Survey Department
-
రీ సర్వేలో సర్కారు స్పీడు
సాక్షి, అమరావతి: భూముల రీ సర్వేతో కొత్త చరిత్రను లిఖిస్తున్న ప్రభుత్వం మరో రికార్డు సృష్టించింది. తొలి విడత రీ సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో సరిహద్దు రాళ్లు పాతే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. వ్యవసాయ భూముల సరిహద్దులను చూపుతూ రాళ్లు వేసినప్పుడు మాత్రమే సమగ్ర భూ సర్వే పూర్తయినట్లని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేయటంతో సర్వే శాఖ వేగంగా దాన్ని పూర్తి చేసింది. గత నెలాఖరుకి 13 లక్షల రాళ్లు పాతిన యంత్రాంగం ఆ తర్వాత 20 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 12.80 లక్షలకుపైగా రాళ్లు పాతి, కొత్త రికార్డు సృష్టించింది. ఈ నెల 20వ తేదీకల్లా 2 వేల గ్రామాల్లో రాళ్లు పాతే పని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నా మూడు రోజుల ముందే ఆ పని పూర్తి చేశారు. ఇందుకోసం సర్వే శాఖ వెయ్యి రోవర్లను సమకూర్చుకొంది. మరికొన్నింటిని అద్దెకు తీసుకొంది. రోజుకు సగటున 40 నుంచి 50 వేల రాళ్లను పాతారు. 2 వేల గ్రామాల్లో అన్ని దశల సర్వే పూర్తి రాష్ట్రంలోని 17 వేలకుపైగా గ్రామాలకుగాను తొలి విడతగా 2 వేల గ్రామాల్లో రీ సర్వే అన్ని దశలు పూర్తయింది. ఈ గ్రామాలకు కొత్త రెవెన్యూ రికార్డులు (ఆర్ఓఆర్) సైతం తయారయ్యాయి. ఆ గ్రామాలకు చెందిన 7.50 లక్షల మంది రైతులకు భూ హక్కు పత్రాలను జారీ చేశారు. చివరిగా రైతుల భూముల సరిహద్దుల్లో సర్వే రాళ్లు పాతడం కూడా పూర్తి చేయడం ద్వారా ఈ 2 వేల గ్రామాలను రీసర్వే మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దారు. ఖర్చంతా ప్రభుత్వానిదే సాధారణంగా రైతులు భూమిని సర్వే చేయించుకుని రాళ్లు పాతించడం పెద్ద ప్రయాస. ఖర్చు ఎక్కువ. అయితే, ప్రభుత్వం రైతులపై పైసా కూడా భారం పడకుండా మొత్తం తానే భరించింది. సర్వే పూర్తి చేసి ఉచితంగా రాళ్లు పాతి రైతులకు భూములు అప్పగించింది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా ఇందుకోసం అవసరమైన రాళ్లను కోట్ల ఖర్చుతో తయారు చేయించింది. రాళ్ల తయారీకి ప్రత్యేకంగా యూనిట్లు పెట్టి మరీ అవసరమైన సైజుల్లో రాళ్లను తయారు చేసింది. 25 లక్షలకు పైగా రాళ్లు సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో మొత్తం 25 లక్షలకు పైగా రాళ్లను పాతారు. మూడు గ్రామాలు కలిసే చోట (ట్రై జంక్షన్) ఏ క్లాస్ పెద్ద రాళ్లు 6,970 పాతారు. ప్రతి భూకమతం హద్దుల్లో బి క్లాస్ చిన్న రాళ్లు 25.73 లక్షలు పాతారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలోని 354 గ్రామాల హద్దుల్లో 4.48 లక్షల రాళ్లు పాతారు. విజయనగరం జిల్లాలో 179 గ్రామాల్లో 2.48 లక్షలు, పల్నాడు జిల్లాలో 70 గ్రామాల్లో 2.08 లక్షలు, కాకినాడ జిల్లాలో 121 గ్రామాల్లో 1.86 లక్షలు, చిత్తూరు జిల్లాలోని 134 గ్రామాల్లో 1.44 లక్షల రాళ్లు పాతారు. ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా గ్రానైట్, శాండ్ స్టోన్, లైమ్ స్టోన్, నాప రాళ్లను వినియోగించారు. 70 శాతానికిపైగా గ్రానైట్ రాళ్లనే పాతారు. -
రోజుకు 50 వేల సర్వే రాళ్లు
సాక్షి, అమరావతి: భూముల రీ సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో సర్వే రాళ్లు పాతే కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. రైతులపై పైసా భారం లేకుండా ప్రభుత్వ ఖర్చుతోనే సర్వే చేసిన భూముల్లో రాళ్లు పాతుతున్నారు. ఇప్పటికే విశాఖపట్నం, గుంటూరు, నంద్యాల, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఈ కార్యక్రమం వంద శాతం పూర్తయింది. మిగతా జిల్లాల్లోనూ వేగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రోజుకు 50 వేల రాళ్లు పాతడమే లక్ష్యంగా సర్వే సెటిల్మెంట్, రెవెన్యూ యంత్రాంగాలు పనిచేస్తున్నాయి. ఈ నెల 18వ తేదీన 54,538 రాళ్లను రైతుల భూముల సరిహద్దుల్లో పాతారు. ఆరోజు ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 8 వేలకుపైగా రాళ్లను పాతారు. ఆ తర్వాత నుంచి ప్రతి రోజూ 50 వేలకు తగ్గకుండా రాళ్లను పాతుతున్నారు. ఇందుకోసం జిల్లాలవారీగా షెడ్యూల్‌ను రూపొందించారు. దాని ప్రకారం రోజూ రాళ్లు పాతుతున్నారో లేదో పర్యవేక్షిస్తున్నారు. ఒకేసారి భారీగా సర్వే రాళ్లు పాతుతుండడంతో ఉన్న రోవర్లు సరిపోవడంలేదు. దీంతో సర్వే శాఖ అదనంగా వెయ్యి రోవర్లను సమకూర్చుకుంది. వచ్చే నెల 20లోగా సర్వే పూర్తయిన గ్రామాలన్నింటిలో ఈ కార్యక్రమం పూర్తి చేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ గ్రామాల్లో 25.80 లక్షల రాళ్లు పాతాల్సి ఉండగా ఇప్పటివరకు 14 లక్షలకుపైగా రాళ్లు పాతారు. రికార్డు స్థాయిలో సర్వే రాళ్లు పాతే కార్యక్రమం నడుస్తోందని సర్వే, సెటిల్మెంట్ కమిషనర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. రీ సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లోని రైతులకు భూహక్కు పత్రాల పంపిణీ చివరి దశకు వచ్చిందని చెప్పారు. రాళ్లు కూడా పాతడం పూర్తయితే రీ సర్వే ప్రాజెక్టులో ఈ గ్రామాలు మోడల్‌గా ఉంటాయని తెలిపారు. కోటీ ఇరవై ఐదు లక్షల సర్వే రాళ్లు అవసరం సర్వే కోసం రాష్ట్రవ్యాప్తంగా కోటీ ఇరవై ఐదు లక్షల సర్వే రాళ్లు అవసరమవుతాయని అంచనా. అన్ని రాళ్లను సమకూర్చే సామర్థ్యం ఉన్న ఫ్యాక్టరీలు రాష్ట్రంలో, సమీప రాష్ట్రాల్లోనూ లేవు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే 4 సర్వే రాళ్ల కర్మాగారాలు ఏర్పాటు చేసి రాళ్లు ఉత్పత్తి చేస్తోంది. సర్వే రాళ్లు తయారు చేయడానికి అవసరమైన గ్రానైట్ రాళ్లను గనుల శాఖ ఈ ఫ్యాక్టరీలకు సమకూరుస్తోంది. వాటిని 2 సైజుల్లో తయారు చేసి సర్వే శాఖకు అప్పగిస్తున్నారు. -
నిరుద్యోగులకు శుభవార్త.. జాబ్ నోటిఫికేషన్ విడుదల
ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలోని అటవీశాఖకు సంబంధించి ఎనిమిది ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ పోస్టులు, అలాగే సర్వే ల్యాండ్ రికార్డ్స్ విభాగంలోని ఎనిమిది కంప్యూటర్ డ్రాఫ్ట్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్.అరుణ్‌కుమార్ అక్టోబర్ 17న తెలిపారు. కాగా, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ పోస్టులకు నవంబర్ 15 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేయవచ్చునని పేర్కొన్నారు. కంప్యూటర్ డ్రాఫ్ట్‌మెన్ పోస్టులకు నవంబర్ 10 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. ఇతర వివరాలకు psc.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు. -
డ్రోన్ పైలట్లుగా సర్వేయర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న భూముల రీ సర్వే కోసం ప్రభుత్వ సర్వేయర్లే డ్రోన్ పైలట్లుగా మారారు. ఇలా సర్వేయర్లే డ్రోన్లను ఆపరేట్ చేస్తూ భూములను సర్వే చేయడం దేశంలోనే మొదటిసారి. సామర్లకోటలోని సర్వే శిక్షణ అకాడెమీలో ఎంపిక చేసిన సర్వేయర్లకు శిక్షణ ఇస్తున్నారు. రీ సర్వే కోసం ప్రభుత్వం మొదట సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుని డ్రోన్లను ఉపయోగించడం ప్రారంభించింది. కొన్ని ప్రైవేటు డ్రోన్ ఏజెన్సీలతోనూ సర్వే చేయిస్తోంది. మొదట్లో ఆ డ్రోన్లను ఆపరేట్ చేసే సంస్థల పైలట్లకు సర్వేయర్లు కో–పైలట్లుగా పని చేశారు. రీ సర్వేను మరింత వేగంగా నిర్వహించేందుకు ప్రభుత్వమే ఇటీవల సొంతంగా 20 డ్రోన్లు కొనుగోలు చేసింది. ప్రైవేటు డ్రోన్లతోపాటు వీటిని ఉపయోగిస్తోంది. ఈ డ్రోన్లకు పైలట్లుగా ప్రభుత్వ సర్వేయర్లే ఉండాలని సర్వే శాఖ భావించింది. ఇందుకోసం ప్రతి జిల్లా నుంచి ముగ్గురు, నలుగురు సర్వేయర్లను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చారు. డ్రోన్లు విక్రయించిన సంస్థ నిపుణులే సామర్లకోట వచ్చి తొలి విడతగా 94 మందికి వారం రోజులు శిక్షణ ఇచ్చి సరిఫికెట్లు కూడా ఇచ్చారు. డ్రోన్‌ను సర్వేకు సిద్ధం చేయడం (అసెంబ్లింగ్), ఆపరేషన్, సర్వే అయిన తర్వాత డేటాను స్వీకరించడం (క్యాప్చర్ చేయడం), ఆ డేటాను హైదరాబాద్‌లోని సర్వే ఆఫ్ ఇండియాకు పంపించేవరకు మొత్తం బాధ్యత పైలట్లదే. సర్వే శాఖ డ్రోన్లతోనే రోజుకు 2,470 ఎకరాలు సర్వే చేస్తున్నారు. తాజాగా మరో 10 డ్రోన్లను సర్వే శాఖ కొనుగోలు చేసింది. వాటిని ఆపరేట్ చేసేందుకు మరో 20 మంది సర్వేయర్లకు బుధవారం నుంచి సామర్లకోటలో శిక్షణ ప్రారంభమయ్యింది. విడాల్ ఏవియేషన్ సంస్థ నిపుణులు ఈ శిక్షణ ఇస్తున్నారు. సర్వేయర్లు డ్రోన్ ఫ్లై చేయడం గర్వకారణం ప్రభుత్వ సర్వేయర్లు డ్రోన్ల ద్వారా రీ సర్వేలో భూములు కొలవడం గర్వించదగ్గ విషయం. సర్వే శాఖలో 25 సంవత్సరాలుగా పని చేస్తున్నా. చైన్లు, క్రాస్లు పట్టుకుని లాగుతూ సర్వే చేసేవాళ్లం. ఇప్పుడు మా సర్వేయర్లు డ్రోన్ పైలట్లుగా మారి రీ సర్వే చేస్తున్నారు. వారికి అప్పగించిన పనిని సమర్ధంగా చేస్తున్నారు. – డీఎల్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్, సర్వే సెటిల్మెంట్, భూమి రికార్డుల శాఖ -
గొలుసు.. మామూళ్లతో కొలుచు..!
కొద్దినెలల క్రితం దేవనకొండ మండలంలో భూమి సర్వే కోసం రైతులు జిల్లా సర్వే ఏడీని ఆశ్రయించారు. దీంతో ఆయన సంబంధిత సర్వేయర్‌కు ఫోన్ చేసి తక్షణం సర్వే చేయాలని ఆదేశించారు. సర్వే అయితే చేశారు కాని ముడుపులు మాత్రం వదలలేదు. ఏడీ సార్ చెప్పినారు కదా అంటే వాళ్లు చెబుతుంటారు. మాకు ఇవ్వాల్సిందే అంటూ మామూళ్లు వసూలు చేశారు. ఇటీవల డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి కృష్ణగిరి మండలం కోయిలకొండ గ్రామానికి చెందిన ఓ రైతు ఫోన్ చేసి సర్వే కోసం సర్వేయర్ రూ.9వేల లంచం తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. ఆ డబ్బు తిరిగి ఇప్పిస్తానని కలెక్టర్ వీరపాండియన్ హామీ ఇచ్చారు. కలెక్టర్ దృష్టికి పోవడంతో సర్వేయర్ తీసుకున్న మామూళ్లు వెనక్కి ఇచ్చినట్లు తెలుస్తోంది. సాక్షి, కర్నూలు(అగ్రికల్చర్): సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నా..కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. సమస్యల పరిష్కారానికి డబ్బులు డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ప్రతిష్టను మంటకలుపుతున్నారు. సర్వే విభాగంలో ఈ తంతు సాగుతోంది. మామూళ్లు ఇవ్వందే సిబ్బంది గొలుసు పట్టడం లేదు. ఈ విభాగంలో ఫీల్డ్ మెజర్‌మెంటు బుక్ (ఎఫ్ఎండీ)లు గల్లంత కావడం చర్చనీయాంశమైంది. ఇవి లేకపోతే భూ సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం లేదు. ఇటువంటి వాటిని భద్రపరచాల్సిన అవసరం ఎంతో ఉన్నా సర్వే, భూమి రికార్డుల విభాగం తగిన చొరవ తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో సర్వేకు సంబంధించి 61 సమస్యలు వచ్చాయి. ఇందులో కేవలం 2 మాత్రమే పరిష్కరించారు. 3440 ఎఫ్‌ఎంబీలు గల్లంతు.. జిల్లాలో 914 రెవెన్యూ గ్రామాలు ఉండగా 4,87,761 సర్వే నంబర్లు (ఎఫ్‌ఎంబీలు) ఉన్నాయి. వీటిని డిజిటల్ ఇండియాలో భాగంగా ఎఫ్‌ఎంబీలను డిజిటలైజేషన్ చేసే ప్రక్రియను చేపట్టారు. ఇందులో 3440 ఎఫ్‌ఎంబీలు గల్లంతు అయ్యాయి. భూ సమస్యలకు ప్రధాన ఆధారం ఎంఎంబీనే. ఇందులో పొలంలో ఎక్కడెక్కడ ఎన్ని గొలుసులకు సర్వే రాళ్లు ఉండేది స్పష్టంగా ఉంటుంది. సర్వేకు ఎఫ్ఎంబీనే ఆధారం. ఇవే లేవంటే సర్వే విభాగం ఎంత నిర్లక్ష్యంగా ఉందో స్పష్టమవుతోంది. గల్లంతు అయిన ఎఫ్‌ఎంబీలు ఎవ్వరి దగ్గరైన ఉంటే తెచ్చి ఇవ్వాలని సర్వే అధికారులు కోరారు. అయితే స్పందన లేదు. గల్లంతైన ఎఫ్‌ఎంబీలను మళ్లీ తయారు చేసి డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. మామూలుగా అయితే జూన్ నెల చివరికే ఈ తంతు పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. వారి రూటే సప‘రేటు’ ముడుపులు ముట్టచెప్పిన వారికి సర్వే చేస్తూ... మిగిలిన దరఖాస్తులు తిరస్కరిస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో శాంక్షన్ పోస్టులకు అనుగుణంగా సర్వేయర్లు, డిప్యూటీ సర్వేయర్లు ఉన్నారు. అంతేగాక 200 మంది వరకు లైసన్స్‌డ్ సర్వేయర్లు ఉన్నారు. ఇంతమంది ఉన్నా సర్వే సమస్యలు మాత్రం ఎక్కడివక్కడే ఉండిపోయాయి. లైసన్స్‌డ్ సర్వేయర్లు మొదలు కొని డిప్యూటీ సర్వేయర్లు, సర్వేయర్లు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎకరాకు ఇంత చొప్పున రేటు నిర్ణయించారు. ఈ ప్రకారం ముట్టచెబితేనే సర్వేయర్లు గొలుసుపడుతారు. సాక్షాత్తు జిల్లా సర్వే అధికారులు చెప్పినప్పటికీ ముడుపులు తీసుకోకుండా సర్వే చేయరంటే అతిశయోక్తి కాదు. -
సర్వేశ్వరా !
తంబళ్లపల్లె మండలంలోని కోటకొండ గ్రామానికి చెందిన రామప్ప అనే రైతు తగాదాలో ఉన్న తన పొలాన్ని కొలవాలని మూడు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నాడు. అతని సమస్య ఇంతవరకు పరిష్కారానికి నోచుకోలేదు. పిచ్చాటూరు మండలంలోని రాజనగరం గ్రామానికి చెందిన Ôశంకరప్ప అనే భూ యజమాని తన స్థలాన్ని కబ్జా చేసారని, తన భూమిని కొలవాలని గత ఏడాది డిసెంబర్లో మీ–సేవలో దరఖాస్తు చేసుకున్నాడు. నెలలు గడిచినా సర్వేయర్ రాకపోవడంతో, తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాడు. మీసేవ దరఖాస్తు తమకు అందలేదని సమాధానం. చేసేది లేక ఆయన ప్రైవేట్ సర్వేయర్‌ను ఆశ్రయించాడు. చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర ప్రభుత్వమేమో ఒక పక్క రియల్ టైమ్ గవర్నెన్స్ అంటూ గొప్పలు చెప్పుకుంటోంది. అయితే జిల్లాలో క్షేత్రస్థాయిలో సర్వేయర్లు లంచం లేనిదే విధులు నిర్వహించరనే విమర్శలున్నాయి. భూ కొలతల కోసం అర్జీ అందజేసే సామాన్యులు, రైతుల నుంచి ఆమ్యామ్యాలు తీసుకున్నాకే విధులు నిర్వహిస్తున్నారు. ఎవరైనా ఆమ్యామ్యాలు ఇవ్వడానికి వెనకాడితే వాళ్లను నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుతూ నరకం చూపిస్తున్నారు. సర్వే శాఖపై జిల్లా ఉన్నతాధికారులు సమీక్షలు జరపకపోవడంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటలా తయారైంది. సర్వే నిమిత్తం వచ్చేఅర్జీదారులను ముప్పుతిప్పలు పెడుతున్నా పట్టించుకునే నాథుడు కనిపించడం లేదు. భూ కొలతలకు సంబంధించి అర్జీలు చేసుకుంటున్న వారి స్థలం విస్తీర్ణాన్ని బట్టి రేటు నిర్ణయిస్తున్నారు. ఈ విధంగా అక్రమ సంపాదనకు అలవాటు పడిన సర్వేయర్లు ఉన్నతాధికారుల ఆదేశాలను కూడా లెక్కపెట్టే స్థితిలో లేరనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది సర్వేయర్లు ఏళ్ల తరబడి ఒకే చోట పాతుకుపోయారనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలోని ప్ర జలు తమ భూమిని సర్వే చేయించుకోవా లంటే అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. పెండింగ్‌లో దరఖాస్తులు జిల్లాలోని 66 మండలాల్లో మూడు నెలలుగా 2,786 వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. సర్వేయర్ల అలసత్వం కారణంగానో.. ముడుపులు అందని కారణంగానో అధిక సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మండల, జిల్లా స్థాయిలో దరఖాస్తులు కొండలా పేరుకుపోతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా.. కొన్ని దరఖాస్తులకు మోక్షం లభించడం లేదని తెలుస్తోంది. సాధారణంగా రైతుల మధ్య భూముల హద్దులకు సంబంధించి వివాదాలు, సమస్యలు తలెత్తినప్పుడు లేదా భూముల క్రయవిక్రయాల సందర్భంగా హద్దులను క్షేత్రస్థాయిలో అధికారికంగా నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. భూసేకరణ, నష్టపరిహారం చెల్లింపు తదితర సమయాల్లో ప్రభుత్వ సర్వేయర్ల అవసరం ఏర్పడుతుంది. గ్రామస్థాయిలో కొలతల కోసం మీ సేవల ద్వారా దరఖాస్తులు చేసుకుంటారు. ఆ దరఖాస్తులు తహసీల్దార్ కార్యాలయాలకు చేరుతాయి. ఆ దరఖాస్తులను రెవెన్యూ శాఖ సర్వేయర్లు పరిశీలించి, కొలతలు వేసి హద్దులను నిర్ణయించి, అధికారికంగా నివేదికలను సమర్పిస్తారు. సంబంధిత అర్జీదారుని భూములను సర్వే చేసేందుకు ఫలానా తేదీన భూమి దగ్గరకు వస్తున్నామని, అందుబాటులో ఉండాలని నోటీసులు పంపాల్సి ఉంటుంది. కానీ వారికి ముడుపులు అందలేదనే కారణంతో ఏదో ఒక సాకు చెప్పి తరచూ వాయిదాలు వేస్తున్నారని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. కొరవడిన పర్యవేక్షణ సర్వే శాఖపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో సర్వేయర్లు ఆడిందే ఆటగా మారిందనే ఆరోపణలు ఉన్నా యి. ఈ శాఖకు సంబంధించి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు పర్యవేక్షణ చాలా అవసరం. ప్రస్తుతం వారు పని ఒత్తిడిలో ఉండడంతో సర్వేయర్లు తమ ఇష్టానుసా రం ప్రవర్తిస్తున్నారు. సర్వేయర్లు భూము ల కొలవకపోవడంతో రైతులు, ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. మరికొంతమంది ప్రభుత్వ సర్వేయర్లకు లంచాలు ఇచ్చుకోలేక, ప్రైవేటు సర్వేయర్లను ఆశ్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు. -
ఎలా సర్వేశ్వరా..?
► సర్వే శాఖలో సిబ్బంది లేక సతమతం.. ► నిలిచిపోయిన ముఖ్యమైన సర్వేలు ► సెలవులో ఎ.డి. విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలోని భూమి, సర్వే శాఖ సిబ్బంది కొరతతో అల్లాడుతోంది. జిల్లాలో అధికారికంగా చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలకు సర్వేయర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. రైతుల అవసరార్థం నిత్యం ఏదో ఒక సర్వే కార్యక్రమం ఉంటూనే ఉంటుంది. కానీ సిబ్బంది కొరత తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తోంది. సర్వే శాఖలో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 26 మంది డిప్యూటీ సర్వేయర్లు ఉండాలి. కానీ ఎనిమిది మందే ఉన్నారు. ఇప్పుడు ఏం అవసరం వచ్చినా ఒక మండలం నుంచి మరో మండలానికి సర్వేయర్లు వెళ్లాల్సిందే! ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రైవేటు సర్వేయర్లకు తర్ఫీదు ఇచ్చేవారు కూడా లేరు. ప్రభుత్వానికి సంబంధించి ఏపీఐఐసీ కోసం స్థల సేకరణతోపాటు పలు ప్రైవేటు పరిశ్రమల ఏర్పాటుకు సర్వే చేరుుంచాల్సి ఉందని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు అవసరమైన సర్వేయర్లు మాత్రం జిల్లాలో అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. అసలే లేరంటే... అసలు సిబ్బందే తక్కువంటే.. ఇక్కడి నుంచి డెప్యుటేషన్‌పై సర్వేయర్లను, డిప్యూటీ సర్వేయర్లను పంపిస్తున్నారు. దీంతో మరింత ఇబ్బందులు ఎదురవుతున్నారుు. జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన సర్వే కార్యక్రమాలు అట్టడుగున నిలిచారుు. రాష్ట్రంలోని ఏ జిల్లాలో సర్వే కార్యక్రమం కావాలన్నా జిల్లా సర్వేయర్లు, ముఖ్యమైన అధికారులను పంపిస్తున్నారు. ఇలా సర్వేయర్లు, డిప్యూటీ సర్వేయర్లు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్‌సర్వే వంటి అధికారులను ఇప్పటికే పంపించారు. అది ఇంకా కొనసాగుతోంది. మచిలీపట్నానికి నలుగురు ఉప తహసీల్దార్లు జిల్లాలో పని చేస్తున్న నలుగురు ఉప తహసీల్దార్లను ఇటీవలే మచిలీపట్నంలోని (మాడా) అభివృద్ధి సంస్థకు పంపించారు. మక్కువకు చెందిన పి.మోహనరావు, కురుపాం నీలకంఠరావు, టాస్క్‌ఫోర్స్ సర్వేయర్లు పి.ఖాదర్, రామ్‌కుమార్‌లను పంపించారు. దీంతో ఇక్కడ మరింత ఇబ్బందులు తప్పడం లేదు. ఇనాం సర్వేలు, గ్రామ సర్వేలు పెండింగ్‌లోనే.. ఎన్నాళ్ల నుంచో నలుగుతున్న ఇనాం సర్వేలు, గ్రామాల్లో అస్సలు జరుగని సర్వేలను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్న దశలో ఇలా అధికారులు, సర్వేయర్లు జిల్లా నుంచి వెళ్లిపోతుండటం సమస్యలను తగ్గించేందుకు అవాంతరాలుగా నిలుస్తున్నారుు. అలాగే ఇనాం సర్వేలకు కూడా ఇన్చార్జిలుగా వివిధ ప్రాంతాలనుంచి సర్వేయర్లను నియమించారు. అరుుతే శ్రీకాకుళం వంటి పొరుగు జిల్లాల్లో అదనంగా సర్వేయర్లున్నా.. ఇక్కడ మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడి నుంచి కొంత మంది సర్వేయర్లను ఇక్కడ నియమిస్తే శాఖాపరంగా ఇబ్బందులు తొలగే పరిస్థితి ఉంది. సెలవులో ఎ.డి. జిల్లా సర్వే శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ ఎం.గోపాలరావు అనారోగ్య కారణాలతో దీర్ఘకాలిక సెలవుపై ఇప్పటికీ ఆయన స్థానంలో ఎవరినీ ఇన్చార్జిగా కానీ, ఎఫ్ఏసీగా కానీ నియమించలేదు. అరుుతే ఇక్కడ సీనియర్ అధికారిగా పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే బీఎల్ నారాయణను ఇన్చార్జిగా నియమించే అవకాశం ఉన్నా.. ఇంకా ఉన్నతాధికారులు ఆదేశాలివ్వలేదని తెలుస్తోంది.