సత్యభామ.
ఏమో ఎక్కడ జరిగిందో తెలియట్లేదు. త్రేతాయుగంలో మా పినతల్లి కైకమ్మ మా తండ్రిగారయిన దశరథ మహారాజుకి యుద్ధంలో సహకరించింది కదా. ద్వాపర యుగం వరకు ఎన్నడూ స్త్రీపురుష వివక్ష లేదు. మరి కలియుగంలో ఎందుకు వచ్చిందో... అంటూ ఏమీ తెలియనివాడిలా ఉపదేశం చేశాడు పరాత్పరుడు.
సత్యభామ చిరునవ్వుతో... వీటికితోడు.. ఎవరికైనా కోపం వస్తే చాలు... సత్యభామలా అలిగింది అంటూ పోలుస్తారే కాని, సత్యభామలా ధైర్యంగా ఉన్నవారిని నాతో ఎందుకు పోల్చరో తెలియట్లేదు. ఆడవారు ఆదిశక్తి స్వరూపం కదా... ఆ శక్తి ఎందుకు సన్నగిల్లిపోతోందో... ఆ ఆత్మాభిమానం ఎక్కడకు పారిపోతోందో అర్థం కావట్లేదు కృష్ణా... అంటూ తన కొంగును నడుముకి బిగిస్తూ పలికింది సత్య.
అవును సత్యా... ఈ సృష్టి నిత్యం కొనసాగటం కోసం ఆడమగ అనే ప్రాణులను సృష్టిస్తే... మానవులు మాత్రం ఆడవారు తక్కువ, మగవారు ఎక్కువ అనే స్థితికి చేరుతున్నారు. ఇది మంచిది కాదు... అంటూ హితోక్తులు పలుకుతున్నాడు. దీపావళి పండుగలోని పరమార్థం అదే కదా... మన ఇంటిలోని రాక్షస గుణాలను పారద్రోలి, దైవలక్షణాలు అనే దీపాన్ని వెలిగించమని మనం ఈ పండుగ ద్వారా చెబుతున్నాం.
దీపపు కాంతులతో పాటు, మానసిక ఉల్లాసం కోసం బాణాసంచా కాల్చుకోమంటున్నాం. కాని వీటిలోని పరమార్థం పక్కకు వెళ్లిపోతోంది. శారీరక ఆరోగ్యం దిగజారిపోయేలా చెవులు చిల్లులు పడే మందుగుండు సామగ్రి కాలుస్తున్నారు. సామాన్యంగా నిరాడంబరంగా చేసుకోవలసిన పండుగను అప్పులు చేసి ఆర్భాటంగా చేసుకుంటున్నారు... అంటూ సత్యభామ పలుకుతుంటే.. శ్రీకృష్ణుడు సన్నగా నవ్వుతూ...నిజమే సత్యా.. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలేమో.. అన్నాడు.
►వైజయంతి పురాణపండ (సృజన రచన)
Comments
Please login to add a commentAdd a comment