సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ప్రస్తుత డీజీపీ కార్యాలయంలోనే రెండు రాష్ట్రాల డీజీపీలు కొనసాగనున్నారు. అలాగే ప్రస్తుతం హైదరాబాద్‌లో గల రాష్ర్టస్థాయి ప్రభుత్వ కార్యాలయాలతో పాటు విభాగాధిపతుల కార్యాలయాల్లోనే రెండు రాష్ట్రాలకు చెందిన కార్యాలయాలు కొనసాగుతాయి. ఉమ్మడి రాజధాని గ్రేటర్ హైదరాబాద్‌లో ఇరు రాష్ట్రాలకు భవనాల కేటాయింపు ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. ఇందుకు సంబంధించిన కమిటీ చైర్మన్‌గా ఉన్న శ్యాంబాబు హైదరాబాద్‌లోని 179 విభాగాధిపతులతో సమావేశాలను దశల వారీగా శుక్రవారంతో పూర్తి చేశారు. ఉమ్మడి రాజధానిలో ప్రభుత్వ కార్యాలయ భవనాలు ఇరు రాష్ట్రాలకు కేటాయించే అధికారం రాష్ట్ర గవర్నర్ నర్సింహన్‌కు ఉంది.
ప్రస్తుత డీజీపీ కార్యాలయంలోనే కొన్ని అంతస్తులను తెలంగాణ డీజీపీ కార్యాలయానికి, మరి కొన్ని అంతస్తులను ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయానికి కేటాయించనున్నారు. అలాగే పోలీసు శాఖకు చెందిన అన్ని కార్యాలయాలను ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విభజించనున్నారు.
సచివాలయంలోని సౌత్ హెచ్ బ్లాకును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంగా కేటాయించాలని నిర్ణయించిన నేపథ్యంలో భద్రతాపరంగా దాని ఎదురుగా గల పాడుపడిన జి-బ్లాకును కూల్చి వేయాలని పోలీసు అధికారులు అభిప్రాయపడ్డారు. అయితే రాష్ట్రపతి పాలన సమయంలో ఎటువంటి నిర్మాణాలను కూల్చివేతకు అనుమతించబోనని నర్సింహన్ స్పష్టం చేశారు.
రెండు రాష్ట్రాల డీజీపీలు ఒకేచోట
Published Sat, Apr 5 2014 12:31 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement