
వారిపై నాలుగు శాఖల పెత్తనం
రీ సర్వేతో పాటు అదనపు పనులూ అప్పగింత
అవసరమైన పరికరాలు ఇవ్వకుండానే పని చేయాలంటూ ఒత్తిడి
సుదీర్ఘకాలం నుంచి వస్తున్న తప్పులకూ వారిదే బాధ్యత
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంలో భూముల రీ సర్వేలో కీలకపాత్ర పోషించిన గ్రామ సర్వేయర్లు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తీవ్ర అగచాట్లు పడుతున్నారు. వారు చేయాల్సినవే కాకుండా అదనపు పనులు అప్పగిస్తూ ఇబ్బందులు పెడుతుండడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మల్టిపుల్ పనులు చేసే జాబితాలో పెట్టడంతో గ్రామ సర్వేయర్లపై గ్రామ, వార్డు సచివాలయాల శాఖ, రెవెన్యూ, పంచాయతీరాజ్, సర్వే సెటిల్‌మెంట్ ల్యాండ్ రికార్డుల శాఖలు పెత్తనం చేస్తున్నాయి.
సర్వేయర్లపై సచివాలయ కార్యదర్శి, తహశీల్దార్, ఎంపీడీవో, మండల సర్వేయర్.. బాస్‌లుగా ఉన్నారు. ఈ నాలుగు శాఖల బాస్‌లు ఒకే సమయంలో వివిధ రకాల పనులను అప్పగిస్తున్నారు. ఏ పని చేయకపోయినా షోకాజ్ నోటీసులు, మెమోలతో హడలెత్తిస్తున్నారు. వాస్తవానికి సర్వేయర్లకు మాతృ శాఖ సర్వే సెటిల్‌మెంట్, ల్యాండ్ రికార్డుల శాఖ. వారి ప్రధాన పని భూముల రీ సర్వే చేయడమే. కానీ ఇప్పుడు ఆ పనితో పాటు పీ–4, హౌస్ హోల్డ్ తదితర సర్వేలు కూడా చేయిస్తున్నారు.
ఒకే సమయంలో అన్ని పనులూ చేయాలని ఒత్తిడి చేస్తుండడంతో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సర్వేయర్లు పనిచేయక తప్పడం లేదు. వారికి సంబంధించిన రీ సర్వే పని చేసినా.. ఆ తర్వాత రెవెన్యూ శాఖ చేయాల్సిన యాజమాన్య హక్కుల నిర్ధారణ (టైటిల్ కన్‌ఫర్మేషన్) పని కూడా వీరిపైనే పడుతోంది. రెవెన్యూ సిబ్బంది సహకరించకపోవడంతో పాత రికార్డుల్లో ఉన్న వివరాలతోనే 1బీ, అడంగల్ రికార్డులు సిద్ధమవుతున్నాయి. దీంతో ఆ తప్పులన్నింటికీ సర్వేయర్లనే బాధ్యులుగా చేసి షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు.
అలాగే అనేక ఏళ్ల నుంచి రెవెన్యూ రికార్డుల్లో ఉన్న తప్పులకు కూడా గ్రామ సర్వేయర్లనే బాధ్యులుగా చేస్తుండడంతో వారు లబోదిబోమంటున్నారు. ల్యాప్‌టాప్, ఇతరత్రా పరికరాలు ఇవ్వకుండానే పనులు చేయాలంటూ ఒత్తిడి చేస్తుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా.. ఉదయం సంబంధిత సచివాలయానికి వచ్చి బయోమెట్రిక్ హాజరు కచ్చితంగా వేయాలంటూనే.. మరోవైపు ఇతర ప్రాంతాల్లో పనులు అప్పగిస్తున్నారు. దీంతో వారి పరిస్థితి దయనీయంగా మారిపోయింది.
ఇన్ని పనులు చేసినా పదోన్నతుల చానల్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని పలువురు గ్రామ సర్వేయర్లు వాపోతున్నారు. మరోవైపు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్దికరణలో 4,700 మందికి పైగా గ్రామ సర్వేయర్లను మిగులు సిబ్బందిగా చూపించారు. వారికి ఇతర శాఖల్లో బదిలీలకు ఆప్షన్ ఉన్నా.. అది కూడా అమలు చేయడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment