సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులు పొందిన వలంటీర్లతో సీఎం వైఎస్ జగన్
ప్రతి నెలా ఒకటో తేదీ పొద్దున్నే.. సూర్యోదయం కాకముందే అవ్వాతాతల దగ్గరకు వెళ్లాలి.. వారి చేతిలో పెన్షన్ పెట్టాలి. ఈ పెన్షన్ డబ్బులు వాళ్లకు చేరకపోతే ఆ అవ్వాతాతలు ఇబ్బందులు పడతారని తెలిసిన నిస్వార్థ సేవా సైనికులు వలంటీర్లు. రూపాయి లంచం లేకుండా.. వారి నుంచి ఒక చిరునవ్వు, దీవెన పొందుతూ పని చేస్తున్న మనసున్న గొప్ప సైనికులు నా వలంటీర్లు.. మన వలంటీర్లు అని గర్వంగా చెబుతున్నా.
ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకుంటున్న నా చెల్లెమ్మలు, తమ్ముళ్లకు ఆల్ ద బెస్ట్. వలంటీర్ల సత్కారం కోసం ప్రభుత్వం దాదాపు రూ.241 కోట్లు వ్యయం చేస్తోంది. ఈ సత్కారాలు ఈ ఒక్క ఏడాదితోనే ఆగిపోవు. ప్రతి ఏడాది ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ ఏడాది ‘సేవామిత్ర’ అవార్డు పొందిన వారు వచ్చే ఏడాది ‘సేవారత్న’ కోసం.. ‘సేవారత్న’ పొందిన వారు ‘సేవావజ్ర’ కోసం ప్రయత్నించాలి.
– ముఖ్యమంత్రి జగన్
సాక్షి, అమరావతి: సంక్షేమ ఫలాలను అర్హులందరికీ ఇంటి గడప వద్దే చేరవేస్తూ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే వలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టినట్టు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. పరిపాలన అంటే ఇలా ఉండాలనే విధంగా దేశమంతా మనవైపు చూసేలా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు అనుసంధానంగా 2.60 లక్షల మంది వలంటీర్లు విధులు నిర్వర్తిస్తున్నారని అభినందించారు. ఉగాది పండుగ సందర్భంగా వలంటీర్ల సేవలకు గుర్తింపుగా వారికి రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట సేవా పురస్కారాలు అందజేసే కార్యక్రమాన్ని సీఎం జగన్ సోమవారం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ప్రారంభించారు.
ఆదివారమైనా.. సెలవు రోజైనా.. ఎండ, వాన, చలిని లెక్క చేయకుండా వలంటీర్లు సేవా దృక్పథంతో విధి నిర్వహణలో పాల్గొంటున్నారని ప్రశంసించారు. సూర్యోదయానికి ముందూ సూర్యాస్తమయం తర్వాత కూడా విధి నిర్వహణలో నిమగ్నమవుతున్న వలంటీర్ల సేవా దృక్పథం, మంచి చేయాలన్న తపనను రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తోందని తెలియచేసేందుకే ఈ అవార్డుల కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు చెప్పారు. లంచాలు అన్నదే లేకుండా, కులం, మతం, వర్గం, రాజకీయాలని ఎక్కడా వివక్ష చూపకుండా, ఎలాంటి పక్షపాతానికి తావివ్వకుండా, మంచి ఆగకూడదనే తపనతో సేవలందిస్తున్న ప్రతి వలంటీర్‌ను సత్కరించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. సీఎం జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ..
మనసున్న మనుషులు.. నా చెల్లెమ్మలు, తమ్ముళ్లు
జూన్ మొదటి వారంలో ప్రమాణ స్వీకారం చేస్తే ఆగస్టు, సెప్టెంబరు నాటికి వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం. అక్టోబరు నాటికి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దాదాపు 20 నెలల కాలంలో పరిపాలన అంటే ఈ మాదిరిగా చేయవచ్చు అనే విధంగా దేశమంతా మనవైపు చూసేలా వలంటీర్లుగా విధుల్లో ఉన్న నా చెల్లెమ్మలు, నా సోదరులు పని చేస్తున్నారు. సొంత లాభం కొంత మానుకుని పొరుగు వారికి సహాయపడే మంచి మనుషులు, మనసున్న నా చెల్లెమ్మలు, తమ్ముళ్లకు నిండు మనసుతో అభినందనలు తెలియజేస్తున్నా. మానవత్వాన్నే మంచితనంగా, మంచితనాన్నే కులంగా మార్చుకుని ఈ వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టారు.
ప్రభుత్వ పథకాలకు గ్రామగ్రామానా వాడవాడలా సంధానకర్తలా ఒకవైపు సచివాలయాలు మరోవైపు వలంటీర్లు ఉన్నారు. ఎక్కడా వివక్ష,, లంచానికి తావులేకుండా కులం, మతం, పార్టీ, రాజకీయం చూడకుండా చివరికి అధికార పార్టీకి ఓటు వేశారా లేదా అన్నది కూడా చూడకుండా ప్రతి కార్యక్రమంలో నిస్వార్ధంగా సేవ చేస్తున్నారు. ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నందుకు మీ అందరికీ మనసారా సెల్యూట్ చేస్తున్నాం.
మీ అందరికీ పేదల బాధలు తెలుసు కాబట్టే..
రాష్ట్రంలో దాదాపు 2.60 లక్షల మంది పైచిలుకు వలంటీర్లు ప్రతి చోటా పనిచేస్తున్నారు. వీరిలో 97 శాతం మంది 35 ఏళ్ల లోపు యువకులు, సేవాభావం ఉన్నవారే. ఇందులో 53 శాతం చెల్లెమ్మలే ఉన్నారు. మొత్తం వలంటీర్లలో దాదాపు 83 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద వర్గాలకు చెందిన వారున్నారు. పేదరికం అంటే తెలిసిన వారు, పేదల బాధలు అర్ధం చేసుకున్న వారు. ఆ బాధలు పేదలకు రాకూడదని తాపత్రయపడే సైనికులు. మరో 1.40 లక్షల మంది గ్రామ సచివాలయాల్లో, గ్రామానికి పది మంది చొప్పున శాశ్వత ఉద్యోగులుగా పని చేస్తున్నారు. వీరిలో కూడా దాదాపు 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందినవారే ఉన్నారు.
కోవిడ్ కట్టడిలో కీలక పాత్ర
దాదాపు 32 రకాల సేవలకు సంబంధించి వలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏ కార్యక్రమం తీసుకున్నా కొన్నింటిలో పూర్తిగా, మరి కొన్నింటిలో అవసరం మేరకు పని చేస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్‌ను ఎదుర్కోవడంలో వలంటీర్ల పాత్ర అంతా ఇంతా కాదు.
మరో రెండు చోట్ల కూడా పాల్గొంటా..
ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. రేపట్నుంచి ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో ఒక రోజు చొప్పున వలంటీర్లందరికీ అవార్డుల ప్రదానం, సత్కారాల కార్యక్రమం కొనసాగుతుంది. మంగళవారం ఉగాది పండగ కాబట్టి అధికారులు ఒక్కరోజు సెలవు తీసుకోవచ్చు. ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు సత్కార కార్యక్రమాల్లో పాల్గొంటారు. అందరూ భాగస్వాములవుతారు. నేను కూడా మూడు ప్రాంతాలలో పాల్గొంటా. ఈరోజు పెనమలూరు నియోజకవర్గంలో మొదలైంది. ఉత్తరాంధ్ర, రాయలసీమలో నిర్వహించే సత్కార కార్యక్రమాలకు కూడా హాజరవుతా.
సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరైన వలంటీర్లు
వారి ఖర్మకు వదిలేయండి..
సేవాభావంతో పని చేస్తున్న వలంటీర్ల మీద, ఈ వ్యవస్థ మీద ఎల్లో మీడియా, కొందరు విపక్ష నాయకులు అవాకులు చవాకులు మాట్లాడడం చూస్తున్నాం. మీకు ఒకటే చెబుతున్నా. మీరు క్రమశిక్షణతో మెలిగినంత కాలం ఎలాంటి విమర్శలకు వెరవద్దు. పండ్లు కాసే చెట్టు మీదే రాళ్లు పడతాయని గుర్తు పెట్టుకోండి. మిమ్మల్ని వారేదో అంటున్నారని చెప్పి ఎవరూ వెరవద్దు. వారి పాపానికి, వారి ఖర్మకు వారిని వదిలేయండి. మీ ధర్మాన్ని మీరు నెరవేర్చండి. ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుందని గట్టిగా చెబుతున్నా.
ఉద్యోగం కాదు.. మీరు చేసేది సేవ
మానవ సేవే మాధవసేవ అని గుర్తు పెట్టుకోండి. మీరు చేస్తున్నది ఉద్యోగం కాదు సేవ అన్నది కచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇవాళ మీరు ఇంత నిస్వార్ధంగా సేవలు అందిస్తున్నారనే ఆ 50 కుటుంబాల వారు మిమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నారు. ఇంతగా మీపై ఆప్యాయత చూపిస్తున్నారని మరిచిపోవద్దు. ఈ పని ద్వారా మీరు సాధించేది, మీకు జరిగే మంచి ఏమిటంటే.. ఆ 50 ఇళ్లలో అవ్వాతాతల దీవెనలు మన ఆస్తి అని మర్చిపోవద్దు. దేవుడి దయ మీ అందరి కుటుంబాల మీద ఉండాలని, ప్రజలందరి చల్లని దీవెనలు మనందరి ప్రభుత్వానికి అందేలా, మీ అందరి పనితీరు మరింత గొప్పగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా.
మీ సేవలకు ఇవిగో ఉదాహరణలు..
కొందరు వలంటీర్లు చేసిన పనులను చాలామంది చూసే ఉంటారు. పేపర్లలో కూడా చదివి ఉంటారు. వారు ఎంత నిస్వార్థంగా, సేవా దృక్పథంలో పని చేశారో తెలియచేసేందుకు నేను కొన్ని ఉదాహరణలు చెబుతున్నా..
► శ్రీకాకుళం జిల్లా సరిబుజ్జిలి మండలం పురుషోత్తపురానికి చెందిన ఓ అవ్వ రోడ్డు ప్రమాదంలో గాయపడి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతుంటే మన వలంటీర్ రమణ ఆస్పత్రికి వెళ్లి ఆమెకు పింఛన్ డబ్బులు అందచేశాడు.
► ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం చిలకపాడుకు చెందిన బి.వీరనారాయణమ్మ హైదరాబాద్‌లో గుండె శస్త్రచికిత్స చేయించుకుని ఆస్పత్రిలో ఉంటే మన వలంటీర్ సిద్ధారావు అక్కడకు వెళ్లి మరీ పెన్షన్ ఇచ్చి వచ్చాడు.
► చిత్తూరు జిల్లా కంబంవారిపల్లికి చెందిన భాస్కర్‌రెడ్డి పక్షవాతంతో బెంగళూరులో చికిత్స పొందుతుంటే మన వలంటీర్ భానుప్రకాష్ అక్కడికి వెళ్లి పెన్షన్ ఇచ్చాడు.
► విజయనగరం జిల్లా గజపతినగరంలో గ్యాస్ స్టవ్ ప్రమాదంలో 9 ఏళ్ల బాలిక గాయపడితే వలంటీర్లు సకాలంలో ఆస్పత్రిలో చేర్చడమే కాకుండా తమ జేబు నుంచి రూ.2 వేలు కూడా ఆర్థిక సాయం చేశారు.
► గుంటూరు జిల్లా రొంపిచర్లలో అగ్ని ప్రమాదం సంభవిస్తే మన వలంటీర్ శివకృష్ణ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పిల్లలు, వృద్ధులను కాపాడాడు.
► ఇలాంటి ఘటనలు ఎన్నో కనిపిస్తున్నాయి. ఎందుకు ఇంత తపనపడతారు? ఇంత సహాయ పడతారు అంటే కారణం.. వలంటీర్లు తమ పరిధిలోని ఆ 50 ఇళ్లను ఒక కుటుంబంగా భావించారు కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి.
2.22 లక్షల మంది వలంటీర్లకు సత్కారం..
మూడు కేటగిరీలలో మొత్తం 2,22,990 మంది గ్రామ, వార్డు వలంటీర్లను ప్రభుత్వం సత్కరిస్తోంది. మొత్తం రూ.228.74 కోట్ల నగదు బహుమతితో పాటు అవార్డులు అందచేస్తోంది.
లెవల్–1.. ‘సేవామిత్ర’
ఈ కేటగిరీలో రాష్ట్రవ్యాప్తంగా 2,18,115 మంది వలంటీర్లను సత్కరిస్తున్నాం. రూ.10 వేల నగదు, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జి ప్రదానం చేసి మీరు చేసిన మంచి పనిని ప్రభుత్వం గుర్తిస్తోంది అని చెబుతూ ప్రతి వలంటీర్‌ను ప్రోత్సహించేందుకు చేస్తున్న మంచి కార్యక్రమం ఇది.
లెవెల్ –2.. ‘సేవారత్న’
మాములుగా కంటే కాస్త ఎక్కువగా, స్ఫూర్తిదాయకంగా పనిచేసిన వారిని ప్రతి మండలం, ప్రతి మున్సిపాలిటీ నుంచి ఐదుగురు చొప్పున, మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి 10 మంది చొప్పున మొత్తం 4 వేల మందిని ‘సేవా రత్న’ అవార్డుతో సత్కరిస్తున్నాం. ‘సేవారత్న’ అవార్డు గ్రహీతలు రూ.20 వేల నగదు, పతకం, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జి అందుకుంటారు.
లెవెల్ –3.. ‘సేవావజ్ర’
ఇంకా ఎక్కువ కష్టపడిన వారికి మూడో కేటగిరీలో సత్కారం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదుగురు చొప్పున ఎంపిక చేసి మొత్తం 875 మంది వలంటీర్లకు సేవా వజ్ర అవార్డు ప్రదానం చేస్తున్నాం. ఈ అవార్డు గ్రహీతలకు రూ.30 వేల నగదు, పతకం, సర్టిఫికెట్, శాలువాతో పాటు బ్యాడ్జి ప్రదానం చేస్తారు.
వలంటీర్ల విజయాలతో బుక్‌లెట్ ఆవిష్కరణ..
రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్ల సత్కారాల కార్యక్రమాన్ని సోమవారం లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ తొలిరోజు 18,576 మంది వలంటీర్ల ఖాతాల్లోకి రూ.18,93,36,000 నగదు ప్రోత్సాహకాన్ని ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేశారు. పెనమలూరు నియోజకవర్గ పరిధిలో 9 మంది వలంటీర్లకు సీఎం జగన్ స్వయంగా శాలువా, పతకం, బ్యాడ్జి అందజేసి సత్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వలంటీర్ల విజయాలను తెలియచేస్తూ ప్రచురించిన ప్రత్యేక బుక్‌లెట్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కె.పార్థసారథి, సింహాద్రి రమేష్, మేకా ప్రతాప అప్పారావు, డి.నాగేశ్వరరావు, కొక్కిలిగడ్డ రక్షణనిధి, మల్లాది విష్ణు, వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డితో పాటు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
‘‘ఒక వ్యవస్థలో అవినీతి, వివక్షకు తావులేకుండా ఓ కార్యక్రమం చేయగలమా?.. ఇది సాధ్యమేనా? అని గతంలో అందరికీ సందేహాలుండేవి. వాటిని తొలగిస్తూ కేవలం అర్హత ఉంటే చాలు కచ్చితంగా ప్రభుత్వ పథకం డోర్ దగ్గరకే వచ్చి చేరుతుందని చేసి చూపించిన వ్యక్తులు వలంటీర్లు’’
Comments
Please login to add a commentAdd a comment