ప్రతి ఇంటికి ఐదేళ్లలో చేసిన మేలును వివరిస్తూ సీఎం జగన్ సందేశంతో లేఖలు
మీ ఇంటికి మంచి జరిగితే మరోసారి ఆశీర్వదించాలని ప్రజలకు విన్నపం
రేపట్నుంచి మూడు రోజులు ఇంటింటికీ వలంటీర్ల ద్వారా పంపిణీ
సాక్షి,అమరావతి: సుపరిపాలనతో రాష్ట్రంలో ప్రతి ఇంటికీ పారదర్శకంగా మేలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లలో చేకూర్చిన ప్రయోజనాలను వివరిస్తూ రూపొందించిన లేఖను నేరుగా లబ్ధిదారులకు అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్ల ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఆదివారం వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
ఈమేరకు ముఖ్యమంత్రి జగన్ సందేశంతో కూడిన లేఖలను ప్రతి ఇంటికీ అందజేయనున్నారు. ఐదేళ్లలో ఒక్కో ఇంటికి ఏ పథకం ద్వారా మొత్తం ఎంత మేర ప్రయోజనం కలిగిందో వివరిస్తూ లబ్ధిదారులవారీగా ప్రత్యేకంగా అనుబంధ పత్రాన్ని రూపొందించారు. లేఖ పంపిణీ సమయంలో వలంటీర్లు ఆయా కుటుంబాలకు చెందిన ఒక సభ్యుడి నుంచి ఈ– కేవైసీ తీసుకోనున్నారు. లేఖ సారాంశం ఇదీ..
రాష్ట్ర ప్రజలందరికీ..
► ముఖ్యమంత్రిగానే కాకుండా మీలో ఒకడిగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీ బిడ్డగా మీ అందరితో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నా. మీ అందరి చల్లని దీవెనలతో ఏర్పాటైన మనందరి ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకుంటోందని తెలియజేయడానికి నేనెంతగానో సంతోషిస్తున్నా. ఈ ఐదేళ్లలో మీ బిడ్డ ప్రభుత్వం సాధించిన విజయాల్లో కొన్నిటిని మీకు మరోసారి గుర్తు చేయదలిచా. మీకిచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలోని నవరత్నాలను అమలు చేసి 99.5 శాతం హామీలను మనందరి ప్రభుత్వం పూర్తి చేయగలిగింది. గత పాలకులు తమ మేనిఫెస్టోని మాయం చేసి మోసగిస్తే మనం భగవద్గీత, ఖురాన్, బైబిల్‌లా భావించి ప్రతి హామీని నెరవేరుస్తూ మేనిఫెస్టోకి జవాబుదారీతనం, సార్ధకత తీసుకురాగలిగాం. కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రతి ఇంటికీ ప్రభుత్వ సేవలు, సంక్షేమ ఫలాలను అందించగలిగాం.
► నాడు– నేడు ద్వారా కార్పొరేట్ పాఠశాలల కంటే మిన్నగా ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలను మార్చాం. ప్రభుత్వ స్కూళ్లన్నింటిలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి పేద పిల్లలకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందుబాటులోకి తేవడంతోపాటు ఐబీ దిశగా అడుగులు వేయగలిగాం. విద్యార్ధులందరికీ ఉచితంగా యూనిఫాం, ఫాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, ట్యాబ్‌లు సమకూర్చి జగనన్న గోరుముద్ద ద్వారా రోజూ రుచికరమైన భోజనం అందజేస్తున్నాం. జగనన్న వసతిదీవెన, విద్యాదీవెన, విదేశీ విద్యాదీవెనలతో పాటు డిజిటల్ క్లాస్ రూంలు, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ లాంటి కార్యక్రమాలు చేపట్టగలిగాం. ఈ ఐదేళ్లలో విద్యారంగానికే సుమారు రూ.74 వేల కోట్లు ఖర్చు చేశాం. ఇది విద్యా రంగంలో మీ కళ్ల ముందే మీ బిడ్డ తీసుకొచ్చిన మార్పు. గత పాలకులు మన బిడ్డల భవిష్యత్ గురించి ఏనాడైనా ఇలా పట్టించుకున్నారా? ఒక్కసారి ఆలోచించండి.
► వైద్యం కోసం పేదలెవరూ అప్పుల పాలు కాకూడదన్నది మీ బిడ్డ తపన, తాపత్రయం. ఖరీదైన కార్పొరేట్ వైద్యం పేదలకు ఉచితంగా అందించేలా ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచగలిగాం. గతంలో ఆరోగ్య శ్రీ ద్వారా 1,000 రకాల చికిత్సలే అందగా ఇప్పుడు ఏకంగా 3,257 రకాల చికిత్సలను ఉచితంగా అందిస్తున్నాం. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను మనందరి ప్రభుత్వంలో అభివృద్ది చేసుకోగలిగాం. విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలతో గ్రామీణ ప్రజల గడప వద్దకే మెరుగైన వైద్య సేవలను తీసుకెళ్లగలిగాం.
► గ్రామాల్లో ఆర్బీకేలను నెలకొల్పి రైతులకు విత్తనం నుంచి పంట అమ్మకం వరకు తోడుగా ఉంటున్నాం. రైతన్నకు ఇచ్చిన మాట ప్రకారం క్రమం తప్పకుండా రైతు భరోసా, ఉచిత పంటల బీమా, ధాన్యం కొనుగోలు సొమ్మును నేరుగా ఖాతాల్లో జమ చేయగలిగాం. ఐదేళ్లలో రైతులకు రూ.1,75,007 కోట్లు సాయంగా అందించి వారికి అండదండగా నిలవగలిగాం.
► మీ బిడ్డ ప్రభుత్వంలో ఇవాళ ప్రతి ఊరు మారింది. ఏ ఊరికి వెళ్లినా ప్రతి 50 గడపలకు ఒక వలంటీరుతో పాటు గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ సదుపాయం, నాడు–నేడుతో రూపు మారిన గవర్నమెంట్ బడులు కనిపిస్తాయి. పెన్షన్ మొదలు ఇంటికే రేషన్, సర్టిఫికెట్లు, మెడికల్ టెస్ట్‌ల వరకు అన్ని రకాల సేవలు తలుపు తట్టి మరీ అందిస్తున్నాం. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా ప్రభుత్వాన్నే వారి గడప వద్దకు తేగలిగాం. గతంలో ఎప్పుడైనా ఈ పరిస్థితి ఉందా? పాలన, సేవలు అందించే విషయంలో మీ బిడ్డ తెచ్చిన ఈ మార్పును గమనించమని కోరుతున్నా.
► 31 లక్షల మంది పేద అక్కచెల్లెమ్మలకు ఒక్కొక్కరికీ కనీసం రూ.10 లక్షల విలువైన ఇంటి పట్టాలను వారి పేరిటే రిజిస్ట్రేషన్ చేసి సొంతింటి కలను సాకారం చేసే దిశగా అడుగులు వేయగలిగాం. అక్కచెల్లెమ్మల పేరిటే సంక్షేమ ఫలాలను అందించి మహిళా సాధికారితను సాకారం చేశాం.
► కులమతాలు, ఏ పార్టీ అనే వివక్ష లేకుండా కేవలం అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులను ఎంపిక చేసి డీబీటీతో రూ.2.62 లక్షల కోట్లు పేదల ఖాతాల్లోకి నేరుగా జమ చేసి లబ్ధి చేకూర్చాం. పేదలకు తోడుగా నిలిచి వారి జీవన ప్రమాణాలు పెరిగేలా తోడ్పాటు అందించాం.
► ఈ ఐదేళ్లలో ప్రతి గ్రామం, ప్రతి ఇంటికి ఎంత మేలు చేశామన్నది మీ కళ్ల ముందే కనిపిస్తోంది. ప్రతి పేద కుటుంబానికి అండగా నిలబడగలిగాం. మీ బిడ్డ పాలనలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మీ బిడ్డను మరోసారి ఆశీర్వదించండి.
ఇట్లు..
మీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment