రెండ్రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి
ఇంతవరకు ఎక్కడున్నాడో ఆచూకీ లేదు.. నా భర్తని అంతమొందించే కుట్ర చేస్తున్నారు
బీటెక్ రవి మాటలు చూస్తే ఇవే అనుమానాలు కలుగుతున్నాయి
నా భర్తని వెంటనే మీడియా ముందుంచాలి.. లేకపోతే డీజీపీ ఆఫీసు ఎదుట ధర్నా చేస్తా
వర్రా రవీందర్ రెడ్డి భార్య కళ్యాణి ఆందోళన
సాక్షి అమరావతి: తన భర్తకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీందర్ రెడ్డి భార్య కళ్యాణి హెచ్చరించారు. ఆమె శనివారం తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. పోలీసులు తన భర్తని రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయని, ఇంతవరకు ఎక్కడున్నాడో ఆచూకీ తెలియడంలేదని ఆమె చెప్పారు. శనివారం ఉదయం టీడీపీ నేత బీటెక్ రవి మాట్లాడిన మాటలను బట్టి చూస్తే.. ప్రభుత్వం తన భర్తకి హాని తలపెట్టే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోందని, ఆయన్ని అంతమొందించాలని పోలీసులు కుట్ర చేస్తున్నారని అనుమానంగా ఉందని చెప్పారు.
ఆయన్ని పోలీసులు మీడియా ముందు హాజరు పర్చకపోతే డీజీపీ ఆఫీసు ఎదుట ధర్నా చేస్తానని హెచ్చరించారు. ఐ–టీడీపీ, విశాఖకు చెందిన టీడీపీ సానుభూతిపరుడు పినపాల ఉదయ భూషణ్, చంద్ర కిరణ్‌లతో రవీందర్ రెడ్డి పేరుతో ఫేక్ ఐడీ సృష్టించి, దాని ద్వారా షర్మిల, నర్రెడ్డి సునీత, వైఎస్ విజయమ్మలపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని తెలిపారు. దీనిపై రవీందర్‌రెడ్డి కడప ఎస్పీకి అప్పట్లోనే ఫిర్యాదు చేయగా, ఎస్పీ వారిని అరెస్టు చేసి మీడియాకు అసలు విషయాలు వివరించారని తెలిపారు.
తన భర్త నిర్దోషి అని నాటి ఎస్పీ ప్రకటనతోనే స్పష్టమైందన్నారు. తన భర్త ఎవరి మీద పోస్టులు పెట్టలేదని, అసభ్యకరంగా పోస్టులు పెట్టినట్లు షర్మిల మాట్లాడటం సరికాదని అన్నారు. పులివెందుల వాసి అయినంత మాత్రాన వైఎస్ భారతి మేడానికి పీఏ అవుతారా? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీపై కక్ష ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి గానీ, తన భర్తని పావుగా వాడుకోవడం సరికాదన్నారు. టీడీపీ నేతలకూ ఆడపిల్లలు, వారికి కూడా భర్తలు ఉన్నారు కదా? వారికి ఏమైనా జరిగితే తట్టుకుంటారా అని నిలదీశారు. తాను కూడా ఒక మహిళనే అన్న విషయం గుర్తించాలంటూ కళ్యాణి కన్నీటి పర్యంతమయ్యారు.
నా తమ్ముడి ఆచూకీ తెలపాలి: వర్రా మల్లికార్జున్ రెడ్డి
రవీందర్ రెడ్డిని పోలీసులు రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నట్లు మీడియా ద్వారా చూసి కుటుంబ సభ్యులందరం తల్లడిల్లిపోతున్నామని ఆయన సోదరుడు వర్రా మల్లికార్జునరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే తన సోదరుడిని కోర్టులో లేదా మీడియా ముందు హాజరు పరచాలని, లేకుంటే కుటుంబమంతా డీజీపీ ఆఫీసు ఎదుట నిరాహార దీక్ష చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment