లబ్ధిదారుడికి భూ సర్వే పత్రం అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సచివాలయ సిబ్బంది తదితరులు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా విప్లవాత్మక మార్పులను ప్రజలకు క్షేత్ర స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ వ్యవస్థను మరింత మెరుగు పరుస్తూ మారు మూల గ్రామాలకు వేగంగా సేవలందించేందుకు ఏపీ సేవ పోర్టల్–2ను ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. రెండేళ్లలో గ్రామ స్వరాజ్యం అంటే ఇదీ అని కళ్ల ముందు కనిపించేలా అమలు చేసి చూపించామని చెప్పారు. గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటో ఇంతకన్నా వేరే అర్థం బహుశా ఉండదన్నారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి (ఏపీ సిటిజన్ సర్వీసెస్ పోర్టల్) ఏపీ సేవ 2.0 (టూ పాయింట్ ఓ) పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇవాళ ప్రారంభించిన సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ (సీఎస్‌పీ)ను పలకడానికి అనువుగా ఏపీ సేవ అంటున్నామని చెప్పారు. దీని వల్ల మారుమూల గ్రామాల్లో కూడా వేగంగా, పారదర్శకంగా, జవాబుదారీతనం పెంచే విధంగా.. మనకున్న వ్యవస్థను మెరుగు పరుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇంకా ఏమన్నారంటే..
ఇంతకంటే వేరే నిదర్శనం లేదు
► గ్రామ స్వరాజ్యం అంటే మన కళ్లముందే కనిపించేలా రెండేళ్లుగా ప్రభుత్వం అడుగులు ముందుకేస్తోంది. 540కి పైగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సేవలందిస్తున్నాం. ప్రతి 2 వేల జనాభాకు ఒకటి చొప్పున గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశాం. అక్కడ పది మంది ఉద్యోగులు సేవలందిస్తున్నారు.
► రాష్ట్ర వ్యాప్తంగా 15,004 సచివాలయాలు పని చేస్తున్నాయి. వీటి ద్వారా 1.34 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు పని చేస్తున్నారు. గ్రామ స్థాయిలో ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున, మున్సిపల్ స్థాయిలో ప్రతి 100 ఇళ్లకు ఒకరు చొప్పున 2.60 లక్షల మంది వలంటీర్లు ఉన్నారు. మొత్తంగా దాదాపు 4 లక్షల మంది ఈ డెలివరీ మెకానిజంలో పని చేస్తున్నారు. వీరంతా ప్రభుత్వ పథకాలు, సేవలు అందించడంలో ఇంటింటికి వెళ్లి నిరంతరం పని చేస్తున్నారు. ఇంతకన్నా గ్రామ స్వరాజ్యానికి వేరే నిదర్శనం లేదు. వీరందరికీ అభినందనలు.
► ఇలా సేవలందించే కార్యక్రమాన్ని 2020 జనవరి 26న ప్రారంభించాం. ఈ రెండేళ్ల పయనంలో నేర్చుకున్న పాఠాల ద్వారా మరింత మెరుగ్గా సేవలను అందించేలా, పారదర్శకంగా ఉండేలా మార్పులు తీసుకొచ్చి ఏపీ సేవ పోర్టల్‌ను ప్రారంభిస్తున్నాం.
540కి పైగా సేవల్లో వేగం
► గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒకే వేదికపై 540కి పైగా ప్రభుత్వ సేవలు మెరుగైన రీతిలో అందుబాటులోకి వస్తాయి. గత రెండేళ్లలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 3.46 కోట్ల మందికి సేవలు అందించాం. ఈ లెక్కన ఏ స్థాయిలో ఈ వ్యవస్థ ఉపయోగపడిందో ఇట్టే తెలుస్తోంది. ఇప్పుడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన కొత్త పోర్టల్ ద్వారా మరింత వేగంగా పనులు జరుగుతాయి.
► తాము ఇచ్చిన అర్జీ ఎక్కడ ఉంది? ఏ స్థాయిలో ఉంది? ఎవరి దగ్గర ఎన్ని రోజుల నుంచి పెండింగ్‌లో ఉంది? అన్న విషయాన్ని నేరుగా ప్రజలు తెలుసుకోవచ్చు. సంబంధిత శాఖలోని పైస్థాయి అధికారులు కూడా ఈ విషయాలు తెలుసుకోవచ్చు.
లంచాలు, అవినీతికి తావుండదు
► కొత్త సాఫ్ట్‌వేర్ ద్వారా అందించే విస్తృత సేవల వల్ల ప్రజలు తమకు అవసరమైన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. పారదర్శకత పెరిగి అవినీతి దూరం అవుతుంది.
► ప్రజలు వారి దరఖాస్తును ట్రాక్ చేసుకునే (ఏ దశలో ఉందో చూసుకునే) వెసులుబాటు ఉంటుంది. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయం సాధ్యపడుతుంది. అటు ప్రభుత్వ శాఖలు, ఇటు ప్రజల మధ్య వారధిగా అంటే ముఖ్యమైన హబ్‌గా.. గ్రామ, వార్డు సచివాలయాలు రాబోయే రోజుల్లో ఇంకా మెరుగ్గా పనిచేసేందుకు ఏపీ సేవ పోర్టల్ ఉపకరిస్తుంది.
► ప్రజలు ఏదైనా సేవకు సంబంధించి దరఖాస్తు చేయగానే పక్కాగా రశీదు వస్తుంది. భౌతికంగా, డిజిటల్ పద్ధతుల్లో రశీదులు వస్తాయి. పరిష్కారానికి ఎంత సమయం పడుతుందో కూడా చెబుతారు. ఆయా దరఖాస్తుల ప్రాసెస్‌ను తెలియజేస్తూ ఎప్పటికప్పుడు అర్జీదారులకు ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి.
► ఫీజులు చెల్లించాల్సి ఉంటే.. ఏపీ సేవ పోర్ట్‌ల్ సహాయంతో రుసుములు చెల్లించే అవకాశం ఉంటుంది. యూపీఐ, క్యూ ఆర్ కోడ్ స్కానింగ్, క్యాష్ పేమెంట్ లేదా ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసే వెసులుబాటు అందుబాటులోకి వస్తుంది.
ఎక్కడి నుంచైనా దరఖాస్తు చేయొచ్చు
► ఏపీ సేవ పోర్టల్ ద్వారా రెవిన్యూ, భూ పరిపాలనకు సంబంధించిన దాదాపు 35 రకాల సేవలను కూడా తీసుకు వచ్చాం. మునిసిపాలిటీలకు సంబంధించి 25 సేవలు, పౌర సరఫరాలకు చెందిన 6 సేవలు, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన 3 సేవలు, విద్యుత్ రంగానికి సంబంధించిన 53కు పైగా సేవలను పోర్టల్ కిందకు తీసుకు వచ్చాం.
► దరఖాస్తుదారుడు తమ సమీపంలోని సచివాలయంలోనే కాకుండా.. ఎక్కడి నుంచైనా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. ఒకచోట దరఖాస్తు చేస్తే.. వేరే చోట నుంచి కూడా సర్టిఫికెట్ పొందవచ్చు. ఒకవేళ దరఖాస్తును తిరస్కరిస్తే.. దానికి కారణాలు ఏంటో చెబుతారు. ఇలాంటి సదుపాయాలన్నీ కూడా ఏపీ సేవ పోర్టల్‌ద్వారా అందుబాటులోకి వస్తాయి.
► ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సేవలన్నింటినీ పూర్తిగా డిజిటలైజ్ చేస్తున్నాం. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల నుంచి మండల స్థాయి, మునిసిపాలిటీలు, జిల్లా స్థాయి, రాష్ట్ర సచివాలయంలోని ఉన్నత స్థాయి ఉద్యోగులు అందరూ ఒకే డిజిటల్ ప్లాట్‌ఫాంపై పని చేస్తారు. తద్వారా ఉద్యోగుల్లో జవాబుదారీతనం మరింత పెరుగుతుంది. ప్రతి ఉద్యోగి డిజిటల్ సిగ్నేచర్ అందరికీ కనిపిస్తుంది. ఒకవేళ చేయకపోతే ఎందుకు చేయలేదని పై అధికారులు, దరఖాస్తుదారులు ప్రశ్నించ గలుగుతారు. తద్వారా సర్టిఫికెట్లు, డాక్యుమెంట్ల జారీలో జాప్యం ఉండదు. అవినీతికి తావుండదు.
– సీఎం వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment