‘చుక్కల’ చిక్కుల్లేవ్‌! | CM YS Jagan govt another revolutionary step in history of lands | Sakshi
Sakshi News home page

‘చుక్కల’ చిక్కుల్లేవ్‌!

Published Thu, Apr 6 2023 2:41 AM | Last Updated on Thu, Apr 6 2023 8:13 AM

CM YS Jagan govt another revolutionary step in history of lands - Sakshi

సాక్షి, అమరావతి: భూముల చరిత్రలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరో విప్లవాత్మక ముందడుగు వేసింది. రాష్ట్రంలో దశాబ్దాలుగా స్తంభించిపోయిన చుక్కల భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరించింది. ఒకేసారి 15 జిల్లాల్లో 2.06 లక్షల ఎకరాల చుక్కల భూము­లను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించి రైతన్నలకు ఊరట కల్పించింది.

రెవెన్యూ శాఖ నిర్వహించిన సుమోటో వెరిఫికేషన్‌ ద్వారా రికా­ర్డులన్నింటినీ పూర్తిగా పరిశీలించి చుక్కల నుంచి విముక్తి కల్పించింది. ‘‘22 ఏ (1) ఇ’’ నుంచి తొలగిస్తూ ఇప్పటికే 10 జిల్లాలకు సంబంధించిన జీవోలు జారీ కాగా మిగతావి త్వరలో వెలువడనున్నాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 43 వేల ఎకరాల చుక్కల భూములకు విముక్తి లభించింది.

ఈ భూములను రైతులు ఇక స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు. వాటిపై రుణాలు పొందేందుకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. లక్షల మంది రైతు కుటుంబాల్లో మానసిక వేదనను తొలగిస్తూ చుక్కల భూములకు విముక్తి కల్పించిన నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌ సారథ్యంలో ఈ నెలలో భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

భూముల సమస్యలపై స్పెషల్‌ ఫోకస్‌
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీర్ఘకాలంగా పేరుకుపోయిన భూముల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా అన్ని భూములను రీ సర్వే చేస్తోంది. షరతుల గల పట్టా భూములను 22 ఏ జాబితా నుంచి తొలగించడంతో కృష్ణా జిల్లా అవనిగడ్డలో 18 వేల ఎకరాలకు సంబంధించి రైతులకు మేలు జరిగింది.

అనాధీనం, ఖాళీ కాలమ్‌ భూముల సమస్యను పరిష్కరించేందుకు చట్టాన్ని మార్చింది. కృష్ణా, గోదావరి డెల్టాలోని లంక భూములకు డి పట్టాలిచ్చేందుకు నిబంధనలను సవరించింది. అదే క్రమంలో చుక్కల భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తోంది. నిషేధిత ఆస్తుల జాబితాలోని 22 ఏ (1) ఇ నుంచి చుక్కల భూములను తొలగించింది.

నిబంధనలకు అనుగుణంగా ఆ భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించాలని తొలుత జిల్లా కలెక్టర్లను ఆదేశించినా వివాదాలు, దళారుల కారణంగా అడుగు ముందుకు పడకపోవడంతో ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగింది.

1.81 లక్షల సర్వే నెంబర్ల రీ–వెరిఫికేషన్‌
సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రాష్ట్రంలో చుక్కల భూములన్నింటినీ సుమోటోగా రీ వెరిఫికేషన్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు 2022 ఆగస్టు 22, 25వ తేదీల్లో జిల్లా కలెక్టర్లకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ సాయిప్రసాద్‌ రెండు సర్క్యులర్లు జారీ చేశారు. చుక్కల భూములు కాకపోయినప్పటికీ 1908 రిజిస్ట్రేషన్ల చట్టం సెక్షన్‌ 22–ఏ (1)ఇ కింద నమోదు చేసిన భూములతోపాటు అసలు నిషేధిత జాబితాలో చేర్చకూడని వాటిని 22 ఏలో పొందుపరచిన కేసులపై ఒక నిర్ణయానికి రావాలని ఆదేశించారు. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా చుక్కల భూముల పేరుతో ఉన్న 4.06 లక్షల ఎకరాలను రెవెన్యూ యంత్రాంగం సుమోటోగా రీ వెరిఫికేషన్‌ చేసింది.

ఆర్డీవోలు, తహశీల్దార్లు 1.81 లక్షల సర్వే నెంబర్లలోని 4.06 లక్షలపైగా ఎకరాలకు సంబంధించిన భూములను రీ వెరిఫికేషన్‌ చేశారు. రైతుల వద్ద ఉన్న డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్ల శాఖ రికార్డులు, రెవెన్యూ శాఖ నిర్వహించే 10 (1) అకౌంట్, రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌ (ఆర్‌వోఆర్‌)లను క్షుణ్నంగా తనిఖీ చేశారు. ఆ భూములకు సంబంధించి ఏవైనా కోర్టు ఉత్తర్వులుంటే వాటిని కూడా పరిగణలోకి తీసుకున్నారు. 2017లో చుక్కల భూముల చట్టం వచ్చే నాటికి ఆ భూమి 11 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ కాలం సంబంధిత రైతు ఆధీనంలో ఉందో లేదో పరిశీలించారు.

ఆర్‌ఎస్‌ఆర్‌ (రీ–సెటిల్మెంట్‌ రిజిష్టర్‌)లోని 16వ కాలమ్‌లో చుక్కల భూమిగా నిర్దేశించే కాలమ్‌ను పరిశీలించారు. వీటి ప్రకారం రికార్డుల్లో పేరు ఉన్నట్లు ధృవీకరించుకోవడంతోపాటు 11 ఏళ్లుగా సంబంధిత రైతు ఆధీనంలో భూమి ఉంటే 22 (ఏ)1 ఇ నుంచి తొలగించారు. అలాగే చుక్కల భూముల కేటగిరీ కిందకు రావని గుర్తించిన భూములను నిబంధనల ప్రకారం ఏ కేటగిరీలో చేర్చాలో అందులో (22ఏ (1) చేర్చారు. 

రైతులకు సర్వ హక్కులు
నిషేధిత జాబితాలో ఉండడంతో ఈ భూముల రిజిస్ట్రేషన్లను ఇన్నాళ్లూ నిలిపివేశారు. పంట రుణాలు కూడా రావడంలేదు. తమ సమస్యను పరిష్కరించాలని రైతులు అధికారుల చుట్టూ తిరగడమే కానీ ఇన్నాళ్లూ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ సమస్యలన్నింటికీ తెర దించుతూ చుక్కల భూముల సమస్యకు సీఎం వైఎస్‌ జగన్‌ ముగింపు పలికారు. రాష్ట్ర చరిత్రలో లక్షల ఎకరాల భూములకు విముక్తి కల్పించడం ఇదే తొలిసారి. ప్రణాళిక ప్రకారం చుక్కల భూముల సమస్యను పరిష్కరించి వాటికి విముక్తి కలిగించి లక్షల మంది రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపారు. దీనిద్వారా సంబంధిత రైతులకు తమ భూములపై సర్వ హక్కులు లభిస్తాయి. 


15 ఏళ్ల అవస్థలు తీరాయి..
గ్రామంలో పూర్వీకులు నుంచి వచ్చిన 2.50 ఎకరాలు భూమిని 15 ఏళ్ల  క్రితం రెడ్‌ మార్క్‌లో పెట్టారు. తహశీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి అడిగితే చుక్కల భూమిగా నమోదైందని చెప్పారు. అప్పటి నుంచి పొలం అమ్ముకోవాలంటే రిజిస్టర్‌ కాకపోవడంతో ఎంతో ఇబ్బంది పడుతున్నా.  సమస్య పరిష్కరించాలని చాలాసార్లు అధికారులకు అర్జీలిచ్చినా స్పందన లేదు. సీఎం జగన్‌ ప్రభుత్వం మా సమస్యను ఇంత సులభంగా పరిష్కరిస్తుందని అనుకోలేదు. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. 
– జానపాటి అవులయ్య, వేములకోట, మార్కాపురం మండలం, ప్రకాశం జిల్లా

ప్రభుత్వానికి రుణపడి ఉంటాం..
18 ఏళ్ల క్రితం సర్వే నెంబర్‌ 432–3, 4లో 2.30 ఎకరాల భూమి కొన్నాం. అప్పటి నుంచి అందులో సాగు చేసుకుంటున్నాం. 2015లో ఆ భూమికి సంబంధించిన పట్టాదార్‌ పాస్‌ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకుంటే చుక్కల భూమిగా నమోదైందని చెప్పారు. దీంతో విక్రయించేందుకు, బ్యాంకు రుణం పొందేందుకు వీలు లేకుండా పోయింది. ఎన్నోసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు. ఇన్నాళ్లకు మా భూమిని చుక్కల నుంచి తప్పించినట్లు చెప్పారు. మేం కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించారు. ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
– నల్లగొర్ల మస్తానయ్య, మహిమలూరు, ఆత్మకూరు మండలం, నెల్లూరు జిల్లా

చుక్కల భూములంటే?
ఆంగ్లేయుల హయాంలో నిర్వహించిన రీ సర్వేలో కొందరు భూ యజమానులు సర్వేకు ముందుకు రాకపోవడం, భూమి ఎవరిదో నిర్థారించలేకపోవడంతో ఆర్‌ఎస్‌ఆర్‌–1లోని పట్టాదార్‌ కాలమ్, రిమార్క్స్‌ కాలమ్‌లో మూడు చుక్కలు పెట్టి వదిలేశారు. శిస్తు కట్ట లేని రైతులు సర్వేకు విముఖత చూపడంతో ఆ భూములు ఎవరివో రికార్డుల్లో నమోదు కాలేదు. ఇక ఆ తర్వాత మళ్లీ సర్వే జరగలేదు. రికార్డులు అలా చుక్కలతోనే ఉండడంతో వాటిని చుక్కల భూములుగా వ్యవహరిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement