పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణం సాయినగర్‌లో శనివారం జగనన్న సురక్ష కార్యక్రమానికి హాజరైన ప్రజలు
వెంటనే సర్టిఫికెట్లు..
ఈమె పేరు సునీత. వీళ్లది విజయవాడ శివారులోని కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరు గ్రామం. జగనన్న సురక్ష క్యాంపులో కుల ధ్రువీకరణ, ఇన్‌కం సర్టిఫికెట్ల కోసం సచివాలయంలో దరఖాస్తు చేశారు. వలంటీర్లు వెంటనే ఇంటికి వచ్చి ఈమెకు అవసరమైన సర్టిఫికెట్ల గురించి వాకబు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జూలై ఒకటి నుంచి ప్రారంభించిన జగనన్న సురక్ష క్యాంపులో అధికారులు వీటిని అక్కడికక్కడే ఉచితంగా అందజేశారు. గతంలో ఒక సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేసుకుంటే అధికారుల చుట్టూ నెలల తరబడి తిరగాల్సిన పరిస్థితి. కానీ, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇలా ప్రజల వద్దకే పాలనను తీసుకురావడంతో ఇప్పుడు ఆ ఇక్కట్లు తప్పాయి.
సాక్షి, అమరావతి: ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి అనుబంధంగా శనివారం (జులై 1) నుంచి రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిసున్న క్యాంపుల్లో తొలిరోజే భారీ స్పందన వచ్చింది. ఒక్కరోజులోనే మొత్తం 3,69,373 వినతులను అప్పటికప్పుడే పరిష్కరించారు. గ్రామ, వార్డు సచివాలయాల వద్దకే మండల స్థాయి అధికారులందరూ వచ్చి క్యాంపుల్లో పాల్గొని నిబంధనల మేరకు వాటిని పరిష్కరించారు.
సాధారణంగా వారం నుంచి 30 రోజుల వ్యవధిలో జారీచేయాల్సిన వాటిని కూడా రెండు, మూడు గంటల వ్యవధిలోనే అధికారులు అర్జీదారులు కోరిన సర్టిఫికెట్లను అందజేశారు. నిజానికి.. నాలుగేళ్ల క్రితం వరకు ప్రభుత్వాఫీసుల్లో పని కావాలంటే వాటిచుట్టూ రోజులు లేదా నెలల తరబడి కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి. కానీ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వినూత్న రీతిలో ప్రభుత్వ పాలనను గడప వద్దకే తీసుకొచ్చేలా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఫలితంగా.. రాష్ట్రంలో ఎవరికి ఏ పని ఉన్నా వారి సొంత ఊరిలోని సచివాలయాల్లోనే దాదాపు 600 పైగా ప్రభుత్వ సేవలు అందుతున్నాయి.
ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రతి సంక్షేమ పథకంతో పాటు అన్ని రకాల ప్రభుత్వ కార్యక్రమాలు అర్హతే ప్రామాణికంగా ఎలాంటి వివక్ష, లంచాలకు తావులేకుండా సంతృప్తస్థాయిలో పూర్తి పారదర్శకంగా అందజేసే కార్యక్రమం కొనసాగుతోంది. ఫలితంగా.. ఇప్పుడు అర్హులెవ్వరూ మిగిలిపోకూడన్న ఆశయంతో ‘జగనన్న సురక్ష’ను చేపట్టింది. ఇందులో భాగంగా.. జులై 31 వరకు నిర్వహించ తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ జూన్ 23న లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం నుంచి ప్రారంభమైన సురక్ష క్యాంపుల్లో పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
తొలిరోజే 3.69 లక్షలకు పైగా అర్జీల పరిష్కారం..
రాష్ట్రవ్యాప్తంగా 14.28 లక్షల కుటుంబాలు నివాసం ఉండే 1,305 గ్రామ, వార్డు సచివాలయాల వద్ద శనివారం ఆయా మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో జగనన్న సురక్ష క్యాంపులు జరిగాయి. వీటిల్లో 4,42,840 రకాల వినతుల పరిష్కారం కోసం అర్జీదారులు దరఖాస్తు చేసుకోగా, వాటిల్లో 3,69,373 వినతులను అక్కడికక్కడే పరిష్కరించి, వాటికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను ఆయా అర్జీదారులకు అందజేసినట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ లక్ష్మీశా వెల్లడించారు. తొలిరోజు క్యాంపుల్లో అక్కడికక్కడే పరిష్కరించిన సమస్యల్లో అత్యధికం కొత్త బియ్యం కార్డుల మంజూరు, హౌస్ హోల్డు లిస్టులో మార్పులు–చేర్పులతో పాటు విద్యార్ధులకు సంబంధించి ఇన్‌కం, కుల ధృవీకరణ పత్రాల జారీ, పలు రకాల ఆధార్ సేవలు వంటివి ఉన్నాయి.
కొత్త కార్డుల మంజూరుకు వీలుగా ముందే..
హౌస్ హోల్డ్ సర్వే ప్రకారం ప్రభుత్వ రికార్డుల్లో ఉమ్మడి కుటుంబాలుగా నమోదై ప్రస్తుతం వేరుగా ఉంటున్న వారు కొత్త కార్డుకు అవకాశంలేక ఇబ్బందుల పడుతున్న వారి సమస్యను ప్రభుత్వం ఈ సందర్భంగా జగనన్న సురక్ష పరిష్కరిస్తోంది. స్ప్లిట్ ఆఫ్ హౌస్‌హోల్డ్ (ప్రభుత్వ డేటాలోని కుటుంబ వివరాల్లో కొంతమంది సభ్యుల పేర్ల తొలగింపు) కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న దాదాపు 82 వేల వినతులను జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభానికి ముందే ప్రభుత్వం పరిష్కరించింది.
11 రకాల సేవలు ఉచితంగా..
మండల స్థాయి అధికారులు నిర్వహించే క్యాంపుల్లో అన్ని రకాల వినతులు, ధృవీకరణ పత్రాల జారీకి సంబంధించిన అర్జీలు స్వీకరిస్తారు. అయితే, ఇందులో 1) ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు (కుల, నివాస ధృవీకరణ) 2) ఆదాయ ధృవీకరణ 3) పుట్టిన రోజు 4) మరణ ధృవీకరణ 5) మ్యుటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్ (భూ కొనుగోలు అనంతరం అన్‌లైన్‌లో నమోదు) – మ్యుటేషన్ ఫర్ కరక్షన్స్ (అన్‌లైన్‌లో భూ వివరాల నమోదులో మార్పులు చేర్పులు) 6) వివాహ ధృవీకరణ (పట్టణ ప్రాంతాల్లో 90 రోజుల్లోగా, గ్రామీణ ప్రాంతాల్లో 60 రోజుల్లోపు) 7) ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు 8) ఆధార్‌కార్డులో మొబైల్ నెంబరు అప్‌డేట్ 9) కౌలు గుర్తింపు కార్డులు (సీసీఆర్‌సీ) 10) కొత్త రేషన్‌కార్డు లేదా రేషన్‌కార్డు విభజన 11) స్ప్లిట్ ఆఫ్ హౌస్‌హోల్డ్ సంబంధింత సర్వీసులకు ఈ క్యాంపుల్లో ఎలాంటి సర్వీసు ఛార్జీలు లేకుండా ప్రభుత్వం వీటిని జారీచేస్తోంది.
కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు
ఇక ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కావడంతో చాలామంది కౌలు రైతులు సీసీఆర్సీ కార్డులు పొందడానికి ఈ క్యాంపులు ఎంతగానో ఉపయోగపడ్డాయి. సచివాలయాల్లో అందుబాటులో ఉన్న దరఖాస్తులను పూర్తిచేసి అనేకమంది రైతులు సీసీఆర్సీ కార్డులు పొందారు. క్యాంపులు తమకు బాగా ఉపయోగపడ్డాయని వారు ఎక్కడలేని సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఆధార్ డెస్‌్కలో ఆధార్ కార్డుతో ఫోన్ నంబర్ లింకింగ్ సేవలూ అనేకమంది అందుకున్నారు. అలాగే, మ్యుటేషన్ కోసం చాలామంది తమ సర్వీసులను రిజిస్టర్ చేసుకున్నారు. వాటిని ఎప్పటికప్పుడు అధికారులు పరిష్కరిస్తున్నారు.
సేవలు మరింత విస్తృతం
ఈ ప్రభుత్వం రాకముందు గతంతో 2–3 గ్రామాలకు ఒకరిద్దరు మాత్రమే ప్రభుత్వోద్యోగులు ఉండేవారు. కానీ, నేడు సచివాలయ పరిధిలో కనీసం 10–11 మంది ఉండడంతో ఇలాంటి క్యాంపుల ద్వారా సేవలు మరింత విస్తృతం అయ్యాయి. అంతేకాక, నాణ్యమైన సేవలు ప్రజలకు అందుతున్నాయి. అవసరాలను బట్టి.. అక్కడక్కడ వైద్య సేవలు కూడా జగనన్న సురక్ష క్యాంపుల్లో నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment