సాక్షి, అమరావతి: భూముల రీ సర్వేతో కొత్త చరిత్రను లిఖిస్తున్న ప్రభుత్వం మరో రికార్డు సృష్టించింది. తొలి విడత రీ సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో సరిహద్దు రాళ్లు పాతే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. వ్యవసాయ భూముల సరిహద్దులను చూపుతూ రాళ్లు వేసినప్పుడు మాత్రమే సమగ్ర భూ సర్వే పూర్తయినట్లని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేయటంతో సర్వే శాఖ వేగంగా దాన్ని పూర్తి చేసింది.
గత నెలాఖరుకి 13 లక్షల రాళ్లు పాతిన యంత్రాంగం ఆ తర్వాత 20 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 12.80 లక్షలకుపైగా రాళ్లు పాతి, కొత్త రికార్డు సృష్టించింది. ఈ నెల 20వ తేదీకల్లా 2 వేల గ్రామాల్లో రాళ్లు పాతే పని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నా మూడు రోజుల ముందే ఆ పని పూర్తి చేశారు. ఇందుకోసం సర్వే శాఖ వెయ్యి రోవర్లను సమకూర్చుకొంది. మరికొన్నింటిని అద్దెకు తీసుకొంది. రోజుకు సగటున 40 నుంచి 50 వేల రాళ్లను పాతారు.
2 వేల గ్రామాల్లో అన్ని దశల సర్వే పూర్తి
రాష్ట్రంలోని 17 వేలకుపైగా గ్రామాలకుగాను తొలి విడతగా 2 వేల గ్రామాల్లో రీ సర్వే అన్ని దశలు పూర్తయింది. ఈ గ్రామాలకు కొత్త రెవెన్యూ రికార్డులు (ఆర్‌ఓఆర్) సైతం తయారయ్యాయి. ఆ గ్రామాలకు చెందిన 7.50 లక్షల మంది రైతులకు భూ హక్కు పత్రాలను జారీ చేశారు. చివరిగా రైతుల భూముల సరిహద్దుల్లో సర్వే రాళ్లు పాతడం కూడా పూర్తి చేయడం ద్వారా ఈ 2 వేల గ్రామాలను రీసర్వే మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దారు.
ఖర్చంతా ప్రభుత్వానిదే
సాధారణంగా రైతులు భూమిని సర్వే చేయించుకుని రాళ్లు పాతించడం పెద్ద ప్రయాస. ఖర్చు ఎక్కువ. అయితే, ప్రభుత్వం రైతులపై పైసా కూడా భారం పడకుండా మొత్తం తానే భరించింది. సర్వే పూర్తి చేసి ఉచితంగా రాళ్లు పాతి రైతులకు భూములు అప్పగించింది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా ఇందుకోసం అవసరమైన రాళ్లను కోట్ల ఖర్చుతో తయారు చేయించింది. రాళ్ల తయారీకి ప్రత్యేకంగా యూనిట్లు పెట్టి మరీ అవసరమైన సైజుల్లో రాళ్లను తయారు చేసింది.
25 లక్షలకు పైగా రాళ్లు
సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో మొత్తం 25 లక్షలకు పైగా రాళ్లను పాతారు. మూడు గ్రామాలు కలిసే చోట (ట్రై జంక్షన్) ఏ క్లాస్ పెద్ద రాళ్లు 6,970 పాతారు. ప్రతి భూకమతం హద్దుల్లో బి క్లాస్ చిన్న రాళ్లు 25.73 లక్షలు పాతారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలోని 354 గ్రామాల హద్దుల్లో 4.48 లక్షల రాళ్లు పాతారు.
విజయనగరం జిల్లాలో 179 గ్రామాల్లో 2.48 లక్షలు, పల్నాడు జిల్లాలో 70 గ్రామాల్లో 2.08 లక్షలు, కాకినాడ జిల్లాలో 121 గ్రామాల్లో 1.86 లక్షలు, చిత్తూరు జిల్లాలోని 134 గ్రామాల్లో 1.44 లక్షల రాళ్లు పాతారు. ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా గ్రానైట్, శాండ్ స్టోన్, లైమ్ స్టోన్, నాప రాళ్లను వినియోగించారు. 70 శాతానికిపైగా గ్రానైట్ రాళ్లనే పాతారు.
Comments
Please login to add a commentAdd a comment