సాక్షి, అమరావతి: భూముల రీ సర్వే ప్రక్రియ తర్వాత భూ యజమానులకు జారీచేసే భూ హక్కు పత్రాల్లో ఎలాంటి తప్పుల్లేకుండా చూసేందుకు రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. తొలిదశలో సర్వే పూర్తయిన రెండువేల గ్రామాల్లో జారీచేస్తున్న పత్రాల్లో కొన్నిచోట్ల క్లరికల్ తప్పులు దొర్లడంతో వాటిని సరిచేసేందుకు వెబ్‌ల్యాండ్‌లో కొత్తగా నాలుగు ఆప్షన్లు ఇచ్చారు.
పట్టాదారు మృతిచెందడం, ల్యాండ్ పార్సిల్ నంబర్ సంబంధిత ఖాతాకు సరిపోకపోవడం, పాత సర్వే నెంబరు తప్పుపడడం, ఆర్‌ఓఆర్, షేప్ ఫైల్‌లో విస్తీర్ణం సరిపోకపోవడం వంటి వాటి కారణంగా తప్పుగా నమోదైనట్లు తహసీల్దార్లు గుర్తించారు. దీంతో ఈ నాలుగు ఆప్షన్లు ప్రత్యేకంగా ఇచ్చి క్లరికల్ తప్పులను సరిదిద్దే అవకాశం కలి్పంచారు. ఈ తప్పులన్నీ సరిదిద్దిన తర్వాతే ఆయా గ్రామాల్లో తుది ఆర్‌ఓఆర్‌ను అప్‌డేట్ చేయాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ రెవెన్యూ యంత్రాంగానికి నిర్దేశించారు.
ఏ జిల్లాల్లో ఎన్ని తప్పులు వచ్చాయి?ఎన్ని సరిదిద్దారనే అంశాలను కూడా కమిషనర్ సమీక్షించి ఆర్‌ఓఆర్ పక్కాగా రూపొందేలా చర్యలు తీసుకుంటున్నారు. తుది ఆర్‌ఓఆర్‌ను ఖరారుచేయడానికి ముందు పట్టాదారుల వ్యక్తిగత సమాచారం, ఫొటో వంటి వివరాలన్నీ మరోసారి పరిశీలించాలని తహసీల్దార్లకు ఆదేశాలిచ్చారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత తుది ఆర్‌ఓఆర్ రూపొందించి భూ హక్కు పత్రాలు జారీచేయాలని స్పష్టంచేశారు. భూహక్కు పత్రాలను ఈనెల మొదటి వారంలోనే జారీచేయాలని నిర్దేశించారు.
Comments
Please login to add a commentAdd a comment