సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్త డిజిటల్ భూ రికార్డుల విధానం గురించి ఏమాత్రం అవగాహనలేకుండా ప్రభుత్వంపై కొందరు ఉద్దేశపూర్వకంగా బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారు. జగనన్న భూహక్కు, భూరక్ష పథకం కింద ఇచ్చిన పట్టాదారు పాసుబుక్‌లు ఎందుకు పనికిరావని.. ఇందులో రైతులకు హక్కుల్లేవని, రుణాలు రావంటూ ప్రభుత్వంపై విద్వేషం రగిలిస్తూ ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. కానీ, భూముల రీసర్వే తర్వాత ప్రభుత్వం జారీచేస్తున్న పట్టాదార్ పాసు పుస్తకాలు అత్యంత ఆధునికమైనవని రెవెన్యూ వర్గాలు స్పష్టంచేస్తున్నాయి.
రుణాలు తీసుకోవడానికి ప్రస్తుతం ఇస్తున్న పాసు పుస్తకం (భూ హక్కు పత్రం) ఉపయోగపడదనే ప్రచారం అవగాహన రాహిత్యమేననే చెబుతున్నాయి. నిజానికి.. భూములపై యాజమాన్య హక్కును ప్రతిబింబించేది పాసు పుస్తకమే. దాన్ని చూపించి బ్యాంకుల రుణం తీసుకోవడంతోపాటు తనఖా పెట్టుకోవడం, అమ్ముకోవడం వంటివన్నీ గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. రీ సర్వేకు ముందున్న పాస్ పుస్తకంలోని ఉపయోగాల కంటే ఇప్పుడిస్తున్న పాసు పుస్తకాలతో ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి.
► 2016లో ఆర్‌ఓఆర్ చట్టాన్ని సవరించిన తర్వాత భూముల అమ్మకాలు, కొనుగోళ్లు, బహుమతి, తనఖా, లీజు వంటి లావాదేవీలను పాసు పుస్తకంలో రిజిస్ట్రేషన్ అధికారి నమోదు చేయాల్సిన అవసరంలేదు.
► రైతులు రుణాలు తీసుకోవడానికి తమ పాసు పుస్తకాలను బ్యాంకుల్లో ఇవ్వక్కర్లేదు.
► రెవెన్యూ రికార్డులు ఆన్‌లైన్‌లో ఉండటంతో పాసు పుస్తకాలను అప్‌డేట్ చేయాల్సిన అవసరం కూడా లేకుండాపోయింది.
► రుణం మంజూరు చేసేటప్పుడు వెబ్‌ల్యాండ్ ఎలక్ట్రానిక్ రెవెన్యూ రికార్డుల్లో రుణం గురించి నమోదుచేస్తారు. ఈ విషయం తెలుసుకోకుండా కొందరు ఇప్పుడున్న పాసు పుస్తకాల కంటే గతంలో ఇచ్చిన పాస్ పుస్తకాలే మంచివని ప్రచారం చేస్తున్నారు. ఇది సరికాదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.
► నిజానికి.. రీసర్వే ప్రక్రియకు ముందు జారీచేసిన పాసుబుక్‌లతో పోలిస్తే ప్రస్తుత పాస్‌బుక్‌లకే విలువ ఎక్కువ.
కొత్త పాసు పుస్తకంతో రుణాలు రాలేదనే ఫిర్యాదు రాలేదు..
ఇక అవాస్తవ ప్రచారం చేస్తున్న వారికి తెలియని విషయం ఏమిటంటే.. జగనన్న భూహక్కు, భూరక్ష పథకం కింద ఇచ్చిన పాసు పుస్తకం (భూహక్కు పత్రం) అత్యంత ఆధునికమైంది. ఇందులో నమోదు చేసిన వివరాలన్నీ ఆన్‌లైన్‌లోని వెబ్‌ల్యాండ్‌లో ఉన్న వివరాలే. అలాగే..
► ఈ పాసుబుక్‌లో భూమికి సంబంధించిన జియో కోఆర్డినేటెడ్ లొకేషన్, భూ కమతం స్కెచ్, యజమాని పేరు వంటివన్నీ ఉంటాయి. డిజిటల్ యుగంలో వచ్చిన కొత్త మార్పు ఇది.
► గతంలో మాదిరిగా పాసు పుస్తకాలు అసలైనవా కాదా? అని ధృవీకరించుకోవాల్సిన అవసరంలేదు.
► పాస్ పుస్తకాల్లేవని, పోయాయని కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా లేదు. ఆన్‌లైన్‌లో నమోదైన వివరాలే పక్కాగా ఉంటాయి.
► అంతేకాక.. ఈ కొత్త పాస్ పుస్తకాలను ఫోర్జరీచేసే అవకాశం కూడా లేదు. దొంగ పాస్ పుస్తకాలను సృష్టించడం కుదరదు.
► పాస్ పుస్తకంలో ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా నకిలీవి సృష్టించడం సాధ్యంకాదు. అందువల్లే ఈ పాస్ పుస్తకంపై భౌతికంగా సంతకాలు అవసరంలేదు.
► ఇలా వివరాలన్నీ ఆన్‌లైన్‌లో ఉండడంవల్ల గతంలో మాదిరిగా పాస్ పుస్తకాలు ఒకరి పేరుతో, అడంగల్, 1బీ మరొకరి పేరు మీద ఉండే అవకాశంలేదు.
► అందుకే దీన్ని దేశంలోనే అత్యంత ఆధునికమైన భూరికార్డు విధానంగా పలు రాష్ట్రాలు అంగీకరిస్తున్నాయి.
► ఇక ఈ పాస్ పుస్తకం ద్వారా రుణం రాలేదని, రిజిస్ట్రేషన్ జరగట్లేదని ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు.
జాయింట్ పట్టాలు ఇవ్వద్దని ఆదేశాలు..
ఇక జాయింట్ పట్టాలపైనా అపోహలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం జాయింట్ ఎల్‌పీఎంలు (ల్యాండ్ పార్సిల్ మాప్) జారీ చెయ్యొద్దని స్పష్టంగా ఆదేశాలిచ్చింది. ఆధీనంలో ఉన్న భూమి ప్రకారం, దానిపై హక్కులపై ప్రకారం సబ్ డివిజన్ చేసుకోని సందర్భాల్లో జాయింట్ ఎల్‌పీఎంలు ఇచ్చారు. గతంలో ఉన్న జాయింట్ పట్టాలవల్ల ఏర్పడిన గొడవలనే ఇప్పుడు కొత్తగా ఏర్పడుతున్న గొడవలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటుచేసిన ధరణి వెబ్‌సైట్‌లో అనుభవదారుల హక్కులు కనపడని విధంగా ఏపీలోనూ హక్కులు కనపడడం లేదంటూ ప్రజల్లో అపోహలు పెంచే ప్రయత్నం జరుగుతోంది. రాష్ట్రంలో భూ హక్కుల రక్షణ విధానం అత్యంత ఆధునికంగా రూపొందించారు. ఈ విధానం భారతదేశంలోనే ఆదర్శంగా నిలిచింది. అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా చట్టప్రకారం జరుగుతున్న రీ సర్వే ద్వారా పటిష్టమైన భూ హక్కులను రికార్డు చేసే వ్యవస్థ రాష్ట్రంలో రూపొందింది. ఈ విషయాలేవీ తెలుసుకోకుండా కేవలం రాజకీయ కోణంలో సీపీఐ నాయకుడు నారాయణ ఆరోపణలు చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment