land acquisation act
-
హద్దులు ఎలా తెలిసేది?
సాక్షి, సిరిసిల్ల: జిల్లాలోని 13 మండలాల్లో 255 గ్రామాలు, 171 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మొత్తం 91,416 సర్వేనంబరు ఉండగా.. వారి పరిధిలో 4,68,532 ఎకరాల భూమి ఉందని రికార్డులు చెబుతున్నాయి. వీటిని సుమారు నాలుగు దశాబ్దాల క్రితం సర్వే చేశారు. రాష్ట్రప్రభుత్వం ఇటీవల భూరికార్డుల ప్రక్షాళన సర్వే చేపట్టి కొన్నింటిని పరిష్కరించింది. చాలా వరకు వివాదాస్పదంగా ఉన్నాయి. వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో సర్వే చేయాల్సిన అధికారులు.. సర్వేయర్ల కొరతతో పనిలో జాప్యమవుతోంది. జిల్లా వ్యాప్తంగా 13 మండలాలు ఉండగా 9 మంది సర్వేయర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. జిల్లా కార్యాలయంలో ఇద్దరు డెప్యూటీ సర్వేయర్లు, మరో ఇద్దరు సర్వేయర్లు ఉండాల్సి ఉండగా.. ఒక్కరితోనే నెట్టుకు వస్తున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఏడుగురు సర్వేయర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో భూమి కొలతలు ముందుకు సాగడం లేదు. ప్రైవేటు సర్వేయర్లపై నమ్మకం లేకపోవడం.. క్షేత్రస్థాయిలో రైతులు అంగీకరించకపోవడంతో ప్రభుత్వ సర్వేయర్ల కోసం నిరీక్షిస్తోది. ప్రతినెలా రూ.40వేల వరకు సర్వే కోసం ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతున్నా.. సర్వేయర్ల కొరతతో ఇబ్బందిగా మారింది. సామాన్యులు భూమిని సర్వే చేయించుకోవడం ఓ సవాల్‌గా పరిణమించింది. కాసులిస్తేనే నోటీసులు.. భూమి సర్వేకు సంబంధించి ఒక్కో సర్వే నంబరుకు మండల సర్వేయర్‌కు రూ.250, ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్(జిల్లాస్థాయిలో)కు రూ.300 ప్రభుత్వానికి ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ ఫీజు మీ సేవ కేంద్రం ద్వారా చెల్లించినా సర్వేయర్లు భూమి కొలతకు ముందుకు రావడం లేదు. సరిహద్దు భూముల యజమానులకు నోటీసులు ఇవ్వడం లేదు. భూమి కొలతలకు సంబంధించి చుట్టూ ఉన్న భూముల యజమానులకు నోటీసులు ఇవ్వాలి. కానీ దరఖాస్తుదారుల వద్ద పెద్దఎత్తున మామూళ్లు దండుకుంటూ సర్వే చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వేములవాడలో మండల సర్వేయర్ సత్యనారాయణను ఏసీబీ అధికారులు ఇటీవల పట్టుకుని జైలుకు తరలించారు. నాలా మార్పిడి కోసం కాసులు తీసుకుంటూ ఆయన పట్టుబడ్డారు. అనేకమంది రైతులు భూములను సర్వే చేయించుకునేందుకు నిరీక్షిస్తున్నారు. ముడుపులు ఇస్తామని చెప్పినా.. సర్వేలు చేసేందుకు అప్పుడప్పుడు సతాయిస్తున్నారనే ఆరోపణ వస్తున్నాయి. ప్రభుత్వ భూసేకరణ పనులు.. జిల్లాలో ప్రభుత్వ భూసేకరణ పనులు ఎక్కువగా ఉన్నాయి. మధ్యమానేరు, కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ –9, 10, 11, 12 పనులు జిల్లాలో సాగుతున్నాయి. మల్కపేట రిజర్వాయర్, అనంతగిరి జలాశయం, కాల్వలు, రైల్వేలైన్, బైపాస్ రోడ్డు, అపరెల్ పార్క్ కోసం భూసేకరణ.. ఇలా జిల్లాలో అనేక పనులకు భూసేకరణ యుద్ధప్రాతిపదికన చేయాల్సి ఉంటోంది. దీంతో ప్రభుత్వ సర్వేయర్లు తమ పనుల్లో బిజీగా ఉంటున్నారు. సామాన్య రైతులు భూమి కొలతలు చేయించుకునే పరిస్థితి లేకుండా పోయింది. సర్వేయర్ శాఖ అధికారులు డిజిటల్ గ్లోబల్ పోజిషల్ సిస్టమ్ (డీజీపీఎస్) విధానంలో శాటిలైట్‌తో అనుసంధానంతో సర్వేలు చేయడంతో భూసేకరణ పనులు కాస్త వేగవంతమయ్యాయి. అయినా ఇంకా సర్వే కోసం చలానా చెల్లించిన రైతులు వందల్లో ఉన్నారు. మండలానికో సర్వేయర్‌ను పూర్తిస్థాయిలో నియమించి క్షేత్రస్థాయిలో భూములను సర్వేలు చేస్తే.. వివాదాలు శాశ్వతంగా పరిష్కారమవుతాయని అభిప్రాయపడుతున్నారు. హద్దులు పక్కాగా నిర్ధారణ అవుతాయి. ఆ దిశగా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పనిఒత్తిడి ఉంది మాపై పనిఒత్తిడి ఉంది. ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నమాట వాస్తమే. కానీ ప్రభుత్వ పరంగా వచ్చే సర్వే ఆర్డర్లను ముందుగా సర్వే చేయాల్సి ఉంటుంది. జిల్లాలో ఇప్పటివరకు జిల్లెల్ల, మర్రిపెల్లి, పెద్దూరు శివారుల్లో 4వేల ఎకరాల భూములను సర్వే చేసి సేకరించారు. సీరియల్ ఆధారంగా, ప్రాధాన్యతాక్రమంలో సర్వే చేస్తాం. – వి.శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, సిరిసిల్ల -
మండలిలో ఐదు నిమిషాల్లోనే..
- బిల్లును ఆమోదించాలని చైర్మన్‌ను కోరిన మంత్రి హరీశ్ - ఆమోదం పొందినట్టు ప్రకటించిన చైర్మన్.. సభ నిరవధిక వాయిదా సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సభ్యుల నిరసనల మధ్య భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు శాసన మండలి ఐదు నిమిషాల్లోనే ఆమోదం తెలిపింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మండలి ప్రారంభమైంది. ఆకుపచ్చ కండువాలతో వచ్చిన కాంగ్రెస్ సభ్యులు షబ్బీర్ అలీ, ఆకుల లలిత, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సంతోష్‌కుమార్.. రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఇదే సమయంలో సభలో భూసేకరణ చట్ట సవరణ బిల్లును డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ప్రవేశపెట్టారు. బిల్లుపై మాట్లాడాల్సిందిగా విపక్ష నేత షబ్బీర్ అలీని చైర్మన్ కె,.స్వామిగౌడ్ కోరారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలంటూ షబ్బీర్ ప్రసంగాన్ని కొనసాగించారు. ఇదే సమయంలో చైర్మన్... ఎంఐఎం సభ్యుడు జాఫ్రీకి మాట్లాడే అవకాశం ఇచ్చారు. బిల్లుకు తాము పూర్తి మద్దతును తెలుపుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ప్లకార్డులు ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ సభ్యులు తమ స్థానాల నుంచి ముందుకెళ్లకుండా మార్షల్స్ అడ్డుగా నిలిచారు. మంత్రి హరీశ్‌రావు కల్పించుకొని.. కాంగ్రెస్ సభ్యులకు మాట్లాడటం ఇష్టం లేదని బిల్లును ఆమోదించాల్సిందిగా చైర్మన్‌ను కోరారు. కాంగ్రెస్ సభ్యుల నిరసనలు కొనసాగుతుండగానే బిల్లు ఆమోదం పొందినట్టు చైర్మన్ ప్రకటించారు. ఆ వెంటనే సభను నిరవధికంగా వాయిదా వేశారు. అనారోగ్యం కారణంగా బీజేపీ సభ్యుడు ఎన్.రామచంద్రరావు సభకు హాజరు కాలేదు. -
భూసేకరణ చట్టానికి 3 సవరణలు
-
భూసేకరణ చట్టానికి 3 సవరణలు
- రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచన సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన భూసేకరణ సవరణ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం మూడు సవరణలు కోరింది. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సూచించిన ఈ సవరణలను కేంద్ర న్యాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి పంపనుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఢిల్లీ పర్యటనలో కేంద్ర న్యాయమంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలిసినప్పుడు ఈ అంశం చర్చకొచ్చింది. న్యాయశాఖ తరఫున క్లియరెన్స్ ఇచ్చేందుకు సూచనప్రాయంగా కేంద్ర మంత్రి అంగీకరించారు. కేంద్రం సూచించిన సవరణలు చేసేందుకు, కోరిన వివరణలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించింది. అయితే ఏమేం సవరణలు చేయాలనే విషయంలో కేంద్రం నుంచి అధికారికంగా సమాచారం అందలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కేంద్రం నుంచి వచ్చే ప్రతిపాదనల ప్రకారం తగిన మార్పులు చేయాల్సి ఉంటుందని, అవసరాన్ని బట్టి మరోసారి అసెంబ్లీలో సవరణలకు ఆమోదం తీసుకోవాలా లేదా ఆర్డినెన్స్ రూపంలో కేంద్రానికి పంపాలా అనే అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నాయి. ప్రధానంగా రాష్ట్రం పంపించిన బిల్లులో పొందుపరిచిన ప్రయోజనాలను 2014కు ముందున్న నిర్వాసితులకు సైతం అమలు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సవరణ కోరినట్లు తెలిసింది. మిగతా రెండు సవరణలు బిల్లులోని పలు పదాల్లో మార్పులు తప్ప మరేమీ కాదని అధికార వర్గాలు తెలిపాయి. గతేడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ బిల్లును శాసనసభ ఆమోదించి కేంద్ర హోంశాఖకు పంపించింది. రాష్ట్ర అవసరాల దృష్ట్యా ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలపాలని ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. -
'తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తాం'
మహబూబ్‌నగర్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నదీ జలాలను కూడా జలమార్గాలుగా ఉపయోగించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. ప్రపంచంలో అత్యధికంగా ప్రమాదాలు భారత దేశంలోనే జరుగుతున్నాయని, వీటిని నివారించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు గడ్కరీ తెలిపారు. రోడ్డు, రవాణా శాఖలో అవినీతిని అరికట్టేందుకున ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక చట్టం తీసుకు రానున్నట్టు మంత్రి చెప్పారు. ప్రాజెక్టులు నిర్మించడం వల్లే అభివృద్ధి సాధ్యమని, భూ సేకరన చట్టాన్ని ప్రతిపక్షాలు అడ్డుకోవాలని చూడటం తగదన్నారు. చెరుకుపై రవాణా పన్ను మినహాయించేందుకు ఆలోచన చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.