త్వరలో 277 సర్వేయర్ల పోస్టుల భర్తీ
-
డెప్యూటీ సీఎం మహమూద్ అలీ
కరీంనగర్ : భూ సమస్యల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే 277 సర్వేయర్ల పోస్టులను భర్తీ చేయనున్నామని డెప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. మంగళవారం కరీంనగర్‌లోని కలెక్టరేట్ సమావేశమందిరంలో రెవెన్యూ, సీజనల్ వ్యాధులు, హరితహారంపై మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి అ«ధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సాదాబైనామాలను ఫాస్ట్ ట్రాక్‌లో విచారించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షలకు పైగా సాదాబైనామా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. దరఖాస్తుల విచారణలో జాగ్రత్తగా వ్యవహరించి పేద రైతులకు న్యాయం చేయాలన్నారు. మ్యూటేషన్ ఇరవై రోజుల్లో, విరాసత్ పది రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ, భూదాన్, వక్ఫ్ భూములు కబ్జాకు గురికాకుండా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి సైన్ బోర్డులు పెట్టాలన్నారు. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం ముద్రతో ఈ పాస్ పుస్తకాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. రెవెన్యూ కార్యాలయాలకు సొంత భవనాలు, నిర్వహణ నిధులు, కార్లు, విద్యుత్ బిల్లులు మంజూరీ చేస్తామని తెలిపారు. మీసేవలో అవకతవకలున్నాయని దృష్టికి వచ్చిందని, అటువంటి వారి లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశించారు. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత రెవెన్యూశాఖలో ఉద్యోగుల కొరత లేకుండా చేస్తామన్నారు.