noc
-
పశువుల మందులకు వేగంగా ఎన్వోసీ.. ప్రత్యేక పోర్టల్ ఆవిష్కరణ
న్యూఢిల్లీ: వెటర్నరీ ఔషధాలు, టీకాలకు సంబంధించిన దరఖాస్తులను వేగవంతంగా ప్రాసెస్ చేసేందుకు, నో–అబ్జెక్షన్ సర్టిఫికేషన్ (ఎన్వోసీ) జారీ చేసేందుకు కేంద్రం ప్రత్యేకంగా నాంది పేరిట పోర్టల్ ప్రారంభించింది. కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, డెయిరీ శాఖ మంత్రి పర్షోత్తం రూపాలా సోమవారం దీన్ని ఆవిష్కరించారు. సాధారణంగా ఔషధాలు, టీకాల దిగుమతి, తయారీ, మార్కెటింగ్ మొదలైన వాటి నియంత్రణ అనేది ఆరోగ్య శాఖలో భాగమైన సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో) పరిధిలోకి వస్తుంది. అయితే, వెటర్నరీ ఔషధాలు, టీకాలకు సంబంధించి మత్స్య, పశు సంవర్ధక, డైరీ శాఖతో సంప్రదింపుల తర్వాత అనుమతులు జారీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ మాన్యువల్‌గా ఉండటంతో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే నాంది (ఎన్వోసీ అప్రూవల్ ఫర్ న్యూ డ్రగ్ అండ్ ఇనాక్యులేషన్ సిస్టం) పోర్టల్‌ను ఆవిష్కరించినట్లు రూపాలా చెప్పారు. తాజా పరిణామంతో ఇకపై సీడీఎస్‌సీవో సుగమ్ పోర్టల్‌లో దాఖలు చేసిన దరఖాస్తును పశు సంవర్ధక, డెయిరీ విభాగానికి పంపిస్తారు. దరఖాస్తుదారు ఆన్లైన్లో అవసరమైన పత్రాలను దాఖలు చేయాలి. పశు సంవర్ధక శాఖలోని సాధికారిక కమిటీ అప్లికేషన్‌ను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటుంది. అన్నీ సంతృప్తికరంగా ఉంటే ఎన్వోసీని ఆన్లైన్లో జారీ చేస్తారు. -
రామప్పపై ఏఎస్ఐ మంట!
సాక్షి, హైదరాబాద్: భూపాలపల్లి జిల్లా వెంకటాపూర్ సమీపంలో సింగరేణి సంస్థ ప్రతిపాదించిన ‘పీవీ నరసింహారావు భూఉపరితల గనుల (ఓపెన్ కాస్ట్ మైన్)’ అంశం వివాదానికి కారణమైంది. ఇప్పటికే ప్రతిపాదిత గనులతో అక్కడికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి ముప్పు వస్తుందన్న అభ్యంతరాలు ఉన్నాయి. అలాంటిది బొగ్గు గనుల ఏర్పాటు కోసం నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీపై కేంద్ర పురావస్తుశాఖ సానుకూల నిర్ణయం తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. యునెస్కో గుర్తింపు పొందిన కట్టడం రామప్ప దేవాలయం ఇటీవలే యునెస్కో నుంచి ప్రపంచ వారసత్వ సంపద హోదా గుర్తింపు దక్కించుకున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఆ ఘనత సాధించిన తొలి కట్టడంగా రామప్ప ఆలయం రికార్డు సృష్టించింది. దీనికి సమీపంలోనే సింగరేణి బొగ్గు గనుల తవ్వకాలకు ప్రతిపాదనలు వచ్చాయి. దీనికి సంబంధించి బెంగళూరులోని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ప్రాంతీయ కార్యాలయం ఎన్ఓసీ జారీకి సానుకూలత వ్యక్తం చేసింది. నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక, డిపార్ట్మెంట్ ఆఫ్ మైనింగ్ ఇంజనీరింగ్‌లను సంప్రదించి.. సింగరేణి హామీల ఆధారంగా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు పేర్కొంది. కానీ దీనిపై రామప్ప ఆలయ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్న ‘ది పాలంపేట ఏరియా డెవలప్మెంట్ అథారిటీ’ విస్మయం వ్యక్తం చేసింది. ప్రతిష్టాత్మకమైన యునెస్కో గుర్తింపు సాధించిన తరుణంలో, దానికి విఘాతం కలిగించే ఏ చిన్న చర్యను కూడా ఉపేక్షించకుండా అభ్యంతరం చెప్పాల్సిన ఏఎస్ఐ.. అందుకు విరుద్ధంగా వ్యవహరించడం ఏమిటని మండిపడింది. ఈ అథారిటీలో కీలక సభ్యత్వమున్న కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. మరోవైపు బొగ్గు గనులు ప్రారంభమైతే రామప్ప ఆలయానికి జరిగే నష్టం ఏమిటో తేల్చాలని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎస్‌జీఆర్‌ఐ), జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ)లను పాలంపేట డెవలప్మెంట్ అథారిటీ కోరింది. దీనితోపాటు బొగ్గు గనులతో జీవావరణం, సామాజిక, ఆర్థిక ప్రభావంపై అధ్యయనం చేయాలని సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్‌ను కోరాలని నిర్ణయించింది. ఈ సంస్థలు తేల్చే అంశాల ఆధారంగా బొగ్గు గనుల తవ్వకం ఆధారపడి ఉంది. మూడు కీలక అంశాలతో.. పాలంపేట డెవలప్మెంట్ అథారిటీ భేటీలో కాకతీయ హెరిటేజ్ ట్రస్టు పక్షాన ప్రొఫెసర్ పాండురంగారావు ప్రధానంగా మూడు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. బొగ్గు గనుల తవ్వకం వల్ల రామప్ప ఆలయానికి ప్రమాదం పొంచి ఉందని స్పష్టం చేశారు. శాండ్ బాక్స్ పునాదుల్లోంచి ఇసుక జారిపోయే ప్రమాదం రామప్ప దేవాలయాన్ని నాటి కాకతీయ నిపుణులు శాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మించారు. భూకంపాలు వంటి కుదుపులు ఏర్పడ్డా.. నిర్మాణానికి ఇబ్బంది రాకుండా పునాదుల్లో ఇసుకను నింపారు. ఆలయ ప్రదక్షిణ పథం నుంచి దిగువకు దాదాపు 18 అడుగుల మందంతో ఇసుక ఉంది. ఈ ఇసుక పదిలంగా ఉంటేనే నిర్మాణం స్థిరంగా ఉంటుంది. రామప్ప ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో 300 మీటర్ల లోతు వరకు బొగ్గు గనులను తవి్వతే.. భూమి పొరల్లో నీటి ప్రవాహ దిశను మార్చే కదలికలు (హైడ్రాలిక్ గ్రేడియంట్స్) ఏర్పడుతాయి. రామప్ప ఆలయం ఎగువన దాదాపు 3 టీఎంసీల సామర్ధ్యమున్న రామప్ప చెరువు ఉంది. హైడ్రాలిక్ గ్రేడియంట్స్ వల్ల చెరువు నీళ్లతో ఆలయ పునాదుల్లోని ఇసుకను కోత గురై.. క్రమంగా ఆలయ పునాదులు అస్థిరమయ్యే ప్రమాదం ఉంది. గని ఉన్నంత కాలం కంపనాల ప్రభావం బొగ్గు గనుల్లో నిరంతరం పేలుళ్లు జరుపుతూ ఉంటారు. 300 మీటర్ల లోతు వరకు తవ్వే క్రమంలో జరిపే పేలుళ్లు భూమి పొరల్లో కంపనాలు సృష్టిస్తాయి. రామప్ప ఆలయ నిర్మాణం నాజూకుగా ఉంటుంది. పేలుళ్ల కంపనాల వల్ల రాళ్లలో కదలికలు ఏర్పడి కట్టడం ధ్వంసమయ్యే ప్రమాదం ఉంటుంది. బొగ్గు తరలింపు ధూళితో ఆలయ నిర్మాణానికి ప్రమాదం ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్.. సమీపంలోని నూనె శుద్ధి కర్మాగారాల కాలుష్యం వల్ల దెబ్బతింటున్నట్టు ఇప్పటికే తేలింది. ఇప్పుడు రామప్పకు గనుల తవ్వకం, లారీల్లో బొగ్గు తరలింపుతో.. ధూళి కణాలు రామప్ప ఆలయం మీద పడుతూ.. రసాయనిక చర్యకు కారణమవుతాయి. ఇది నిర్మాణానికి ప్రమాదం తెచ్చి పెడుతుంది. -
ఆకాశ భవనాలు.. రోడ్లపై వాహనాలు ‘ఇంపాక్ట్’..పడేదెప్పుడు?
సాక్షి, హైదరాబాద్ : ట్రాఫిక్‌లో గంటల కొద్దీ ప్రయాణం.. నివాస, వాణిజ్య సముదాయాల నుంచి ఒక్కసారిగా బయటికొచ్చే జనంతో రోడ్లు జామ్.. మూడు, నాలుగు కిలోమీటర్ల దూరానికీ అరగంటకుపైగా పట్టడం.. ఇప్పటికే హైదరాబాద్ వాసులు ఎదుర్కొంటున్న సమస్య ఇది. దీనికితోడు భవిష్యత్తులో మరింత పెరిగే ట్రాఫిక్ చిక్కులకు పరిష్కారంగా తెరపైకి వచ్చినదే ‘ట్రాఫిక్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (టీఐఏ)’. కొత్తగా భారీ భవనాలు, అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలు నిర్మించదలిస్తే.. ఆయా రహదారుల్లో ఇప్పటికే ఉన్న ట్రాఫిక్, అదనంగా పెరిగే ట్రాఫిక్‌ను పరిశీలించి తగిన నిబంధనలతో అనుమతులు ఇవ్వడమే ‘టీఐఏ’. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) నాలుగేళ్ల కిందటే ఈ మేరకు ప్రతిపాదనలు చేసింది. ఇప్పటికీ అడుగు ముందుకు పడలేదు. ఇదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రద్దీ ప్రదేశాలు, ప్రధాన రోడ్ల పక్కన భారీ నివాస, వాణిజ్య భవనాలు వెలుస్తూనే ఉన్నాయి. ట్రాఫిక్ ఇబ్బంది పెరిగి పోతూనేఉంది. ‘ట్రాఫిక్ ఇంపాక్ట్’ అంచనా ఇలా.. ఉదాహరణకు ఒక మల్టీప్లెక్స్ భవనం నిర్మించేందుకు అనుమతి ఇవ్వాలంటే భవనం బిల్టప్ ఏరియా, అందులోని సినిమా స్క్రీన్లు, షాపులు ఇలా అన్నీ పరిగణనలోకి తీసుకుంటారు. వీటికి వచ్చిపోయే వారి సంఖ్య, ఆ ప్రాంతంలో పెరగబోయే రద్దీ, సినిమా షోల ప్రారంభ, ముగింపు సమయాల్లో ప్రభావం తదితర అంశాలు బేరీజు వేస్తారు. అక్కడ ప్రస్తుతం ఉన్న రహదారి òపెరగ నున్న రద్దీకి సరిపోతుందో లేదో అంచనా వేస్తారు. ఒకవేళ సరిపోని పక్షంలో రహదారిని విస్తరించేందుకున్న అవకాశాలు, ప్రత్యామ్నాయ మార్గాలు, సమీపంలోని జంక్షన్లు, వాటి వద్ద ఏర్పడబోయే ట్రాఫిక్ పరిస్థితి వంటి వివిధ అంశాలను పరిశీలి స్తారు. తర్వాత షరతులతో అనుమతులిస్తారు. ట్రాఫిక్ సమస్య తలెత్తే పరిస్థితి ఉంటే.. దాని పరిష్కారానికి వీలుగా బిల్డర్ ఎక్కువ సెట్బ్యాక్లు వదలాల్సి ఉంటుంది. లేదా లింక్ రోడ్ల వంటి వాటికి చాన్స్ ఉంటే వేసేందుకు అనుమతిస్తారు. ఒకవేళ జీహెచ్ఎంసీయే రోడ్లు వేస్తే అందుకయ్యే వ్యయాన్ని బట్టి ఇంపాక్ట్ ఫీజు వసూలు చేస్తారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎలాంటిప్రత్యా మ్నాయ పరిష్కారాలు లేని పక్షంలో బహుళ అంతస్తులకు అనుమతులు ఇవ్వకుండా నిరాకరిస్తారు. ఒక్క అడుగూ పడక.. హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ మ రింత జటిలం కాకుండా ఉండేందుకు‘ఇంపాక్ట్’ ఆలోచన చేశారు. కొత్తగా నిర్మించే భవ నాల వల్ల ఆ ప్రాంతంలో ఎంత రద్దీ పెరగనుంది? అప్ప టికే ఉన్న ట్రాఫిక్ ఎంత? కొత్తగా పెరగబోయే వాహనాలు ఎన్ని ఉంటాయి? ఎన్ని వాహనాలకు పార్కింగ్ సదుపాయం ఉంది? పెరిగే ట్రాఫిక్ నుంచి ఉపశమనంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అన్న అంశాలతో ‘ట్రాఫిక్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (టీఐఏ)’ సర్టిఫికెట్‌ను జత పరిచేలా భవన నిర్మాణ నిబంధనల్లో పొందు పర్చేందుకు సిద్ధమయ్యారు. ఇది జరిగి నాలుగేళ్లయినా.. ఇప్పటికీ ముందడుగు పడలేదు. ప్రధాన ప్రాంతాల్లోనూ ఆకాశ హర్మ్యాలు కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఆకాశ హర్మ్యాలు పెరుగుతున్నాయి. ఎల్బీ నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్‌సిటీ వంటి అత్యధిక రద్దీ ఉండే ప్రధాన ప్రాంతాల్లోనూ ఈ పరిస్థితి కనిపిస్తోంది. దీనితో ప్రభుత్వం వేల కోట్ల ఖర్చుతో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించినా ట్రాఫిక్ సమస్యలు తగ్గకపోగా.. పెరిగిపోతూనే ఉన్నాయి. బంజారాహిల్స్‌లో ఇదివరకు ఉన్న భవనాల గరిష్ట ఎత్తు నిబంధనలను సైతం సవరించి ఆకాశ హర్మ్యాలు అనుమతులు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ ఇక్కట్లున్న కేబీఆర్ పార్కు చుట్టుపక్కల ప్రాంతాల్లో సమస్య మరింత పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. గతేడాది వంద ఆకాశ హర్మ్యాలు: గతంలో జీహెచ్ఎంసీ వెలుపల మాత్రమే ఆకాశ హర్మ్యాలను ఎక్కువగా నిర్మించేవారు. ఇటీవలి కాలంలో బల్దియా పరిధిలోనూ ఇవి పెరుగుతున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో దాదాపు వంద హైరైజ్ భవనాలకు జీహెచ్ఎంసీ అనుమతులిచ్చింది. అంతకుముందు ఏడాది వాటి సంఖ్య 80కిపైనే ఉంది. వారిని తప్పనిసరి చేస్తే మంచిదే.. పెద్ద బిల్డర్లు హైరైజ్, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులలో పార్కింగ్ స్థలం వినియోగం కోసం ట్రాఫిక్ కన్సల్టెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ నిబంధన తప్పనిసరి చేస్తే ప్రతీ ఒక్కరూ పాటిస్తారు. దీనితో ప్రాజెక్టుతోపాటు సదరు ప్రాంతంపై ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు అవకాశం ఉంటుంది. డివైడర్లు, బారికేడ్లు, వీధి దీపాలు వంటి ట్రాఫిక్ వ్యయా లను సీఎస్ఆర్ కింద బిల్డర్ చేపట్టేలా చేయాలి. – నరేంద్ర కుమార్ కామరాజు, ప్రణీత్ గ్రూప్ ఎన్ఓసీ ఉంటేనే.. భవనాల నుంచి వచ్చే వాహనాలు, బయట పార్కింగ్ చేసే వాహనాలతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ పెరుగుతుంది. అందుకే వాణిజ్య సముదాయాలతో పాటు హైరైజ్ నివాస భవనాలకు కూడా ట్రాఫిక్ పోలీసు ఎన్ఓసీ ఉంటేనే అనుమతులు జారీ చేయాలి. 25 అంతస్తులకు మించిన ప్రతి భవనానికి ఈ విధానాన్ని అమలు చేస్తే మంచిది. – కె.నారాయణ్ నాయక్, ట్రాఫిక్ జాయింట్ సీపీ, సైబరాబాద్ -
పంజాబ్ కింగ్స్‌కు ఏకకాలంలో గుడ్‌న్యూస్.. బ్యాడ్‌న్యూస్
మరో వారం రోజుల్లో(మార్చి 31న) ఐపీఎల్ 16వ సీజన్‌కు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్‌కు ఏకకాలంలో గుడ్‌న్యూస్.. బ్యాడ్‌న్యూస్ వచ్చాయి. గుడ్‌న్యూస్ ఏంటంటే విధ్వంసకర ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఐపీఎల్లో ఆడేందుకు ఎన్వోసీ క్లియరెన్స్ ఇచ్చింది. అదే సమయంలో మరో ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టోకు మాత్రం ఇంకా ఎన్వోసీ క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో బెయిర్ స్టో ఐపీఎల్ 16వ సీజన్ ఆడేది అనుమానమే. ఇంగ్లండ్‌కే చెందిన మరో స్టార్ క్రికెటర్ సామ్ కరన్ మాత్రం పంజాబ్ కింగ్స్‌కు అందుబాటులో ఉండనున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా రికార్డులకెక్కిన సామ్ కరన్‌ను పంజాబ్ కింగ్స్ రూ.18.25 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా అక్టోబర్‌లో మ్యాచ్ సందర్భంగా కాలు విరగడంతో బెయిర్ స్టో ఆటకు దూరమయ్యాడు. ఆ తర్వాత సర్జరీ చేయించుకొని కోలుకున్నాడు. ప్రస్తుతం ఈసీబీ పర్యవేక్షణలో ఉన్న బెయిర్ స్టో ఇంకా ఫిట్నెస్ సాధించలేదు. ఈ క్రమంలోనే ఐపీఎల్‌కు ఎన్వోసీ ఇవ్వడానికి ఈసీబీ నిరాకరించింది. దీంతో అతను ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో జరగనున్న యాషెస్ సిరీస్ వరకు బెయిర్ స్టో అందుబాటులోకి వస్తాడని ఈసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక డిసెంబర్ 2022లో జరిగిన మినీ వేలంలో పంజాబ్ కింగ్స్ బెయిర్ స్టోను రూ. 6.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక గతేడాది పాకిస్తాన్‌తో రావల్పిండి టెస్టు అనంతరం మోకాలి గాయంతో ఆటకు దూరమైన లియామ్ లివింగ్‌స్టోన్ ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. పంజాబ్ కింగ్స్ ఇతన్ని రూ. 11.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. గాయం నుంచి కోలుకున్న తర్వాత లంకాషైర్ తరపున కౌంటీ క్రికెట్ ఆడాడు. ఈసీబీ ఎన్వోసీ క్లియరెన్స్ ఇచ్చినప్పటికి లివింగ్‌స్టోన్ ఎప్పుడు వస్తాడనే దానిపై క్లారిటీ లేదు. మరోవైపు సామ్ కరన్ మాత్రం ఐపీఎల్ 2023 సీజన్‌కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అతనితో పాటు జోఫ్రా ఆర్చర్(ముంబై ఇండియన్స్), బెన్ స్టోక్స్(సీఎస్కే), మార్క్‌వుడ్(లక్నో సూపర్ జెయింట్స్) తదితరులు ఐపీఎల్ 16వ సీజన్లో పాల్గొననున్నారు. IPL 2023లో ఇంగ్లండ్ ఆటగాళ్లు సామ్ కరన్ (పంజాబ్ కింగ్స్), బెన్ స్టోక్స్ (చెన్నై సూపర్ కింగ్స్), హ్యారీ బ్రూక్ (సన్‌రైజర్స్ హైదరాబాద్), ఫిల్ సాల్ట్ (ఢిల్లీ క్యాపిటల్స్), రీస్ టాప్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), ఆదిల్ రషీద్ (సన్‌రైజర్స్ హైదరాబాద్), జో రూట్ (రాజస్థాన్ రాయల్స్) , లియామ్ లివింగ్‌స్టోన్ (పంజాబ్ కింగ్స్), జానీ బెయిర్‌స్టో (పంజాబ్ కింగ్స్), మొయిన్ అలీ (చెన్నై సూపర్ కింగ్స్), జోఫ్రా ఆర్చర్ (ముంబై ఇండియన్స్), జోస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్), డేవిడ్ విల్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) మరియు మార్క్ వుడ్ (లక్నో సూపర్ జెయింట్స్) View this post on Instagram A post shared by S A M C U R R A N (@samcurran58) #SherSquad, we need your undying love and support this year more than ever. We are in this together! ♥️#SaddaPunjab #PunjabKings #TATAIPL pic.twitter.com/CnS9DNlcqJ — Punjab Kings (@PunjabKingsIPL) March 21, 2023 చదవండి: క్యాన్సర్ మహమ్మారి నుంచి బయటపడిన టెన్నిస్ దిగ్గజం మ్యాచ్ ఓడిపోయినా రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. -
ఆ కేసు విచారణకు స్వీకరిస్తేనే ఎన్ఓసీ అవసరం
సాక్షి, అమరావతి: ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి, అతని పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నప్పుడు, ఆ క్రిమినల్ కేసును సంబంధిత కోర్టు విచారణకు(కాగ్నిజెన్స్) స్వీకరించినప్పుడు మాత్రమే.. నిందితుడు విదేశాలకు వెళ్లాలంటే సంబంధిత కోర్టు నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. కేసు సంబంధిత కోర్టులో పెండింగ్‌లో ఉన్నంత మాత్రాన, ఆ కేసును పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుగా భావించడానికి వీల్లేదంది. సంబంధిత కోర్టు ఆ కేసును విచారణకు తీసుకోనంత వరకు విదేశీయానం విషయంలో ఆ కోర్టు నుంచి ఎన్ఓసీ అవసరం లేదంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ఇటీవల తీర్పునిచ్చారు. పిటిషనర్ నుంచి స్వాధీనం చేసుకున్న పాస్‌పోర్ట్‌ను తిరిగి అతనికి ఇచ్చేయాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. కేసు విచారణకు హాజరయ్యే హామీతో రూ.2 లక్షలను విజయవాడ రెండో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో డిపాజిట్ చేయాలని పిటిషనర్‌ను ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లా, ఆలమూరు మండలానికి చెందిన డీవీ సూర్యనారాయణమూర్తిపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. ఖతార్‌లో ఉద్యోగం చేస్తున్న సూర్యనారాయణమూర్తి మన దేశానికి రాగానే విజయవాడ దిశా పోలీసులు అతని పాస్‌పోర్టును సీజ్ చేశారు. అంతేకాక అతని పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకోవాలంటూ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధి కారికి లేఖ రాశారు. దీనిపై సూర్యనారాయణమూర్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
పొలం అమ్మడం కోసం ...ఏకంగా కలెక్టర్, జేసీ సంతకాలనే ఫోర్జరీ....
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: ఏకంగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సంతకాలనే ఫోర్జరీ చేశారు. వాటి ఆధారంగా నకిలీ నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) సృష్టించారు. దానిపై ఓ ప్రజాప్రతినిధికి అనుమానం రావడం, ఆయన కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో అసలు బాగోతం వెలుగు చూసింది. అధికార వర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కూడేరు మండలం కమ్మూరు గ్రామ సర్వే నంబర్ 525, 526లో బోయ నారాయణప్ప పేరిట 34.86 ఎకరాల పొలముంది. దీనికి 1954వ సంవత్సరంలోనే డి.పట్టా మంజూరైంది. ఈ భూమిని ఇటీవల అనంతపురం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కొని.. అగ్రిమెంట్ చేసుకున్నాడు. అతను వేరే వ్యక్తికి అమ్మాలనుకుని.. ఎన్ఓసీ కోసం దరఖాస్తు చేశాడు. దానిపై తహసీల్దార్, ఆర్డీఓ సంతకాలు పూర్తయ్యాయి. జేసీ, కలెక్టర్ సంతకాలు చేయాల్సి ఉంది. కానీ అంతలోనే సదరు వ్యక్తి ఓ రెవెన్యూ కార్యాలయంలో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్‌ను ఆశ్రయించి పని త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరాడు. దీంతో కంప్యూటర్ ఆపరేటర్ కలెక్టర్, జేసీ సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ ఎన్ఓసీ సృష్టించి అతనికి అందజేశాడు. ప్రజాప్రతినిధికి అనుమానం రావడంతో.. సదరు ఎన్ఓసీ ఓ ప్రజాప్రతినిధి చేతికి వెళ్లింది. అంత త్వరగా ఎన్ఓసీ రావడంపై ఆయనకు అనుమానం వచ్చింది. ఇదే విషయాన్ని కలెక్టర్ నాగలక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ పరిశీలించి నకిలీదిగా నిర్ధారించారు. దీని సృష్టికర్తలెవరో తేల్చాలంటూ అనంతపురం ఆర్డీఓ మధుసూదన్‌ను ఆదేశించారు. దీంతో ఆయన విచారణ చేపడుతున్నారు. కలెక్టర్, జేసీ సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ ఎన్ఓసీ సృష్టించారని ఆర్డీఓ కూడా నిర్ధారించారు. కంప్యూటర్ ఆపరేటర్ పనేనా? అనంతపురంలో పనిచేస్తున్న పుట్టపర్తి ప్రాంతానికి చెందిన కంప్యూటర్ ఆపరేటర్ నకిలీ ఎన్ఓసీని తయారు చేసినట్లు తెలుస్తోంది. అతనితో పాటు మరొక వ్యక్తి పాత్ర కూడా ఉన్నట్లు సమాచారం. వారిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. సదరు కంప్యూటర్ ఆపరేటర్ టీడీపీ హయాంలోనూ ఇలాంటి పని చేసి అప్పటి జేసీ చేతికి చిక్కినట్లు సమాచారం. అప్పట్లో జిల్లా ఉన్నతాధికారులకు రాజకీయ ఒత్తిళ్లు రావడంతో విషయం బయటకు రాలేదు. (చదవండి: సవతి తల్లి కర్కశం...మేడపై నుంచి తోసి..గొంతు నులిమి) -
ఆ రాష్ట్రంలో 2022 జనవరి 1 నుంచి డీజిల్ వాహనాలు బ్యాన్..!
న్యూఢిల్లీ: 2022, జనవరి 1 నాటికి పదేళ్లు పైబడిన డీజిల్ వాహనాల విషయంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదేళ్లు పైబడిన అన్ని డీజిల్ వాహనాలను డీరిజిస్టర్ చేస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటి) ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ డీరిజిస్టర్డ్ డీజిల్ వాహనాలకు ఎలాంటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్ఓసీ) కూడా జారీ చేయము అని పేర్కొంది. పదేళ్లు పైబడిన డీజిల్ వాహనాలు దిల్లీ రోడ్లపై తిరిగేందుకు అనుమతించొద్దని ఏప్రిల్ 7, 2015న ఎన్టీటీ సంబంధిత శాఖను ఆదేశించింది. అనంతరం దశలవారీగా ఇలాంటి వాహనాలను డీరిజిస్టర్ చేయాలంటూ 2016, జులై 18న ఆదేశాలు జారీ చేసింది. 15 ఏళ్లు పైబడిన వాహనాలకు తొలుత రిజేస్ట్రేషన్ రద్దు చేయాలని స్పష్టం చేసింది. అలాగే దిల్లీ వెలుపల వీటిని నడిపేందుకు నిరభ్యంతర పత్రం కూడా ఇవ్వొద్దని తేల్చి చెప్పింది. ఎన్జీటి ఆదేశాలకు అనుగుణంగా వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఢిల్లీలో 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలను మొదట డీరిజిస్టర్ చేస్తుందని రవాణా శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పదేళ్లు పైబడిన డీజిల్ వాహనాలకు, 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలను దేశంలో ఎక్కడ నడవకుండా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్ఓసీ) కూడా జారీ చేయము అని పేర్కొంది. 10 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలను, 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలను వినియోగించుకోవాలంటే ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే అవకాశం ఉంటుందని ఢిల్లీ రవాణా శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. కొన్ని వారాల క్రితం, ఢిల్లీ ప్రభుత్వం ఈవి కిట్ తో పాత డీజిల్ & పెట్రోల్ వాహనాలను రెట్రోఫిట్ చేయడానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకోకపోతే పాత వాహనాలను స్క్రాప్ చేయాల్సి ఉంటుంది అని తెలిపింది. ఢిల్లీ రవాణా శాఖ, ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు బృందాలు ఇప్పటికే అటువంటి పాత వాహనాలను గుర్తించి అధీకృత విక్రేతల ద్వారా స్క్రాపింగ్ కోసం పంపుతున్నాయి. (చదవండి: ఎంజీ మోటార్స్ అరుదైన ఘనత..! భారత్‌లో తొలి కంపెనీగా..!) -
కాఫీడే టెక్ పార్క్ విక్రయానికి యస్ బ్యాంకు బ్రేక్!
బెంగళూరు: కాఫీడే ఎంటర్ప్రైజెస్ బెంగళూరులో తనకున్న టెక్నాలజీ పార్క్‌ను బ్లాక్‌స్టోన్ గ్రూపునకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకోగా, దీనికి యస్ బ్యాంకు ఆమోదం చెప్పకపోవడంతో నిలిచిపోయినట్టు సమాచారం. కాఫీ డే గ్రూపునకు రుణాలిచ్చిన సంస్థల్లో యస్ బ్యాంకు కూడా ఒకటి. ఈ ఒప్పందానికి యస్ బ్యాంకు ఇప్పటి వరకు నిరభ్యంతర సర్టిఫికెట్ ఇవ్వలేదని ఈ వ్యవహారం గురించి తెలిసిన వర్గాలు చెప్పాయి. కాఫీ డే తీసుకున్న ఇతర రుణాల తాలూకు చెల్లింపులపై హామీ ఇవ్వాలని యస్ బ్యాంకు కోరినట్లు తెలిసింది. ఇతర రుణదాతలంతా ఇప్పటికే కాఫీడే టెక్ పార్క్– బ్లాక్‌స్టోన్ ఒప్పందానికి ఆమోదం తెలిపారని, యస్ బ్యాంకు మాత్రమే ఆమోదం తెలపాల్సి ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి. కాఫీ డేకు చెందిన ట్యాంగ్లిన్ డెవలప్మెంట్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో బెంగళూరులో గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్ నడుస్తోంది. ఈ కంపెనీ యస్ బ్యాంకుకు రూ.100 కోట్లు బకాయి పడింది. కాఫీ డే కూడా యస్ బ్యాంకుకు రూ.1,400 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆకస్మిక ఆత్మహత్య తర్వాత కంపెనీ యాజమాన్యం ఆస్తుల విక్రయం ద్వారా అప్పులు చెల్లించే ప్రయత్నాలు మొదలెట్టింది. ఇందులో భాగంగా గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్‌ను బ్లాక్‌స్టోన్‌కు రూ.2,600– 3,000 కోట్ల విలువకు విక్రయించేందుకు నాన్ బైండింగ్ ఒప్పందం చేసుకుంది. తాజా పరిణామాలతో బీఎస్ఈలో కాఫీడే షేరు సోమవారం 9 శాతం నష్టంతో రూ.43.85 వద్ద క్లోజయింది. -
బురిడీ కాలేజీలు
కర్నూలు(రాజ్‌విహార్): ‘బోధనా’ విలువలు నేర్పించే కళాశాలలే దారి తప్పాయి. ప్రభుత్వ శాఖలను బురిడీ కొట్టించాయి. అనుమతుల కోసం నకిలీ ధ్రువపత్రాలు సమర్పించాయి. అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించిన భద్రతా చర్యలు లేకుండానే అడ్డదారుల్లో అనుమతులు పొందాయి. నకిలీ ఎన్ఓసీలతో ఏకంగా రాయలసీమ యూనివర్సిటీనే బురిడీ కొట్టించాయి. మామూళ్ల మత్తులో జోగిన వర్సిటీ అధికారులు వాటిని పరిశీలించకుండానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. జిల్లా వ్యాప్తంగా 96 బీఈడీ, డీఈడీ బోధనా కళాశాలలు ఉండగా.. వాటిలో 11 మాత్రమే అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) పొంది ఉన్నాయి. మిగిలిన 85 కాలేజీలకు ఎన్ఓసీలు లేవు. ఎన్ఓసీలు ఎందుకు? కళాశాలల్లో చదివే విద్యార్థులు, అధ్యాపకుల భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటలు ఆర్పడానికి తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ పరికరాలు ఏర్పాటు చేయాలి. ఇందుకోసం అగ్ని మాపక శాఖ అధికారుల తనిఖీ అనంతరం పొందే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ను వర్సిటీకి సమర్పించాల్సి ఉంటుంది. 500 చదరపు మీటర్ల విస్తీర్ణం లేదా ఆరు మీటర్ల ఎత్తయిన కళాశాల భవనం ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా అగ్ని మాపక శాఖ సూచించిన మేర భద్రతా చర్యలు చేపట్టాలి. ఫైర్ ఎస్టింగర్లతో పాటు హోజ్‌రీల్ పైపు, ఫైర్ పంప్, భవనం పైన వాటర్ ట్యాంకు ఏర్పాటు చేయాలి. 2007 సంవత్సరానికి ముందునిర్మించిన భవనమైతే ఆఫ్‌లైన్‌లో, ఆ తరువాత నిర్మించి ఉంటే ఆన్లైన్లో ఎన్ఓసీ కోసం అగ్నిమాపక శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత సంబంధిత స్టేషన్ ఫైర్ ఆఫీసర్, జిల్లా ఫైర్ ఆఫీసర్ పరిశీలించి, అన్నీ సక్రమంగా ఉంటే ఎన్ఓసీ జారీ చేస్తారు. నకిలీ ఎన్ఓసీలతో అనుమతులు జిల్లాలో 96 బీఈడీ, డీఈడీ కళాశాలలు ఉండగా.. అందులో 11 మాత్రమే అసలు సర్టిఫికెట్లు పొంది ఉన్నాయి. మిగిలిన వాటికి ఎన్ఓసీలు లేవు. ఇందులో కొన్ని కళాశాలలు చలానా చెల్లించిన రసీదుతో అనుమతులు పొందగా.. మరికొన్ని నకిలీ ఎన్ఓసీలను జత చేసి అనుమతి సంపాదించాయి. వాస్తవానికి బోధనా కళాశాలల్లో రకరకాల చార్జీలు, ఫీజుల పేరుతో విద్యార్థుల నుంచి భారీగా వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ నిబంధనల మేరకు భద్రతా చర్యలు చేపట్టడం లేదు. కళాశాలలకు అనుమతులిచ్చే వర్సిటీ అధికారులు కూడా వచ్చిన ధ్రువపత్రాలు అసలువా.. నకిలీవా? అని చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. వెలుగులోకి వచ్చిందిలా.. ఇటీవలే కొన్ని కళాశాలల ఎన్ఓసీలపై అనుమానం వచ్చిన అగ్నిమాపక శాఖ డీజీ.. ఆ సర్టిఫికెట్ల నిర్ధారణకు జిల్లా ఫైర్ ఆఫీసర్‌ను ఆదేశించారు. అవి నకిలీవని తేలడంతో జిల్లాలోని అన్ని కళాశాలల సర్టిఫికెట్లు పరిశీలించి వాస్తవికతతో కూడిన నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో 96 కళాశాలలల్లో కేవలం 11 ఎన్ఓసీలు మాత్రమే అసలువని తేలింది. నకిలీ ఎన్ఓసీలు, అసలు ఎన్ఓసీలే లేకుండా అనుమతి పొందిన కళాశాలల వివరాలు అక్షరశ్రీ (ఆదోని), అల్ మదీనా (మునగాలపాడు), అంకాలరెడ్డి (ఆళ్లగడ్డ), భారతి (నంద్యాల), బీవీఆర్ (గడివేముల), డాక్టర్ రామలింగారెడ్డి (ఆళ్లగడ్డ), డాక్టర్ కె.వి.సుబ్బారెడ్డి (లక్ష్మీపురం), జి.ఎం కాలేజ్ (నంద్యాల), గీతాంజలి (బి.క్యాంప్, కర్నూలు), జీఎంఆర్ (కవులూరు), జ్ఞానసరస్వతి (బనగానపల్లె), ఇక్బాల్ కాలేజ్ (నాయకల్లు), జేవీఆర్ఆర్ (నంద్యాల), కె.ఇక్బాల్ కాలేజ్ (రుద్రవరం), కేఎండీ ఇక్బాల్ కాలేజ్ (పెద్దపాడు), లిటిల్ ఫ్లవర్ (అయ్యలూరు), మదీనా (బ్రాహ్మణకొట్కూరు), మొహమ్మద్ పాషా కాలేజ్ (బి.క్యాంప్, కర్నూలు), నాయక్ కాలేజీ (దూపాడు), నలంద (ఎమ్మిగనూరు), నేషనల్ కాలేజ్ (ఉలిందకొండ), ప్రభాత్ (పార్నపల్లి), ప్రవీణ్ భాను (ఆళ్లగడ్డ), రాఘవరామ్ (ఆళ్లగడ్డ), రోజా (కోవెలకుంట్ల), సాయిప్రతిభ (కర్నూలు), సాయిశ్రీ (డోన్), సాయినాథ్ రామ్ (కరివేన), ఎస్ఏఎస్ (బ్రాహ్మణకొట్కూరు), శాంతినికేతన్ (లక్ష్మీపురం), శారద (నన్నూరు), సిద్ధార్థ, ఎస్పీజీ (నంద్యాల), ఎస్ఆర్సీ (కర్నూలు), శ్రీలక్ష్మీ (బనగానపల్లె), శ్రీలక్ష్మీనరసింహ (కొలిమిగుండ్ల), శ్రీగాయత్రి (ధర్మవరం), శ్రీలక్ష్మి వెంకటేశ్వర (మామిదాలపాడు), శ్రీరాఘవేంద్ర (నన్నూరు), శ్రీరాఘవేంద్ర (ఎమ్మిగనూరు), శ్రీరాఘవేంద్ర (ఆళ్లగడ్డ), శ్రీరామచంద్ర (పాములపాడు), శ్రీసాయిప్రతిభ (పత్తికొండ), శ్రీ వెంకటేశ్వర (ఆత్మకూరు), సెయింట్ పీటర్స్ (జూటూరు), సుమౌర్య (బి.తాండ్రపాడు), ఠాగూర్ కాలేజీ (కోడుమూరు), తారకరామ (చాపిరేవుల), వరప్రసాద్ రావు కాలేజీ (పంచలింగాల), విజయానికేతన్ (పాణ్యం), విశ్వవాణి (కర్నూలు), జోహార్స్ (ఉడుములపాడు), జుబేదా కాలేజీ (నంద్యాల), కృషి విద్యానికేతన్ (ఆళ్లగడ్డ), జీఎస్ఆర్ (చింతకుంట), మదీనా (కోవెలకుంట్ల), విశ్వశాంతి (ఆళ్లగడ్డ), శ్రీవెంకటేశ్వర విద్యా మందిర్ (నంద్యాల), ఎంఎన్ఆర్ (తిమ్మాపురం), ఎన్ఎంఆర్ (కర్నూలు), సర్వేశ్వర (పసుపల), బృందావన్ (ఆళ్లగడ్డ), కె.నాగిరెడ్డి (దూపాడు), వెంకటేశ్వర్ (నంద్యాల), నాగ సత్యనారాయణ (బొల్లవరం), శ్రీసాయి వెంకటేశ్వర (గూడూరు), కేఎస్ఆర్ (కర్నూలు), శ్రీవైష్ణవి (పత్తికొండ), శ్రీసుధ (డోన్), అనసూయ (తుగ్గలి), సెయింట పీటర్ (ఆదోని), శ్రీవెంకటేశ్వర (ప్యాపిలి), శ్రీలక్ష్మీ శ్రీనివాస (బి.తాండ్రపాడు), శ్రీభారతి (నంద్యాల), నవభారత్ కాలేజ్ (బి.క్యాంప్, కర్నూలు), సుమౌర్య (హొళగుంద), శ్రీశివసాయికృష్ణ కాలేజీ (నందికొట్కూరు). 85 కళాశాలలకు ఎన్ఓసీలు లేవు జిల్లాలో 96 బీఈడీ, డీఈడీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో కేవలం 11 మాత్రమే నిబంధనల ప్రకారం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు పొందాయి. మిగిలిన కళాశాలలు పెట్టిన ఎన్ఓసీలు నకిలీవని తేలింది. కొన్ని కాలేజీలు కేవలం చలానా తీసిన రసీదుతో అనుమతులు పొందాయి. – వి.శ్రీనివాసరెడ్డి, జిల్లా ఫైర్ ఆఫీసర్ -
రోగుల ప్రాణాలతో చెలగాటం!
సాక్షి, విశాఖపట్నం: ప్రైవేటు, ప్రభుత్వాస్పత్రులు.. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. విశాఖ నగరంలో 85 శాతం ఆస్పత్రులు అగ్నిమాపకశాఖ నిర్దేశించిన భద్రతా ప్రమాణాలు లేకుండానే నడుస్తున్నాయి. అగ్నిమాపకశాఖ జారీ చేసిన నిరభ్యంతర పత్రాలు (ఎన్వోసీలు) ఉంటేనే ఆస్పత్రులు నడవాలి. కానీ నగరంలో అలాంటి ఎన్వోసీలతో పనిలేకుండానే ఆస్పత్రుల యాజమాన్యాలు వాటిని నిరభ్యంతరంగా నడుపుతున్నాయి. ఏళ్ల తరబడి ఈ ఆస్పత్రులు ఎన్వోసీలు లేకుండా నడుస్తున్నా అగ్నిమాపకశాఖ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. సంబంధిత ఆస్పత్రులకు కేవలం నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. విశాఖ నగరంలో ప్రభుత్వ ఆస్పత్రులు 58, ప్రైవేటు ఆస్పత్రులు 213 వెరసి 271 ఉన్నాయి. వీటిలో కేవలం 44 (ప్రైవేటువి 38) ఆస్పత్రులు (15 శాతం) మాత్రమే ఎన్వోసీలను కలిగి ఉన్నాయి. మిగిలిన 227 ఆస్పత్రులు అగ్నిమాపకశాఖ నిర్ణీత ప్రమాణాలతో పనిలేకుండా నడుస్తున్నాయి. పలు ప్రైవేటు ఆస్పత్రులు నామమాత్రపు అగ్నిమాపక పరికరాలతో నడుపుతున్నాయి. కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు ఎన్వోసీల కోసం దరఖాస్తు చేసినట్టు చెబుతున్నాయి. ఇంకా చాలా ఆస్పత్రులు ఇప్పటికీ దరఖాస్తే చేయడం మానేశాయి. కానీ నిబంధనల మేరకు అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఎన్వోసీలు పొందలేకపోతున్నాయని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. మరో విశేషమేమిటంటే ఇలా ఎన్వోసీలు పొందని ప్రభుత్వాస్పత్రుల్లో కేజీహెచ్‌తో పాటు విక్టోరియా (ఘోషా) ఆస్పత్రులు కూడా ఉన్నాయి. ఇవీ నిబంధనలు.. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఆస్పత్రుల్లో అగ్నిమాపక నిరోధక పరికరాలు ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి? అన్నదానిపై స్పష్టమైన నిబంధనలు జారీ చేసింది. వీటిని పర్యవేక్షించాలని కొన్నాళ్ల క్రితం అగ్నిమాపకశాఖ అధికారులను ఆదేశించింది. నిబంధనల ప్రకారం ఆస్పత్రి ప్రతి ఫ్లోర్లోనూ ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో స్ప్రింక్లర్లు, ౖఫైర్ డిటెక్షన్ సిస్టం వంటివి ఏర్పాటు చేయాలి. వీటితో పాటు అత్యవసర మెట్ల మార్గం, ర్యాంపులు, ప్రత్యేక ఫైర్ పంపులు ఉండాలి. ఇంకా అండర్‌గ్రౌండ్‌లో నిమిషానికి 1,620 లీటర్ల వేగంతో నీటిని పంప్ చేయగలిగే 50 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న నీటి ట్యాంకును ఏర్పాటు చేయాలి. కానీ చాలా ఆస్పత్రుల్లో ఇలాంటివేమీ లేవు. దీంతో అగ్నిమాపకశాఖ అధికారులు సంబంధిత ఆస్పత్రుల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. దీనిపై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులకు కూడా రెండుసార్లు లేఖలు రాసినా అటు నుంచి స్పందన లేదని అగ్నిమాపకశాఖ అధికారులు చెబుతున్నారు. నిర్దేశిత ప్రమాణాలు లేకుండా నడుస్తున్న ఈ ఆస్పత్రుల్లో ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే పరిస్థితి ఏమిటన్న దానిపై ఆందోళన వ్యక్తమవుతోంది. నగరంలో ఫైర్ ఎన్వోసీ పొందని ప్రైవేటు ఆస్పత్రుల్లో కొన్ని.. ఆస్పత్రి పేరు ప్రాంతం ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ హనుమంతవాక లాజరస్ హాస్పిటల్ వాల్తేరు మెయిన్‌రోడ్డు సూర్య హాస్పిటల్ మహరాణిపేట శంకర్ ఫౌండేషన్ ఐ హాస్పిటల్ వేపగుంట వాసన్ ఐ కేర్ హాస్పిటల్ రామ్‌నగర్ ఏఎంజీ రూత్ డిచ్మన్ హాస్పిటల్ నక్కవానిపాలెం సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ మహరాణిపేట కనకదుర్గ నర్సింగ్‌హోం జిల్లాపరిషత్ గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రుషికొండ అనిల్ నీరుకొండ ఎన్ఆర్ఐ హాస్పిటల్ సంగివలస లైఫ్‌కేర్ మల్టిస్పెషాలిటీ హాస్పిటల్ కంచరపాలెం ఏసియన్ సూపర్ స్పెషాలిటీ ఈఎన్టీ ఆస్పత్రి పెదవాల్తేరు వైష్ణవి హాస్పిటల్ కలెక్టరేట్–బీచ్‌రోడ్డు లోటస్ హాస్పిటల్ గోపాలపట్నం మాక్స్ విజన్ ఐ హాస్పిటల్ డైమండ్‌పార్క్ ఆర్కే హాస్పిటల్ గాజువాక రెండోసారి నోటీసులిస్తాం.. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని, ఎన్వోసీలు సమర్పించని ఆస్పత్రులకు ఇప్పటికే ఒకసారి నోటీసులు జారీ చేశారు. 30 నుంచి 50 రోజుల్లో వారి నుంచి సమాధానం రావాల్సి ఉంది. ఇప్పటికీ చాలా ఆస్పత్రుల నుంచి స్పందన లేదు. వీటికి త్వరలోనే రెండోసారి నోటీసులిస్తాం. అప్పటికీ స్పందించకపోతే ప్రాసిక్యూషన్ కోసం ఫైర్ సర్వీస్ డైరెక్టర్ జనరల్‌కు సిఫార్సు చేస్తాం. –ఇ. స్వామి, రీజనల్ ఫైర్ సేఫ్టీ అధికారి, జీవీఎంసీ. -
ఇటు పరిహారం.. అటు రికవరీ!
సాక్షి, జడ్చర్ల టౌన్ : వారందరూ ముంపు గ్రామాల రైతులు.. ఉన్న పొలం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కోల్పోతున్నారు.. అంతకుముందే ఆ భూములపై బ్యాంకులో రుణం తీసుకున్నారు... ఇప్పుడు పరిహారం వస్తున్నందున రుణం చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు ఒత్తిడి తీసుకొస్తుండడం ఆరోపణలకు తావిస్తోంది.. ఇది మొదటి దశేనని, రెండో దశ పరిహారం రాగానే రుణం చెల్లిస్తామని రైతులు చెబుతుండగా.. మొత్తం భూములే కోల్పోతున్నందున రుణం రికవరీ చేసుకునేందుకు తమకు మరో మార్గం లేదని బ్యాంకు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిహారం చెక్కులను కళ్లతోనైనా చూసుకోకుండానే లాక్కోవడం ఎంతవరకు సబబంటూ జడ్చర్ల తహశీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ఆందోళనకు దిగారు. 273 ఎకరాలకు పరిహారం జడ్చర్ల మండలం ఖానాపూర్ గ్రామంలో వ్యవసాయ పొలాలు మొత్తం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఉదండాపూర్ రిజర్వాయర్‌లో 800 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి. నిందులో 273 ఎకరాలకు సంబంధించి రూ.1,49,09,375 పరిహారం విడుదలైంది. ఈ డబ్బుకు సంబంధించి రైతులకు చెక్కులను తహసీల్దార్ కార్యాలయంలో అందజేస్తున్నారు. ఈ మేరకు గురువారం 75మంది రైతులకు జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయంలో చెక్కులు ఇవ్వగా.. అక్కడకు కారుకొండ కెనరాబ్యాంక్ ఇన్చార్జి రాజేష్ చేరుకుని 12 మంది రైతుల నుంచి చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. ఆ చెక్కులను రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామని.. వారం తర్వాత రుణం పోను మిగతా నగదు తీసుకోవచ్చని తెలిపారు. తహసీల్ వద్ద ఆందోళన ముంపు రైతులు సోమవారం జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయంలో చెక్కులు తీసుకునేందుకు వచ్చారు. అయితే బ్యాంక్ ఇన్చార్జి రాజేష్ వచ్చే వరకు అధికారులు చెక్కులు ఇవ్వలేదు. సదరు అధికారి వచ్చాక చెక్కులు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధం కాగానే.. తనకు అందజేయాలని బ్యాంకు అధికారి కోరాడు. దీంతో రైతులు చెక్కులు తీసుకోకుండా ఆందోళనకు దిగారు. ఇవి మొదటి విడతే అయినందున రెండో విడత చెక్కులు వచ్చాక రుణం చెల్లిస్తామని బదులిచ్చారు. ఇలా ఇరువర్గాల వాదనలతో చెక్కుల పంపిణీ నిలిచిపోయింది. 1,200ఖాతాలు.. రూ.12కోట్ల రుణం నవాబుపేట మండలం కారుకొండ గ్రామంలో కెనరాబ్యాంక్ ఏర్పాటు చేశారు. బ్యాంకు పరిధి లో ఖానాపూర్, కారుకొండ గ్రామాలు ఉన్నా యి. రెండు గ్రామాల్లో 1,200ఖాతాలు రైతులకు సంబంధించి ఉండగా ప్రస్తుతం రూ. 12కోట్ల వ్యవసాయ రుణాలు రికవరీ కావాల్సి ఉంది. వీటిలో సగభాగం ఖానాపూర్ గ్రామ రైతులవే. ప్రభుత్వం ఇటీవల కొత్త పాస్‌పుస్తకా లు పంపిణీ చేసినప్పటికీ ఖానాపూర్ ముంపుకు గురవుతుండటంతో ఇక్కడ రైతుల కు రాలేదు. ప్రస్తుతం పరిహారం చెక్కులు వస్తుం డడంతో బ్యాంక్ అధికారులు తహసీల్‌కు చేరుకున్నారు. అయితే, కలెక్టర్‌తో సంప్రదించి లీడ్‌బ్యాంక్ మేనేజర్‌కు ముందుస్తుగా సమాచారం ఇచ్చాకే రికవరీ చేస్తున్నామని చెబుతున్నారు. బలవంతంగా చెక్ తీసుకున్నారు నాకు మొత్తం రూ.18లక్షల చెక్ వచ్చింది. క్రాప్‌లోన్ రూ.10వేలు మాత్రమే ఉంది. దీనికోసం నా చెక్ మొత్తం తీసుకుని ఖాతాలో జమ చేస్తామంటూ తీసుకున్నారు. నా ఇష్టంతో చెక్ ఇవ్వలేదు. ఓ వైపు పొలాలు పోయి బాధలో ఉంటే బ్యాంక్ అధికారులు చెక్కులు లాక్కోవటం సబబు కాదు. – చాకలి చిన్న రాములు, ఖానాపూర్ కొద్ది మొత్తమే వచ్చింది.. నా భూమి మొత్తం 8ఎకరాలు పోతుంది. అంత భూమికి డబ్బులు రాలే. సగం డబ్బులు అంటే రూ.16.38 లక్షలే వచ్చాయ్. నా క్రాప్ లోన్ రూ.1.10లక్షలే ఉంది. రెండో విడత డబ్బు వచ్చాక రుణం చెల్లిస్తానన్నా వినకుండా చెక్ లాగేసుకున్నారు. – ఊశన్న, ఖానాపూర్ మేం ఎన్ఓసీ ఇస్తేనే పాస్ అవుతుంది.. ఖానాపూర్ రైతుల క్రాప్ లో న్ బకాయిలు ఇప్పుడు వ సూలు చేసుకోవాల్సిందే. భూములు ముంపునకు గురవుతున్నందున ఆ త ర్వాత వారు రుణం చెల్లించలేరు. ఇన్నాళ్లు సేవలందించిన మా బ్యాంకును కాదని కొందరు రైతులు పరిహారం చెక్కులను ఇతర బ్యాంకుల్లో వేసుకుని డ్రా చేసుకుంటున్నారు. అందుకోసం లీడ్‌బ్యాంక్ మేనేజర్‌తో సంప్రదించి ఇకపై మా బ్యాంకు ఎన్ఓసీ ఇస్తేనే ఏ బ్యాంకులోనైనా పాస్ అయ్యేలా చర్యలు తీసుకోనున్నాం. – రాజేష్, కెనరా బ్యాంక్ ఇన్చార్జి, కారుకొండ -
ఎన్ఓసీ ఎప్పటికో?
సాక్షి, సిటీబ్యూరో : హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) లే అవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల క్లియరెన్స్ ప్రక్రియ గడువు మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. ఈ దశలో నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ల (ఎన్ఓసీ) కోసం దరఖాస్తుదారులు, హెచ్ఎండీఏ అధికారులు నానాపాట్లు పడుతున్నారు. హెచ్ఎండీఏనే స్వయంగా చొరవ తీసుకున్నా తొమ్మిది వేల దరఖాస్తులకు సంబంధించి ఇప్పటి వరకు ఎన్ఓసీలు జారీ కాలేదు. ఈ విషయంలో దరఖాస్తుదారులతోపాటు హెచ్ఎండీఏ అధికారులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఎదుర్కొన్న అనుభవాలే హెచ్ఎండీఏ అధికారులకు ఎదురవుతుండటంతో ఏమి చేయాలో పాలుపోలేని పరిస్థితి ఏర్పడింది. ఆయా జిల్లాల కలెక్టర్ల మార్గదర్శనంలో తహసీల్దార్లు, రెవెన్యూ విభాగం అధికారుల చుట్టూ తిరుగుతున్నా అనుకున్నంత వేగంగా ఎన్వోసీలు హెచ్ఎండీఏ చేతికి అందడం లేదు. హెచ్ఎండీఏకు అందిన లక్షా 75 వేలకు పైగా దరఖాస్తుల్లో లక్షా 2,500లకు ఆమోదముద్ర పడింది. సీలింగ్ ల్యాండ్ అని, ప్రభుత్వ భూమిలో ఉందంటూ, నాలాలో ప్లాటు వస్తుందంటూ...ఇలా దాదాపు తొమ్మిదివేల దరఖాస్తులకు ఎన్ఓసీలు తేవాలంటూ గతంలో షార్ట్‌ఫాల్ పంపిన హెచ్ఎండీఏ అధికారులు వారి నుంచి వ్యతిరేకత రావడంతో తామే స్వయంగా తెచ్చేందుకు గతనెలలో ప్లాన్ చేశారు. ఈ మేరకు హెచ్ఎండీఏ పరిధిలోని జిల్లాల కలెక్టర్లకు లేఖలు కూడా రాశారు. ఆయా జిల్లాల కలెక్టర్ల మార్గదర్శనంలో తహసీలార్లు, రెవెన్యూ విభాగ అధికారులతో సమావేశమయ్యారు. అయినా సామాన్యుడి మాదిరిగానే హెచ్ఎండీఏ అధికారులు వారిచుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇప్పటివరకు కేవలం మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా నుంచి 183 ఎన్వోసీలు తీసుకురాగలిగారు. మిగతా రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల నుంచి ఇప్పటివరకు ఒక్క ఎన్ఓసీ కూడా తేలేకపోయారు. రెవెన్యూ విభాగం అధికారులను తరచూ కలుస్తున్నా ఎన్ఓసీలు జారీ చేయడంలో మాత్రం ఆలస్యమవుతోందని హెచ్ఎండీఏ అధికారులు చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పటికైనా ఆ విభాగం అధికారులు మేల్కొని ఎన్ఓసీలు ఇస్తే సాధ్యమైనంత త్వరగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్లియర్ చేస్తామని చెబుతున్నారు. ఫీజు సమాచారం అందినా చెల్లించడంలో అనాసక్తి... ఎల్ఆర్ఎస్ దరఖాస్తు పరిశీలన ప్రక్రియ టైటిల్ స్కుృటినీ, టెక్నికల్ స్కుృటినీ పూర్తయిన తర్వాత సక్రమమని తేలితే క్లియరెన్స్ ఇస్తారు. ఎల్ఆర్ఎస్, నాలా ఫీజు చెల్లించాలంటూ సదరు దరఖాస్తుదారుడి సెల్‌నంబర్‌కు ఎస్ఎంఎస్లు పంపుతారు. అది చెల్లించగానే ఫైనల్ ప్రొసిడింగ్స్ జారీ చేస్తారు. ఇలా హెచ్ఎండీఏకు వచ్చిన లక్షా 75 వేల దరఖాస్తుల్లో లక్షా 2,500 దరఖాస్తులను క్లియర్ చేశారు. దాదాపు తొమ్మిది వేల దరఖాస్తులు ఎన్ఓసీల రూపంలో పెండింగ్‌లో ఉన్నాయి. మిగిలిన 63,500 దరఖాస్తులను ఓపెన్ స్పేస్, రిక్రియేషనల్, వాటర్ బాడీ, మానుఫ్యాక్చరింగ్, సెంట్రల్ స్క్వేర్, ట్రాన్స్‌పొర్టేషన్, బయో కన్సర్వేషన్, ఫారెస్ట్ జోన్, మాస్టర్ ప్లాన్ రోడ్డు, ఓపెన్ స్పేస్ ఆఫ్ లే అవుట్, నది, వాగు, నాలా బఫర్‌జోన్‌లోని ప్లాట్లు, శిఖంలోని ప్లాట్లు తదితర కారణాలతో తిరస్కరించారు. అయితే ఎల్ఆర్ఎస్ క్లియర్ అయిన ఫీజు సమాచారం అందుకున్న లక్షా 2,500 మంది దరఖాస్తుదారుల్లో దాదాపు 18,500 మంది ఫీజు చెల్లించలేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికి మూడుసార్లు ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ గడువు పొడిగించినా వీరి సంఖ్య మాత్రం అలానే ఉంటుందని, ఈసారైనా తప్పక చెల్లించి ఫైనల్ ప్రొసిడింగ్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు. వీరి ద్వారా హెచ్ఎండీకు దాదాపు రూ.120 నుంచి రూ.150 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. -
ఉతప్ప అనూహ్య నిర్ణయం
న్యూఢిల్లీ: సొంత టీమ్ కర్ణాటకతో 15 ఏళ్లు అనుబంధాన్ని క్రికెటర్ రాబిన్ ఉతప్ప తెంచుకోనున్నాడు. హోమ్ టీమ్‌ను వీడాలని నిర్ణయించుకోవడంతో అతడికి కర్ణాటక క్రికెట్ సంఘం(కేఎస్‌సీఏ) నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) ఇచ్చింది. ఇక అతడు వేరే రాష్ట్ర జట్టుకు ఆడినా ఇబ్బంది ఉండదు. రానున్న రంజీ సీజన్లో వేరే జట్టుకు ఆడనున్నాడు. ఉతప్ప నిర్ణయానికి ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని కేఎస్‌సీఏ కార్యదర్శి సుధాకర్‌రావు తెలిపారు. ‘ ఉతప్ప నిర్ణయం బాధాకరం. ఏ జుట్టుకు ఆడినా అతడు బాగా రాణించాలని కోరుకుంటున్నాం. అండర్-14 స్థాయి నుంచి కర్ణాటక జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. వేరే టీమ్ తరపున ఆడేందుకు అతడు ఉత్సాహం చూపించాడు. మేము అతడి నిర్ణయానికి అడ్డుచెప్పలేద’ని సుధాకర్‌రావు అన్నారు. గత వారమే అతడికి ఎన్వోసీ ఇచ్చినట్టు వెల్లడించారు. 31 ఏళ్ల ఉతప్ప 130 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 46 వన్డేలు, 13 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అతడు ఏ రాష్ట్ర జట్టు తరపున ఆడేది ఇంకా స్పష్టం కాలేదు. రెండు రాష్ట్రాలు అతడిని తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సుధాకర్‌రావు వెల్లడించారు. కేరళ తరపున ఉతప్ప ఆడే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. -
నిలుపుదల చట్టవిరుద్ధం!
రాజధాని ప్రాంతంలో రిజిస్ట్రేషన్ల ఆపివేత చెల్లదు ప్రభుత్వ పెద్దల ఒత్తిడివల్లే మెమో జారీ కోర్టుకెళితే అధికారులే ఇరుక్కుంటారు న్యాయ, రెవెన్యూ నిపుణుల స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంతంలో భూములు, స్థలాల క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం చట్ట విరుద్ధమని న్యాయ, రెవెన్యూ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ)కు సమీకరణ కింద భూములివ్వని రైతులను వాటిని అమ్ముకోకుండా అరికట్టి ఇబ్బంది పెట్టేందుకే ప్రభుత్వ పెద్దలు ఇలా చట్ట విరుద్ధ ప్రక్రియకు తెరలేపారని అభిప్రాయపడ్డారు. రైతులను టార్గెట్ చేస్తూ రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో స్థిరాస్తుల క్రయ విక్రయ రిజిస్ట్రేషన్లు ఆపడం అన్యాయమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని ప్రాంతంలో సీఆర్డీఏ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) లేనిదే భూములు, స్థలాల క్రయ విక్రయ రిజిస్ట్రేషన్లు చేసేందుకు సబ్ రిజిస్ట్రార్లు నిరాకరిస్తున్నారు. దీంతో భూములు, స్థలాలు అమ్ముకోవాలనుకునే వారు ఇబ్బంది పడుతున్నారు. ‘ఎన్ఓసీ లేనిదే రిజిస్ట్రేషన్ చేయరాదంటే రిజిస్ట్రేషన్లు ఆపివేసినట్లే. ఎందుకంటే భూములు అమ్ముకోవాలనుకుంటున్న రైతులెవరికీ సీఆర్డీఏ నిరభ్యంతర పత్రం ఇవ్వదు. అందువల్ల వారు భూములు అమ్ముకోవడానికి అవకాశం ఉండదు. ఈ దురుద్దేశంతోనే ఎన్ఓసీ నిబంధన అమలు చేయాలని రిజిస్ట్రేషన్ అధికారులపై కీలక నేత ద్వారా ఒత్తిడి తెప్పించింది.’ అని రెవెన్యూ శాఖలో చర్చ సాగుతోంది. ప్రభుత్వానికి అధికారం ఉన్నా.. ఎక్కడైనా రిజిస్ట్రేషన్లు నిలిపివేసే అధికారం చట్టపరంగా ప్రభుత్వానికి ఉంటుంది. అయితే రాజధానికి భూసమీకరణ ప్రక్రియ ఆరంభించకముందైతే విశాల ప్రయోజనాల కోసం రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్లు జీవో ఇస్తే ఎవరూ తప్పుబట్టడానికి ఆస్కారం ఉండేదికాదు. అప్పట్లో సీఆర్డీఏ ప్రతిపాదన మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ఈమేరకు ప్రతిపాదన పంపగా రిజిస్ట్రేషన్లు ఆపివేస్తే భూముల ధరలు పడిపోతాయనే సాకు చూపించి ప్రభుత్వం దీన్ని పక్కన పడేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా అసెంబ్లీలో ఈ విషయం ప్రకటించారు. అందువల్ల ఇప్పుడు రిజిస్ట్రేషన్ల నిలిపివేత ఉత్తర్వులిస్తే విమర్శలు వస్తాయని సర్కారు పెద్దలు భయపడి దొడ్డిదారిన రిజిస్ట్రేషన్ల నిలిపివేతకు చర్యలు తీసుకున్నారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. జరిగిందేమిటి? పూలింగ్ కింద భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ జరుగుతున్నందున తాము ఎన్ఓసీ జారీ చేస్తే మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయాలని సీఆర్డీఏ షరతుతో ప్రతిపాదన పంపింది. దీని ప్రకారం వెంటనే మెమో జారీ చేయాలని అక్కడి రిజిస్ట్రేషన్ శాఖ అధికారిపై కీలక మంత్రి ఒత్తిడి తెచ్చారు. నిస్సహాయ స్థితిలో అక్కడి అధికారి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు మెమో జారీ చేశారు. ‘రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ లేదా షరతులు విధిస్తూ మెమో ఇచ్చే అధికారం ప్రభుత్వానికి తప్ప ఎవరికీలేదు. ఎవరైనా కోర్టుకు వెళితే ఈ మెమో నిలవదు. దీన్ని జారీ చేసిన అధికారి ఇరుక్కుంటారు. అయితే కీలక నేత మౌఖిక ఆదేశాలను కాదనే సాహసం చేయలేకే అధికారి మెమో జారీ చేసి ఉండవచ్చు.. ఇలా అధికారులను పావులుగా వాడుకోవడం సర్కారు పెద్దలకు సరికాదు..’ అని సచివాలయంలో రెవెన్యూశాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఎలాంటి మెమో పంపలేదు ఈ విషయమై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులను ‘సాక్షి’ సంప్రదించగా రాజధాని ప్రాంతంలో రిజిస్ట్రేషన్లు ఆపివేయాలంటూ తాము ఎలాంటి ఆదేశాలు పంపలేదని స్పష్టం చేశారు. జిల్లా రిజిస్ట్రార్ మెమో ఇచ్చి ఉంటే తమకు తెలియదని వారు తెలిపారు. -
ఎయిర్కోస్టా... ఇక దేశ వ్యాప్తం..!
► వచ్చే వేసవి నుంచి సేవలు ప్రారంభం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ప్రాంతీయ విమానయాన సర్వీసుల సంస్థ ఎయిర్‌కోస్టాకు దేశ వ్యాప్తంగా సర్వీసులు నడపడానికి అనుమతి లభించింది. కేంద్ర పౌర విమానయాన సంస్థ దేశ వ్యాప్తంగా విమాన సర్వీసులు నడపడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) ఇచ్చినట్లు ఎయిర్కోస్టా ఒక ప్రకటనలో పేర్కొంది. వచ్చే వేసవికి దేశవ్యాప్త సర్వీసులు నడిపే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు ఎయిర్కోస్టా డిప్యూటీ సీఈవో వివేక్ చౌదరి తెలిపారు. ఈ నెలల్లో 100 సీట్ల సామర్థ్యం ఉన్న ఎంబారియర్ ఈ-190 విమానం వచ్చి చేరుతుందని, దీంతో మొత్తం విమానాల సంఖ్య 5కు చేరుతుందన్నారు. ఇది కాకుండా ఫిబ్రవరిలో మరో ఈ-190 రానున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎయిర్కోస్టా నాలుగు విమానాలతో రోజుకు 32 సర్వీసులను నడుపుతోంది. రెండేళ్లలోనే ప్రాంతీయ స్థాయి నుంచి జాతీయ స్థాయి విమానయాన సంస్థగా ఎదగడంపై ఎయిర్కోస్టా చైర్మన్ రమేష్ లింగమనేని సంతోషం వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం 300 సిబ్బంది, రెండు విమానాలు, 5 పట్టణాలతో ప్రారంభమైన ఎయిర్కోస్టా ఇప్పుడు 800 మంది సిబ్బంది, నాలుగు విమానాలు, 9 పట్టణాలకు సర్వీసులను అందిస్తున్నట్లు తెలిపారు. రానున్న కాలంలో ఢిల్లీ, భువనేశ్వర్‌కు విమాన సర్వీసులను ప్రారంభించే యోచనలో ఎయిర్కోస్టా ఉంది. -
అసైన్డ్ భూముల అమ్మకానికి పచ్చజెండా!
సాక్షి, హైదరాబాద్: మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చిన అసైన్డ్ భూములను నిరభ్యంతర పత్రాలు(ఎన్ఓసీ) లేకుండా అమ్ముకునేందుకు అనుమతివ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. మెట్ట అయితే 5 ఎకరాలు, తరి భూమి అయితే రెండున్నర ఎకరాలను ప్రభుత్వం వీరికి ఉచితంగా కేటాయిస్తోంది. భూమి పొందిన వారు పదేళ్లు అ నుభవించిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో అమ్ముకోవాలంటే ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. రూ.కోటి లోపు విలువైన భూమి విక్రయానికి జిల్లా కలెక్టర్, రూ.2 కోట్ల లోపు విలువైన భూవిక్రయానికి రాష్ట్ర భూ పరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ ఎన్ఓసీని ఇవ్వవచ్చు. రూ.2 కోట్లకుపైగా విలువైన భూమి విక్రయానికి ఎన్ఓసీని ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. కొందరు ఇప్పటికే ఎన్ఓసీలు లేకుం డానే సబ్ రిజిస్ట్రార్లను మేనేజ్ చేసి భూములను అమ్మేశారు. భూములు అమ్మేసిన వారి వారసులు ఇప్పుడు తమ భూములను తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తే కొనుగోలు చేసిన వారు నష్టపోతారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి లాంటి నగర సరిహద్దు ల్లో పూర్వం స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులు తీసుకున్న అసైన్డ్ భూముల విలువ ఇప్పుడు భారీగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో గతంలో ఎన్ఓసీలు లేకుండా కొనుగోలు చేసిన వారు ఇబ్బం దులు తప్పవని భయపడుతున్నారు. అందువల్ల ఎన్ఓసీలు లేకుండా కొనుగోలు చేసినా చెల్లుబాటయ్యేలా జీవో ఇవ్వాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులు కూడా ఎన్ఓసీ లేకుండా అమ్ముకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ప్రభుత్వం కూడా ఈ దిశగా యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను రెవెన్యూ శాఖ ప్రభుత్వానికి పంపింది. -
ఇచ్చుకుంటే ఓకే..!
► నిబంధనలకు అగ్నిమాపక శాఖ తిలోదకాలు ► ముందు జాగ్రత్త చర్యలను నీరుగారుస్తున్న వైనం ► నిబంధనల మేరకు భవనాలున్నా చేయి తడిపితేనే ఎన్ఓసీ ► ఆమ్యామ్యాలకే ప్రాధాన్యత సాక్షి ప్రతినిధి, కడప : అక్రమార్జనకు కాదేదీ అనర్హం అన్నట్లుగా అగ్ని మాపక శాఖ వ్యవహరిస్తోంది. ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు కట్టుదిట్టం చేయాల్సిందిపోయి నిబంధనలను నీరు గారుస్తోంది. నిబంధనల మేరకు భవనాలు నిర్మిస్తే ఒకరేటు, ఇష్టానుసారం కట్టుకుంటే మరో రేటు నిర్ణయించి ఎన్ఓసీలు జారీ చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే వేధింపులు సర్వసాధారణమయ్యాయి. పాఠశాలలు, ఆస్పత్రులు, కాంప్లెక్సు, భారీ భవంతుల నిర్మాణంలో మున్సిపల్ ఫ్లాన్ అప్రూవల్ తప్పనిసరి. దానితోపాటు అగ్నిమాపక శాఖ నో అబ్జక్షన్ సర్టిఫికేట్ (ఎన్ఓసీ) ఇవ్వాల్సి ఉంటుంది. అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు తప్పించుకోడానికి వీలుగా నిర్మాణాలు ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఈ శాఖ ఎన్ఓసీ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మామూళ్లు మత్తులో ఈ శాఖ నిబంధనలను గాలికి వదిలేసింది. పెపైచ్చు నిబంధనల మేరకు నిర్మాణాలున్నా మామూళ్లు ఇవ్వందే ఎన్ఓసీలు జారీ కావడం లేదు. డబ్బు కోసం వేధిస్తూ కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. అవినీతి ఊబిలో యంత్రాంగం మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ చెల్లింపులతో సంబంధం లేకుండా ఆరు అంతస్తుల నిర్మాణ భవనాలు చదరపు మీటరుకు రూ.10 చలానా చెల్లించి అగ్నిమాపక శాఖ అనుమతి పొందాల్సి ఉంది. అలాంటి భవనాల్లో ఐదు వేల లీటర్ల కెపాసిటీ కలిగిన ఓవర్ హెడ్ ట్యాంకు, 450 ఎల్పీఎం పంపు, హోస్ పైపు రీల్ ఏర్పాటు చేయాలి. పాఠశాలల్లో అయితే అటోమేటిక్ స్ప్రింక్లర్లు ఏర్పాటు తప్పనిసరి. 25 వేల లీటర్లు కెపాసిటీ కలిగిన ఫైర్ లెస్ ట్యాంకు, అందులో 900 లీటర్స్ ఫర్ మినిట్ పంపు ఉండాలి. ఇవన్నీ ఏర్పాటు చేస్తామని అంగీకరిస్తూ ముందుగా ప్రొవిజనల్ ఎన్ఓసీ తీసుకోవాలి. సైట్, ఫ్లోర్ వైజ్ ప్లాన్ ఇచ్చిన తర్వాత అన్నీ పరిశీలించి.. అగ్నిమాపక శాఖ సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికెట్ ప్రతి సంవత్సరం విధిగా రెన్యువల్ చేయించుకోవాలి. ఇవేమి పట్టించుకునే స్థితిలో అగ్ని మాపక శాఖ లేదు. అన్ని నిబంధనలు పాటించిన వారికి గౌరవంగా సర్టిఫికెట్ మంజూరు చేసిన దాఖలాలు కూడ లేవని తెలుస్తోంది. నిబంధనల మేరకు నిర్మాణాలున్నా భారీగా సొమ్ము ముట్టజెప్పితే తప్ప ఎన్ఓసీ దక్కడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా భవనాలుంటే వారు అడిగినంత సమర్పించుకోక తప్పదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ జారీ చేసిన భవనాలల్లో 70 శాతం నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలున్నట్లు తెలుస్తోంది. నిబంధనల మేరకే అనుమతులు ‘పక్కాగా నిబంధనలున్న భవనాలకు మాత్రమే అనుమతులు ఇస్తున్నాం. నా దృష్టికి వచ్చిన వాటిలో పక్కాగా పరిశీలన చేశాకే సర్టిఫికెట్ ఇస్తున్నాం. ఇప్పటి వరకు ఒక్కటి మాత్రమే నిబంధనల మేరకు నిర్మించలేదని తిరస్కరణకు ప్రతిపాదనలు చేశామ’ని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి విజయ్‌కుమార్ ‘సాక్షి’కి వివరించారు. ప్రక్రియ కొనసాగేందుకు కొద్ది రోజులు పడుతుంది తప్ప ఉద్దేశ పూర్వకంగా ఆలస్యం చేయడం లేదని ఆయన తెలిపారు. -
ఇకపై ఎన్వోసీ ఆన్లైన్లో
- నేడు లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ పరిధిలో ఇకపై ఫైర్ ఎన్వోసీ, ట్రేడ్ లెసైన్స్‌ల్ని ఆన్లైన్లోనే పొందే విధంగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. పరిపాలనా విభాగంలో ఈ(ఎలక్ట్రానిక్) విధానాన్ని అమలు చేస్తున్నారు. దశల వారీగా మిగితా విభాగాలకు విస్తరించాలని కమిషనర్ జి.వీరపాండియన్ నిర్ణయించారు. ఇందులో భాగంగా ఫైర్, ట్రేడ్‌లెసైన్స్‌ల ఎన్ఓసీని ఆన్లైన్ చేశారు. దరఖాస్తు ఇలా ఆన్లైన్లో గాని, నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, మూడు సర్కిల్ కార్యాలయాల్లో, 13 కౌంటర్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. సెల్‌ఫోన్, ఆధార్ కార్డు నెంబర్లు పొందుపర్చాలి.ఆన్లైన్లో రిజిస్టర్ అయిన వెంటనే పాస్వర్డ్ వస్తోంది. అనంతరం వివరాలను నమోదు చేయాలి. బిల్డింగ్ ప్లాను, బ్యాంకు గ్యారంటీ, అండర్టేకిన్ లెటర్, ఫైర్‌ఫైటింగ్ ఎక్విప్మెంట్ వివరాలు,ప్రాపర్టీ, వాటర్, డ్రెయినేజ్ ట్యాక్స్‌లు వీఎల్టీ రసీదులు స్కాన్‌చేసి అప్లోడ్ చేయాలి. ఆన్లైన్లో దరఖాస్తు అందుకున్న అధికారులు మెసేజ్, లేదా ఈ మెయిల్ద్వారా తెలియజేస్తారు. కమిషనర్ అప్రువల్ చేసిన వెంటనే మెసెజ్ వస్తోంది. అనంతరం కార్పొరేషన్ 103 కౌంటర్లో ఎన్ఓసీ కాపీని పొందవచ్చు, ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకొనే అవకాశం ఉంది. ఈమేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నగరపాలక సంస్థ రీజినల్ ఫైర్ ఆఫీసర్ వెంకటాద్రి చౌదరి తెలిపారు. -
భూముల రిజిస్ట్రేషన్లకు ని‘బంధనాలు’
శ్రీకాకుళం పాతబస్టాండ్ : జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్లకు నిబంధనలు అడ్డంకిగా నిలుస్తున్నాయి. దీంతో ప్రజ లు ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఆర్డీవో నుంచి నో అబ్జెక్షన్ ధ్రువపత్రాల (ఎన్ఓసీ)తో రిజిస్ట్రేషన్లు అయిన ప్రభు త్వ భూములకు కూడా ప్రస్తుతం మళ్లీ రిజిస్ట్రేషన్ జరగడం లేదు. అలాగే పొరపాటున రెవెన్యూ, రిజిస్ట్రేషన్ రికార్డుల్లో ప్రభుత్వ భూములుగా నమోదైన ప్రయివేటు భూముల పరిస్థితి ఇలాగే ఉంది. వాస్తవ భూ పరిస్థితులను పరిశీలించకుండానే కొందరు సబ్ రిజిస్ట్రార్లు అడ్డుతగులుతున్నారు. దీంతో అవసరాలకు అమ్ముకునే వారు అవస్థ పడుతున్నారు. ఎన్ఓసీ కలెక్టర్ ఇవ్వాల్సిందే! భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి గతంలో ఆర్డీవో ఎన్ఓసీ ఇస్తే సరిపోయేది. కొత్తగా కలెక్టర్ మంజూరి చేసిన ఎన్ఓసీ, రిజిస్ట్రేషన్ డెరైక్టర్ జనరల్ ఆదేశాలతో అన్లైన్లో వివరాలు నమోదు చేస్తేనే భూముల రిజిస్ట్రేషన్ అని సబ్ రిజిస్ట్రేషన్ అధికారులు చెబుతున్నారు. దీనిపై గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం జీవో ను విడుదల చేసిందని వారంటున్నారు. దీంతో గతంలో రిజిస్ట్రేషన్ జరిగి, ఎటువంటి అభ్యంతరాలు లేని భూములకు ఎన్ఓసీ కోసం జిల్లాలో పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ఇలా కలెక్టరేట్లో 12 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. భూమి స్వరూపం ఇతర పరిస్థితులపై మండల రెవెన్యూ అధికారులు ఆర్డీవో సిఫార్సు చేసిన దరఖాస్తులే అవి. అయినా దరఖాస్తుల పరిశీలనలో ఉన్నతాధికారులు కొర్రీలు వేయడంతో కలెక్టరేట్లోనే మూలుగుతున్నాయి. నరసన్నపేట మండలానికి సంబంధించి రెండు, ఆమదాలవలస మండలం నుంచి రెండు, ఎచ్చెర్ల మండలం రెండు, శ్రీకాకుళం మండలం మూడు, కోట బొమ్మాళి, కొత్తూరు , పాలకొండ మండలాలకు సంబంధించి ఒక్కో దరఖాస్తు వీటిలో ఉన్నాయి. నేడు కలెక్టర్ సమావేశం ఈ మేరకు మంగళవారం జిల్లాలో భూమి రిజిస్ట్రేషన్లపై కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ రిజిస్ట్రేషన్ అధికారులలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనే పెండింగ్ దరఖాస్తులపై ఓ నిర్ణయానికి రానున్నట్టు దరఖాస్తుదారులు ఆశాభావంతో ఉన్నారు. నిబంధనలు సడలిస్తే తప్ప భూ క్రయ విక్రయాలు చేయలేమని పలువురు అంటున్నారు. -
రికార్డు ‘కబ్జా’
►రఘునాథపాలెం మండలంలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు హాంఫట్ ►ఖమ్మం మున్సిపాలిటీకి చెందిన 100 ఎకరాల భూమి హుష్‌కాకి ► ఎన్నెస్పీ భూమి కనిపిస్తే కబ్జానే.. ►చెరువు శిఖం, సీలింగ్, ఇనాం భూముల్లోనూ ఉల్లంఘనలు ►లక్ష్మీనర్సింహస్వామి,ఆంజనేయస్వామి గుడి భూములూ స్వాహా ►అనుమతుల్లేకుండానే కేటగిరీల మార్పు ► ఏకంగా ఇంటి నంబర్లే ఇచ్చేసిన మున్సిపల్ అధికారులు ►రిజిస్ట్రేషన్ల కోసం చేతులు మారిన కోట్ల రూపాయలు ►‘ఆపరేషన్ భూరైడింగ్’లో వెల్లడయిన ప్రాథమిక సమాచారం సాక్షి ప్రతినిధి, ఖమ్మం: అది గుడి భూమి అయినా.. బడి భూమి అయినా.. ఇనాం భూమి అయినా.. సీలింగ్ భూమి అయినా... చెరువు శిఖమయినా... మున్సిపాలిటీదైనా, నాగార్జునసాగర్ కాల్వదైనా... కబ్జాకు కాదేదీ అనర్హం అనుకున్నారో ఏమో... జిల్లా కేంద్రానికి ఆనుకుని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో కూడా భాగమై ఉన్న రఘునాథపాలెం మండలంలో భూమి కనిపిస్తే చాలు కబ్జా చేసేశారు. ప్రభుత్వ భూములంటే మరీ అలుసన్నట్టు ఎక్కడ చిన్న అవకాశం వచ్చినా ఉల్లంఘనలు జరిగాయి. ఇదేదో సాదాసీదాగా చెపుతున్నది కాదు... జిల్లా జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్ నేతృత్వంలో గత నెల 26, 27 తేదీల్లో రెవెన్యూ సిబ్బంది మూకుమ్మడిగా నిర్వహించిన సర్వేలో ప్రాథమికంగా వెల్లడయిన వాస్తవమిది. ఈ సర్వేలో వెల్లడయిన అంశాల్లోని విశ్వసనీయ వివరాల ప్రకారం ఒక్క రఘునాథపాలెం మండలంలోనే దాదాపు 1000 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిలో ఉల్లంఘనలు కనిపిస్తున్నాయి. ఇందులో పేదలకు అసైన్ చేసిన భూముల నుంచి ఇనాం భూముల వరకు ఉన్నాయి. ఎలాంటి ఎన్వోసీలు, ఓఆర్సీలు లేకుండా ఏకంగా పట్టాదారుల పేర్లు మారిపోవడం, ఒక కేటగిరీ నుంచి మరో కేటగిరికి భూ మార్పిడి చేయడం.. చెరువు భూముల్లో ఇళ్లు కట్టుకున్నా మున్సిపల్ అధికారులు ఇంటి నెంబర్లు ఇవ్వడం బట్టి చూస్తే ఇక్కడ జరుగుతున్న భూదందా ఏపాటిదో అర్థమవుతోంది. అసలు ప్రభుత్వ రికార్డుల్లో ఒకటి ఉంటే వాస్తవంగా ఆ భూమిలో మరో రకమైన కార్యకలాపాలు జరుగుతుండడం గమనార్హం. మిగితా భూములను రిజిస్టర్ చేసిన దాని కన్నా ఇలాంటి స్థలాలను రిజిస్టర్ చేసుకోవడం మామూలు విషయం కాదని, ఈ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారి ఉంటాయని రెవెన్యూ వర్గాలే అంటున్నాయి. మొత్తం మీద కేవలం రెండు రోజుల పాటు కొందరు సిబ్బంది కలిసి ప్రాథమికంగా నిర్వహించిన సర్వేలోనే పెద్ద ఎత్తున ఉల్లంఘనలు వెలుగులోకి వస్తే, ఈ వివరాల సేకరణను ఒక ప్రాజెక్టుగా తీసుకుని సర్వే చేస్తే ఇంకా ఎంత భూమి బయటకు వస్తుందో, ఎంతమంది కబ్జాసురులు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారుల లీలలు వెలుగులోనికి వస్తాయోనని పలువురు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే నోటీసులు... ఆపరేషన్ భూరైడింగ్ పేరిట రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ సర్వేలో ఉల్లంఘనలుగా తేలిన భూముల్లో ఉన్న వారికి త్వరలోనే నోటీసులు అందజేస్తామని రెవెన్యూ వర్గాలు ‘సాక్షి’కి చెప్పాయి. ఇది కేవలం ప్రాథమికంగా తెప్పించిన సర్వేనేనని, దీనిలో చాలా భూములపై మరోసారి తనిఖీ ఉంటుందని, ఇందుకోసం త్వరలోనే డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించాయి. ఈ భూముల సర్వేకు సంబంధించి వచ్చిన సమాచారాన్నంతటినీ క్రోఢీకరించి విభాగాలు, కేటగిరీల ద్వారా విభజించి అసలు వాస్తవమేంటనే దాన్ని మరోసారి నిర్ధారించుకుంటామని తెలిపాయి. ఉల్లంఘన జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణ అయిన తర్వాతే నోటీసులిస్తామని, ఈ సర్వేలో వెల్లడైన ఉల్లంఘనకు సంబంధించిన భూములను అనుభవిస్తున్న సంస్థలు, వ్యక్తులు భయపడవద్దని, పూర్తిస్థాయిలో నిర్ధారణ అయిన తర్వాతే చర్యలు తీసుకుంటామని, ఇప్పటివరకు నిర్వహించింది ప్రాథమిక విచారణ మాత్రమేనని రెవెన్యూ అధికారులంటున్నారు.రెవెన్యూ రికార్డుల ప్రకారం నిర్వహించిన సర్వేకు సంబంధించి విశ్వసనీయ సమాచారం ప్రకారం గ్రామాల వారీగా ఉల్లంఘనలు ఇలా ఉన్నాయి.... రఘునాథపాలెం: సర్వే నెంబర్ 11లో నర్సింహులకుంట చెరువులోని 2 ఎకరాలను కబ్జా చేసి రోడ్డు వేశారు. 218లో ఉన్న 2 ఎకరాల కుంట భూమిని వ్యవసాయేతర పనులకు వినియోగిస్తున్నారు. 407లో ఉన్న ఏడెకరాల శిఖం భూమిలో ఏకంగా కాలనీ ఏర్పాటయింది. దాని వివరాలు లభించడం లేదు. 351లో పేదలకు ఇళ్ల స్థలాల కోసం సేకరించిన ఏడెకరాల భూమిని కబ్జా చేసి వ్యవసా యం చేస్తున్నారు. 355లో శారదా కళాశాల సమీపం లో ఉన్న సీలింగ్ ల్యాండ్‌లో 8 మందికి 2 ఎకరాల భూమిని వ్యవసాయం కోసం అసైన్ చేశారు. దానిలో ఎలాంటి అనుమతులు లేకుండా వ్యవసాయేతర కార్యకలాపాలు సాగుతున్నాయి. 30లో ఎకరం అసైన్డ్ భూమిని కబ్జా చేశారు. 93లో ఎస్సీ కాలనీకి అసైన్ చేసిన 8ఎకరాల 33గుంటల భూమిని వే రే వ్యక్తి అనుభవిస్తున్నారు. 111,112లోని మూడెకరాల గుడి భూమికి సంబంధించి ప్రైవేటు వ్యక్తుల పేర్ల మీద పాస్‌పుస్తకాలున్నాయి. 371 సర్వే నంబర్లోని 10 ఎకరాల 35 గుంటల ఇనాం భూములను ప్లాట్లు చేశారు. బల్లేపల్లి: సర్వే నెంబర్ 41లో ఉన్న శ్మశానవాటికలో అర ఎకరం కబ్జాకు గురయింది. పాపటపల్లి: సర్వే నెంబర్ 149లోని 110 ఎకరాల అసైన్డ్ భూమి సేల్‌డీడ్ చేసి వేరే వ్యక్తులు కొనుక్కున్నారు. వారు పేదలయితే అసైన్డ్ కమిటీ ద్వారా నిర్ధారించి వారికే రెగ్యులరైజ్ చేసే అవకాశం ఉంది. 118లో ఉండాల్సిన చెరువులో 12 ఎకరాల భూమి కనిపించడం లేదు. 89 లో ఉండాల్సిన ఏడెకరాల చెరువు ప్రభుత్వ రికార్డుల్లో ఓ రకంగా ఉంటే వాస్తవంగా వేరే రూపంలో ఉంది. ధంసలాపురం: సర్వే నెంబర్ 178లో 128 ఎకరాల్లోని చెరువులో 40 ఎకరాల భూమి కబ్జాకు గురయింది. శ్రీరాంహిల్స్లోని సర్వే నెంబర్ 49లో హౌసింగ్బోర్డుకిచ్చిన స్థలాన్ని బహిరంగ వేలం ద్వారానే విక్రయించినా అందులో 10 శాతం భూమిని పేద వర్గాలకు ఇవ్వాలన్న నిబంధన ను పాటించలేదు. కోయచెలక: సర్వే నెంబర్ 192లో 119 ఎకరాల 20 గుంటల భూమిని పేదలకు ఇళ్ల స్థలాల కోసం అసైన్‌చేశారు. కానీ ఆ భూమిలో ఎలాంటి ఇళ్లు నిర్మించలేదు. అందులో 4ఎకరాల భూమిని వ్యవసాయేతర పనులకు వినియోగిస్తున్నారు. ఆరు ప్లాట్లను కబ్జా చేసి పత్తి పండిస్తున్నారు. 149లో ఉన్న 80 ఎకరాల పెద్ద చెరువు శిఖం భూమిలో 7.5 ఎకరాలు కబ్జాకు గురయింది. 150,151, 229 సర్వే నెంబర్లలోని 5ఎకరాల 31 కుంటల ఇనాం భూమిని ఓఆర్సీలు లేకుండా అమ్ముకున్నారు. చిమ్మపూడి: సర్వే నెంబర్ 48లోఉన్న 195 ఎకరాల అసైన్ భూమిలో 80 శాతం అమ్ముకున్నారు. 20 ఎకరాలు కబ్జా అయింది. 512లోని మూడెకరాలు ఖాళీ జాగా ఉంది. 163లోని 71 ఎకరాల చెరువులో 2 ఎకరాలు కబ్జాకు గురయింది. మంచుకొండ: సర్వే నెంబర్ 338లో ఉన్న 211 ఎకరాల ప్రభుత్వ భూమిలో 168 ఎకరాలు అసైన్ చేశారు. దీనిలో 73 ఎకరాల్లో ఉల్లంఘనలున్నాయి. సర్వే నెంబర్ 37లోని 37 ఎకరాల సీలింగ్ భూమి అన్యాక్రాంతమైంది. 282లోని ఎర్రచెరువులో 16 ఎకరాల 60 గుంటల భూమిని 18 మంది కబ్జా చేశారు. 354లో ఉన్న భూమిని ప్రభుత్వం పేదలకు ఇళ్లస్థలాల కోసం సేకరించినా.. ఇప్పటికీ ఆ భూమిని అసలు పట్టాదారుడే అనుభవిస్తున్నాడు. వెలుగుమట్ల: సర్వే నెంబర్ 548 లోని 2 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురయింది. దీనిపై సమగ్ర సర్వే జరపనున్నారు. 564లో ఉన్న 22 కుంటల కారిజ్ఖాతా ఇనాం భూమిని ముగ్గురు వ్యక్తులు కబ్జా చేశారు. 565లోని శిఖం భూమిలో 8 ఎకరాలు కబ్జాకు గురయింది. 396 లో ఉన్న రెండెకరాల ఎన్నెస్పీ స్థలంలో రోడ్డు వేసి వెం చర్లు చేస్తున్నారు. 138, 140లో ఉన్న దాదాపు 5 ఎకరాల ఎన్నెస్పీ భూమి కూడా కబ్జాకు గురయింది. దీని ని జాయింట్ సర్వే చేయనున్నారు. 135, 137లో ఉన్న మూడెకరాల ఎన్నెస్పీ భూమిని ఎవరో అమ్ముకున్నారు. ఖమ్మం రెవెన్యూ: సర్వే నెంబర్ 123లో ఉన్న 189.33 కుంటల భూమిలో 100 ఎకరాలు మున్సిపాలిటీకి కేటాయిం చారు. అందులో అన్నీ ప్రైవేటు సముదాయాలు వెలి శాయి. థియేటర్లు, కల్యాణమండపాలు నిర్మించారు. పాకబండ: సర్వే నెంబర్ 66లోని 34 ఎకరాల 11 కుంటల భూమిని 144 మంది కబ్జా చేశారు. సర్వే నెంబర్ 4లోని 4,500 గ జాల భూమిని దాసాంజనేయస్వామి గుడి కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేశారు. అందులో ప్రైవేటు వ్యక్తులు ఇళ్లు కట్టుకున్నారు. మున్సిపాలిటీ వారు ఇంటి నెంబర్లు కూడా ఇచ్చారు. బుర్హాన్‌పురం: సర్వే నెంబర్ 105లో ఉన్న లక్ష్మీనర్సింహస్వామి గుడి భూమిలో 23 ఎకరాలను 400 మంది కబ్జా చేశారు. అందులో ఉన్న ఐదెకరాల ఎన్నెస్పీ భూమి కూడా కబ్జాకు గురయింది. 292,293లోని 4 ఎకరాల 28 కుంటల శిఖం భూమి కూడా కబ్జా అయింది. 5లో మూడెకరాలు ఖబర్‌స్థాన్ కోసమని రికార్డుల్లో ఉంటే అక్కడ పక్కాఇళ్లున్నాయి. ఎస్పీ కార్యాలయం సమీపంలోని 489లో అన్నీ ప్రైవేటు భవంతులు వెలిశాయి. 217లో ఉండాల్సిన 41.25 ఎకరాల ప్రభుత్వ భూమిలో 10 ఎకరాల్లో ఉల్లంఘనలు జరగ్గా 15 ఎకరాలు కబ్జాకు గురయింది. 35, 38, 39, 40 సర్వే నెంబర్లలోని గుంటి మల్లేశ్వరి దేవస్థానంలో 3 ఎకరాలు కబ్జా అయింది. ఈర్లపూడి: సర్వే నెంబర్ 554లోని 300 ఎకరాల అసైన్ భూమిని 43 మంది కొనుక్కున్నారు. 73లోని మూకుడికుంట చెరువులో 19 ఎకరాలు కబ్జాకు గురయింది. వేపకుంట్ల: సర్వే నెంబర్ 196,197లోని 50 ఎకరాల చెరువు భూముల్లో 20 ఎకరాలను కబ్జా చేశారు. 26లోని ఇనాం భూమిని ఓఆర్సీలు లేకుండానే 41 మంది కొనుగోలు చేశారు. చింతగుర్తి: సర్వే నెంబర్ 56లో 28 ఎకరాల 30 కుంటల చెరువు శిఖం భూమి ఉంది. ఇందులో 10.28 ఎకరాలు అసైన్ చేశారు. ఈ శిఖం భూమిని ఎలా అసైన్ చేశారు, ఎవరు చేశారనేది తేలాల్సి ఉంది. 266లో ఉన్న 941 ఎకరాల భూమి వివాదంలో ఉంది. ఇందులో సీలింగ్, పట్టా, అసైన్ భూములున్నాయి. దీనిని రీసర్వే చేయనున్నారు. రేగుల చెలక: సర్వే నెంబర్ 85లో ఉన్న 25 ఎకరాల్లో మూడు గ్రానైట్ కంపెనీలకు భూమిని లీజుకిచ్చారు. ఈ భూమిలో గ్రానైట్ కంపెనీలు బ్లాస్టింగ్లు చేస్తుండడంతో వ్యవసాయం కోసం అసైన్ చేసిన భూముల్లో వ్యవసాయం చేసుకోలేకపోతున్నారు. 57,58,60 సర్వే నెంబర్లలో బల్వత్ఇనాం భూములను ఓఆర్సీ లేకుండా వ్యవసాయం నుంచి వ్యవసాయేతరానికి బదలాయించారు. 9లో ఉన్న 1.15 కుంటల శిఖం భూమిని 14 మందికి ఇళ్ల స్థలాల కోసం కేటాయించారు. 145లో ఎకరం భూమి కబ్జాకు గురయింది. ఖానాపురం: 37 సర్వే నెంబర్లోని 153 ఎకరాల భూమిలో 86 ఎకరాల 29 కుంటల భూమిని మూడువేల మంది బీపీఎల్ కుటుంబాలు, స్వాతంత్య్ర సమరయోధులకు కేటాయించారు. ఇందులో కేవలం 80 ఇళ్లు మాత్రమే కట్టి ఉన్నాయి. మిగిలిన 67 ఎకరాల భూమిని రెండు మినరల్స్‌కు 20 ఏళ్ల లీజుకిచ్చారు. 94లో ఉన్న ఎకరం భూమి రికార్డుల్లో శ్మశానవాటిక అని ఉండగా, అది ఖాళీగానే ఉంది. 321లో 45 ఎకరాల 39 కుంటల్లో 10 ఎకరాలు టీఎన్జీవోలకు కేటాయించగా, అందులో 90శాతం ఖాళీగానే ఉన్నాయి. అదే సర్వేనెంబర్లో 15.39 ఎకరాలను ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు కబ్జా చేసి నివసిస్తున్నారు. 94లోన్న 15 కుంటల ఊరచెరువు స్లూయిజ్ కూడా కబ్జాకు గురయింది. మూడెకరాలు ఒయాసిస్ రిక్రియేషన్ క్లబ్‌కు కేటాయించినా క్లబ్ పనిచేయడం లేదు. 234లో ఉన్న 129 ఎకరాల 4 కుంటల లకారం చెరువు శిఖం భూమిపై డీటైల్డ్ సర్వే చేయనున్నారు. వి.వి.పాలెం: సర్వే నెంబర్ 101లో ఉన్న 150 ఎకరాలకు గాను 111 ఎకరాలు అసైన్ చేశారు. అందులో 34 ఎకరాల్లో ఉల్లంఘనలుండగా, 37 ఎకరాలు కబ్జా అయింది. 158లో ఉన్న ఎకరం సీలింగ్ భూమిని కబ్జా చేశారు. 66లో ఉన్న ఆంజనేయస్వామి గుడికి చెందిన 24 గుంటల భూమి ప్రైవేటు వ్యక్తులకు అమ్మేశారు. అదే గ్రామంలోని 9 ఎకరాల 23 కుంటలు కబ్జాకు గురయింది. -
అవినీతిని సహించను
ఒంగోలు టౌన్ : ‘ఎన్వోసీలు లేకుండా యూనిట్లు నడపడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించొద్దు. ఎక్కడైనా అలాంటి యూనిట్లు నడుస్తుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటా. కిందిస్థాయి నుంచి అధికారుల పనితీరు గమనిస్తా. గతంలో మాదిరిగా పరిస్థితులు ఉండవు. అవినీతికి ఏ రూపంలో పాల్పడినా సహించను’ అని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖామంత్రి పీతల సుజాత హెచ్చరించారు. ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల గనులు, భూగర్భ వనరుల శాఖాధికారులతో స్థానిక సీపీవో కాన్ఫరెన్స్ హాల్లో గురువారం ఉదయం ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. జోన్ పరిధిలో గనులు, భూగర్భ వనరులశాఖ ద్వారా ఈ ఏడాది 1,256 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా నిర్ణయించగా, మొదటి మూడు నెలల్లో 276 కోట్ల రూపాయలు వసూలు చేశారన్నారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి పూర్తిస్థాయిలో లక్ష్యాలు అధిగమించాలని ఆదేశించారు. నెల్లూరు జిల్లాలో మినరల్స్ సమృద్ధిగా ఉన్నా ప్రభుత్వానికి ఆశించినంత ఆదాయం రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా 12 కోట్ల రూపాయలు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా 5 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేశారన్నారు. జోన్‌లోని మిగిలిన జిల్లాలతో పోల్చితే నెల్లూరు జిల్లా ఆదాయపరంగా అట్టడుగు స్థానంలో ఉందని అసహనం వ్యక్తం చేశారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్ స్థాయి నుంచి సిబ్బంది, అధికారులంతా కష్టపడి పనిచేసి లక్ష్యాలు సాధించాలని ఆదేశించారు. కృష్ణపట్నం పోర్టు నుంచి 17 కోట్ల రూపాయల బకాయిలు వసూలు కావాల్సి ఉండగా, వారు కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని అధికారులు మంత్రి దృష్టికి తీసుకురాగా, తాను హైదరాబాద్ వెళ్లిన తరువాత ఈ విషయాన్ని పరిశీలించి ఆ సంస్థకు నోటీసులు జారీ చేస్తానని మంత్రి పేర్కొన్నారు. లీజులు ప్రారంభించకుంటే రద్దు చేయాలి... మూడేళ్ల కంటే ముందు గనులు లీజుకు తీసుకుని ఇప్పటికీ ప్రారంభించని యూనిట్లను గుర్తించి రద్దు చేయాలని మంత్రి సుజాత ఆదేశించారు. వాటిని కొత్తవారికి ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనధికార ఇసుక తవ్వకాలను అరికట్టాలని, పర్యావరణానికి హాని జరగకుండా చూడాలని చెప్పారు. గనుల శాఖలో సిబ్బంది కొరత తీర్చేందుకు ఔట్ సోర్సింగ్ ద్వారా నియామకాలకు అనుమతి ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. సమావేంలో కలెక్టర్ విజయకుమార్, పర్చూరు శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు, గనులశాఖ ఉపసంచాలకుడు ప్రసాద్, మూడు జిల్లాల అధికారులు పాల్గొన్నారు. -
పేలనున్న ‘ఫైర్’ బాంబ్
పిఠాపురం, న్యూస్‌లైన్ : అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ పేరుతో జిల్లా వ్యాపారులపై రూ.25 కోట్ల భారం పడనుంది. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రతీ వ్యాపార సంస్థ ముందుజాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే చర్యలు తప్పవని అగ్నిమాపక శాఖాధికారులు హెచ్చరించడం మినహా ఇప్పటివరకు పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. అయితే ఇప్పటి నుంచి ప్రతీ వ్యాపార సంస్థకు ఫైర్ ఎన్ఓసీ తప్పక ఉండాలని, లేకపోతే ఆయా సంస్థల లెసైన్స్ రద్దు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. తద్వారా ఆదాయాన్ని పొందేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర అగ్నిమాపక శాఖ డెరైక్టర్ జనరల్ ఎస్వీ రమణమూర్తి ఆంధ్రప్రదేశ్ ఫైర్ సర్వీస్ యాక్ట్-1999 ప్రకారం ఓ సర్క్యులర్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఆ ప్రక్రియలో అగ్నిమాపక సిబ్బంది నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ప్రతీ గ్రామంలోను కిళ్లీ షాపుల నుంచి బడా వ్యాపార సంస్థల వరకు అన్నింటి వివరాలు సేకరిస్తున్నారు. ఆయా వ్యాపార సంస్థల వాడుక స్థలం, వ్యాపార తీరు, వినియోగించే వస్తువులు తదితర వివరాల ఆధారంగా ఒక్కో వ్యాపార సంస్థకు రూ.500, రూ.1000, రూ.1500, రూ.2000, రూ.2500 నుంచి రూ.5 వేల వరకు చెల్లించి ఎన్ఓసీ పొందాల్సి ఉంటుంది. చిన్న కిళ్లీబడ్డీల నుంచి పెద్ద వ్యాపార సంస్థల వరకు 613 రకాల వ్యాపారాలు ఈ ఎన్ఓసీ పరిధిలోకి రానున్నాయి. వ్యాపార సంస్థల వివరాల సేకరణ జిల్లాలోని అన్ని వ్యాపార సంస్థల వివరాలు సేకరిస్తున్న ఫైర్ సిబ్బంది ఆ నివేదికను ప్రభుత్వానికి పంపడం పూర్తయ్యాక, దీనిపై చట్టం చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే వ్యాట్ వంటి పన్నులతో సతమతమవుతున్న వ్యాపారులపై ఈ అదనపు భారం తడిసిమోపుడు కానుంది. 15 మీటర్లకు మించి ఉండే అపార్ట్మెంట్లు, రెస్టారెంట్లు, స్కూల్స్, ట్రాన్స్‌పోర్టు గొడౌన్లు, ఎగ్జిబిషన్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, బేకరీలు, వ్యాపార, వ్యాపార రహిత భవనాలకు ఎన్ఓసీ పొందాల్సి ఉంటుంది. త్వరలో జీఓ ఎన్ఓసీ లేకుండా వ్యాపారం కొనసాగించకుండా దాడులు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతీ వ్యా పార సంస్థ తప్పనిసరిగా ఎన్ఓసీ తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే జిల్లాలో వ్యాపార సంస్థల వివరాలు సేకరించడం పూర్తి కావస్తున్న నేపథ్యంలో త్వరలో ప్రభుత్వం జీఓ జారీ చేయనుంది.