CM YS Jagan Speech At Avanigadda Public Meeting - Sakshi
Sakshi News home page

రీ సర్వేతో భూ సమస్యలు పరిష్కారం: సీఎం జగన్‌

Published Thu, Oct 20 2022 12:32 PM | Last Updated on Fri, Oct 21 2022 8:31 AM

CM YS Jagan Speech At Avanigadda Public Meeting - Sakshi

సాక్షి, అవనిగడ్డ: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా, భూములకు సంబంధించి పక్కాగా సరిహద్దులు, కచ్చితమైన రికార్డులు లేకపోవడం వల్ల రైతులు ఎటువంటి కష్టాలు పడుతున్నారో మనందరికీ తెలుసని, ఇవాళ ఆ సమస్యలన్నింటినీ రీ సర్వే ద్వారా పరిష్కరిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. భూ యాజమాన్య హక్కుల విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల ఎంతో మంది ఇన్నాళ్లూ ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరుగుతూ ధర్నాలు, నిరాహార దీక్షలు సైతం చేస్తున్నప్పటికీ సమస్యలు కొలిక్కి రాలేదన్నారు. ఈ సమస్యపై గత పాలకులెవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మనందరి ప్రభుత్వం.. ఈ సమస్యపై దృష్టి సారించి.. పరిష్కార మార్గం చూపుతోందని స్పష్టం చేశారు. గురువారం ఆయన 22ఏ–1 నిషేధిత భూముల సమస్యకు పరిష్కారం చూపుతూ, కృష్ణా జిల్లా అవనిగడ్డలో రైతులకు భూ హక్కు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వంద సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో భూముల రీ సర్వే చేపట్టి ఒక మహాయజ్ఞంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 15 వేల మంది సర్వేయర్లను నియమించామని,   
కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక పరికరాలు కొనుగోలు చేశామని స్పష్టం చేశారు. ఆధునిక టెక్నాలజీ.. కోర్స్‌(కంటిన్యూస్‌ ఆపరేటింగ్‌ రిఫరెన్స్‌ సిస్టం) బేస్‌ సిస్టంను తీసుకొచ్చి.. విమానాలను, హెలికాప్టర్‌లను సైతం ఉపయోగిస్తున్నామని.. డ్రోన్లను, రోవర్లను కొనుగోలు చేసి వాటినీ వినియోగిస్తున్నామని తెలిపారు. ఈ సభలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

ఒక యజ్ఞంలా రీ సర్వే 
సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన పరికరాలను కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి కొనుగోలు చేసి, ఉపయోగిస్తున్నాం. వంద సంవత్సరాలకు పూర్వం జరిగిన సర్వేకు మళ్లీ రీ సర్వే చేయించి, హద్దులను మళ్లీ పూర్తిగా మార్కు చేసి, రికార్డులు అన్నింటినీ పూర్తిగా అప్‌డేట్‌ చేయిస్తున్నాం. సబ్‌డివిజన్‌లు, మ్యుటేషన్స్‌ అన్నీ పక్కాగా చేపట్టి, ఇటువంటి సమస్యలున్న చోట అంటే షరతులు గల పట్టాలు, చుక్కల భూములు, అనాధీనం భూములు ఇటువంటి నిషేధిత జాబితాలో ఉన్న అనేక భూములకు ఒక పరిష్కారం చూపాలని అడుగులు ముందుకు వేస్తున్నాం. 

ఈ కార్యక్రమాన్ని దీక్షగా, ఒక యజ్ఞంలా చేస్తున్నాం. గ్రామాలతో పాటు పట్టణాలలో కూడా రీసర్వే చేసి భూములు, స్థిరాస్తుల యజమానులకు స్పష్టంగా సరిహద్దులు చూపడంతోపాటు, ఈ మహాయజ్ఞంలో భాగంగా హక్కు పత్రాలను కూడా ఇవ్వబోతున్నాం.  

నవంబర్‌లో 1,500 గ్రామాలలో.. 
17 వేల పై చిలుకు గ్రామాలకు గాను, నవంబరు నెలలో 1,500 గ్రామాలలో సర్వే పూర్తి చేసి, హద్దులు రీ మార్క్‌ చేసి, అక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించి అందరికీ భూ హక్కు పత్రాలు ఇచ్చే కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ఇవన్నీ పూర్తి చేసి, ఆయా గ్రామాల్లోనే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఉండేటట్టుగా అడుగులు వేస్తున్నాం.  

మన గ్రామంలో సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసు ఉంటే మన భూములు వేరే వాళ్ల పేరు మీదకు మార్చి, తిక్క తిక్క చేష్టలు చేస్తే వెంటనే మనకు తెలిసిపోతుంది. అటువంటి వాటిని మనం వెంటనే అడ్డుకోగలుగుతాం. అందువల్ల ఈ కార్యక్రమాన్ని ఒక గొప్ప యజ్ఞంగా భావించాం. నవంబరు నుంచి 1500 గ్రామాలతో మొదలు పెట్టి.. ప్రతి నెలా కొన్ని వందల గ్రామాలను యాడ్‌ చేసుకుంటూ వెళతాం. వచ్చే ఏడాది (2023) చివరి నాటికి మొత్తం 17 వేల పై చిలుకు గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. 

ఈ దిశలో మరో అడుగే ఈ రోజు మనం తీసుకుంటున్న నిర్ణయం. షరతులుగల పట్టా పేరుతో నిషేధిత జాబితాలో అంటే 22ఏ–1 లో ఉన్న భూముల సమస్యలను పరిష్కరిస్తూ.. రైతులకు క్లియరెన్స్‌ పత్రాలను జారీ చేస్తున్నాం. 

రైతు మనసు తెలిసిన ప్రభుత్వమిది  
ఇవాళ మన ప్రభుత్వంలో జరిగిన మంచి ఏంటి? గత ప్రభుత్వ హయాంలో జరిగిన చెడు ఏంటి? అన్నది ఆలోచించాలి. గిరిజనులకు ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చింది గతంలో దివంగత నేత వైఎస్సార్‌ అయితే, ఇవాళ మీ జగనన్న ప్రభుత్వం. అసైన్డ్‌ గాని, ఆర్వోఎఫ్‌ఆర్‌ కానీ, ఆలయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా రైతు భరోసా ఇస్తున్నది మన అందరి ప్రభుత్వం. అసైన్డ్‌ భూముల విషయంలో గత ప్రభుత్వం వంచిస్తే.. ఈరోజు మంచి చేసింది మన ప్రభుత్వం. 

గత ప్రభుత్వం రైతుల భూములను ఎలా దోచుకోవాలని ఆలోచిస్తే, అవి రైతులకు ఎలా ఇవ్వాలని  ఆరాటపడుతూ, ఆలోచన చేస్తున్నది మన ప్రభుత్వం. మన ప్రభుత్వం రైతు మనసు తెలిసిన ప్రభుత్వం. పేదవాడి బాగోగులు మనసులో పెట్టుకుని అడుగులు వేస్తున్న ప్రభుత్వం. ప్రతి ఇంటికీ సంక్షేమం, అభివృద్ధి ఫలాలను వివక్ష లేకుండా, అవినీతి లేకుండా అందిస్తున్న ప్రభుత్వం మనది. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను ఖురాన్‌గా, బైబిల్‌గా, భగవద్గీతగా భావించి 98 శాతం హామీలను 3 ఏళ్ల 4 నెలల కాలంలోనే నెరవేర్చిన ప్రభుత్వం మనది.  

22 వేల మంది రైతులకు హక్కు పత్రాలు... 

ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 355 గ్రామాలలో 22ఏ–1 నిషేధిత జాబితాలో ఉన్న 18,889 సర్వే నంబర్లకు సంబంధించి మొత్తం 35,669 ఎకరాల భూముల సమస్యకు పరిష్కారం చూపినట్టవుతుంది. దీనివల్ల ఆయా భూముల్లో సాగు చేసుకుంటున్న 22,042 మంది రైతులకు, వారి భూమి మీద వారికి హక్కు కల్పించే కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నాం.  
వేలాది మంది రైతులకు ఇబ్బందిగా మారిన ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా ఇవాళ అడుగులు పడుతున్నాయి. ఇలాంటి వారంతా ఇక రెవెన్యూ ఆఫీసులు, కోర్టుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. 22ఏ–1 కింద నిషేధిత భూముల జాబితాలో ఉన్న ఈ భూముల సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం చూపిస్తూ.. వాటిని డీనోటిఫై చేసేలా ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. 
ఈ నిర్ణయం వల్ల ఒక్క అవనిగడ్డ నియోజకవర్గంలో మాత్రమే 10,119 మంది రైతన్నలకు 15,791 ఎకరాలకు సంబంధించి ప్రయోజనం కలుగుతోంది. వీరందిరకీ యాజమాన్య హక్కులు అందుతాయి. ఇకపై ఆ రైతులు వాళ్ల భూములు అమ్ముకోవచ్చు. మరొకరు కొనుక్కోవచ్చు. లేదా ఆ రైతన్నలు ఆ భూములను వాళ్ల పిల్లలకు బహుమతిగా కూడా ఇవ్వవచ్చు. వారికి పక్కాగా హక్కు పత్రాలను కూడా ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది.  

గత ప్రభుత్వ నిర్వాకం.. 
దేశంలో భూముల అమ్మకాలు, కొనుగోలు ప్రక్రియ అంతా 1908 రిజిస్ట్రేషన్‌ చట్టం ప్రకారమే జరుగుతుంది. నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం హయాంలో 1930 వరకు షరతుగల భూముల పట్టాల పేరుతో వివిధ వర్గాలకు భూ కేటాయింపులు జరిగాయి. వాటిని రకరకాల కేటగిరీ భూములు.. మెట్ట, తరి, సాగులో ఉన్న మెట్ట భూములు, డొంక, వంక, వాగు, గ్రామ కంఠం, ప్రభుత్వ భూములు.. ఇలా అనేక రకాల కేటగిరీల్లో 1932 నుంచి 1934 మధ్యలో రికార్డులన్నీ రీసెటిల్‌మెంట్‌ బుక్స్‌లో చేర్చారు. పట్టా దారుల భూముల వివరాలను, సర్వే నంబర్లను ఈ పుస్తకాల్లో నమోదు చేశారు. అటువంటి భూములను 1932–34 నుంచి రైతన్నలు వారి తరాలు, వారి పిల్లల తరాలు, తర్వాత వారి మనవళ్ల తరాలు అనుభవిస్తున్నారు. 2016 వరకు రిజిస్ట్రేషన్, టైటిల్‌ డీడ్స్‌ ఇలా ఈ భూములకు సంబంధించిన అన్ని లావాదేవీలు కొనసాగాయి. పట్టాదారు పాస్‌పుస్తకం ఇవ్వడం వల్ల వారికి పంట రుణాలతో పాటు ఇతర రుణాలు కూడా అందేవి. కానీ 2016 మే నెలలో గత ప్రభుత్వం జిల్లాల వారీగా ఈ భూములు అన్నింటినీ నిషేధిత జాబితా 22–ఎ లో చేర్చుతూ.. రకరకాల జీవోలు జారీ చేసింది. అప్పటి నుంచి రైతన్నలకు ఇబ్బందులు మొదలయ్యాయి. అందుకే ఆ భూములు అన్నింటినీ డీ నోటిఫై చేసి, చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను రద్దు చేసి, ఆ రైతన్నలకు మేలు చేసే కార్యక్రమం చేస్తున్నాం. వివాదాలన్నింటికీ ముగింపు పలికి.. అనాధీన భూములు, చుక్కల భూములు, ఇనాం భూముల సమస్యలన్నింటికీ గ్రామ స్థాయిలోనే పరిష్కారం చూపిస్తున్నాం. భూముల రిజిస్ట్రేషన్, ల్యాండ్‌ రికార్డుల నిర్వహణలో దేశానికే ఒక మోడల్‌గా నిలిచేలా రీసర్వే చేపట్టాం.  

రైతుల సమస్యలు తెలిసిన మారాజు జగనన్న
మా తాత నుంచి వారసత్వంగా వచ్చిన భూమిలో 30 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నాం. 2017లో మా అమ్మాయి పెళ్లికి లోను తీసుకుందామని బ్యాంకుకు వెళితే రెండు ఎకరాలు నిషేధిత జాబితాలో ఉందని, లోను ఇవ్వం అని చెప్పారు. తహసీల్దార్, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సాహసోపేత నిర్ణయంతో మా లాంటి రైతుల జీవితాల్లో వెలుగులు వచ్చాయి. నిజంగా ఈ రోజు మా రైతులందరికీ పండుగ రోజు. 
– కొండవీటి వీర వెంకట నారాయణ, విశ్వనాథపల్లి, కోడూరు మండలం

జగనన్న రుణం తీర్చుకుంటాం
తండ్రి వారసత్వంగా నాకు వచ్చిన ఐదు ఎకరాలు నిషేధిత జాబితాలోకి వెళ్లింది. పిల్లలను చదివించుకునేందుకు లోను కావాలని బ్యాంకుల చుట్టూ తిరిగితే ఇవ్వం అని చెప్పారు. నిషేధిత జాబితా నుంచి తొలగించాలని గతంలో ధర్నాలు, నిరాహార దీక్షలు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయంతో భూ సమస్య తొలగిపోయింది. 
– రేపల్లె రాజయ్య, వి.కొత్తపాలెం, కోడూరు మండలం 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement