మహ‘దూద్’ అలీ | telangana deputy cm mahamood ali | Sakshi
Sakshi News home page

మహ‘దూద్’ అలీ

Published Sun, Jul 6 2014 5:25 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 AM

మహ‘దూద్’ అలీ

మహ‘దూద్’ అలీ

* పాల వ్యాపారాన్ని వదలని డిప్యూటీ సీఎం
తాతల నాటి వారసత్వాన్ని కొనసాగిస్తున్న వైనం
రాజకీయాలకూ... కుటుంబానికి సమ ప్రాధాన్యం
టీఆర్‌ఎస్‌లో కీలక పాత్ర
కేసీఆర్‌కు అత్యంత సన్నిహితునిగా గుర్తింపు
చాదర్‌ఘాట్: రాష్ట్ర ప్రజలందరికీ ఆయన డిప్యూటీ సీఎం. పాతబస్తీ వాసులకు మాత్రం వెన్నలాంటి మనసున్న పాల వ్యాపారి. ఏ స్థాయి పదవిలో ఉన్నా తన ఉన్నతికి కారణమైన పాల వ్యాపారాన్ని మాత్రం వదులుకోరు. తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆ వ్యాపార బాధ్యతలను బిడ్డకు అప్పగించినా... నేటికీ స్వయంగా పర్యవేక్షిస్తుండడం ఆయన ప్రత్యేకత. ఆయనే తెలంగాణ రాష్ట్ర   ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ. ఉప ముఖ్యమంత్రిగా, రెవెన్యూ మంత్రిగా జోడు పదవులను చేపట్టిన ఆయన తనవ్యాపారాన్ని మాత్రం ఎంతో బాధ్యతగా కొనసాగిస్తున్నారు.

తండ్రి మహ్మద్ బాబూమియా నుంచి పాల వ్యాపారాన్ని వారసత్వంగా అందిపుచ్చుకున్న అలీ 1979లో సొంతంగా ఆజంపురాలో బాబూమియా డెయిరీ పేరుతో పాల వ్యాపారం ప్రారంభించారు. నాణ్యతకు ప్రాధాన్యమిచ్చే మహమూద్ అలీ ఈ రంగంలో అంచెలంచెలుగా ఎదిగారు. పాతబస్తీ మొత్తం బాబూమియా పాలనే వాడుతుంటారంటే ఆయన ప్రత్యేకత ఏంటో తెలుసుకోవచ్చు. పాలతో పాటు పెరుగు, వెన్న, నెయ్యి విక్రయాల్లోనూ ప్రఖ్యాతిగాంచారు.

 అందరికీ పాలు, నెయ్యి విక్రయించే మహమూద్ అలీ తాను మాత్రం వాటికి దూరంగా ఉంటారు. అంతే కాదండోయ్. ఆయన ఎక్కువగా శాఖాహారంపైనే మక్కువ చూపిస్తుంటారు. సాదాసీదా జీవన శైలితో పాటు  వినయాన్ని వదలకపోవడం ఆయనకు అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు తె చ్చి పెట్టాయి. పాల వ్యాపారం నా పవిత్ర వృత్తి అని వినమ్రంగా చెప్పగలగడం ఆయనకే సాధ్యం.
 
విద్యార్హతలు
పాతబస్తీలోని అన్వర్ అలూమ్ కళాశాలలో కామర్స్ డిగ్రీ పూర్తి చేసిన అలీ పాఠశాల స్థాయి నుంచే వ్యాపార మెలకువలను ఒంట బట్టించుకున్నారు. పాల వ్యాపారంలో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ చదువు కొనసాగించారు.
 
వ్యాపార విస్తరణ
తన తాత తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన పాల వ్యాపారాన్ని మహమూద్ అలీ మరింతగా విస్తరించారు. దాదాపు 150 గేదెలతో ఆయన డెయిరీ నడుస్తోంది. రోజుకు సగటున వెయ్యి లీటర్ల పాలు, 100 లీటర్ల పెరుగు, 50 కేజీల నెయ్యిని విక్రయిస్తుంటారు. పంజాబ్, గుజరాత్, హర్యానా తదితర రాష్ట్రాల నుంచి మేలు జాతి గేదెలను దిగుమతి చేసుకుంటారు. వీటి సంరక్షణ, పోషణకు గాను 30 మంది ఉద్యోగులు ఈ డెయిరీలో పని చేస్తున్నారు.
 
కుటుంబ నేపథ్యం

1973లో నస్రీన్‌ను వివాహమాడిన మహమూద్ అలీకి ఇద్దరు కుమారులు. వీరిలో ఒకరు అకాల మృత్యువుకు గురయ్యారు. ప్రస్తుతం ఉన్న మహమ్మద్ ఆజమ్ అలీ తండ్రిలాగానే ఓవైపు వ్యాపారం చూసుకుంటూ మరోవైపు టీఆర్‌ఎస్ పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శిగా, మలక్‌పేట నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. మహమూద్ అలీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తుండగా.. కుటుంబ బాధ్యతలను, వ్యాపార నిర్వహణను కుమారుడు ఆజమ్ అలీ చూస్తున్నారు. డిప్యూటీ సీఎం కుమారుడైనా ఇప్పటికీ తండ్రి చాటు బిడ్డలా ఎంతో సౌమ్యంగా, సున్నితంగా పని చేసుకుపోతుంటారని ఆజమ్ పేరు తెచ్చుకున్నారు.
 
రాజకీయ ప్రవేశం..
2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ సమయంలో అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన అలీ కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో, ప్రభుత్వ ఏర్పాటులో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. కీలక సమయాల్లో ఆయన వ్యవహరించిన తీరు పార్టీ వర్గాల్లో మరింత నమ్మకాన్ని పెంచింది. అలీ పనితీరుకు ముగ్ధుడైన కేసీఆర్ 2003లో రాష్ట్ర మైనారిటీ విభాగం అధ్యక్షునిగా, పొలిట్‌బ్యూరో సభ్యునిగా బాధ్యతలు అప్పగించారు.

విశేషం ఏమిటంటే  కేసీఆర్ స్వయంగా మహమూద్ అలీ ఇంటికి వచ్చి పాతబస్తీ రాజకీయ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారంటే వారిద్దరి అనుబంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. రాజకీయాల్లో పూర్తిగా తలమునకలైనఅలీ ఒకానొక దశలో కుటుంబానికి సమయాన్ని కేటాయించలేని పరిస్థితులు తలెత్తాయి. ఆ సమయంలో కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చినా.. తొట్రుపాటు లేకుండా అటు కుటుంబానికి...ఇటు రాజకీయాలకు న్యాయం చేస్తూ వస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement