హైదరాబాద్: బల్దియా పీఠంపై తొలిసారిగా టీఆర్‌ఎస్ జెండా ఎగురవేయబోతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం ఆజంపురాలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలు శాంతికాముకులని, ఎలాంటి అలజడులకు, వివాదాలకు అవకాశం ఇవ్వరని స్పష్టం చేశారన్నారు.
ప్రస్తుత పరిస్థితులు చక్కబడే వరకు తన కార్యాలయం నుంచే పరిపాలన కొనసాగిస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పద్నాలుగేళ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణలో రాజకీయ అలజడులు సృష్టిస్తే అటువంటి దుష్టశక్తులపై చర్యలు తీసుకోవటంలో ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. గత ప్రభుత్వాల హయాంలో బల్దియాకు వెళ్లాలంటే లంచాలు ఇస్తేనే పనులు జరిగేవని... ఇప్పుడా దుస్థితి రాబోదన్నారు. అభివృద్ధే ధ్యేయంగా కేసీఆర్ నగరంపై దృష్టి పెట్టారని... హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు.