సాక్షి, సిరిసిల్ల: జిల్లాలోని 13 మండలాల్లో 255 గ్రామాలు, 171 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మొత్తం 91,416 సర్వేనంబరు ఉండగా.. వారి పరిధిలో 4,68,532 ఎకరాల భూమి ఉందని రికార్డులు చెబుతున్నాయి. వీటిని సుమారు నాలుగు దశాబ్దాల క్రితం సర్వే చేశారు. రాష్ట్రప్రభుత్వం ఇటీవల భూరికార్డుల ప్రక్షాళన సర్వే చేపట్టి కొన్నింటిని పరిష్కరించింది. చాలా వరకు వివాదాస్పదంగా ఉన్నాయి. వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో సర్వే చేయాల్సిన అధికారులు.. సర్వేయర్ల కొరతతో పనిలో జాప్యమవుతోంది.
జిల్లా వ్యాప్తంగా 13 మండలాలు ఉండగా 9 మంది సర్వేయర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. జిల్లా కార్యాలయంలో ఇద్దరు డెప్యూటీ సర్వేయర్లు, మరో ఇద్దరు సర్వేయర్లు ఉండాల్సి ఉండగా.. ఒక్కరితోనే నెట్టుకు వస్తున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఏడుగురు సర్వేయర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో భూమి కొలతలు ముందుకు సాగడం లేదు. ప్రైవేటు సర్వేయర్లపై నమ్మకం లేకపోవడం.. క్షేత్రస్థాయిలో రైతులు అంగీకరించకపోవడంతో ప్రభుత్వ సర్వేయర్ల కోసం నిరీక్షిస్తోది. ప్రతినెలా రూ.40వేల వరకు సర్వే కోసం ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతున్నా.. సర్వేయర్ల కొరతతో ఇబ్బందిగా మారింది. సామాన్యులు భూమిని సర్వే చేయించుకోవడం ఓ సవాల్‌గా పరిణమించింది.
కాసులిస్తేనే నోటీసులు..
భూమి సర్వేకు సంబంధించి ఒక్కో సర్వే నంబరుకు మండల సర్వేయర్‌కు రూ.250, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్(జిల్లాస్థాయిలో)కు రూ.300 ప్రభుత్వానికి ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ ఫీజు మీ సేవ కేంద్రం ద్వారా చెల్లించినా సర్వేయర్లు భూమి కొలతకు ముందుకు రావడం లేదు. సరిహద్దు భూముల యజమానులకు నోటీసులు ఇవ్వడం లేదు. భూమి కొలతలకు సంబంధించి చుట్టూ ఉన్న భూముల యజమానులకు నోటీసులు ఇవ్వాలి. కానీ దరఖాస్తుదారుల వద్ద పెద్దఎత్తున మామూళ్లు దండుకుంటూ సర్వే చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వేములవాడలో మండల సర్వేయర్ సత్యనారాయణను ఏసీబీ అధికారులు ఇటీవల పట్టుకుని జైలుకు తరలించారు. నాలా మార్పిడి కోసం కాసులు తీసుకుంటూ ఆయన పట్టుబడ్డారు. అనేకమంది రైతులు భూములను సర్వే చేయించుకునేందుకు నిరీక్షిస్తున్నారు. ముడుపులు ఇస్తామని చెప్పినా.. సర్వేలు చేసేందుకు అప్పుడప్పుడు సతాయిస్తున్నారనే ఆరోపణ వస్తున్నాయి.
ప్రభుత్వ భూసేకరణ పనులు..
జిల్లాలో ప్రభుత్వ భూసేకరణ పనులు ఎక్కువగా ఉన్నాయి. మధ్యమానేరు, కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ –9, 10, 11, 12 పనులు జిల్లాలో సాగుతున్నాయి. మల్కపేట రిజర్వాయర్, అనంతగిరి జలాశయం, కాల్వలు, రైల్వేలైన్, బైపాస్ రోడ్డు, అపరెల్ పార్క్ కోసం భూసేకరణ.. ఇలా జిల్లాలో అనేక పనులకు భూసేకరణ యుద్ధప్రాతిపదికన చేయాల్సి ఉంటోంది. దీంతో ప్రభుత్వ సర్వేయర్లు తమ పనుల్లో బిజీగా ఉంటున్నారు. సామాన్య రైతులు భూమి కొలతలు చేయించుకునే పరిస్థితి లేకుండా పోయింది. సర్వేయర్ శాఖ అధికారులు డిజిటల్ గ్లోబల్ పోజిషల్ సిస్టమ్ (డీజీపీఎస్) విధానంలో శాటిలైట్‌తో అనుసంధానంతో సర్వేలు చేయడంతో భూసేకరణ పనులు కాస్త వేగవంతమయ్యాయి. అయినా ఇంకా సర్వే కోసం చలానా చెల్లించిన రైతులు వందల్లో ఉన్నారు. మండలానికో సర్వేయర్‌ను పూర్తిస్థాయిలో నియమించి క్షేత్రస్థాయిలో భూములను సర్వేలు చేస్తే.. వివాదాలు శాశ్వతంగా పరిష్కారమవుతాయని అభిప్రాయపడుతున్నారు. హద్దులు పక్కాగా నిర్ధారణ అవుతాయి. ఆ దిశగా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పనిఒత్తిడి ఉంది
మాపై పనిఒత్తిడి ఉంది. ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నమాట వాస్తమే. కానీ ప్రభుత్వ పరంగా వచ్చే సర్వే ఆర్డర్లను ముందుగా సర్వే చేయాల్సి ఉంటుంది. జిల్లాలో ఇప్పటివరకు జిల్లెల్ల, మర్రిపెల్లి, పెద్దూరు శివారుల్లో 4వేల ఎకరాల భూములను సర్వే చేసి సేకరించారు. సీరియల్ ఆధారంగా, ప్రాధాన్యతాక్రమంలో సర్వే చేస్తాం.
– వి.శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే, సిరిసిల్ల
Comments
Please login to add a commentAdd a comment