
మండలిలో ఐదు నిమిషాల్లోనే..
- బిల్లును ఆమోదించాలని చైర్మన్‌ను కోరిన మంత్రి హరీశ్
- ఆమోదం పొందినట్టు ప్రకటించిన చైర్మన్.. సభ నిరవధిక వాయిదా
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సభ్యుల నిరసనల మధ్య భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు శాసన మండలి ఐదు నిమిషాల్లోనే ఆమోదం తెలిపింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మండలి ప్రారంభమైంది. ఆకుపచ్చ కండువాలతో వచ్చిన కాంగ్రెస్ సభ్యులు షబ్బీర్ అలీ, ఆకుల లలిత, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సంతోష్‌కుమార్.. రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఇదే సమయంలో సభలో భూసేకరణ చట్ట సవరణ బిల్లును డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ప్రవేశపెట్టారు. బిల్లుపై మాట్లాడాల్సిందిగా విపక్ష నేత షబ్బీర్ అలీని చైర్మన్ కె,.స్వామిగౌడ్ కోరారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలంటూ షబ్బీర్ ప్రసంగాన్ని కొనసాగించారు.
ఇదే సమయంలో చైర్మన్... ఎంఐఎం సభ్యుడు జాఫ్రీకి మాట్లాడే అవకాశం ఇచ్చారు. బిల్లుకు తాము పూర్తి మద్దతును తెలుపుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ప్లకార్డులు ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ సభ్యులు తమ స్థానాల నుంచి ముందుకెళ్లకుండా మార్షల్స్ అడ్డుగా నిలిచారు. మంత్రి హరీశ్‌రావు కల్పించుకొని.. కాంగ్రెస్ సభ్యులకు మాట్లాడటం ఇష్టం లేదని బిల్లును ఆమోదించాల్సిందిగా చైర్మన్‌ను కోరారు. కాంగ్రెస్ సభ్యుల నిరసనలు కొనసాగుతుండగానే బిల్లు ఆమోదం పొందినట్టు చైర్మన్ ప్రకటించారు. ఆ వెంటనే సభను నిరవధికంగా వాయిదా వేశారు. అనారోగ్యం కారణంగా బీజేపీ సభ్యుడు ఎన్.రామచంద్రరావు సభకు హాజరు కాలేదు.