సామర్లకోటలోని సర్వే శిక్షణ అకాడెమీలో డ్రోన్లతో శిక్షణ పొందుతున్న సిబ్బంది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న భూముల రీ సర్వే కోసం ప్రభుత్వ సర్వేయర్లే డ్రోన్ పైలట్లుగా మారారు. ఇలా సర్వేయర్లే డ్రోన్లను ఆపరేట్ చేస్తూ భూములను సర్వే చేయడం దేశంలోనే మొదటిసారి. సామర్లకోటలోని సర్వే శిక్షణ అకాడెమీలో ఎంపిక చేసిన సర్వేయర్లకు శిక్షణ ఇస్తున్నారు. రీ సర్వే కోసం ప్రభుత్వం మొదట సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుని డ్రోన్లను ఉపయోగించడం ప్రారంభించింది. కొన్ని ప్రైవేటు డ్రోన్ ఏజెన్సీలతోనూ సర్వే చేయిస్తోంది.
మొదట్లో ఆ డ్రోన్లను ఆపరేట్ చేసే సంస్థల పైలట్లకు సర్వేయర్లు కో–పైలట్లుగా పని చేశారు. రీ సర్వేను మరింత వేగంగా నిర్వహించేందుకు ప్రభుత్వమే ఇటీవల సొంతంగా 20 డ్రోన్లు కొనుగోలు చేసింది. ప్రైవేటు డ్రోన్లతోపాటు వీటిని ఉపయోగిస్తోంది. ఈ డ్రోన్లకు పైలట్లుగా ప్రభుత్వ సర్వేయర్లే ఉండాలని సర్వే శాఖ భావించింది. ఇందుకోసం ప్రతి జిల్లా నుంచి ముగ్గురు, నలుగురు సర్వేయర్లను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చారు.
డ్రోన్లు విక్రయించిన సంస్థ నిపుణులే సామర్లకోట వచ్చి తొలి విడతగా 94 మందికి వారం రోజులు శిక్షణ ఇచ్చి సరిఫికెట్లు కూడా ఇచ్చారు. డ్రోన్‌ను సర్వేకు సిద్ధం చేయడం (అసెంబ్లింగ్), ఆపరేషన్, సర్వే అయిన తర్వాత డేటాను స్వీకరించడం (క్యాప్చర్ చేయడం), ఆ డేటాను హైదరాబాద్‌లోని సర్వే ఆఫ్ ఇండియాకు పంపించేవరకు మొత్తం బాధ్యత పైలట్‌లదే. సర్వే శాఖ డ్రోన్లతోనే రోజుకు 2,470 ఎకరాలు సర్వే చేస్తున్నారు. తాజాగా మరో 10 డ్రోన్లను సర్వే శాఖ కొనుగోలు చేసింది. వాటిని ఆపరేట్ చేసేందుకు మరో 20 మంది సర్వేయర్లకు బుధవారం నుంచి సామర్లకోటలో శిక్షణ ప్రారంభమయ్యింది. విడాల్ ఏవియేషన్ సంస్థ నిపుణులు ఈ శిక్షణ ఇస్తున్నారు.
సర్వేయర్లు డ్రోన్ ఫ్లై చేయడం గర్వకారణం
ప్రభుత్వ సర్వేయర్లు డ్రోన్ల ద్వారా రీ సర్వేలో భూములు కొలవడం గర్వించదగ్గ విషయం. సర్వే శాఖలో 25 సంవత్సరాలుగా పని చేస్తున్నా. చైన్లు, క్రాస్‌లు పట్టుకుని లాగుతూ సర్వే చేసేవాళ్లం. ఇప్పుడు మా సర్వేయర్లు డ్రోన్ పైలట్లుగా మారి రీ సర్వే చేస్తున్నారు. వారికి అప్పగించిన పనిని సమర్ధంగా చేస్తున్నారు.
– డీఎల్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్, సర్వే సెటిల్మెంట్, భూమి రికార్డుల శాఖ
Comments
Please login to add a commentAdd a comment