Surveyors
-
వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లకు కొత్త జాబ్ చార్ట్
సాక్షి, అమరావతి: వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త జాబ్ చార్ట్ ఇచ్చింది. గ్రామ సచివాలయాల్లో పనిచేసే వీఆర్వోలు, వార్డు సచివాలయాల్లో పనిచేసే వార్డు రెవెన్యూ కార్యదర్శులకు కంబైన్డ్ జాబ్ చార్ట్, గ్రేడ్–1, 2, 3 గ్రామ సర్వేయర్లకు జాబ్ చార్ట్‌లపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ రెండు వేర్వేర్లు ఉత్తర్వులిచ్చారు. వీఆర్వోల జాబ్ చార్ట్.. తుపాన్లు, వరదలు, ప్రమాదాలు లాంటి విపత్తు నిర్వహణ విధులు, ఓటర్ల జాబితా అప్డేషన్, ప్రభుత్వం నిర్దేశించే ఇతర ఎన్నికల విధులు, రెవెన్యూ రికార్డుల మ్యుటేషన్ పనులు, భూముల రీ సర్వే కార్యకలాపాలు, నివాస, నేటివిటీ లాంటి సర్టిఫికెట్ల జారీ విధులను నిర్వర్తించాలని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో రెవెన్యూ శాఖకు సంబంధించిన అన్ని వినతులను పరిశీలించి తీసుకున్న చర్యలపై ఆయా శాఖలకు నివేదికలు పంపడం లాంటి పనుల్ని నిర్దేశించారు. పంటల అజమాయిషీ, సర్వే రాళ్ల తనిఖీ, ప్రభుత్వ భూములు, ఆస్తుల రక్షణ, రోడ్లు, వీధులు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా కాపాడటం, రెవెన్యూ సెస్, పన్నులు వసూలు చేయాలి. హత్యలు, ఆత్మహత్యలు, అసహజ మరణాలు, గ్రామాల్లో శాంతి భద్రతకు విఘాతం కలిగించే అంశాలను తహశీల్దార్‌కు నివేదించడంతోపాటు తహశీల్దార్, కలెక్టర్, సీసీఎల్ఏ, ప్రభుత్వం నిర్దేశించే ఇతర పనుల్ని ఎప్పటికప్పుడు నిర్వర్తించాలని జాబ్ చార్ట్‌లో పేర్కొన్నారు. ఒకే సమయంలో ఎక్కువ పనులు చేయాల్సి వచ్చినప్పుడు ప్రాధాన్యతకు అనుగుణంగా చేపట్టాలని సూచించారు. గ్రామ సర్వేయర్ల జాబ్ చార్ట్ వ్యక్తులు, ప్రభుత్వ సంస్థలతోపాటు అనుమతించిన లేఅవుట్లకు సంబంధించి ఎఫ్‌లైన్ పిటిషన్లు (సరిహద్దు వివాదాలు, హద్దులు–విస్తీర్ణంలో తేడాలు లాంటి వాటిపై అందే దరఖాస్తులు) స్వీకరించి పరిష్కరించాలి. సర్వే సబ్ డివిజన్, సంబంధిత మార్పులు చేసే బాధ్యత వారిదే. గ్రామ కంఠాలు, పూర్తిస్థాయి స్ట్రీట్/టౌన్ సర్వే, కొత్త సబ్ డివిజన్, పాత సబ్ డివిజన్లను కలపడంపై అందే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించి గ్రామ రికార్డుల్లో చేర్చాలి. సచివాలయాల పరిధిలో అందే అన్ని వినతులతోపాటు వివిధ శాఖల అధికారులు రిఫర్ చేసే అంశాలపై నివేదికలు ఇవ్వాలి. మిస్ అయిన, దెబ్బతిన్న, తొలగించిన సర్వే పాయింట్లు, మార్క్‌లు, గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లు సర్వే, సరిహద్దు చట్టం ప్రకారం ముసాయిదా నోటీసు ఇచ్చి రెన్యువల్ చేయాలి. తన పరిధిలోని 10 శాతం సర్వే పాయింట్లు, మార్క్‌లు, గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లను ప్రతి నెలా తనిఖీ చేయాలి. కాంపిటెంట్ అథారిటీ అధికారుల ఆదేశాల ప్రకారం రికార్డుల్లో తప్పులను సరి చేయాలి. పై అధికారులకు సమాచారమిచ్చి అన్ని తనిఖీలకు గ్రామ సర్వేయర్లు హాజరు కావాలి. సర్వే పరికరాలు, ఇతర వస్తువులను సర్వీస్ చేయించి నిర్వహణ చేపట్టాలి.నెలవారీ టూర్ డైరీలు, ప్రోగ్రెస్ స్టేట్మెంట్లు ఇతర నిర్దేశిత సమాచారాన్ని సర్వే సెటిల్మెంట్ కమిషనర్‌కు పంపాలి. సర్వే కార్యకలాపాలను ఈటీఎస్, డీజీపీఎస్, కార్స్ లాంటి అత్యాధునిక సాంకేతిక పరికరాలతోనే నిర్వహించాలి. వీఆర్వోలకు సహకరించాలి. ఈ జాబ్ చార్ట్ ఆధారంగా పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కూడా ఇచ్చారు. -
డ్రోన్ పైలట్లుగా సర్వేయర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న భూముల రీ సర్వే కోసం ప్రభుత్వ సర్వేయర్లే డ్రోన్ పైలట్లుగా మారారు. ఇలా సర్వేయర్లే డ్రోన్లను ఆపరేట్ చేస్తూ భూములను సర్వే చేయడం దేశంలోనే మొదటిసారి. సామర్లకోటలోని సర్వే శిక్షణ అకాడెమీలో ఎంపిక చేసిన సర్వేయర్లకు శిక్షణ ఇస్తున్నారు. రీ సర్వే కోసం ప్రభుత్వం మొదట సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుని డ్రోన్లను ఉపయోగించడం ప్రారంభించింది. కొన్ని ప్రైవేటు డ్రోన్ ఏజెన్సీలతోనూ సర్వే చేయిస్తోంది. మొదట్లో ఆ డ్రోన్లను ఆపరేట్ చేసే సంస్థల పైలట్లకు సర్వేయర్లు కో–పైలట్లుగా పని చేశారు. రీ సర్వేను మరింత వేగంగా నిర్వహించేందుకు ప్రభుత్వమే ఇటీవల సొంతంగా 20 డ్రోన్లు కొనుగోలు చేసింది. ప్రైవేటు డ్రోన్లతోపాటు వీటిని ఉపయోగిస్తోంది. ఈ డ్రోన్లకు పైలట్లుగా ప్రభుత్వ సర్వేయర్లే ఉండాలని సర్వే శాఖ భావించింది. ఇందుకోసం ప్రతి జిల్లా నుంచి ముగ్గురు, నలుగురు సర్వేయర్లను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చారు. డ్రోన్లు విక్రయించిన సంస్థ నిపుణులే సామర్లకోట వచ్చి తొలి విడతగా 94 మందికి వారం రోజులు శిక్షణ ఇచ్చి సరిఫికెట్లు కూడా ఇచ్చారు. డ్రోన్‌ను సర్వేకు సిద్ధం చేయడం (అసెంబ్లింగ్), ఆపరేషన్, సర్వే అయిన తర్వాత డేటాను స్వీకరించడం (క్యాప్చర్ చేయడం), ఆ డేటాను హైదరాబాద్‌లోని సర్వే ఆఫ్ ఇండియాకు పంపించేవరకు మొత్తం బాధ్యత పైలట్లదే. సర్వే శాఖ డ్రోన్లతోనే రోజుకు 2,470 ఎకరాలు సర్వే చేస్తున్నారు. తాజాగా మరో 10 డ్రోన్లను సర్వే శాఖ కొనుగోలు చేసింది. వాటిని ఆపరేట్ చేసేందుకు మరో 20 మంది సర్వేయర్లకు బుధవారం నుంచి సామర్లకోటలో శిక్షణ ప్రారంభమయ్యింది. విడాల్ ఏవియేషన్ సంస్థ నిపుణులు ఈ శిక్షణ ఇస్తున్నారు. సర్వేయర్లు డ్రోన్ ఫ్లై చేయడం గర్వకారణం ప్రభుత్వ సర్వేయర్లు డ్రోన్ల ద్వారా రీ సర్వేలో భూములు కొలవడం గర్వించదగ్గ విషయం. సర్వే శాఖలో 25 సంవత్సరాలుగా పని చేస్తున్నా. చైన్లు, క్రాస్లు పట్టుకుని లాగుతూ సర్వే చేసేవాళ్లం. ఇప్పుడు మా సర్వేయర్లు డ్రోన్ పైలట్లుగా మారి రీ సర్వే చేస్తున్నారు. వారికి అప్పగించిన పనిని సమర్ధంగా చేస్తున్నారు. – డీఎల్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్, సర్వే సెటిల్మెంట్, భూమి రికార్డుల శాఖ -
సమగ్ర భూ సర్వేలో 'సచివాలయ' సర్వేయర్లు
సాక్షి, అమరావతి: సమగ్ర భూ సర్వేలో గ్రామ, వార్డు సచివాలయాల సర్వేయర్లు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లోని కమ్యూనిటీ సర్వేయర్లను ఉపయోగించుకోవాలని మంత్రివర్గం ఉపసంఘం అధికారులకు సూచించింది. ఈ మేరకు వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం అమలు కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా సర్వేలో భాగంగా ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని మొత్తం ప్రక్రియ పూర్తి అవ్వడానికి ఎంత సమయం పడుతుందో అధ్యయనం చేయాలని సూచించింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సర్వే రాళ్లకు సంబంధించి గుంతలు తవ్వడం తదితర పనులను వేగంగా ముందుకు తీసుకువెళ్లాలని ఆదేశించింది. గ్రామకంఠం సమస్యపై ప్రభుత్వం ఇప్పటికే సానుకూలంగా ఉందని తెలిపింది. ఎక్కడా పొరపాట్లు లేకుండా యాజమాన్య హక్కు సర్టిఫికెట్లను అందించే ప్రక్రియను చేపట్టాలని సూచించింది. భూరికార్డులను ఆధునికీకరించే ప్రక్రియను ఎటువంటి జాప్యం లేకుండా సకాలంలో పూర్తి చేయాలని కోరింది. ఇందుకు అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకోవాలని పేర్కొంది. కాగా, ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా వంద గ్రామాల్లో గ్రామకంఠం పరిధిలో అర్హులైన వారికి భూయాజమాన్య హక్కు కార్డులను జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. అక్టోబర్ 2 నాటికి వెయ్యి గ్రామాల్లో పంపిణీకి సన్నాహాలు చేస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రాంతాల్లో తాడేపల్లిగూడెంలో పైలట్ ప్రాజెక్ట్‌గా సర్వే ప్రక్రియను నిర్వహిస్తున్నామని చెప్పారు. 762 గ్రామాలకు విలేజ్ మ్యాప్‌లు సిద్ధంగా ఉన్నాయన్నారు. సకాలంలో సర్వేను పూర్తి చేయాలంటే కనీసం 51 డ్రోన్లు అవసరమవుతాయన్నారు. దీనిపై మంత్రులు స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డ్రోన్ కార్పొరేషన్ ద్వారా డ్రోన్లను సమకూర్చుకునే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, కృష్ణదాస్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీసీఎల్ఏ నీరబ్‌కుమార్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
మా భూములు సర్వే చేయండి..
సాక్షి, ఖమ్మం: జిల్లాలో 21 మండలాలు ఉండగా.. 21 మంది సర్వేయర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు ప్రభుత్వానికి సంబంధించిన భూముల సర్వేతోపాటు ఎవరైనా రైతులు తమ భూములను సర్వే చేయాలని దరఖాస్తు చేసుకుంటే.. ఆయా భూములను సర్వే చేసి సరిహద్దులు నిర్ధారించాల్సి ఉంటుంది. అయితే రైతులు తమ భూముల సర్వే కోసం తొలుత మీసేవలో దరఖాస్తు చేసుకుంటారు. ఇవన్నీ తహసీల్దార్ కార్యాలయాలకు చేరుకుంటాయి. వాటిని పరిశీలించిన అధికారులు తొలుత వచ్చిన దరఖాస్తును తొలుత పరిష్కరించేందుకు ఆ పనిని సర్వేయర్లకు అప్పగిస్తారు. తమ వద్దకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం సర్వేయర్లు క్షేత్రస్థాయిలో రైతుల భూములను కొలిచి.. సరిహద్దులు నిర్ధారించాల్సి ఉంటుంది. జిల్లాలో ఆరు నెలల కాలంలో తమ భూములను సర్వే చేయాలని కోరుతూ 3,319 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 323 దరఖాస్తులను తిరస్కరించారు. అయితే సర్వేయర్లు సుమారు 15వేల ఎకరాల వరకు భూమిని కొలవాల్సి ఉండగా.. 6వేల ఎకరాల వరకే కొలిచినట్లు తెలుస్తోంది. దరఖాస్తు చేసుకున్న రైతులు మాత్రం తమ భూములు సర్వే చేయాలంటూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రభుత్వ పనులతో.. మండలానికి ఒక సర్వేయర్ ఉండడంతో వారిని అధికారులు ప్రభుత్వ పనుల కోసం వినియోగిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతుండడంతో ఆయా పనులకు సంబంధించి భూముల సర్వే చేపట్టాల్సి వస్తోంది. దీంతో నెలలో ఎక్కువ భాగం ప్రభుత్వ భూములు సర్వే చేయడంతోనే సరిపోతుందని పలువురు సర్వేయర్లు పేర్కొంటున్నారు. గతంలో ఎస్సారెస్పీ, నేషనల్ హైవే పనులు సాగాయి. దీంతో అధిక శాతం మంది సర్వేయర్లు ఇందుకు సంబంధించిన భూముల సర్వేలోనే నిమగ్నం కావాల్సి వచ్చింది. ప్రస్తుతం గ్రామాల్లో డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఎక్కడైనా ప్రభుత్వ స్థలాన్ని గుర్తించినా.. లేదంటే ఎవరైనా దాతలు ముందుకొచ్చి స్థలం దానం చేసినా.. ఆ స్థలాన్ని సర్వేయర్లు కొలిచి.. ఎంత స్థలం అవసరం అవుతుందనే వివరాలను అంచనా వేసి ఇవ్వాల్సి ఉంటుంది. గ్రామాల్లో ప్రస్తుతం ఈ పనులు ముమ్మరంగా సాగుతుండడంతో సర్వేయర్లు ఈ పనుల్లోనే బిజీగా ఉన్నారు. రైతుల ఎదురుచూపులు.. సర్వేయర్లు వివిధ పనులతో బిజీగా ఉండడంతో రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. మీసేవలో దరఖాస్తు చేసుకున్న రైతులు.. ఎంతకూ సర్వేయర్లు స్పందించడం లేదని గ్రీవెన్స్‌లో వినతిపత్రాలు అందిస్తున్నారు. నెలలు గడుస్తున్నా.. తమ భూములను సర్వే చేయడం లేదని వాపోతున్నారు. పహాణీలో భూమి తప్పుగా నమోదు కావడం.. ఇద్దరు రైతుల మధ్య సరిహద్దు పంచాయితీ, భూమి ఆక్రమణకు గురికావడం తదితర సమస్యలతో రైతులు తమ భూములు సర్వే చేయాలని దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే నెలలతరబడి సర్వేకు నోచుకోకపోవడం.. సమస్య పరిష్కారం కాకపోవడంతో గ్రామాల్లో ఘర్షణలు కూడా చోటు చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే రైతులు మాత్రం సర్వేయర్లు తమ దరఖాస్తులను పట్టించుకోవడం లేదని, వారికి ఇష్టం వచ్చిన వారికైతే వెంటనే సర్వే చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. భూమి చూపించండి.. మా భూమిని సర్వే చేసి.. అప్పగించాలని ఆరు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నాం. అధికారులు ఇప్పటివరకు మా భూమిని కొలత వేయలేదు. తరతరాలుగా వస్తున్న మా భూమికి సరైన హద్దులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఉన్నతాధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి. – గుడవర్తి వెంకటేశ్వర్లు, కొత్త లింగాల, కామేపల్లి మండలం ఫిర్యాదులు పరిష్కరిస్తున్నాం.. రైతులు వివిధ సమస్యల నిమిత్తం భూముల సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో మా సిబ్బంది వీలైనంత వరకు సమస్యలు పరిష్కరిస్తున్నారు. వివిధ ప్రభుత్వ పనులు కొనసాగుతుండడంతో క్షేత్రస్థాయిలో ఆ పనుల్లో సర్వేయర్లు నిమగ్నమయ్యారు. దీంతో జాప్యం జరిగితే పెండింగ్ దరఖాస్తులపై దృష్టి సారించి.. త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. – సీహెచ్.శ్రీనివాసులు, ఏడీ ఎఫ్ఏసీ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ -
‘సర్వే’ ఎదురు చూపులకు చెక్
సాక్షి, అమరావతి: భూముల కొలతలు, సరిహద్దుల నిర్ధారణ, భాగ పరిష్కారం (సబ్ డివిజన్), స్థలాల కొలతల కోసం ఇక నెలల తరబడి ఎదురుచూడాల్సిన పనిలేదు. సర్వేయర్ల కోసం మండల రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం అంతకన్నా ఉండదు. ముడుపుల మాటే లేదు. ఇప్పటి వరకూ సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ సమస్యలు అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సర్వేయర్లు, డిప్యూటీ సర్వేయర్లు కలిపి మొత్తం 942 మంది ఉన్నారు. పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలతో పోల్చితే మన రాష్ట్రంలోనే సర్వేయర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక విస్తీర్ణం ప్రకారం కనీసం 4,000 నుంచి 5,000 వేల మంది సర్వేయర్లు అవసరమని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ గతంలో శాస్త్రీయ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. గత ప్రభుత్వాలు ఈ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోలేదు. దీనివల్ల క్రమేణా భూసంబంధమైన సమస్యలు పెరిగిపోయాయి. దేశ చరిత్రలోనే లేని విధంగా... స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే లేనివిధంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు గ్రామ సచివాలయాల ద్వారా ఏకకాలంలో 11,158 సర్వేయర్ పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం మండలానికి ఒక్క సర్వేయరు మాత్రమే ఉండగా ఈ పోస్టుల భర్తీతో ప్రతి గ్రామ సచివాలయంలో ఒక సర్వేయర్ ఉండనున్నారు. 2,000 మంది జనాభా ఉన్న గ్రామ సచివాలయంలో కూడా ఒక సర్వేయర్ అందుబాటులో ఉంటారు. దీంతో గ్రామంలో కొలతల కోసం ఎవరు అర్జీ పెట్టుకున్నా అక్కడున్న సర్వేయర్ వెంటనే కొలతలు వేసి సబ్‌డివిజన్ చేస్తారు. సర్వేయర్లను నియమించగానే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సులభమార్గంలో సర్వే చేసే విధానంపై శిక్షణ కూడా ఇస్తారు. గ్రేడ్ –3 సర్వేయర్లుగా నియామకం మొదట 11,158 మందిని జిల్లా ఎంపిక కమిటీ ద్వారా గ్రేడ్ –3 సర్వేయర్లుగా నియమిస్తారు. తర్వాత వారికి నిబంధనల మేరకు గ్రేడ్–2 సర్వేయర్లుగా పదోన్నతి కల్పిస్తారు. గ్రేడ్ –2 సర్వేయర్లను పెద్ద గ్రామపంచాయతీల్లో నియమిస్తారు. గ్రేడ్–2 సర్వేయర్లను తదుపరి గ్రేడ్ –1కు ప్రమోట్ చేసి పట్టణాల్లో నియమిస్తారు. వీరందరినీ భూముల రీసర్వేకి ప్రభుత్వం వినియోగించుకుంటుంది. భూముల రీసర్వే, సర్వే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం కోసం ప్రభుత్వం భారీ సంఖ్యలో సర్వేయర్లను నియమిస్తోంది. -
కబ్జాదారుల ఆటకట్టేనా?
కోరుట్ల : సర్కారు స్థలాలకు రక్షణ కరువైంది మహా ప్రభో.. అంటూ వందలాది ఫిర్యాదులు అంది నా ఇన్నాళ్లు స్పందించని రెవెన్యూ అధికారులు ఒక్కసారిగా జూలు విదిల్చారు. ప్రభుత్వ స్థలాలను కాపాడటానికి స్పెషల్‌డ్రైవ్ చేపట్టారు. ఈ వ్యవహారం చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందాన్ని తలపిస్తోంది. ఇప్పటికే పట్టణంలో చాలాచోట్ల సర్కారు స్థలాలు కబ్జాదారుల కబంధహస్తాల్లోకి చేరిపోయాయి. ఈ ఆక్రమణలకు తెరదించి ప్రభుత్వ స్థలాలను కాపాడితే మున్ముందు ప్రజావసరాల కోసం వాడుకునేందుకు వినియోగించుకోవచ్చన్న స్పృహాప్రజాప్రతినిధులతోపాటు అధికార యం త్రాంగానికి రావడం ఆశించదగ్గ పరిణామం. జిల్లాలో రెండో స్థానం ప్రభుత్వ స్థలాలు అధికంగా ఉన్న మండలాల్లో కరీంనగర్ మినహాయిస్తే.. తిమ్మాపూర్ తర్వాత కోరుట్ల రెండోస్థానంలో ఉంది. పట్టణ పరిసరాల్లో పరంపోగు, కారీజుఖాతా, బంచరాయి కింద సుమారు 153 సర్వే నంబర్లలో దాదాపు 1,044 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ప్రస్తుతం ఈ స్థలాల్లో సుమారు 690 ఎకరాలు వివిధ సామాజిక అవసరాలతో పాటు వ్యక్తిగత అవసరాల కోసం అసైన్ చేసినట్లుగా రెవెన్యూ రికార్డులు చెబుతున్నా..వీటిలో చాలామేర ఆక్రమణకు గురయ్యాయి. మరో 350 ఎకరాల ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నాయి. కోరుట్లలో భూములకు డిమాండ్ పెరగడంతో కొందరు రియల్ వ్యాపారులు ఈ స్థలాలపైనా కన్నేశారు. ఇప్పటికే 1553, 1215,1497, 454, 478, 923 సర్వే నంబర్లతో పాటు కోరుట్ల వాగు కింది స్థలాల్లో చాలాచోట్ల ఆక్రమణలకు గురువుతున్నాయి. రానున్న కాలంలో ఇదేతీరు కొనసాగితే.. డివిజన్ కేంద్రంగా మారే అవకాశాలు పుష్కలంగా కోరుట్లలో ప్రభుత్వ స్థలాల కోసం దేవులాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీటిని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, కలెక్టర్, జగిత్యాల సబ్ కలెక్టర్ లతో మాట్లాడి ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు స్పెషల్‌డ్రైవ్‌కు శ్రీకారం చుట్టారు. సర్వేకు ఇతర మండలాల అధికారులు ప్రభుత్వ స్థలాల సర్వేకు స్థానిక అధికారులు ఉపక్రమిస్తే నేతల నుంచి ఒత్తిళ్లు వచ్చే అవకాశాలు ఉండటంతో ఇతర మండలాలకు చెందిన రెవెన్యూ అధికారులతో సర్వేకు శ్రీకారం చుట్టారు. ఈ సర్వే బృందం జగిత్యాల సబ్ కలెక్టర్ పర్యవేక్షణలో కోరుట్ల తహశీల్దార్ అధ్వర్యంలో కొనసాగుతోంది. సర్వే కోసం ప్రత్యేకంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన నలుగురు సర్వేయర్లను నియమించనున్నారు. సర్వేయర్లు ప్రభుత్వ స్థలాలను సర్వే చేసి గుర్తించిన అనంతరం వాటికి హద్దులను నిర్ణయించి అక్రమణలను నిరోధిస్తారు. అవసరమైతే కొన్ని స్థలాలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్న యోచనలో రెవెన్యూ అధికారులు ఉన్నారు. ఆక్రమణలకు గురైన చోట కబ్జాదారులను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. ఈ స్పెషల్‌డ్రైవ్ విషయంలో నేతలు.. అధికారులు తరతమ భేదాలు మాని పారదర్శకంగా వ్యవహారిస్తే ఎంతో మేలు జరుగుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.