సాక్షి, అమరావతి: ‘జగనన్న సురక్ష’ కార్యక్రమంలో భాగంగా జూలై 1వతేదీన రాష్ట్రవ్యాప్తంగా 1,297 గ్రామ, వార్డు సచివాలయాల వద్ద మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోకుండా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేందుకు ప్రతి ఇంటినీ జల్లెడ పడుతూ ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఈమేరకు ఏ సచివాలయం పరిధిలో ఎప్పుడు క్యాంపు నిర్వహిస్తారనే వివరాలను ఆయా జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే తెలియజేశారు. తొలిరోజు జూలై 1వతేదీన 1,297 సచివాలయాల వద్ద ఈ క్యాంపులు ప్రారంభమవుతాయి. జూలై 3వతేదీన 410 సచివాలయాల వద్ద, నాలుగో తేదీన 934 సచివాలయాల వద్ద క్యాంపులు నిర్వహిస్తారు. ఇలా మొత్తం 15,004 సచివాలయాల వద్ద నిర్దేశిత తేదీల్లో క్యాంపులు జరుగుతాయి. జూలై 31వ తేదీతో ఈ క్యాంపుల నిర్వహణ పూర్తి కానుంది.
మైకులో ప్రచారం.. వాట్సాప్.. ఎస్సెమ్మెస్‌లు
ఏ సచివాలయం పరిధిలో ఏ తేదీన క్యాంపు జరుగుతుందన్న వివరాలను వారం రోజుల ముందే మైక్ ద్వారా ప్రచారం చేస్తారు. అదే రోజు వలంటీర్లు ఇంటింటి సందర్శన కార్యక్రమాన్ని చేపట్టి క్యాంపు వివరాలను వ్యక్తిగతంగా తెలియజేయడంతో పాటు అర్హులకు ఎలాంటి ధ్రువపత్రాలు అవసరమో ముందుగా తెలియజేస్తారు.
క్యాంపు జరగటానికి నాలుగు రోజుల ముందు కూడా వలంటీర్ల ఆధ్వర్యంలో పనిచేసే వాట్సాప్ గ్రూపుల ద్వారా అందరికీ సమాచారం ఇస్తారు. దీంతోపాటు క్యాంపు నిర్వహణకు ఒక్క రోజు ముందు ఆయా సచివాలయాల పరిధిలో నమోదైన ఫోన్ నంబర్లకు ఎస్‌ఎంఎస్ ద్వారా కూడ సమాచారం చేరవేస్తారు. ఈ మేరకు క్యాంపుల నిర్వహణ, ఇంటింటికీ వలంటీర్ల సందర్శనకు సంబందించి గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్‌వోపీ) రూపొందించి అన్ని జిల్లాలు, మండల స్థాయి అధికారులకు పంపింది.
ఏడు రోజుల ముందు ఆన్‌లైన్ టోకెన్లు..
సచివాలయాల వద్ద మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ప్రత్యేక క్యాంపులు సజావుగా కొనసాగేలా క్యాంపు నిర్వహణకు ఏడు రోజుల ముందు అర్జీదారుల నుంచి వినతుల స్వీకరణతో పాటు వరుస క్రమంలో టోకెన్లను జారీ చేస్తారు. ఈమేరకు ఏడు రోజుల ముందు ఆన్‌లైన్‌లో టోకెన్లు జారీ చేసేలా సచివాలయ ఉద్యోగులకు సాఫ్ట్‌వేర్ అందుబాటులో వస్తుంది.
ఒక దరఖాస్తుదారుడు రెండు రకాల వినతులు అందజేస్తే సంబంధిత వ్యక్తికి రెండు టోకెన్లు జారీ చేస్తారు. ముందుగా టోకెన్లు నమోదు చేసుకున్న వారికి మాత్రమే క్యాంపుల్లో సర్వీసు చార్జీ మినహాయింపు ఉంటుందని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ జారీ చేసిన ఎస్‌వోపీలో స్పష్టం చేసింది.
13 ప్రశ్నలతో వలంటీర్ల ఇంటింటి సర్వే..
ఈ కార్యక్రమంలో భాగంగా వలంటీర్ల ఇంటింటి సందర్శన సమయంలో ప్రతి ఇంటి నుంచి వివరాల సేకరణకు మొత్తం 13 రకాల ప్రశ్నలతో గ్రామ, వార్డుసచివాలయాల శాఖ యాప్‌ను సిద్ధం చేసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని వారికి వివరించడంతోపాటు అర్హులు ఆయా పథకాలను పొందడంలో ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా? అని పరిశీలిస్తారు. ప్రభుత్వం జారీచేసే వివిధరకాల ధ్రువీకరణ పత్రాల గురించి తెలియచేసిన వివరాలను యాప్‌లో నమోదు చేస్తారు.
‘జగనన్న సురక్ష’ క్యాంపులు ఖరారు
Published Mon, Jun 26 2023 4:34 AM | Last Updated on Mon, Jun 26 2023 4:34 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment