సర్వే సెటిల్మెంట్‌ శాఖ పునర్వ్యవస్థీకరణ | Reorganization of Survey Settlement Department | Sakshi
Sakshi News home page

సర్వే సెటిల్మెంట్‌ శాఖ పునర్వ్యవస్థీకరణ

Published Mon, May 23 2022 4:36 AM | Last Updated on Mon, May 23 2022 8:29 AM

Reorganization of Survey Settlement Department - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: 50 ఏళ్ల తర్వాత రాష్ట్రంలోని సర్వే సెటిల్మెంట్, ల్యాండ్‌ రికార్డుల శాఖను ప్రభుత్వం పునర్వ్యస్థీకరించింది. కింది నుంచి పైస్థాయి వరకు కేడర్‌ పోస్టుల్ని అప్‌గ్రేడ్‌ చేయడంతోపాటు పలు విభాగాలకు సంబంధించి కీలకమైన మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 1971లో సర్వే శాఖ పునర్వ్యవస్థీకరణ జరిగింది.

అప్పటి నుంచి పదోన్నతుల ఛానల్‌ లేకపోవడంతో నియమితులైన వారంతా ఒకే కేడర్‌లో ఏళ్ల తరబడి పనిచేసి రిటైర్‌ అవుతున్నారు. తాజాగా.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా భూముల రీసర్వేను చేపట్టడంతో సర్వే శాఖ ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగి పని విధానం పూర్తిగా మారిపోయింది. మరోవైపు.. గ్రామ సచివాలయ వ్యవస్థలో 11,158 మంది గ్రామ సర్వేయర్లను నియమించడంతో సర్వే శాఖ మరింత క్రియాశీలకంగా మారింది.

వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పేరుతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న భూముల రీ సర్వే, వాటి సేవల స్వరూపం పూర్తిగా మారిపోవడం, సర్వే అవసరాలు పెరగడం, భూసేకరణ, భూముల సబ్‌ డివిజన్‌ వంటి పనులు గతం కంటే పూర్తిగా మారిపోయిన నేపథ్యంలో సర్వే శాఖను ప్రభుత్వం ప్రక్షాళన చేసింది. పూర్తిస్థాయిలో పర్యవేక్షణ, తనిఖీ వ్యవస్థ ఉండేలా పునర్వ్యవస్థీకరించింది. 

పర్యవేక్షణాధికారులుగా మండల సర్వేయర్లు  
మండల స్థాయి నుంచి డివిజన్, డివిజన్‌ నుంచి జిల్లా, జిల్లా నుంచి రీజినల్‌ స్థాయి వరకు 410 పోస్టుల్ని అప్‌గ్రేడ్‌ చేశారు. ప్రస్తుతం జిల్లా స్థాయిలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కేడర్‌ పోస్టు ఉండేది. దాన్ని డిప్యూటీ డైరెక్టర్‌ హోదాకు పెంచారు. రీజినల్‌ స్థాయిలో ఉన్న డిప్యూటీ డైరెక్టర్‌ పోస్టులను జాయింట్‌ డైరెక్టర్‌ హోదాకు పెంచారు. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు అన్ని పోస్టుల్ని అప్‌గ్రేడ్‌ చేశారు.

మండల స్థాయిలో కొద్దికాలం క్రితం వరకు మండల సర్వేయర్లే ప్రారంభ ఉద్యోగులు. గ్రామ సర్వేయర్లు రావడంతో ఇప్పుడు వారు ప్రారంభ ఉద్యోగులయ్యారు. దీంతో మండల సర్వేయర్‌ పోస్టు పర్యవేక్షణాధికారి పోస్టుగా మారింది. గతంలో మండల సర్వేయర్లను పర్యవేక్షించేందుకు డివిజన్‌ స్థాయిలో ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే ఉండేవారు.

ఇప్పుడు గ్రామ సర్వేయర్లందరికీ మండల సర్వేయర్‌ పర్యవేక్షణాధికారిగా మారారు. దీనికి అనుగుణంగా మండల సర్వేయర్‌ పోస్టును మండల ల్యాండ్‌ సర్వే అధికారిగా మార్చారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సర్వేయర్లు, అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా ఏపీ సర్వే శిక్షణ అకాడమీని ఏపీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ జియో డెశీ అండ్‌ జియో ఇన్ఫర్‌మ్యాటిక్స్‌గా మార్చారు. సెంట్రల్‌ సర్వే కార్యాలయాన్ని సెంట్రల్‌ సర్వే ఆఫీస్‌ అండ్‌ జియో స్పేషియల్‌ వింగ్‌గా మారుస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్‌ ఉత్తర్వులు జారీచేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement