సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వందేళ్ల తర్వాత చేపడుతున్న అతి పెద్ద రీ సర్వేలో కచ్చితమైన కొలతలు, భూ యజమానుల సంతృప్తి ప్రధాన లక్ష్యాలుగా రెవెన్యూ శాఖ నాలుగు ఐచ్ఛికాలను సిద్ధం చేసింది. కొలతల్లో ఎక్కడైనా చిన్నపాటి తేడా వచ్చిందని రైతులు అభ్యంతరం చెబితే మరో విధానంలో ఆ భూమి హద్దులు నిర్ణయిస్తారు. ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు–భూ రక్ష’ కింద రాష్ట్రంలోని వ్యవసాయ భూములు, గ్రామీణ, పట్టణ ఆస్తులను రీ సర్వే చేసేందుకు రెవెన్యూ, సర్వే సెటిల్‌మెంట్, సర్వే ఆఫ్ ఇండియా ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాయి. దీనిపై ప్రజలను చైతన్యపరచడం, రీ సర్వే ప్రయోజనాలను తెలియజేయడం కోసం ఈ నెల 14నుంచి 19వ తేదీ వరకు గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల వద్ద గ్రామ సభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రీ సర్వే ఉద్దేశం, లక్ష్యాలను అధికారులు ఈ సభల్లో వివరిస్తారు. రీ సర్వే ఎలా ఉంటుంది? దీని ప్రయోజనాలు ఎలా ఉంటాయనే అంశాలపై షార్ట్ ఫిల్మ్ కూడా ప్రదర్శిస్తారు.
మూడు దశల్లో పూర్తి
అటవీ భూములు తప్పించి ప్రభుత్వ భూములు సహా స్థిరాస్తులన్నింటినీ మూడు దశల్లో సర్వే చేసేలా టైమ్‌లైన్ సిద్ధమైంది. రాష్ట్రంలో 17,460 రెవెన్యూ గ్రామాల పరిధిలో 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల మేర గల భూముల సర్వేకు సర్వే ఆఫ్ ఇండియా, రాష్ట్ర సర్వే సెటిల్‌మెంట్ శాఖ సంయుక్తంగా బ్లూప్రింట్ తయారు చేశాయి. మొదటి విడత కింద 5 వేల గ్రామాల్లో సర్వే ప్రారంభించి వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేస్తారు. ఇందులో భాగంగానే ఈ నెల 21న రీ సర్వేను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారు. పైలట్ ప్రాజెక్టు కింద రీ సర్వే పూర్తయిన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో సీఎం జగన్ రైతులకు పట్టాలను అందజేసి రీ సర్వేకి పచ్చ జెండా ఊపుతారు. అదే రోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒక్కొక్క గ్రామంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. తర్వాత ప్రతి డివిజన్‌లో ఒక గ్రామంలోను, తదుపరి ప్రతి మండలంలో ఒక రెవెన్యూ గ్రామంలో రీ సర్వే ప్రారంభిస్తారు. ఇలా వారం రోజుల్లో 670 గ్రామాల్లో ఈ ప్రక్రియ ఆరంభమవుతుంది. రెండో విడత రీ సర్వేను 2021 ఆగస్టులో 6,500 గ్రామాల్లో ప్రారంభించి 2022 జూన్ నాటికి పూర్తి చేస్తారు. మిగిలిన గ్రామాల్లో మూడో విడత సర్వేను 2022 జూలైలో ప్రారంభించి 2023 జూన్ నాటికి పూర్తి చేస్తారు.
కార్స్, డ్రోన్లు, రోవర్ల వినియోగం
– రీ సర్వేలో కంటిన్యూయస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్ (కార్స్), డ్రోన్లు, రోవర్లు వంటి అత్యాధునిక పరికరాలను వినియోగిస్తారు. ఇందుకోసం ఇప్పటికే 9,500 సర్వేయర్లకు శిక్షణ ఇచ్చారు. సర్వేకు 70 బేస్ స్టేషన్లు అవసరం కాగా, ఇప్పటికే 5 ఏర్పాటు చేశారు. మరో 65 బేస్ స్టేషన్లను దశలవారీగా నెలకొల్పుతారు. మొదటి విడత సర్వే కోసం వచ్చే నెలాఖరు నాటికి 30 బేస్ స్టేషన్లను సిద్ధం చేస్తారు. ఎక్కడైనా భూముల్లో పండ్ల తోటలు, ఎత్తయిన చెట్లు ఎక్కువగా ఉంటే డ్రోన్లను పంపడం వీలు కాదు. అందువల్ల ఇలాంటి చోట్ల బేస్ స్టేషన్ల నుంచి శాటిలైట్ ఆధారంగా అక్షాంశాలు, రేఖాంశాల ప్రకారం సబ్ డివిజన్ల (కమతాల) వారీగా రోవర్లను వినియోగించి హద్దులు నిర్ణయిస్తారు.
రీసర్వే సమయంలో కొలతల్లో సూక్ష్మ తేడాల వల్ల వివాదాలు వస్తే నాలుగు పద్ధతులను అనుసరిస్తారు.
1 డ్రోన్ల సాయంతో భూముల కచ్చితమైన కొలతల్ని నిర్ధారించడం మొదటి పద్ధతి.
2 డ్రోన్లతో నిర్ధారించిన కొలతలపై భూ యజమానులు అభ్యంతరం చెబితే రోవర్స్‌ను వినియోగించి కొలతలు వేసి హద్దుల్ని నిర్ణయించడం రెండో పద్ధతి.
3 రోవర్స్ కొలతలపైనా యజమాని సంతృప్తి చెందకపోతే మూడో విధానంగా మాన్యువల్ (పాత) విధానంలో చైన్ లింకులతో కొలతలు వేస్తారు.
4 చైన్ లింకులతో కొలతలపైనా అసంతృప్తి వ్యక్తమైతే సివిల్ ఇంజనీ రింగ్ పద్ధతిలో కొలిచి హద్దులు నిర్ణయిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment