సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే ముమ్మరంగా జరుగుతోంది. కీలకమైన డ్రోన్ సర్వే, ఆ తర్వాత దశల్లో జరిగే క్షేత్రస్థాయి నిజ నిర్ధారణ, గ్రౌండ్ వాలిడేషన్ వంటి పనులన్నీ చకచకా ముందుకు సాగుతున్నాయి. డ్రోన్ సర్వేను 7,744 గ్రామాల్లో పూర్తిచేశారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 766 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తికాగా, శ్రీకాకుళం జిల్లాలో 758 గ్రామాలు, విజయనగరం జిల్లాలో 737, తిరుపతి జిల్లాలో 726, అనకాపల్లి జిల్లాలో 604 గ్రామాల్లో ఈ సర్వేను పూర్తిచేశారు.
అతి తక్కువగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో కేవలం రెండు గ్రామాల్లో మాత్రమే డ్రోన్ సర్వే పూర్తయింది. ఆ జిల్లా అంతా కొండ ప్రాంతాలతో నిండి ఉండడంతో సర్వే సాధ్యం కావడంలేదు. దీంతో అక్కడ డీజీపీఎస్ సర్వే నిర్వహిస్తున్నారు. నంద్యాల, తూర్పు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, కర్నూలు జిల్లాల్లోనూ డ్రోన్ సర్వే ఆశించిన స్థాయిలో జరగడంలేదని గుర్తించారు. దీంతో ఏరియల్ సర్వే ద్వారా ఈ ప్రాంతాల్లో వేగంగా సర్వే చేపడుతున్నారు.
47 లక్షల ఎకరాలకు ఓఆర్‌ఐల జారీ
డ్రోన్ సర్వే నిర్వహిస్తేనే మిగిలిన దశల సర్వే పూర్తిచేయడానికి అవకాశం ఏర్పడుతుంది. డ్రోన్ కెమెరాల ద్వారా తీసిన ఫొటోలను అభివృద్ధి చేసి ఓఆర్‌ఐ (ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్)లు జారీచేస్తారు. వాటిని బట్టి క్షేత్రస్థాయిలో సర్వే బృందాలు నిజ నిర్ధారణ, రైతుల సమక్షంలో గ్రౌండ్ వాలిడేషన్ చేపడతాయి.
ఇప్పటివరకు 47,33,454 ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి 4,006 గ్రామాలకు ఓఆర్‌ఐలు జారీ అయ్యాయి. అవి సర్వే బృందాలకు చేరడంతో వాటిని బట్టి 2,790 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ (క్షేత్రస్థాయి నిజ నిర్ధారణ)ను పూర్తిచేశారు. ఈ గ్రామాల్లోని భూముల విస్తీర్ణం 32,40,618 ఎకరాలు కాగా.. ఈ ప్రాంతం మొత్తం గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తయింది.
18,717 వినతులకు పరిష్కారం
ఇక చివరిగా.. రైతుల సమక్షంలో చేసే గ్రౌండ్ వాలిడేషన్‌ను 2,325 గ్రామాల్లో పూర్తిచేశారు. ఈ గ్రామాలకు సంబంధించి ఇప్పటివరకు 18,855 వినతులు, అభ్యంతరాలు రాగా వాటిలో 18,717 వినతుల్ని మొబైల్ మెజిస్ట్రేట్ బృందాలు పరిష్కరించాయి. ఇన్ని దశల తర్వాత చివరిగా రీ సర్వే పూర్తయినట్లు ప్రకటించే నెంబర్–13 నోటిఫికేషన్లను 2,119 గ్రామాల్లో పబ్లిష్ చేశారు.
ఆ గ్రామాల్లోని రెండువేల గ్రామాలకు సంబంధించి భూహక్కు పత్రాల జారీ ప్రక్రియ నడుస్తోంది. వచ్చే రెండు నెలల్లో మరో రెండువేల గ్రామాల్లో అన్ని దశల సర్వేను పూర్తిచేసి భూహక్కు పత్రాల జారీకి రెవెన్యూ శాఖ వడివడిగా అడుగులు వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment