న్యూఢిల్లీ: వెటర్నరీ ఔషధాలు, టీకాలకు సంబంధించిన దరఖాస్తులను వేగవంతంగా ప్రాసెస్ చేసేందుకు, నో–అబ్జెక్షన్ సర్టిఫికేషన్ (ఎన్‌వోసీ) జారీ చేసేందుకు కేంద్రం ప్రత్యేకంగా నాంది పేరిట పోర్టల్ ప్రారంభించింది. కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, డెయిరీ శాఖ మంత్రి పర్‌షోత్తం రూపాలా సోమవారం దీన్ని ఆవిష్కరించారు. సాధారణంగా ఔషధాలు, టీకాల దిగుమతి, తయారీ, మార్కెటింగ్ మొదలైన వాటి నియంత్రణ అనేది ఆరోగ్య శాఖలో భాగమైన సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో) పరిధిలోకి వస్తుంది.
అయితే, వెటర్నరీ ఔషధాలు, టీకాలకు సంబంధించి మత్స్య, పశు సంవర్ధక, డైరీ శాఖతో సంప్రదింపుల తర్వాత అనుమతులు జారీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ మాన్యువల్‌గా ఉండటంతో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే నాంది (ఎన్‌వోసీ అప్రూవల్ ఫర్ న్యూ డ్రగ్ అండ్ ఇనాక్యులేషన్ సిస్టం) పోర్టల్‌ను ఆవిష్కరించినట్లు రూపాలా చెప్పారు.
తాజా పరిణామంతో ఇకపై సీడీఎస్‌సీవో సుగమ్ పోర్టల్‌లో దాఖలు చేసిన దరఖాస్తును పశు సంవర్ధక, డెయిరీ విభాగానికి పంపిస్తారు. దరఖాస్తుదారు ఆన్‌లైన్‌లో అవసరమైన పత్రాలను దాఖలు చేయాలి. పశు సంవర్ధక శాఖలోని సాధికారిక కమిటీ అప్లికేషన్‌ను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటుంది. అన్నీ సంతృప్తికరంగా ఉంటే ఎన్‌వోసీని ఆన్‌లైన్‌లో జారీ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment