ఇదీ.. విశ్వసనీయత | CM YS Jagan Increased YSR Pension Kanuka To Rs 3000 | Sakshi
Sakshi News home page

ఇదీ.. విశ్వసనీయత

Published Mon, Jan 1 2024 4:23 AM | Last Updated on Mon, Jan 1 2024 1:15 PM

CM YS Jagan Increased YSR Pension Kanuka To Rs 3000 - Sakshi

సాక్షి, అమరావతి: ఇచ్చిన మాటను నిలబెట్టు­కుంటూ, విశ్వసనీయతను చాటుకుంటూ నూతన ఏడాది సందర్భంగా ‘వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక’ ద్వారా అందించే పింఛన్‌ మొత్తాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.3,000కి పెంచిన నేపథ్యంలో ఊరూ­వాడా ఉత్సాహంగా వేడుకలకు సిద్ధమైంది. జనవరి 1వ తేదీ నుంచి ఆయా మండ­లాలవారీగా మొదలయ్యే పెంచిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీ దాకా పూర్తి పండుగ వాతావరణంలో నిర్వ­హిం­చనున్నారు.

స్థానిక శాసన సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు మండలాలు, మున్సి­పాలిటీల వారీగా  ఎక్కడికక్కడ లబ్ధిదా­రులతో స్వయంగా మమేకమవుతూ ఈ కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొనను­న్నారు. సోమవారం నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలు కానుండగా ఈనెల 3వతేదీన సీఎం జగన్‌ కాకినాడ రంగరాయ మెడికల్‌ కాలేజి గ్రౌండ్స్‌లో జరిగే కార్యక్ర­మంలో స్వయంగా పాల్గొని పెంచిన పెన్షన్ల మొత్తాన్ని లబ్ధిదారు­లకు అందచేయను­న్నారు.

వలంటీర్లు ఎప్పటి మాదిరిగానే లబ్ధిదారుల ఇళ్ల వద్దే పెన్షన్‌ డబ్బులను పంపిణీ చేస్తారు. అయితే ఈసారి రాష్ట్రమంతటా ఒకేసారి కాకుండా నిర్దేశించిన మేరకు ఆయా మండలాలు, మున్సిపాలిటీల వారీగా పింఛన్ల పంపిణీ మొదలవుతుంది. ఆయా చోట్ల ప్రజా ప్రతినిధులు ఇందులో పాల్గొని పంపిణీని ప్రారంభిస్తారు. ఇలా ఈనెల 8వతేదీ వరకు పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. మొత్తంగా ఒకటో తేదీ నుంచే రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆరంభించి అందరికీ వలంటీర్ల ఆధ్వర్యంలో ఇళ్ల వద్దే పంపిణీ పూర్తయ్యే వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. 

కొత్త పింఛన్లు 1.17 లక్షలు 
జనవరి నుంచి కొత్తగా మరో 1,17,161 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్లను మంజూరు చేసింది. ఈ నెలలో కొత్తగా జారీ చేసిన వారికి స్థానిక శాసన సభ్యులు, ప్రజా ప్రతినిధులు పింఛను మంజూరు పత్రాలను అందజేస్తారు. ఈ నెలలో కొత్తగా పింఛన్లు మంజూరు చేసిన వారితో కలిపి  మొత్తం 66.34 లక్షల మంది లబ్ధిదారులకు పంపిణీకి ప్రభుత్వం రూ.1,968 కోట్లను విడుదల చేసింది.

సీఎం లేఖను చదివి వినిపిస్తూ..
ఈ నెల నుంచి పెన్షన్‌ మొత్తాన్ని రూ.2,750 నుంచి రూ.3,000కి పెంచిన నేపథ్యంలో లబ్ధిదారులందరికీ ముఖ్యమంత్రి జగన్‌ ప్రత్యేకంగా లేఖ రాశారు. ఇళ్ల వద్ద పెన్షన్‌ డబ్బులు పంపిణీ చేసే సమయంలో సీఎం జగన్‌ రాసిన లేఖ ప్రతిని వలంటీర్లు వారికి అందజేస్తారు. లబ్ధిదారులకు లేఖ సారాంశం పూర్తిగా అర్ధమయ్యేలా వలంటీర్లే ఆ లేఖను చదివి వినిపించాలని అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. 

నమ్మకాన్ని పెంచుకుంటూ...
దేశంలోనే అత్యధికంగా 66.34 లక్షల మందికి నెలకు రూ.3,000 చొప్పున పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఇదేనని అధికారులు పేర్కొంటున్నారు. టీడీపీ హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు రూ.1,000 మాత్రమే పింఛన్‌ అందించగా సీఎం జగన్‌ ప్రభుత్వం నెలకు రూ.2,250 చొప్పున ప్రారంభించి రూ.3,000 దాకా ఏటా పెంచుకుంటూ వచ్చింది.

కరోనా గడ్డు కాలంలోనూ పెంపూ ఆగలేదు.. పెన్షన్లూ ఆగలేదు. మొత్తం లాక్‌డౌన్‌ ఉన్న పరిస్థితుల్లో కూడా పింఛన్లు పెంచడమూ ఆగలేదు.. పంచడమూ ఆగలేదు. ‘అవ్వాతాతల పింఛన్‌ రూ.3,000 వరకు పెంచుకుంటూ పోతాం...’ అని 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన మాటను ముఖ్యమంత్రి జగన్‌ తు.చ. తప్పకుండా ఆచరించి చూపారు. 

ఆత్మ గౌరవంతో పింఛన్లు..
పింఛన్ల కోసం చంద్రబాబు సర్కారు హయాంలో అవ్వాతాతలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్న దుస్థితిని ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వం సమూలంగా మార్చేసింది. అవ్వాతాతలకు మనవడిగా, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు అన్నగా, తమ్ముడిగా, చేనేత, కల్లుగీత, మత్స్య, చర్మకారులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు శ్రేయోభిలాషిగా మానవీయ కోణంలో సీఎం జగన్‌ సంస్కరణలు చేపట్టారు. ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ ఇంటి వద్దే పెన్షన్లను అందిస్తున్నారు. 

► గత పాలకుల హయాంలో పింఛన్‌ కోసం వృద్ధులు, దివ్యాంగులు చాంతాడంత క్యూలలో గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన దుస్థితి. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా  2.6 లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్లు ఒకటో తేదీనే గడప వద్దే పెన్షన్లు అందిస్తున్నారు. సెలవైనా, పండుగైనా సరై టంచన్‌గా చేతిలో పింఛన్లు పెడుతున్నారు.

► టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తేనే కొత్తగా పెన్షన్లు మంజూరైన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు లంచాలు, వివక్షకు తావులేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తున్నారు. అర్హులై ఉండీ ఒకవేళ ఏ కారణం చేతనైనా లబ్ధి పొందకుంటే వారికి మరో అవకాశాన్ని కల్పిస్తూ ఏటా జూన్, డిసెంబర్‌లలో ప్రయోజనం చేకూరేలా చర్యలు చేపట్టారు. 

► ఇప్పుడు పెన్షన్ల కోసం దళారీలు, పైరవీకారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సచివాలయాల్లో జాబితాలు ప్రదర్శించి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. అర్జీ పెట్టుకున్న 21 రోజుల్లో అర్హులకు పెన్షన్‌ కార్డులను మంజూరు చేస్తున్నారు. 

► టీడీపీ హయాంలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల  కేటగిరీలో ఒక్కో లబ్ధిదారుడు పొందిన పెన్షన్‌ మొత్తం రూ.58,000 మాత్రమే కాగా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఆయా లబ్ధిదారులు ఒక్కొక్కరికీ రూ.1,47,500 అందిస్తోంది. గత ప్రభుత్వం కంటే ఇది రూ.89,500 అదనం. 

► టీడీపీ హయాంలో దివ్యాంగుల పెన్షన్‌ కింద ఐదేళ్లలో ఒక్కొక్కరికీ రూ.58,500 మేర మాత్రమే లబ్ధి చేకూర్చగా ఇప్పుడు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వారికి రూ.1,82,000 అందిస్తోంది. గతం కంటే ఇది రూ.1,23,500 అదనం 

► టీడీపీ సర్కారు ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ల సంఖ్య కేవలం 39 లక్షలు కాగా ఇప్పుడు సీఎం జగన్‌ ప్రభుత్వం 66.34 లక్షల మందికి పింఛన్లను అందచేస్తోంది. 

పింఛన్లకే రూ.83,526 కోట్లు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గత నాలుగున్నర ఏళ్లలో ఏకంగా 29,51,760 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేసింది. దీంతో పెన్షన్‌ లబ్ధిదారుల సంఖ్య 66.34 లక్షలకు చేరుకుంది. ఒక్క పెన్షన్ల కోసమే ప్రభుత్వం ఏటా రూ.23,556 కోట్లు వెచ్చిస్తోంది. ముఖ్యమంత్రి జగన్‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు పెన్షన్ల రూపంలో రూ.83,526 కోట్లను అందించినట్లు అధికారులు వెల్లడించారు. 

పింఛన్‌ పెరిగిందిలా...
–    టీడీపీ పాలనలో పెన్షన్‌ రూ.1,000 మాత్రమే
–    జూలై 2019 నుంచి పెన్షన్‌ రూ.2,250కి పెంచిన సీఎం జగన్‌
–    జనవరి 2022న రూ.2,500కు పెన్షన్‌ పెంపు
–    జనవరి 2023న రూ.2,750కు పెంపు
–    జనవరి 2024న రూ.3 వేలకు పెంపు

నాడు 400 కోట్లు.. నేడు 1,968 కోట్లు
–    2014–19 మధ్య టీడీపీ హయాంలో నెలకు పెన్షన్ల సగటు వ్యయం రూ.400 కోట్లు.
–    జూలై 2019 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1,384 కోట్లు
–    జనవరి 2022 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1,570 కోట్లు
–    జనవరి 2023 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1,776 కోట్లు
–    జనవరి 2024 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1,968 కోట్లు  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement