Andhra Pradesh: ‘పల్లె’కు కొత్త రూపు!  | Andhra Pradesh villages Getting Benefits of development | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: ‘పల్లె’కు కొత్త రూపు! 

Published Sun, Aug 20 2023 4:22 AM | Last Updated on Sun, Aug 20 2023 7:56 AM

Andhra Pradesh villages Getting Benefits of development - Sakshi

అనకాపల్లి జిల్లా చంద్రయ్యపాలెంలో ఇప్పటివరకు స్థానికులు నివాసమున్న గుడిసెలు, చంద్రయ్యపాలెంలోని జగనన్న కాలనీలో చురుగ్గా జరుగుతున్న ఇళ్ల నిర్మాణ పనులు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని పాతమల్లంపేట పంచాయతీలో 18 గిరిజన కుటుంబాలు మాత్రమే ఉన్న కుగ్రామం చంద్రయ్యపాలెం. ఇక్కడి ప్రజలకు నాలుగేళ్ల క్రితం వరకు పక్కా ఇల్లు ఎలా ఉంటుందో తెలియదు. పేదరికానికి మారుపేరుగా ఉన్న వీరు పగలంతా కాయకష్టం చేయడం, కొద్దిపాటి పొలంలో జీడి మామిడి పంట సాగు చేసుకోవడం, రాత్రయితే గుడిసెల్లో బతుకులీడ్చడం.. ఎన్నో తరాలుగా ఇదే వారి జీవన విధానం. గుడిసెల్లోకి వచ్చే విష సర్పాల బారి నుంచి పిల్లలను పంచకు కట్టిన ఊయల్లోనే ఉంచాల్సిన పరిస్థితి. ఇలాంటి ఈ కుగ్రామం పరిస్థితి వైఎస్‌ జగన్‌ సీఎం కాగానే ఒక్కసారిగా మారిపోయింది. ఆ 18 కుటుంబాలకు పక్కా ఇళ్లు మంజూరయ్యాయి. అమ్మ ఒడి నుంచి రైతు భరోసా వరకు వివిధ పథకాల ద్వారా ఇప్పటి వరకు రూ.91,40,000 వీరి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఈ డబ్బుతో గొర్రెలు, మేకలు, పాడె గేదెల పెంపకం చేపట్టి కూలి/ వ్యవసాయానికి అనుబంధంగా ఆదాయం పొందుతున్నారు. వీరి ఇళ్ల వద్దకే రేషన్, 104 ద్వారా వైద్యం అందుతోంది. 

► ఈయన పేరు కురచ అప్పారావు. కాకినాడ జిల్లా అల్లిపూడి గ్రామానికి చెందిన ఈయన నాలుగేళ్లలో వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా రూ.5,85,285 లబ్ధి పొందారు. రైతు భరోసా నుంచి ఇంటి స్థలం వరకు 12 ప్రభుత్వ పథకాలను అందుకున్నారు. ‘ఎన్నికల్లో రాజకీయ నాయకులు ఎన్నో హామీలు ఇస్తుంటారు.. అధికారంలోకి రాగానే ఒక్కటీ చేయరు. 2019 ఎన్నికల్లోనూ అలాగే అనుకున్నాను. కానీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన దానికంటే ఎక్కువే చేశారు. అందుకు నేనే ఉదాహరణ. మా అబ్బాయికి ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యం చేయించాను. ఒక్క రూపాయి ఖర్చు కాకుండా పూర్తి ఆరోగ్యంతో ఇంటికి పంపించారు. ఇంత గొప్ప పాలన ఏ ప్రభుత్వంలోనూ చూడలేదని సంబరపడుతున్నాడు.  

► ఇతను అనకాపల్లి జిల్లాలో అటవీ ప్రాంతంలో ఉన్న బుడ్డోడుపాడు గిరిజన గ్రామానికి చెందిన సెగ్గే రాజబాబు. దాదాపు 15 సంవత్సరాలు టీడీపీ తరఫున వార్డు సభ్యుడిగా పని చేశారు. పాతమల్లంపేట పంచాయతీ పరిధిలో 42 కుటుంబాలున్న ఈ గ్రామానికి రోడ్డు కోసం దశాబ్దాలపాటు శ్రమించారు. ‘మా గ్రామం చుట్టూ కొండ వాగులే, నడిచే మార్గం ఉండేది కాదు. వర్షాకాలంలో ఎవరికైనా జబ్బు చేస్తే డోలీల్లో వాగులు దాటించే క్రమంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు కోసం స్థానిక టీడీపీ నాయకుడిగా ఎంతో పోరాడాను.

ఎమ్మెల్యేకు వినతి ఇస్తే పక్కన పడేసేవారు. కానీ జగన్‌ సీఎం అయ్యాక ఎమ్మెల్యేను ఒక్కసారి కలిసి అడగ్గానే హామీ ఇచ్చారు. కానీ రోడ్డు వేయకుండా మా టీడీపీ నాయకులు అడ్డుపడితే పట్టుబట్టి రోడ్డు వేయించారు. మోటారు సైకిలు చూడని మా ఊరికి ఇప్పుడు 104, 108 వాహనాలు నేరుగా వస్తున్నాయి. మా తాత, తండ్రుల కాలంలో ఊరికి రోడ్డు ఉంటే బాగుండు అని ఆశ పడ్డారు. నా తరంలో కూడా రోడ్డు చూస్తానన్న ఆశ పోయిన తరుణంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక అది సాకారమైంది’ అని తెలిపాడు.  

►టీడీపీకి కంచుకోటలాంటి పాతమల్లంపేట పంచాయతీలోని 18 కుటుంబాలున్న చంద్రయ్యపాలెం గిరిజన గ్రామానికి చెందిన రుత్తల పెంటయ్య.. ఇప్పటిదాకా కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్న ఈయన ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలతో గొర్రెలను కొనుక్కొని రైతుగా మారాడు. ‘ఎకరం పొలం ఉంది, కొన్ని రోజులే వ్యవసాయ పనులు ఉంటాయి. మిగిలిన రోజుల్లో కూలి చేసుకోవాలి. ఇప్పుడు పాపకు అమ్మ ఒడి ఇస్తున్నారు. అమ్మకు పెన్షన్‌ వస్తోంది. ప్రభుత్వం బ్యాంకులో వేసిన డబ్బులతో గొర్రెలు పెంచుతూ ఆదాయం పొందుతున్నా. ఇల్లు కూడా మంజూరైంది. సంతోషంగా బతుకుతున్నాం’ అని ఆనందంగా చెబుతున్నాడు. 

నానాజీ అంకంరెడ్డి, సాక్షి ప్రతినిధి : అభివృద్ధి, సంక్షేమానికి దూరంగా ఉన్న గ్రామాలు నాలుగేళ్లుగా కొత్త మార్పు దిశగా పరుగులు తీస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా గ్రామాలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. దాదాపు 26 సంక్షేమ పథకాల్లో వ్యక్తిగతంగా ప్రజలు సగటున నాలుగు పథకాల ద్వారా లబ్ధి పొందుతూ సొంత కాళ్లపై నిలదొక్కుకుంటున్నారు. ‘కులం, మతం చూడం, ఏ పార్టీ అని చూడం, అర్హులా కాదా అన్నది మాత్రమే చూస్తాం, ఆ ప్రాతిపదికనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయి’ అని సీఎం వైఎస్‌ జగన్‌ తరచుగా చెప్పే మాట మారుమూల పల్లెల్లో సాక్షాత్కరిస్తోంది. రాజకీయాలకు అతీతంగా ఊళ్లన్నీ మారిపోతున్నాయి. ఇంత తక్కువ వ్యవధిలో ఇంత మార్పు ఎలా సాధ్యమైందో ఆయా ఊళ్లలోని ప్రజలే కథలు కథలుగా చెబుతున్నారు.   

1850 కుటుంబాలకు  రూ.22.62 కోట్ల లబ్ధి 
ఇది కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామం. దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు ఎమ్మెల్యేగా, స్పీకర్‌గా, ఆరి్థక మంత్రిగా పని చేసిన నాయకుడు ప్రాతినిథ్యం వహించిన ఈ నియోజకవర్గంలోని ఈ గ్రామం పరిస్థితి నాలుగేళ్ల క్రితం వరకు దయనీయం. మూడు కి.మీ రోడ్డు కోసం పదేళ్లకు పైగా ఎదురుచూపు.. శిథిలమైన ప్రభుత్వ బడులను బాగుచేసే నాథుడే కరవు.. డ్రైనేజీ వ్యవస్థే లేదు.. పథకాల కోసం నేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు.. ఏ కొందరికో అరకొర ఇచ్చే పింఛన్లలోనూ కోతలు.. ఇలా సవాలక్ష సమస్యలు.

2019 ఎన్నికల తర్వాత 1850 కుటుంబాలు, 5,010 జనాభా ఉన్న ఈ ఊళ్లో ఎవరూ ఊహించని విధంగా మార్పు మొదలైంది. రూ.కోటి నిధులతో మండల కేంద్రాన్ని కలుపుతూ రోడ్డు వేశారు. శిథిలమైపోయిన ఉన్నత పాఠశాలను నాడు–నేడు రెండో విడతలో పునర్‌ నిర్మిస్తున్నారు. చక్కటి డ్రైనేజీ వ్యవస్థతో పాటు వీధుల్లో సీసీ రోడ్లు వచ్చాయి. విద్యార్థులకు అవసరమైన సర్టిఫికెట్లు ఇదే ఊళ్లోనే ఇస్తున్నారు. రెండు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రం, విలేజ్‌ క్లినిక్‌ ఏర్పాటయ్యాయి. 17 మంది ఉద్యోగులు రోజూ స్థానికంగా ప్రజా సేవలో నిమగ్నమయ్యారు.

35 మంది వలంటీర్లు ప్రతి ఇంటికీ అందుబాటులో ఉన్నారు. ప్రతినెల ఒకటో తేదీ ఉదయాన్నే 777 మందికి పెన్షన్లు అందిస్తున్నారు. 373 మందికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరయ్యాయి. రూ.2 కోట్లతో రోడ్డు, డ్రైనేజీలు, అంతర్గత సీసీరోడ్లు, ప్రభుత్వ పాఠశాల భవనాలు నిర్మిస్తున్నారు. రెండు ఎంపీపీ స్కూళ్లు, ఒక జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 312 మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కింద ఏటా పుస్తకాలు, బ్యాగు వంటి సమస్త వస్తువులు అందుతున్నాయి. దాదాపు 400 మంది తల్లులు అమ్మ ఒడి అందుకుంటున్నారు.

మరో 152 మంది జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పొందుతున్నారు. మొత్తంగా గ్రామ ప్రజలు వివిధ పథకాలకు సంబంధించి డీబీటీ ద్వారా ఇప్పటి వరకు రూ.22,62,25,944 లబ్ధి పొందారు. ఎప్పుడో ఎన్నికల సమయంలో తప్ప కనిపించని ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఏటా రెండు, మూడు పర్యాయాలు గ్రామానికి వచ్చి బాగోగులు కనుక్కుంటున్నారు. ‘ప్రభుత్వం అంటే రేషన్‌ కార్డులు ఇవ్వడం, రోడ్లు వేయడం మాత్రమే చేస్తుందనుకున్నాం. ఇలా ఇన్ని మంచి పనులు చేయొచ్చని నాలుగేళ్లుగా సీఎం నిరూపించారు’ అని గ్రామస్తులు కితాబిస్తున్నారు.  
 
మరో ప్రపంచాన్ని చూస్తున్న బుడ్డోడుపాడు 
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని పాత మల్లంపేట పంచాయతీ చుట్టూ 14 చిన్న చిన్న వాడలున్నాయి. ఇందులో బుడ్డోడుపాడు ఒకటి. 42 గిరిజన కుటుంబాలున్న ఈ వాడకు 70 ఏళ్లుగా రోడ్డు మార్గం లేదు. ప్రజలు మైదాన ప్రాంతానికి రావాలంటే దాదాపు 12 కి.మీ మేర వాగులు, వంకలు, డొంకలు దాటి రావాలి. జబ్బు చేస్తే డోలీలో తరలించాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఎంతో మంది ప్రాణాలు సైతం కోల్పోయారు. సైకిల్‌ తప్ప ఇతర ద్విచక్ర వాహనాన్నే చూడని ప్రజలు, పండించిన పంటను సైతం మంచి ధరకు అమ్ముకోలేని దుస్థితి.

కనీసం పిల్లలను చదివించుకుందామన్నా రోజూ ఇద్దరు మనుషులు పిల్లలకు రక్షణగా ఉండి వాగులు దాటించి తీసుకెళ్లి, తిరిగి తీసుకురావాల్సిన స్థితి. వర్షం వస్తే పొంగుతున్న వా­గు­లు దాటలేక ఎక్కడో చోట తలదాచుకోవాల్సిన పరిస్థితులు. వాడంతా టీడీపీకి అనుకూలమే. కానీ ఏరోజూ ఏ నాయకుడూ ఇటు ౖవైపు కన్నెత్తి చూసేవా­రు కాదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాకతో ఈ వాడకు మంచి రోజులు వచ్చాయి. ‘టీడీపీ సాను­భూతిపరులమన్న మాటేగాని గత టీడీపీ ప్రభుత్వంలో మేం పొందిన మేలు లేదు, మా కష్టాలు విన్న నాయకులూ లేరు.

మమ్మల్ని మనుషులుగా గుర్తించింది మాత్రం జగన్‌ ప్రభుత్వమే’ అని 60 ఏళ్ల సెగ్గే రాజబాబు ఆవేదన వెలుబుచ్చాడు. ఇప్పుడు స్థానికంగా ఉండే వలంటీర్‌ ప్రతినెలా 21 మందికి పెన్షన్లు ఇస్తున్నాడు. 18 పక్కా ఇళ్లు మంజూరయ్యాయి. గతంలో చదువు కోసం పిల్లలను 9 కి.మీ దూరంలోని వేరే ఊరికి పంపాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఇక్కడే ఐదవ తరగతి వరకు పాఠశాల ఏర్పాటైంది.

22 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఏడుగురు విద్యార్థులు పై చదువుల కోసం వేరే ఊళ్లకు వెళ్లి వస్తున్నారు. డీబీటీ ద్వారా ప్రజల ఖాతాల్లో 1,87,7000 జమ అయింది. ఇప్పటి దాకా  ప్రభుత్వం రూ.1.52 కోట్ల మేర ఇక్కడ అభివృద్ధి పనులు చేసింది. ఇప్పుడు ఈ వాడకే నేరుగా వాహనాలు వస్తుండడంతో పండించిన జీడిమామిడి పంటను స్థానికంగా అమ్ముకున్నారు.   

మూడుసార్లు ఎమ్మెల్యే వచ్చారు  
ఈ ప్రభుత్వం వచ్చాక నర్సీపట్నం ఎమ్మెల్యే మూడుసార్లు గ్రామానికి వచ్చారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గతంలో మా పెద్దలు ఎప్పుడూ ఎమ్మెల్యే ఎలా ఉంటారో చూడలేదు. సచివాలయాలు వచ్చాక అన్ని పథకాలు ఇంటికే వస్తున్నాయి. ఎన్నో దశాబ్దాల కల అయిన రోడ్డు కూడా జగనన్న ప్రభుత్వంలోనే వచ్చింది. ఇప్పుడు అంతా హ్యాపీ. 
    – తూబిరి రాజబాబు, మాజీ వైస్‌ సర్పంచ్, బుడ్డోడుపాడు  
  
నాలుగేళ్లలో రూ.4 లక్షల సాయం  
మా ఇంట్లో ఇద్దరికి వికలాంగుల పెన్షన్‌ వస్తోంది. వైఎస్సార్‌ ఆసరా, రైతు భరోసా, సున్నా వడ్డీ పథకం కూడా ఇచ్చారు. నా భర్తకు ఆరోగ్యం బాగాలేకపోతే విశాఖపట్నం ఆస్పత్రిలో చేర్పిస్తే.. ఉచితంగా వైద్యం చేయడంతో పాటు ఆరోగ్య ఆసరా కింద రూ.5 వేలు ఇచ్చారు. వలంటీర్లు ప్రతిరోజు ఇంటికి వచ్చి ఏమన్నా సమస్యలున్నాయా అని అడుగుతున్నారు. ఇప్పటి దాకా వివిధ పథకాల ద్వారా మాకు రూ.4,05,500 వచ్చింది.  
    – చింతకాయల మంగాయమ్మ, అల్లిపూడి గ్రామం 
 
ఇంత మంచి పాలన చూడలేం  
మా పెద్దబ్బాయికి మూడేళ్లు వసతి దీవెన వచ్చింది. చిన్నబ్బాయికి నాలుగేళ్లు జగనన్న అమ్మ ఒడి కూడా తీసుకున్నాం. ఏడు ప్రభుత్వ పథకాల ద్వారా నాకు రూ.2,51,250 నా బ్యాంకు ఖాతాలో జమ అయ్యింది. ఆర్థిక పరిస్థితి బాగోలేని మాలాంటి కుటుంబాలు బతికేదే కూలి పనుల పైన. భర్త చనిపోయిన నాకు వితంతు పింఛన్‌ ఇస్తున్నారు. ఇంటి వద్దే బడ్డీ కొట్టు పెట్టుకున్నా. జగనన్న వల్ల అందరం చక్కగా బతుకుతున్నాం 
     – వడ్డి సత్యవతి, అల్లిపూడి గ్రామం 
  
నా బిడ్డ ఇంజనీర్‌ అవుతోంది.. 
మా బాబు చదువుకునేటప్పుడు ఇన్ని ప్రభుత్వ పథకాలు లేవు. ఎలాంటి సాయం కూడా అందలేదు. మా పాప మాత్రం ప్రభుత్వ పథకాలతోనే ఇంజినీరింగ్‌ చదువుతోంది. విద్యా దీవెన, వసతి దీవెనతో పాటు కొద్దిపాటి పొలానికి రైతు భరోసా వచ్చింది. మా ఆయనకు వాహన మిత్ర ఇచ్చారు. ఇప్పటి దాకా మా కుటుంబానికి రూ.3,75,089 సాయం అందింది. 
    – చింతకాయల నాగరత్నం, అల్లిపూడి   

పిల్లల చదువు కష్టాలు తీరాయి  
మా పెద్దబ్బాయి చదువుకునేటప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ ప్రభుత్వం వచ్చాక మా చిన్నబ్బాయికి అమ్మ ఒడి వస్తోంది. మాకు రైతు భరోసా, చేయూతతో పాటు పెద్ద వారికి పెన్షన్‌ కూడా ఇస్తున్నారు. ఏడాదికి అన్ని పథకాల రూపేణా రూ.70 వేలకు పైనే సాయం అందింది. గతంలో ఊరు దాటి బయటకు వెళ్లాలంటే బతుకుపై ఆశ వదులుకునేవారం. ఇప్పుడు చక్కటి రోడ్డు వేయడంతో ఏ సమయంలోనైనా బయటి ప్రాంతానికి నిర్భయంగా వెళ్లగలుగుతున్నాం.     
– బోయిన చినతల్లి, వెంకటేశ్వర్లు దంపతులు, బుడ్డోడుపాడు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement