surveyers
-
హద్దులు ఎలా తెలిసేది?
సాక్షి, సిరిసిల్ల: జిల్లాలోని 13 మండలాల్లో 255 గ్రామాలు, 171 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మొత్తం 91,416 సర్వేనంబరు ఉండగా.. వారి పరిధిలో 4,68,532 ఎకరాల భూమి ఉందని రికార్డులు చెబుతున్నాయి. వీటిని సుమారు నాలుగు దశాబ్దాల క్రితం సర్వే చేశారు. రాష్ట్రప్రభుత్వం ఇటీవల భూరికార్డుల ప్రక్షాళన సర్వే చేపట్టి కొన్నింటిని పరిష్కరించింది. చాలా వరకు వివాదాస్పదంగా ఉన్నాయి. వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో సర్వే చేయాల్సిన అధికారులు.. సర్వేయర్ల కొరతతో పనిలో జాప్యమవుతోంది. జిల్లా వ్యాప్తంగా 13 మండలాలు ఉండగా 9 మంది సర్వేయర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. జిల్లా కార్యాలయంలో ఇద్దరు డెప్యూటీ సర్వేయర్లు, మరో ఇద్దరు సర్వేయర్లు ఉండాల్సి ఉండగా.. ఒక్కరితోనే నెట్టుకు వస్తున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఏడుగురు సర్వేయర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో భూమి కొలతలు ముందుకు సాగడం లేదు. ప్రైవేటు సర్వేయర్లపై నమ్మకం లేకపోవడం.. క్షేత్రస్థాయిలో రైతులు అంగీకరించకపోవడంతో ప్రభుత్వ సర్వేయర్ల కోసం నిరీక్షిస్తోది. ప్రతినెలా రూ.40వేల వరకు సర్వే కోసం ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతున్నా.. సర్వేయర్ల కొరతతో ఇబ్బందిగా మారింది. సామాన్యులు భూమిని సర్వే చేయించుకోవడం ఓ సవాల్‌గా పరిణమించింది. కాసులిస్తేనే నోటీసులు.. భూమి సర్వేకు సంబంధించి ఒక్కో సర్వే నంబరుకు మండల సర్వేయర్‌కు రూ.250, ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్(జిల్లాస్థాయిలో)కు రూ.300 ప్రభుత్వానికి ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ ఫీజు మీ సేవ కేంద్రం ద్వారా చెల్లించినా సర్వేయర్లు భూమి కొలతకు ముందుకు రావడం లేదు. సరిహద్దు భూముల యజమానులకు నోటీసులు ఇవ్వడం లేదు. భూమి కొలతలకు సంబంధించి చుట్టూ ఉన్న భూముల యజమానులకు నోటీసులు ఇవ్వాలి. కానీ దరఖాస్తుదారుల వద్ద పెద్దఎత్తున మామూళ్లు దండుకుంటూ సర్వే చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వేములవాడలో మండల సర్వేయర్ సత్యనారాయణను ఏసీబీ అధికారులు ఇటీవల పట్టుకుని జైలుకు తరలించారు. నాలా మార్పిడి కోసం కాసులు తీసుకుంటూ ఆయన పట్టుబడ్డారు. అనేకమంది రైతులు భూములను సర్వే చేయించుకునేందుకు నిరీక్షిస్తున్నారు. ముడుపులు ఇస్తామని చెప్పినా.. సర్వేలు చేసేందుకు అప్పుడప్పుడు సతాయిస్తున్నారనే ఆరోపణ వస్తున్నాయి. ప్రభుత్వ భూసేకరణ పనులు.. జిల్లాలో ప్రభుత్వ భూసేకరణ పనులు ఎక్కువగా ఉన్నాయి. మధ్యమానేరు, కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ –9, 10, 11, 12 పనులు జిల్లాలో సాగుతున్నాయి. మల్కపేట రిజర్వాయర్, అనంతగిరి జలాశయం, కాల్వలు, రైల్వేలైన్, బైపాస్ రోడ్డు, అపరెల్ పార్క్ కోసం భూసేకరణ.. ఇలా జిల్లాలో అనేక పనులకు భూసేకరణ యుద్ధప్రాతిపదికన చేయాల్సి ఉంటోంది. దీంతో ప్రభుత్వ సర్వేయర్లు తమ పనుల్లో బిజీగా ఉంటున్నారు. సామాన్య రైతులు భూమి కొలతలు చేయించుకునే పరిస్థితి లేకుండా పోయింది. సర్వేయర్ శాఖ అధికారులు డిజిటల్ గ్లోబల్ పోజిషల్ సిస్టమ్ (డీజీపీఎస్) విధానంలో శాటిలైట్‌తో అనుసంధానంతో సర్వేలు చేయడంతో భూసేకరణ పనులు కాస్త వేగవంతమయ్యాయి. అయినా ఇంకా సర్వే కోసం చలానా చెల్లించిన రైతులు వందల్లో ఉన్నారు. మండలానికో సర్వేయర్‌ను పూర్తిస్థాయిలో నియమించి క్షేత్రస్థాయిలో భూములను సర్వేలు చేస్తే.. వివాదాలు శాశ్వతంగా పరిష్కారమవుతాయని అభిప్రాయపడుతున్నారు. హద్దులు పక్కాగా నిర్ధారణ అవుతాయి. ఆ దిశగా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పనిఒత్తిడి ఉంది మాపై పనిఒత్తిడి ఉంది. ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నమాట వాస్తమే. కానీ ప్రభుత్వ పరంగా వచ్చే సర్వే ఆర్డర్లను ముందుగా సర్వే చేయాల్సి ఉంటుంది. జిల్లాలో ఇప్పటివరకు జిల్లెల్ల, మర్రిపెల్లి, పెద్దూరు శివారుల్లో 4వేల ఎకరాల భూములను సర్వే చేసి సేకరించారు. సీరియల్ ఆధారంగా, ప్రాధాన్యతాక్రమంలో సర్వే చేస్తాం. – వి.శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, సిరిసిల్ల -
వేతనాలు లేని కొలువులు
సాక్షి, మార్టూరు(ప్రకాశం): భూ సర్వేకు సంబంధించిన ఇబ్బందులను తొలగించడానికి ప్రభుత్వం లైసెన్స్డ్ సర్వే వ్యవస్థను తెరపైకి తీసుకొచ్చింది. నిరుద్యోగులుగా ఉన్న అర్హులైన వారిని లైసెన్స్డ్ సర్వేయర్లుగా తీసుకుని మండలాల్లో నియమించడం జరిగింది. వీరికి వేతనాలంటూ ప్రత్యేకంగా ఏమీ లేకుండా సర్వే కోసం అర్జీదారుల చలానా రూపములో చల్లించే 500 రూపాయలను వీరికి చల్లించేలా ప్రకటించి ఆమొత్తాన్ని వీరి ఖాతాల్లో నేరుగా చెల్లిస్తామంటూ వీరి బ్యాంకు ఖాతాల వివరాలను రెండేళ్ల క్రితమే తీసుకున్నట్లు చెప్తున్నారు. కానీ ఇంతవరకు వీరి ఖాతాలో ఒక్క రూపాయి కూడా జమ కాకపోవడం గమనార్హం. గతంలో సర్వే కోసం అర్జీదారులు చెల్లించాల్సిన చలాన 250 రూపాయలు కాగా వీరికి వేతనానికి బదులు ఇవ్వవలసిన భత్యం కోసం చలానా రుసుమును 500 రూపాయలకు పెంచి రైతులపై భారమైతే వేశారు కానీ వీరికి ఇవ్వకపోవడం విశేషం. సంవత్సరాల తరబడి వీరి పోరాటంలో ఫలితంగా సంబంధిత మంత్రి కె.ఇ. కృష్ణమూర్తి గత సంవత్సరం మే 9వ తేదీ లైసెన్స్డు సర్వేయర్లను అసిస్టెంట్ సర్వేయర్లుగా నియమిస్తానని ప్రకటించి విధివిధాలను రూపొందించవలసిందిగా అధికారులను ఆదేశించారు. ఈ క్రమములో అధికారులు మండలానికి ఇద్దరు చొప్పున ప్రకాశం జిల్లాకు 112 మందికి అదనంగా టాస్క్ఫోర్సు విభాగానికి ఐదుగురు కలిపి 117 మంది అవసరమని రాష్ట్రవ్యాప్తంగా 1405 మందిని అసిస్టెంట్ సర్వేయర్లుగా నియమించాల్సిసిన అవసరం ఉందని నివేదికను రూపొందించారు. కనీసవేతనంగా 21,534 రూపాయలుగా రూపొందించిన నివేదికను చీఫ్ సెక్రటరీ అనిల్ చంద్ర పునీత్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గతనెల 6వ తేదీ పంపిన యూనియన్ నాయకులు చెప్తున్నారు. తెలంగాణా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాంట్రాక్టు పద్ధతిన లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించి కనీస వేతనంగా రూ. 18 వేలు ఇస్తున్నట్లు వీరు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న తమకు ఎన్నికల తరణంలోనైనా వేతనాలు ప్రకటిస్తే జీఓ విడుదల చేయాలని వీరు కోరుతున్నారు. సంవత్సరాల తరబడి వేతనాలు లేవు సంవత్సరాల తరబడి వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నాం. పనిభారం చాలా ఎక్కువగా ఉన్నా.. విధులు నిర్వహిస్తున్నాం. ఎన్నికల సమయంలోనైనా సమస్య పరిష్కారమవుతుందని ఎదురు చూస్తున్నాం. - భాస్కర్‌రెడ్డి, లైసెన్స్డ్ సర్వేయర్ల యూనియన్ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు సమస్యలు త్వరగా పరిష్కరించాలి రెండు సంవత్సరాలకు పైగా పైసా వేతనం లేదు. చలానా రుసుమును ఖాతాలో జమచేస్తామన్నారు. అదీలేదు. ఇప్పటికైనా సమస్యలు త్వరగా పరిష్కరించాలి. - వెంకటేష్, లైసెన్స్డ్ సర్వేయర్ మార్టూరు -
త్వరలో 277 సర్వేయర్ల పోస్టుల భర్తీ
డెప్యూటీ సీఎం మహమూద్ అలీ కరీంనగర్ : భూ సమస్యల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే 277 సర్వేయర్ల పోస్టులను భర్తీ చేయనున్నామని డెప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. మంగళవారం కరీంనగర్‌లోని కలెక్టరేట్ సమావేశమందిరంలో రెవెన్యూ, సీజనల్ వ్యాధులు, హరితహారంపై మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి అ«ధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సాదాబైనామాలను ఫాస్ట్ ట్రాక్‌లో విచారించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షలకు పైగా సాదాబైనామా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. దరఖాస్తుల విచారణలో జాగ్రత్తగా వ్యవహరించి పేద రైతులకు న్యాయం చేయాలన్నారు. మ్యూటేషన్ ఇరవై రోజుల్లో, విరాసత్ పది రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ, భూదాన్, వక్ఫ్ భూములు కబ్జాకు గురికాకుండా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి సైన్ బోర్డులు పెట్టాలన్నారు. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం ముద్రతో ఈ పాస్ పుస్తకాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. రెవెన్యూ కార్యాలయాలకు సొంత భవనాలు, నిర్వహణ నిధులు, కార్లు, విద్యుత్ బిల్లులు మంజూరీ చేస్తామని తెలిపారు. మీసేవలో అవకతవకలున్నాయని దృష్టికి వచ్చిందని, అటువంటి వారి లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశించారు. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత రెవెన్యూశాఖలో ఉద్యోగుల కొరత లేకుండా చేస్తామన్నారు.