సాక్షి, అమరావతి: అత్యాధునిక టెక్నాలజీతో రాష్ట్రవ్యాప్తంగా భూములను సమగ్రంగా రీసర్వే చేసేందుకు ప్రభుత్వం రూ.987.46 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు పరిపాలన ఆమోదం తెలుపుతూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం’ అని వ్యవహరించనున్నారు. ఈనెల 5వతేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ పేరు ఖరారు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం వ్యవసాయ భూములు, గ్రామ పంచాయతీలు, పట్టణాల్లోని స్థలాలు రీసర్వే ప్రాజెక్టు పరిధిలోకి వస్తాయి. డ్రోన్లు, కంటిన్యూస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ (కార్స్) నెట్‌వర్క్‌తో చేపట్టనున్న రీసర్వే ప్రాజెక్టుకు రూ.987.46 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు.
వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం ప్రారంభమవుతుంది. మూడు దశల్లో రీ సర్వే పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు. సుపరిపాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అత్యంత ప్రాధాన్య కార్యక్రమాల్లో భూముల సమగ్ర రీసర్వే ప్రాజెక్టు ప్రధానమైనది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వంద శాతం కచ్చితమైన కొలతలలో రాష్ట్రవ్యాప్తంగా భూములను రీ సర్వే చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. భూ రికార్డులను స్వచ్ఛీకరించడంతోపాటు ట్యాంపర్డ్ ఫ్రూఫ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కార్స్ టెక్నాలజీ ద్వారా వీలైనంత తక్కువ ధరకు పరికరాలు కొనుగోలు చేయనున్నారు. ఇందుకోసం బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించింది.
భూముల రీసర్వేకు రూ.987.46 కోట్లు
Published Wed, Nov 18 2020 3:33 AM | Last Updated on Wed, Nov 18 2020 3:33 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment