2,783 గ్రామాల్లో డీజీపీఎస్‌ పరికరాలతో రీ సర్వే | Resurvey with DGPS equipment in 2783 villages Andhra Pradesh | Sakshi
Sakshi News home page

2,783 గ్రామాల్లో డీజీపీఎస్‌ పరికరాలతో రీ సర్వే

Published Mon, Aug 29 2022 5:16 AM | Last Updated on Mon, Aug 29 2022 5:16 AM

Resurvey with DGPS equipment in 2783 villages Andhra Pradesh - Sakshi

డీజీపీఎస్‌ పరికరాలతో సర్వేను ప్రారంభించిన రెవెన్యూ అధికారులు

సాక్షి, అమరావతి: జీపీఆర్‌ఎస్‌ సిగ్నల్స్‌ అందని 2,783 గ్రామాల్లో ప్రభుత్వం డీజీపీఎస్‌ పరికరాల ద్వారా భూముల రీ సర్వే చేపట్టింది. కొన్ని గ్రామాల్లో ఈ సర్వే మొదలైంది. డ్రోన్లు, జీఎన్‌ఎస్‌ఎస్‌ రోవర్ల ద్వారా అత్యంత ఆధునికమైన హైబ్రిడ్‌ టెక్నాలజీతో సర్వే సెటిల్మెంట్‌ శాఖ రీ సర్వేలో భాగంగా భూములను కొలుస్తోంది. ఇందుకోసం జీఎన్‌ఎస్‌ఎస్‌ నెట్‌వర్క్‌ ద్వారా 70 సీవోఆర్‌ఎస్‌ (కంటిన్యుయస్లీ ఆపరేటింగ్‌ రిఫరింగ్‌ స్టేషన్‌) బేస్‌స్టేషన్లను శాశ్వతపద్ధతిలో ఏర్పాటు చేసింది.

శాటిలైట్ల ద్వారా వచ్చే జీపీఆర్‌ఎస్‌ సిగ్నల్స్‌ ఆధారంగా జీఎన్‌ఎస్‌ఎస్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఈ కేంద్రాలు 24 గంటలు పనిచేస్తున్నాయి. కానీ కొండలు, దట్టమైన అటవీప్రాంతాల్లో జీపీఆర్‌ఎస్‌ సిగ్నల్స్‌ రాకపోవడం వల్ల సీవోఆర్‌ఎస్‌ నెట్‌వర్క్‌ ద్వారా రోవర్లు సరిగా పనిచేయడంలేదు. ఇలాంటి ప్రాంతాల్లో డీజీపీఎస్‌ పరికరాల ద్వారా రేడియో మోడ్‌లో రీ సర్వే చేయనున్నారు.

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని 189 మండలాల్లో 2,783 గ్రామాల్లో జీపీఆర్‌ఎస్‌ సిగ్నల్స్‌ సరిగా రావడంలేదని గుర్తించారు. ఈ గ్రామాల్లో 28.50 లక్షల ఎకరాలను రీ సర్వే చేయాల్సి ఉంది. అత్యధికంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన 1,809 గ్రామాల్లో సిగ్నల్స్‌ అందడంలేదని గుర్తించారు. మొత్తం 2,783 గ్రామాల్లో ప్రైవేటు ఏజెన్సీల ద్వారా డీజీపీఎస్‌ ద్వారా రీ సర్వే చేయాలని నిర్ణయించారు.

ఈ గ్రామాలను నాలుగు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. అత్యధిక గ్రామాలున్న ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ప్యాకేజీ–1కి టెండర్ల ప్రక్రియ ముగిసింది. విశాఖకు చెందిన జియోకాన్‌ సర్వేస్, విశాఖకు చెందిన సిల్వర్‌ టెక్నో సొల్యూషన్స్‌ కంపెనీలు ఈ టెండరు దక్కించుకున్నాయి. ఈ రెండు కంపెనీలు పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలోని ఆరుగ్రామాల్లో కొద్దిరోజుల కిందట ప్రయోగాత్మక  సర్వేని విజయవంతంగా నిర్వహించాయి. రెండురోజుల కిందట ఈ గ్రామాల్లో డీజీపీఎస్‌ సర్వేను ప్రారంభించాయి. మిగిలిన మూడు ప్యాకేజీలకు త్వరలో టెండర్లు ఖరారు చేయనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement