Veterinary
-
స్టైపెండ్ పెంచకుంటే పోరుబాటే..
తిరుపతి సిటీ/లబ్బీపేట(విజయవాడతూర్పు) : వెటర్నరీ జూడాలకు స్టైఫండ్ పెంచకపోతే పోరుబాట తప్పదని వెటర్నరీ వర్సిటీ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు జూనపూడి ఎజ్రా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తిరుపతి ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ పశువైద్య కళాశాలలో శుక్రవారం జూడాలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదేళ్లుగా తమకు స్టైఫండ్ రూ.7 వేలే ఇస్తున్నారని.. అదీ సమయానికి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని వెటర్నరీ వర్సిటీల్లో రూ.23 వేలు ఇస్తున్నా.. తిరుపతి వర్సిటీలో మాత్రం పెంచకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న స్టైఫండ్ నిత్యావసరాలకు సరిపోవడం లేదని, వెంటనే రూ.15 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. మూడు నెలలుగా వర్సిటీలో పాలన స్థంభించిపోయిందని, వర్సిటీకి పూర్తి స్థాయి వీసీ, రిజిస్ట్రార్లను నియమించాలని కోరారు. ప్రభుత్వానికి రెండు నెలలు గడువిస్తున్నామని, అప్పటికీ స్పందించకుంటే విధులను బహిష్కరించి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం ఇన్చార్జి రిజిస్ట్రార్ చెంగల్రాయులుకు వినతి పత్రం ఇచ్చారు. నిరసన కార్యక్రమంలో జూడాల అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పవన్‌నాయక్, జనరల్ సెక్రటరీ ఆకాష్ పెద్ద సంఖ్యలో జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. విజయవాడ జీజీహెచ్‌లో జూడాల నిరసనతమపై జరుగుతున్న దాడుల నుంచి రక్షణ కల్పించాలని, ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగుపర్చాలని కోరుతూ విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో జూనియర్ వైద్యులు శుక్రవారం మెరుపు ఆందోళనకు దిగారు. ఐదు గంటల పాటు నిరసన వ్యక్తం చేశారు. పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటకు చెందిన రవి కలుపుమందు తాగి మెడిసిన్ వార్డులో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందాడు. ఈ సమయంలో మృతుడి బంధువులు, జూడాల మధ్య వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో మృతుడి బంధువులు జూడాలపై దాడి చేశారు. దీంతో శుక్రవారం ఉదయం సమ్మె నోటీసు తీసుకుని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి.వెంకటేష్ వద్దకు వెళ్లగా.. సమస్యలేమైనా ఉంటే పరిష్కరిస్తామని, సమ్మె నోటీసు తీసుకోనని చెప్పినట్లు జూడాలు తెలిపారు. దీంతో ఉదయం 9 గంటలకు వందలాది మంది జూడాలు ఆస్పత్రి క్యాజువాలిటీ ఎదుట ఆందోళనకు దిగారు.తమకు రక్షణ కల్పించాలని, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ నరసింహం ప్రభుత్వాస్పత్రికి చేరుకుని జూడాలతో కలిసి సూపరింటెండెంట్ చాంబర్లో చర్చలు జరిపారు. సమస్యలు పరిష్కరిస్తానని ఆయన హామీ ఇవ్వడంతో జూడాలు ఆందోళన విరమించారు. -
ఆర్బీకేల్లోనూ పశు వైద్యసేవలు
సాక్షి, అమరావతి: మూగ, సన్న జీవాలకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను మరింతగా పటిష్టపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో పశువులకు ఏ చిన్న సమస్య వచ్చినా మండల కేంద్రంలో ఉండే పశు వైద్యశాలలు, డిస్పెన్సరీలకు పరుగులెత్తాల్సి వచ్చేది. దీనివల్ల సకాలంలో వైద్యసేవలు పొందలేక పాడి రైతులు పడరాని పాట్లు పడేవారు. గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన ఆర్బీకేలను రూరల్ లైవ్ స్టాక్ యూనిట్లుగా తీర్చిదిద్దడంతో పాడి రైతుల వెతలకు చెక్ పడింది. రాష్ట్రంలో మొత్తం 10,778 ఆర్బీకేలుండగా.. 7,272 ఆర్బీకేల పరిధిలో పాడి సంపద అధికంగా ఉంది. వీటిలో 4,652 ఆర్బీకేల్లో గ్రామ పశు వైద్య సహాయకులు, మిగిలిన ఆర్బీకేల్లో రూరల్ లైవ్‌స్టాక్ యూనిట్ల (ఆర్‌ఎల్‌యూ) సిబ్బంది సేవలందిస్తున్నారు. రేషనలైజేషన్ అనంతరం 1,896 ఆర్బీకేల పరిధిలో వీఏహెచ్‌ఏలు అవసరమని గుర్తించగా.. ఆ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రతి ఆర్బీకేలో 105 రకాల మందులు పాడి సంపద ఉన్న ప్రతి ఆర్బీకేలో రూ.10 వేల విలువైన ట్రెవీస్ (ఇనుప చట్రాల)ను ఏర్పాటు చేశారు. కృత్రిమ గర్భోత్పత్తి కోసం పశు వీర్యాన్ని నిల్వ చేసేందుకు వీలుగా రూ.16.90 కోట్ల విలువైన లిక్విడ్ నైట్రోజన్ కంటైనర్లను ఆర్బీకేల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి ఆర్బీకేలో 105 రకాల మందులను అందుబాటులో ఉంచుతున్నారు. మూడేళ్లలో ఆర్బీకేల ద్వారా రూ.24.30 కోట్ల విలువైన మందులను పంపిణీ చేశారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యేకంగా రూ.24 కోట్ల విలువైన మందులను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు ఆర్బీకేల ద్వారా పశువులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేస్తున్నారు. జబ్బుపడిన జంతువులకు ప్రథమ చికిత్స అందించడంతో పాటు రైతుల ఇంటి గుమ్మం వద్దనే రోగ నిరోధక టీకాలు వేస్తున్నారు. నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాలు నిర్వస్తున్నారు. ఇనాఫ్ ట్యాగ్లు వేస్తున్నారు. ప్రతి మూగజీవానికి హెల్త్ కార్డులు ఇస్తున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ఆర్థిక చేయూత అందిస్తున్నారు. ప్రతి వారం పశువైద్యులు ఆర్బీకేలను సందర్శిస్తూ వీహెచ్‌ఏల సహాయంతో సేవలందిస్తున్నారు. ప్రతి ఆర్బీకేలో రూరల్ లైవ్ స్టాక్ యూనిట్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఆర్బీకేల ద్వారా నాణ్యమైన సేవలందించేందుకు కృషి చేస్తున్నాం. ప్రతి ఆర్బీకేను ఓ రూరల్ లైవ్‌స్టాక్ యూనిట్‌గా తీర్చిదిద్దాం. మూడేళ్లలో రూ.24.30 కోట్ల విలువైన మందులను పంపిణీ చేస్తే.. ఈ ఏడాది ప్రత్యేకంగా రూ.24 కోట్ల విలువైన మందులను అందుబాటులో ఉంచుతున్నాం. – డాక్టర్ సీదిరి అప్పలరాజు, పశు సంవర్ధక శాఖ మంత్రి -
నాలెడ్జ్ క్యాపిటల్‌గా తిరుపతి
తిరుపతి సిటీ : తిరుపతి ఇప్పటికే నాలెడ్జ్ హబ్‌గా పేరుగాంచిందని, త్వరలో నాలెడ్జ్ క్యాపిటల్‌గా తయారవుతుందని ఐజర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సంతను భట్టాచార్య చెప్పారు. ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ ఆడిటోరియంలో గురువారం సుస్థిర గ్రామీణ జీవనోపాధి సాధనపై జరిగిన జాతీయ సదస్సుకు దేశంలోని పలు వెటర్నరీ విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన వీసీలు, విభాగాల డైరెక్టర్లు, డీన్లతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ అనేక ఏళ్లుగా జంతు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. దేశంలో జీవనోపాధికోసం గ్రామీణ ప్రజలు సగటున రోజుకు 30 మంది పట్టణ ప్రాంతాలకు వలస వెళుతున్నారని, సుస్థిర గ్రామీణ జీవనోపాధికోసం వర్సిటీలు ప్రధాన పాత్ర పోషించాలని సూచించారు. జంతు సంరక్షణపై దృష్టి సారించి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యాధి మూలాలకు పరిష్కార మార్గాలను కనుగొనాలని పిలుపునిచ్చారు. అనంతరం సదస్సుకు హాజరైన వీసీలు మాట్లాడుతూ మొబైల్ యాప్స్ ద్వారా రైతులకు అవసరమైన సమాచారాన్ని అందించి వారి ప్రమాణాలను మెరుగుపర్చాలని సూచించారు. పాడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై జాతీయ సదస్సు దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. పరిశోధనల సంపుటిని ఆవిష్కరించి, అనంతరం శాస్త్రవేత్తలకు, విద్యార్థులకు పలు అంశాలపై వక్తలు అవగాహన కల్పించారు. సదస్సులో కర్ణాటక బీదర్ వర్సిటీ వీసీ కేసీ వీరన్న, తిరుపతి పద్మావతీ మహిళా వర్సిటీ వీసీ డి భారతి తదితరులు పాల్గొన్నారు. -
మూగజీవాలకు పునర్జన్మనిచ్చే సంజీవని
-
యువత సంకల్పం అత్యంత బలమైంది
తిరుపతి ఎడ్యుకేషన్: నేటి యువతే రేపటి దేశం. యువతకు మించిన గొప్ప శక్తి లేదు. యువత సంకల్పం అన్నింటి కన్నా బలమైనదని గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పారు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం (ఎస్వీ వెటర్నిటీ వర్సిటీ) 12వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. చాన్సలర్ హోదాలో గవర్నర్ హాజరై విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఆ యువత సరైన దిశలో గమ్యం వైపు పయనిస్తే బలమైన భారత్‌గా ఎదుగుతుందన్నారు.పశుపోషణ, పాడి పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో పాల ఉత్పత్తిని పెంచడంలో, పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తున్నట్టు తెలిపారు. అమూల్ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుని గ్రామీణ మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. శ్రీవారి నైవేద్యాలకు, భక్తులకు అన్న ప్రసాదాల పంపిణీతో పాటు అన్ని అవసరాలకు సేంద్రియ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయడం శుభసూచకమన్నారు. రైతులు సహజసిద్ధమైన ప్రకృతి వ్యవసాయాన్ని అవలంభించేలా వారిని ప్రోత్సహించేందుకు ఎద్దులు, ఆవులను విరాళంగా అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే దేశీయ గోజాతులను రక్షించేందుకు టీటీడీ తీసుకున్న చర్యలు అభినందనీయమన్నారు.గురువుల మార్గనిర్దేశంలో క్రమశిక్షణతో విద్యనభ్యసించిన వెటర్నరీ విద్యార్థులు పశువైద్య నీతి సూత్రాలకు అనుగుణంగా ముందుకు సాగుతూ దేశం గర్వించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. ఎస్వీ వెటర్నరి వర్సిటీ దినదినాభివృద్ధి చెందుతూ ఈ ఏడాదికి ప్రకటించిన ర్యాంకింగ్‌లో తన స్థానాన్ని మెరుగుపరుచుకుని 31వ స్థానంలో నిలవడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలను అందజేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు 35 బంగారు పతకాలు, రెండు రజతం, ఒకరికి నగదు బహుమతిని అందించారు. కేరళ వెటర్నరీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎంఆర్ శశీంద్రనాథ్, ఎస్వీ వెటర్నరీ వర్సిటీ వీసీ డాక్టర్ వి.పద్మనాభరెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అరుణాచలం రవి పాల్గొన్నారు. -
పశువుల మందులకు వేగంగా ఎన్వోసీ.. ప్రత్యేక పోర్టల్ ఆవిష్కరణ
న్యూఢిల్లీ: వెటర్నరీ ఔషధాలు, టీకాలకు సంబంధించిన దరఖాస్తులను వేగవంతంగా ప్రాసెస్ చేసేందుకు, నో–అబ్జెక్షన్ సర్టిఫికేషన్ (ఎన్వోసీ) జారీ చేసేందుకు కేంద్రం ప్రత్యేకంగా నాంది పేరిట పోర్టల్ ప్రారంభించింది. కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, డెయిరీ శాఖ మంత్రి పర్షోత్తం రూపాలా సోమవారం దీన్ని ఆవిష్కరించారు. సాధారణంగా ఔషధాలు, టీకాల దిగుమతి, తయారీ, మార్కెటింగ్ మొదలైన వాటి నియంత్రణ అనేది ఆరోగ్య శాఖలో భాగమైన సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో) పరిధిలోకి వస్తుంది. అయితే, వెటర్నరీ ఔషధాలు, టీకాలకు సంబంధించి మత్స్య, పశు సంవర్ధక, డైరీ శాఖతో సంప్రదింపుల తర్వాత అనుమతులు జారీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ మాన్యువల్‌గా ఉండటంతో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే నాంది (ఎన్వోసీ అప్రూవల్ ఫర్ న్యూ డ్రగ్ అండ్ ఇనాక్యులేషన్ సిస్టం) పోర్టల్‌ను ఆవిష్కరించినట్లు రూపాలా చెప్పారు. తాజా పరిణామంతో ఇకపై సీడీఎస్‌సీవో సుగమ్ పోర్టల్‌లో దాఖలు చేసిన దరఖాస్తును పశు సంవర్ధక, డెయిరీ విభాగానికి పంపిస్తారు. దరఖాస్తుదారు ఆన్లైన్లో అవసరమైన పత్రాలను దాఖలు చేయాలి. పశు సంవర్ధక శాఖలోని సాధికారిక కమిటీ అప్లికేషన్‌ను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటుంది. అన్నీ సంతృప్తికరంగా ఉంటే ఎన్వోసీని ఆన్లైన్లో జారీ చేస్తారు. -
పంజాబ్‌కు ఆదర్శంగా ఏపీ
సాక్షి, అమరావతి: పాడి అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కుతూ దేశానికే ఆదర్శంగా నిలిచిన పంజాబ్ రాష్ట్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకుంటోంది. మూగజీవాల కోసం ఏపీ ప్రభుత్వం విజయవంతంగా అమలుచేస్తున్న మొబైల్ అంబులేటరీ వెహికల్స్ సేవలను పంజాబ్‌లోనూ ఆచరణలోకి తీసుకొస్తున్నామని.. ఇందుకోసం కార్యాచరణ సిద్ధంచేస్తున్నామని పంజాబ్ రాష్ట్ర పశుసంవర్థక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ ప్రతాప్ తెలిపారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా విజయవాడలోని పశుసంవర్థక శాఖ సంచాలకుల కార్యాలయంలో వైఎస్సార్ పశుసంచార వైద్య సేవా రథాలను పంజాబ్ స్టేట్ పశుసంవర్ధక శాఖ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఎంపీ సింగ్‌తో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. అంబులెన్స్‌లో ఏర్పాటుచేసిన సౌకర్యాలను చూసి ఆశ్చర్యం వ్యక్తంచేశారు. అందులో ఉన్న సౌకర్యాలను పశుసంవర్థక శాఖ డైరెక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్ వివరించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో వికాస్ ప్రతాప్ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ఏపీ ఆర్బీకేలపై దేశవ్యాప్తంగా చర్చ 22 జిల్లాలతో కూడిన మా రాష్ట్రంలో 25 లక్షల ఆవులు, 40 లక్షల గేదెలున్నాయి. ముర్రా జాతి పశువులే ప్రధాన పాడి సంపద. ఏపీలో మాదిరిగానే పంజాబ్‌లోనూ సహకార రంగం చాలా పటిష్టంగా ఉంది. ఇక్కడి ఆర్బీకేల తరహాలో సేవలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచన ఉంది. ఏపీలో ఏర్పాటుచేసిన ఆర్బీకేలపై దేశం మొత్తం చర్చించుకుంటోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చాలా దూరదృష్టితో వ్యవసాయ, అనుబంధ రంగాలకు పెద్దపీట వేస్తూ ఎన్నో వినూత్న కార్యక్రమాలు అమలుచేస్తున్నారు. వన్‌స్టాప్ సొల్యూషన్ సెంటర్స్‌గా తీర్చిదిద్దిన ఆర్బీకేల ఆలోచన చాలా వినూత్నం. అలాగే, దేశీవాళీ గో జాతులను ప్రోత్సహించాలన్న సంకల్పంతో ఇక్కడ గో పెంపకం కేంద్రాల ఏర్పాటు కూడా మంచి ఆలోచన. వాటి ఉత్పత్తులకు కూడా మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం నిజంగా గొప్ప విషయం. ఏపీ ప్రభుత్వం నుంచి నేర్చుకోవాల్సిన, ఆచరించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. పంజాబ్‌లో 70 వాహనాలు ఏర్పాటుచేస్తున్నాం వైఎస్సార్ పశు సంచార వైద్య సేవా రథాలలో కల్పించిన సౌకర్యాలు చాలా బాగున్నాయి. ఇదే మోడల్లో మా రాష్ట్రంలోనూ జిల్లాకు మూడుచొప్పున 70 వాహనాలు ఏర్పాటుచేయాలని సంకల్పించాం. అందుకోసమే వాటిని çపరిశీలించేందుకు ఇక్కడకు వచ్చాం. తాము ఊహించిన దానికంటే మెరుగైన సౌకర్యాలను ఈ అంబులెన్స్‌లలో కల్పించారు. ప్రతీ వాహనానికి ఓ పశువైద్యుడు, వెటర్నరీ డిప్లమో చేసిన సహాయకుడు, డ్రైవర్ కమ్ అటెండర్లను నియమించడం, వెయ్యికిలోల బరువున్న జీవాలను తరలించేందుకు వీలుగా హైడ్రాలిక్ లిఫ్ట్, 20 రకాల పరీక్షలు, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు అనువుగా మైక్రోస్కోప్‌తో కూడిన మినీ లేబొరేటరీ, ప్రాథమిక వైద్యసేవలతో పాటు సన్నజీవాలు, పెంపుడు జంతువులు, పక్షులకు సర్జరీలు చేసేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించడం చాలా బాగుంది. టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్చేయగానే రైతు ముంగిటకు వచ్చి వైద్యసేవలు అందిస్తున్న తీరు కూడా అద్భుతం. వాహనాలను డిజైన్ చేసిన టాటా, నిర్వహణ బాధ్యతలు చూస్తున్న జీవీకే యాజమాన్యాలకు నా ప్రత్యేక అభినందనలు. -
నాగుపాముకు సిమెంట్ కట్టు
వనపర్తి: నాగుపాము అంటేనే భయంతో పరుగులు పెడతాం. కానీ సర్పరక్షకుడిగా పేరొందిన సాగర్ స్నేక్ సొసైటీ వ్యవస్థాపకుడు, హోంగార్డు కృష్ణసాగర్ తీరే వేరు. ఎక్కడైనా పాము కనిపించిందని ఫోనొస్తే.. తీసుకెళ్లి సురక్షిత ప్రాంతంలో వదిలేస్తారు. ఆదివారం వనపర్తి పట్టణం నాగవరం శివారులో కదిరెపాడు ధర్మయ్య ఇంటి నిర్మాణానికి పునాది తీస్తుండగా మట్టిపెడ్డలు పడి నాగుపాముకు గాయమైంది. ఇది గమనించి వారు కృష్ణసాగర్‌కు సమాచారమిచ్చారు. గాయంతో పాము ఇబ్బంది పడుతుండటం చూసి ఆయన పశువైద్యాధికారి ఆంజనేయులును ఆశ్రయించారు. ‘దాని ఎముక విరిగినట్టుంది.. ఎక్స్‌రే తీస్తేగానీ వైద్యం చేయలేం’ అని డాక్టర్ తేల్చారు. చివరకు డా.పగిడాల శ్రీనివాస్‌రెడ్డి ఆస్పత్రిలో పాముకు ఎక్స్‌రే తీశారు. పాముకు ఎముక విరగడంతో సిమెంట్ కట్టు వేశారు.దానికి చికిత్స పూర్తయ్యాక వనపర్తి చిట్టడవిలో వదిలేస్తానని కృష్ణసాగర్ తెలిపాడు. -
లండన్‌లో టాప్ టెన్ ఉద్యోగాలు
బ్రిటన్‌లో ఈ తరం విద్యార్థులంతా ఇప్పుడు వెటర్నరీ కోర్సులవైపు పరుగులు తీస్తున్నారు. దీంతో దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఈ కోర్సులకు భలే గిరాకీ పెరిగిందట. అందుకు కారణం దేశంలోని అన్ని ఉద్యోగాలకన్నా వెటర్నరీ డాక్టర్లకు ఎక్కువ వేతనాలు ఆఫర్ చేయడమే! వెటర్నరీ కోర్సుల ట్రెయినింగ్ ఐదారేళ్లు. ఇతర కోర్సులు అన్నింటికన్నా ఎక్కువ పీరియడ్. అయినప్పటికీ విద్యార్థులు ఈ కోర్సుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. వెటర్నరీ డాక్టర్లు ఉద్యోగంలో చేరిన సంవత్సరమే ఏడాదికి 31,636 పౌండ్లు (27,42,145 రూపాయలు) ఇస్తున్నారు. ఆ తర్వాత రెండో స్థానంలో 31,362 పౌండ్లతో (27,16,116 రూపాయలు) ప్రాపర్టీ మేనేజ్మెంట్ కన్సల్టెంట్లు, మూడవ స్థానంలో 30, 593 పౌండ్లతో (26.52,445 రూపాయలు) డెవలప్మెంట్ ఆపరేషన్స్ ఇంజనీర్లు ఉన్నారని ‘ఇండీడ్’ అనే ఉద్యోగాల అన్వేషణ సంస్థ వెల్లడించింది. ఇప్పటి వరకు డిగ్రీలు చదవిన వారంతా తమ అభిరుచుల మేరకు చదువుతారని, ఇక నుంచి వత్తిపరమైన కోర్సులు చేసే వారంతా కెరీర్‌ను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ వేతనాలవైపు మొగ్గు చూపుతారని ఉద్యోగాల వెబ్సైట్ మేనేజింగ్ డైరెక్టర్ బిల్ రిచర్డ్స్ తెలిపారు. కొన్ని ఉద్యోగాలకు గ్రాడ్యుయేషన్‌తో సంబంధం లేకుండానే ఇంతకన్నా ఎక్కువ వేతనాలు ఉంటాయని, అవి పూర్తిగా అనుభవం మీద ఆధారపడి ఉంటాయని ఆయన చెప్పారు. ఇక బ్రిటన్‌లోని ఉద్యోగాల్లో నాలుగో స్థానంలో సీనియర్ స్ట్రక్చరల్ ఇంజనీర్, ఆ తర్వాతి స్థానాల్లో ఆక్చ్వరి, పైథాన్ (లాంగ్వేజ్) డెవలపర్, రిక్రూటింగ్ కోఆర్డినేటర్, ఫుల్ స్టాక్ డెవలపర్, సీప్లస్‌ప్లస్ డెవలపర్, పదవ స్థానంలో సేఫ్టీ కన్సల్టెంట్ ఉద్యోగాలు (ఏడాదికి 24 లక్షల 60 వేల రూపాయలు) అందుబాటులో ఉన్నాయని ‘ఇండీడ్’ వర్గాలు తెలిపాయి. -
పశుగ్రాసం కరువై.. ఆకలికి తాళలేక..
దైద(గురజాల రూరల్)/మాచర్ల రూరల్: పశుగ్రాసం కరువై ఆకలికి తాళలేక జొన్న పిలకలు తిన్న 56 గోమాతలు అకాలమృత్యువు పాలయ్యాయి. గుంటూరు జిల్లా గురజాల మండలంలోని దైద గ్రామ పరిధిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. తెలంగాణలోని నల్లగొండ జిల్లాకు చెందిన గుండాల లక్ష్మయ్యకు 100 ఆవులు ఉన్నాయి. గతేడాది లాగే ఈసారీ పల్నాడు ప్రాంతానికి వచ్చి గత 45 రోజుల నుంచి అనేక చోట్ల ఆవులను మేపుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం దైద ప్రాంతానికి ఆవులను మేపటానికి తోలుకొచ్చాడు. పక్కనే ఉన్న పొలంలో జొన్న పిలకలు తిన్న ఆవులు సుడులు తిరుగుతూ కింద పడి మృతిచెందాయి. కొన్ని ఆవులకు రూ.25 వేలు వెచ్చించి 25 పామ్ ఇంజక్షన్లు ఇచ్చి వైద్యం చేసినా ఫలితం లేకపోయింది. మొత్తం 56 ఆవులు మృతిచెందడంతో లక్ష్మయ్య కుటుంబం దిక్కు తోచని స్థితిలో ఉంది. సుమారు రూ.14 లక్షల నష్టం వాటిల్లిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆవులు మృతి చెందటానికి జొన్న పిలకలు విషపూరితమవటమే కారణమని తెలుస్తోంది. నాటు జొన్న కోత అనంతరం వచ్చే పిలకలు సైనేడ్ కంటే ప్రమాదకరమని గురజాల వెటర్నరీ ఏడీ హనుమంతరావు తెలిపారు. -
సంచార పశువైద్యశాలలు ప్రారంభం
కర్నూలు(అగ్రికల్చర్): పశుసంపద పరిరక్షణకు ఉద్దేశించిన సంచాల పశు వైద్యశాలలను జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ సోమవారం ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వాహనాన్ని కలెక్టరేట్ ఆవరణలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఆళ్లగడ్డ, నంద్యాల, డోన్, ఆదోనిలకు ప్రభుత్వం సంచార పశువైద్యశాలలను మంజూరు చేసిందన్నారు. ఇందుకు ప్రత్యేకంగా వాహనం, డాక్టరు, ఒక పారా సిబ్బంది ఉండి పశుసంపదకు సేవలు అందిస్తారని తెలిపారు. పశువైద్యశాలలు లేని గ్రామాలకు వెళ్లి పశువులకు వైద్య సేవలు అందిస్తారన్నారు. వీటిని స్వచ్చంద సంస్థలు, ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెండు సంచార పశువైద్యాశాలలను సొసైటీ ఫర్ రూరల్ అండ్ ఏకో డెవలప్మెంటు సొసైటీకి, మరో రెండు అంకుష్ సంస్థకు ప్రభుత్వం అప్పగించిందన్నారు. వీటిపై ప్రభుత్వం ఐదేళ్లలో రూ. 75 లక్షలు ఖర్చు చేస్తే, స్వచ్చంద సంస్థలు రూ.25 లక్షలు ఖర్చు చేస్తాయన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పశుసంపదకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో వీటిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ సుదర్శన్‌కుమార్, ఏడీ విజయుడు, పశువైద్యాధికారి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. æ -
పశువైద్యం.. మరింత చేరువ
– జిల్లా పశు సంవర్ధకశాఖ పునర్వ్యవస్థీకరణ – 30 వైద్యశాలలకు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు – పదకొండింటి స్థాయి పెంపు – జేడీ కార్యాలయానికి 5 పోస్టులు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా పశుసంవర్ధక శాఖ పునర్ వ్యవస్థీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పశువులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఏర్పడింది. పలు గ్రామీణ పశువైద్యశాలలు, పశువైద్యశాలలను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు కొత్తగా ఏడీ, డీడీ పోస్టులు మంజూరయ్యాయి. అప్‌గ్రేడ్ అయిన గ్రామీణ పశువైద్యశాలలు.. జిల్లాలోని 30 గ్రామీణ పశువైద్యశాలలను అఫ్‌గ్రేడ్ చేశారు. ఇప్పటి వరకు కాంపౌండర్ స్థాయి ఉద్యోగులతో నడిచే వీటికి ఇకపై వెటర్నరీ అసిస్టెంటు సర్జన్లను నియమిస్తారు. అల్లూరు(నందికొట్కూరు), అల్లూరు(ఉయ్యాలవాడ), విరుపాపుర ం, బైచిగేరి, మాధవరం, ఉరుకుంద, ముక్కెళ్ల, కటారుకొండ, డబ్ల్యూ కొత్తపల్లి, ఆలమూరు, యాగంటిపల్లి, నొస్సం, కొచ్చెరువు, ముద్దవరం, ఉల్చాల, నిడ్జూరు, పోలకల్, పెద్దకొట్టాల, నెహ్రూనగర్(గోస్పాడు), ఉల్లిందకొండ, గడిగరేవుల, వెంకటాపురం, మోత్కూరు, కైరుప్పల, గూళ్యం, కొటేకల్, ముగితి, కర్నూలు బుధవారపేట, మిట్టకందాల, ప్రాతకోట(వెస్ట్) పశువైద్యశాలలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పటి వరకు పశువైద్యశాలలు (వెటర్నరీ డిస్పెన్షరీలు) జిల్లాలో 121 ఉండగా వీటితో కలిపి ఈ సంఖ్య 151కి చేరనుంది. జిల్లాకు మొత్తం 33 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు మంజూరయ్యాయి. వీటిని కొత్తవారితో భర్తీ చేస్తారు. 11 పశువైద్యశాలల స్థాయి పెంపు జిల్లాలోని 11 పశువైద్యశాలలను వెటర్నరీ హాస్పిటల్‌గా పదోన్నతి కల్పించారు. ఇకపై వీటిల్లో వెటర్నరీ అసిస్టెంటు సర్జన్లకు బదులు అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారిని నియమిస్తారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లకు పదోన్నతి కల్పించడం ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. పెద్దకడుబూరు, బేతంచెర్ల, కొసిగి, ఆస్పరి, కల్లూరు, జూపాడుబంగ్లా, పాణ్యం, వెలుగోడు, గూడూరు, రుద్రవరం, సంజామల పశువైద్యశాలలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పటి వరకు ఇలాంటివి జిల్లాలో 15 ఉండగా ఇకపై 26కు చేరతాయి. 5 డీడీ పోస్టులు మంజూరు జిల్లాకు కొత్తగా 5 ఉప సంచాలకుల (డీడీ)పోస్టులు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు కర్నూలు, నంద్యాల, ఆదోని, ఆళ్లగడ్డ(నాలుగు) డివిజన్లుండగా అసిస్టెంటు డైరెక్టర్ స్థాయి అధికారులు నేతత్వం వహిస్తున్నారు. ఈ పోస్టులను కూడా అఫ్‌గ్రేడ్ చేశారు. జిల్లా పశుగణాభివద్ధి సంస్థకు ఇప్పటి వరకు ఏడీ స్థాయి అధికారి పనిచేస్తున్నారు. దీనిని డీడీ పోస్టుగా మార్పు చేశారు. పశుగణాభివద్ది సంస్థకు అదనంగా ఒక వెటర్నరీ అసిస్టెంటు సర్జన్ పోస్టు మంజారైంది. ఇక నుంచి డివిజనల్ స్థాయిలోనూ పశుగణాభివద్ధి సంస్థకు డీడీలు పనిచే స్తారు. ఏడీలకు పదోన్నతి కల్పించడం ద్వారా వీటిని భర్తీ చేస్తారు. జేడీ కార్యాలయానికి కొత్తపోస్టులు పశుసంవర్ధశాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయానికి మూడు ఏడీ పోస్టులు, రెండు వెటర్నరీ అసిస్టెంటు సర్జన్ పోస్టులు మంజారయ్యాయి. ఇప్పటి వరకు జేడీ కార్యాలయానికి ఎలాంటి పోస్టులు లేకపోవడంతో డిప్యూటేషన్‌పై తెచ్చుకొని పనిచేయించుకుంటున్నారు. పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తి పెంపు లక్ష్యంగా 3 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు. 2 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు మంజారైనట్లు జేడీ డాక్టర్ సుదర్శన్‌కుమార్ తెలిపారు. -
మా బతుకులు అంధకారం చేయొద్దు
15వ రోజుకు పశువైద్య విద్యార్థుల ధర్నా గన్నవరం: ఏపీపీఎస్సీ నుంచి పశువైద్యుల నియామకాలను మినహాయించాలని కోరుతూ స్థానిక ఎన్టీఆర్ పశువైద్య కళాశాల విద్యార్థులు చేపట్టిన సమ్మె గురువారం 15వ రోజుకు చేరుకుంది. కళాశాల ప్రధాన ద్వారం తలుపులు మూసివేసిన విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున్న నినాదాలు చేశారు. విద్యార్థులు జి. చంద్రశేఖర్‌రెడ్డి, డి. మోహన్‌వంశీ, ఎల్. ఫణికుమార్, సుమంత్, సురేంద్రలు మాట్లాడుతూ... గత 30 ఏళ్ళుగా మెరిట్ ఆధారంగా జరుగుతున్న డిపార్ట్మెంట్ సెలక్షన్స్‌కు విరుద్దంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిరుద్యోగ పశువైద్య విద్యార్థులకు తీవ్ర నిరాశపరిచిందన్నారు. ఏపీపీఎస్సీ విధానం వల్ల ప్రతిభవంతులైన విద్యార్థుల భవిష్యత్ అంధకారంలోకి పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి పాత పద్ధతిలోనే ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు టి. హేమ, దీప్తి, వీణ, రాగిణి తదితరులు పాల్గొన్నారు. -
ఒక్క నిపుణుడుంటే ఒట్టు
– రెఫరల్ ఆసుపత్రిలో అనర్హుల తిష్ట – రాజకీయ సిఫారసులే అర్హత – పశువులకు అందని వైద్య సేవలు – రూ.5 కోట్లతో అధునాతన భవన నిర్మాణం.. అయినా ఫలితం శూన్యం కర్నూలు(అగ్రికల్చర్) : కర్నూలు కొండారెడ్డి బురుజు పక్కన బహుళార్ధ పశువైద్యశాల(వెటర్నరీ పాలీక్లీనిక్)కు రెఫరల్ ఆసుపత్రిగా గుర్తింపు ఉంది. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు, తాలూకా ఆసుపత్రుల్లోని సహాయ సంచాలకులకు సాధ్యం కాని కేసులను వెటర్నరీ పాలీ క్లినిక్‌కు రెఫర్ చేస్తుంటారు. ఇది పశువైద్యులు, ఏడీలు, రైతులకు శిక్షణ కేంద్రంగా కూడా ఉంది. బహుళార్ధ పశువైద్యశాలను రూ.5 కోట్లతో అత్యంత అధునాతనంగా నిర్మించారు. వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ పశువైద్యశాలగా మార్పు చేయనున్నారు. ఇంతటి ప్రాధాన్యం కల్గిన ఈ బహుళార్ధ పశువైద్యశాలలో రాజకీయ సిఫారసులతో అనర్హులు తిష్ట వేశారు. ఉన్నతాధికారులు కూడా రాజకీయ సిఫారసులకు అనుగుణంగా అనర్హులను నియమిస్తున్నారు. అధిక మొత్తంలో హెచ్ఆర్ఏ పొందడంతో పాటు జిల్లా కేంద్రంలోనే ఉండాలనే లక్ష్యంతో అధికార పార్టీ నేతల రెకమెండేషన్‌తో అనర్హులు వచ్చి తిష్టవేశారు. ఇప్పుడున్నవారిలో ఒక్కరు కూడా స్పెషలిస్టు లేకపోవడం గమనార్హం. ఇందువల్ల పశువులకు సరైన వైద్యసేవలు అందక మత్యువాత పడుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా నెల రోజుల వ్యవధిలో 5 పశువులు మత్యువాత పడ్డాయి. స్పెషలిస్టులే ఉండాల్సి ఉంది... బహుళార్ధ పశువైద్యశాల రెఫరల్ ఆసుపత్రి కావున విధిగా స్పెషలిస్ట్లుండాలి. సర్జరీ నిపుణుడు, మెడిసిన్ నిపుణుడు, గైనకాలజిస్ట్లుండాలి. పశువైద్యులు ఇటువంటి వాటిని ఇక్కడకు రెఫర్ చేస్తుంటారు. నిపుణులుంటేనే వాటికి సరైన చికిత్స అందే అవకాశం ఉంది. కొద్ది నెలల క్రితం వరకు స్పెషలిస్ట్‌లే ఉన్నారు. అయితే రాజకీయ పరపతిని ఉపయోగించి నిపుణులను బయటికి పంపి అనర్హులు ఇక్కడ చేరారు. ఇద్దరు ఏడీలుండగా, ఒకరు న్యూట్రీషియన్, మరొకరు పౌల్ట్రీకి చెందినవారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లలో ఒక పెతాలజీ, మరొకరు ఎల్‌పీఎంకు చెందినవారు ఒక్కరు కూడా నిపుణులు లేకపోవడం వల్ల పశువైద్యం కొండెక్కింది. పర్యవేక్షణ గాలికి.. రెపరల్ ఆసుపత్రి.. డీడీ పర్యవేక్షణల నడుస్తోంది. ప్రస్తుత డీడీ డాక్టర్ సుదర్శన్‌కుమార్ పూర్తి అదనపు బాధ్యతలతో జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. పని ఒత్తిడి కారణంగా వెటర్నరీ పాలీ క్లినిక్‌ను పూర్తిగా పక్కన పెట్టారు. విధిగా సర్జరీ నిపుణుడు, మెడిసిన్ నిపుణుడు, గైనకాలజిస్ట్ ఉండాలనే నిబంధన ఉంది. కానీ అధికార పార్టీ నేతల సిఫారసులకు తలొగ్గి అనర్హులను నియమిస్తూ వస్తున్నారన్న విమర్శలున్నాయి. నిపుణులు లేకపోగా ఉన్నవారిలో ఇద్దరు మహిళలు కావడం, కొన్ని సమయాల్లో వీరు విధి నిర్వహణలో సమర్థవంతంగా రాణించలేకపోతున్నట్లు తెలుస్తోంది. రూ.50 వేల విలువ పశువులు మృతి.. ఇటీవల పగిడ్యాల మండలానికి చెందిన లోకేశ్వర్‌రెడ్డి అనే రైతుకు చెందిన ఎద్దు అనారోగ్యానికి గురవడంతో వెటర్నరీ పాలీక్లినిక్‌కు రెఫర్ చేశారు. ఇక్కడ పశువైద్యులు చికిత్స చేసినా వ్యాధిని గుర్తించకపోవడం వల్ల చికిత్స పని చేయలేదు. దీంతో రూ.50 వేల విలువ చేసే ఎద్దు మతి చెందింది. ఓర్వకల్ పశువైద్యుడు ఒక కోడెను ఇక్కడికి రెఫర్ చేశారు. దాని వ్యా«ధికి తగిన చికిత్స అందకపోవడం వల్ల మతి చెందింది. నగరానికి చెందిన మేలు జాతి కుక్కలు సైతం మతి చెందాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు బహుళార్ధ పశువైద్యశాలపై దష్టి పెట్టాల్సి ఉంది. -
కాపాడి ఆదుకోండి
జిల్లాలో పడకేసిన పశువైద్యం అటెండర్లే దిక్కు.. ఇప్పటికే పలు కేంద్రాల మూత ఖాళీల భర్తీలో ఏళ్ల తరబడి నిర్లక్ష్యం ఆస్పత్రులను వృద్ధిచేస్తే ‘కరువు’ రైతులకు మేలు జిల్లాలో కరువు కోరలు చాచింది. పీకల్లోతూ కష్టాల్లో రైతులు అల్లాడుతున్నారు. ఇలాంటి తరుణంలో రైతులంతా ప్రత్యామ్నాయ ఉపాధిగా ‘పాడి’వైపు చూస్తున్నారు. అయితే, గ్రామాల్లో పశువైద్య కేంద్రాల దుస్థితి కలవరపాటుకు గురిచేస్తోంది. సిబ్బంది కొరతతో కేంద్రాలు కునారిల్లుతుండటంతో అనేకచోట్ల అటెండర్లే దిక్కవుతున్నారు. కొన్ని కేంద్రాలు ఇప్పటికే మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో సిబ్బందిని యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేస్తేనే రైతులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. పోస్టులు ఖాళీ.. వైద్యం నిల్ జిల్లాలో మొత్తం 106 పశువైద్యాధికారుల పోస్టులకు గాను ప్రస్తుతం 47 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 136 మంది డిప్లొమా హోల్డర్స్‌గానూ 90 మంది, 236 మంది నాలుగో తరగతి ఉద్యోగులకు గానూ 171మంది మాత్రమే పనిచేస్తున్నారు. ‘మిల్క్‌గ్రిడ్’ పథకానికి అంకురార్పణ జరిగిన గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల్లో మొత్తం 12 మంది వైద్యాధికారులు పోస్టుల్లో ఐదు ఖాళీగా ఉన్నాయి. 30 మంది డిప్లొమో హోల్డర్స్‌గానూ 18 పోస్టులు ఖాళీగా, 20 మంది నాలుగో తరగతి ఉద్యోగులకు 12 ఖాళీలున్నాయి. ఇదిలా ఉండగా, గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లితో పాటు మరికొన్ని కేంద్రాలు మూతపడ్డాయి. నియోజకవర్గంలోని చాలా కేంద్రాలు అటెండర్ల ఆధారంగానే నడుస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ‘మిల్క్‌గ్రిడ్’ ద్వారా విరివిగా పశువులను అందించి ‘పాలధార’ను పెంచాలనుకుంటుండగా రైతులు మాత్రం పశువైద్యంపై ఆందోళన చెందుతున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. గజ్వేల్: జిల్లాలో దశాబ్దాలుగా వ్యవసాయానికి అనుబంధంగా పాడిపరిశ్రమను అభివృద్ధి చేసుకుంటూ రైతులు జీవనం సాగిస్తున్నారు. అయితే, ఈసారి ఇక్కడ భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. కరువు కారణంగా పంటలు చేతికి అందక రైతులు అల్లాడుతున్నారు. ఇలాంటి తరుణంలో పాడిపరిశ్రమ వారికి ప్రత్యామ్నాయ ఉపాధిగా మారనున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం పాడి పోషణకు అనుకూలమైన వాతావరణం కల్పించింది. విజయ డెయిరీ పాలధరకు రూ.4కు పెంచడం, జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట ప్రాంతాల్లో ఁమిల్క్గ్రిడ్* పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ క్రమంలో గజ్వేల్‌లో పథకానికి అంకురార్పణ జరగడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో పశువైద్య సేవలు కొరవడం వారికి శాపంగా మారింది. మిల్క్గ్రిడ్తో పాటు ఇతర పథకాల అమలుకు పశువైద్య కేంద్రాల్లో నెలకొన్ని సమస్యలు అవరోధంగా పరిణమించే అవకాశాలుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖాళీలు భర్తీ చేయాలని ప్రభుత్వానికి నివేదించాం జిల్లాలో పశువైద్య సిబ్బంది కొరత ఇబ్బందికరంగా ఉన్న మాట వాస్తవమే. పాలసేకరణ పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ పరిణామాన్ని రైతులు హర్షిస్తున్నారు. పశువైద్య కేంద్రాల్లో నెలకొన్న ఖాళీలను భర్తీచేస్తే భారీ ప్రయోజనం ఉంటుంది. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాం. - లక్ష్మారెడ్డి, పశుసంవర్ధక శాఖ జిల్లా జాయింట్ డెరైక్టర్ పశువైద్యం మెరుగుపడాలి పాపన్నపేట: దాదాపు 20 ఏళ్లుగా పాడి పరిశ్రమను కొనసాగిస్తున్నా. నాలుగు గేదెలున్నాయి. ఒక్కోగేదె రెండు పూటలా పది లీటర్లచొప్పున పాలిస్తుంది. లక్ష్మీనగర్‌లో పాలకేంద్రం ఏర్పాటు చేశారు. కొంత గిట్టుబాటు అవుతుంది. గేదెల పోషణ ఖర్చు కూడా భారీగానే అవుతుంది. పశువులకు సత్వర చికిత్స అందించే వెసులుబాటు లేదు. పశువైద్యం స్థితిగతులు మరింత మెరుగుపరచాలి. - గోగినేని మాధవి, లక్ష్మీనగర్ ఒక్కోసారి నష్టం మహారాష్ట్రలోని షిర్డీ, బోడేగాం, ఆంధ్రలోని రాజమండ్రి, పిఠాపురం, బీదర్, జగదేవ్‌పూర్, ఎర్రగడ్డల నుంచి ముర్రజాతి గేదెలను కొనుగోలు చేస్తాం. ఒక్కో గేదె సుమారు రూ.50 వేల నుంచి 60 వేలు పలుకుతుంది. ఇక్కడ వాటిని అమ్ముతుంటా. ఒక్కో గేదెపై సుమారు రూ.5 వేల లాభం వస్తుంది. ఒక్కోసారి నష్టం కూడా వస్తుంది. ఎక్కువగా సీజనల్ వ్యాధుల నుంచి వీటిని కాపాడుకోవడం భారమవుతోంది. స్థానిక పశువైద్య శాలల సేవలు మరింత మెరుగుపడితే పాడి రైతులు సంతోషిస్తారు. - గోగినేని రంగారావు, లక్ష్మీనగర్సౌకర్యాల కొరత ఖరీఫ్ సీజన్లో వర్షాలు లేక వరిపంట వేయలేదు. దీంతో వరిగడ్డి దొరకడం లేదు. గతంలో రూ.20 దొరికే గడ్డికట్టలు ఇప్పుడు రూ.80 నుంచి రూ.100కు అమ్ముతున్నారు. దీంతో పాల ఆదాయంలో ఎక్కువమొత్తం గడ్డికే ఖర్చు చేయాల్సి వస్తుంది. మరోవైపు సీజనల్ వ్యాధులు ఎక్కువవుతున్నాయి. పశు వైద్యాధికారులు తమ సేవల్ని మెరుగుపరుచుకోవడంతో పాటు వైద్యశాలల్లో సదుపాయాలు, మందులు నిరంతరం అందుబాటులో ఉంచాలి. - దోమకొండ కిషన్‌రెడ్డి, పాపన్నపేట. జబ్బవాపు, గురక వ్యాధి ప్రమాదకరం మెదక్: గేదెలకు చలికాలంలో జబ్బవాపు, గురక వ్యాధులు వస్తాయి. వీటిని గుర్తించి వెంటనే వైద్యం చేయించాలి. ఏమాత్రం నిర్లక్ష ్యం చేసినా 48 గంటల్లో గేదెలు మృత్యువాత పడే ప్రమాదం ఉంది. గురక వ్యాధి సోకిన పశువు నీరసంగా ఉండి మేత మేయదు. అలాగే గాలికుంటు వ్యాధి సోకిన పశువులకు గెటికల్లో పుండ్లు, నాలుక చెడతాయి. పాడిగేదెలు పూర్తిగా పాలివ్వడం మానేస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించిన పశువులను వెంటనే వైద్యుల దగ్గరకు తీసుకెళ్లాలి. వ్యాధులు సోకకుండా పశువులకు ఆరు నెలలకోసారి టీకాలు వేయించాలి. జూన్‌లో పశువులకు టీకాలు వేశాం.. మళ్లీ జనవరిలో ఇస్తాం. - ఉమామ సహేరా, పశువైద్యురాలు, మాచవరం, మెదక్ మండలం పచ్చిమేత చాలా అవసరం పాలిచ్చే గేదెలకు పచ్చిమేత ఎంతో అవసరం. ప్రతిరోజు రెండుసార్లు పశువులను శుభ్రంగా కడగాలి. పాకలో దోమలు, ఈగలు వాలకుండా గ్యామగ్జిన్ పౌండర్ చల్లాలి. దాణాతో పాటు మినరల్ మిక్చర్ తప్పకుండా పెట్టాలి. ఈ పద్ధతులు పాటిస్తే ముర్రజాతి గేదెలు 10 నుంచి 15 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. పాడిగేదెలు ఎదకు వచ్చిన విషయాన్ని గమనించి సకాలంలో కృత్రిమ గర్భదారణ చేయించాలి. - బి.సిద్దిరాములు, పాడిరైతు, మెదక్ పశువైద్యులూ అప్రమత్తం సంగారెడ్డి క్రైం: రాష్ర్టంలో పశుగ్రాసం, నీటి తొట్టెల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, కరువును అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ రాష్ట్ర సంచాలకులు డాక్టర్ డి.వెంకటేశ్వర్లు సూచించారు. హైదరాబాద్ నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశుగ్రాసాన్ని తిరిగికొనే పద్ధతి ద్వారా బోర్లు ఉన్న రైతులు పశుగ్రాసాన్ని సాగు చేస్తే ఉపయుక్తంగా ఉంటుందన్నారు. వారికి సెల్ఫ్‌హెల్ప్ గ్రూపుల ద్వారా నగదు చెల్లిస్తామన్నారు. నీటి తొట్టెల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా పశుగ్రాసాన్ని సాగు చేయాలని, కరువును అధిగమించేందుకు 350 మెట్రిక్ టన్నుల విత్తనాలు, దాణ 1676 మెట్రిక్ టన్నులు, మినరల్ మిక్చర్ 89 మెట్రిక్ టన్నులు, మందుల కోసం రూ.5.90 కోట్లు కేటాయించాలని పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ వి.లక్ష్మారెడ్డి కోరారు. జిల్లాలోని అన్ని మండలాల పశువైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని, సంతల్లో పశువుల అమ్మకాలు, కొనుగోళ్లను గమనించాలని, పశుగ్రాసాలు వేరే జిల్లాకు తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పశువులాస్పత్రికి ‘తాళం’ చిన్నశంకరంపేటలోని పశువైద్యశాలకు తాళం పడింది. ఉదయం 8.30 గంటలకే తెరుచుకోవాల్సిన ఆస్పత్రి.. గురువారం 9.30 కూడా ఓపెన్ చేయలేదు. ఎంపీపీ అధ్యక్షురాలు కర్రె కృపావతి గురువారం వైద్యశాల సందర్శనకు వచ్చేసరికి సిబ్బంది లేరు. డాక్టర్ సంజయ్‌కు ఫోన్‌చేయగా స్పందన లేదు. పశుసంవర్థక ఏడీఏకు ఫోన్‌చేసినా స్పందన లేదు.. దీంతో ఆమె అసహనం వ్యక్తంచేశారు. ఇలా అయితే పశువులకు సకాలంలో వైద్యం ఎలా అందుతుందని వాపోయారు. - చిన్నశంకరంపేట సీజనల్ వ్యాధులతో భద్రం గజ్వేల్: సీజనల్ వ్యాధులను పశువులు తట్టుకోలేవు. కాబట్టి మొదటే పశుపోషకులు ఆయా వ్యాధుల లక్షణాలను గుర్తించి వైద్యుల సలహాలతో నివారణ చర్యలు చేపట్టాలి. కొన్ని సీజనల్ వ్యాధులు, వాటి నివారణ చర్యల గురించి పశువైద్య నిపుణులు ఇస్తున్న సూచనలు.. ‘కుంటు’పడే ఉత్పాదక శక్తి గాలికుంటు వ్యాధి: ఈ వ్యాధి వల్ల మరణం సంభవించదు. అయితే పశువుల్లో ఉత్పాదక శక్తి తగ్గతుంది. బలహీనంగా ఉన్న పశువుల్లో వ్యాధి నిరోదక శక్తి తగ్గడం వల్ల ఈ వ్యాధి సోకుతుంది. లక్షణాలు: పళ్ల చిగుళ్లు, నాలుక, ముట్టె లోపలి భాగాల్లో బొబ్బలు ఏర్పడతాయి. 24 గంటల్లో బొబ్బలు పగిలి చితిగిపోవడం వల్ల పశువులు మేత మేయలేవు. శరీర ఉష్ణోగ్రత 104 నుంచి 106 డిగ్రీ వరకు ఉంటుంది. గాలికుంటు వ్యాధి సోకిన పశువుల పాలు తాగిన దూడలు మృతి చెందుతుంటాయి. ఈ విషయంలో రైతులు జాగ్రత్త వహించాలి. చికిత్స: వ్యాధి సోకిన పశువులను మంద నుంచి వేరుచేయాలి. పొటాషియం పర్మాంగనేట్ కలిపిన నీళ్లతో పుండ్లను కడిగి శుభ్రం చేయాలి. హిమాక్సిన్ లాంటి అయింట్‌మెంట్‌తో పూతవేయాలి. ‘శ్వాస’ను పరీక్షించండి శ్వాసకోశ వ్యాధి: పశువులను కలవరపరుస్తున్న వాటిల్లో శ్వాసకోశ వ్యాధి ఒకటి. ఇది సోకిన పశువులు మృత్యువాత పడే అవకాశం ఉంది. తీవ్రమైన జ్వరం, కళ్లు ఎర్రబారడం, ముక్కు వెంట నీరు కారడం, నీరసం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి ఇతర పశువులకు సోకే ప్రమాదం ఉంటుంది. లక్షణాలు: శ్వాసకోశ వ్యాధి ప్రధానంగా శ్వాసకోశం నాడీ మండలం, గర్భకోశ వ్యవస్థలను ఆశిస్తుంది. గాలి కష్టంగా పీలుస్తాయి. వ్యాధి తీవ్రంగా ఉంటే నోటి ద్వారా గాలి పీల్చుకుంటాయి. ఈ వైరస్ జీర్ణకోశాన్ని ఆశిస్తే ఆకలి పూర్తిగా నశిస్తుంది. చికిత్స: ఈ వ్యాధి సోకిన పశువులకు ఎక్కువగా యాంటీబయోటిక్ మందులు ఉపయోగించాలి. పైలక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స అందించాలి. యాంటీ రెబీస్ టీకాలు వేయించాలి. వర్షాకాలంలో వచ్చే గొంతువాపు గొంతువాపు వ్యాధి: ఈ వ్యాధి ప్రభావం వర్షాకాలంలో అధికంగా ఉంటుంది. వ్యాధి సోకిన పశువు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. గొంతు, మెడ భాగంలో వాపు వస్తుంది. చికిత్స: గొంతువాపు వ్యాధికి మార్కెట్లో అనేక రకాల యాంటీబయోటిక్ మందులు లభిస్తున్నాయి. సల్ఫాడిమిన్, ఇంటాసెఫ్‌టాజు ఇంజక్షన్లు బాగా పనిచేస్తాయి. జబ్బవాపుతో కష్టమే.. జబ్బవాపు వ్యాధి: ఆకలి లేకపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస తీసుకోకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. 106 నుంచి 108 డిగ్రీల వరకు జ్వరం ఉంటుంది. చికిత్స: జబ్బవాపు వ్యాధి ప్రారంభ దశలోనే పెన్సిలిన్, ఆక్సి లాంటి యాంటీబయోటిక్ మందులు వాడాలి. పశువులకు తగిన సమయంలో టీకా వేయించడం ద్వారా దీన్ని పూర్తిగా నివారించవచ్చు. -
అర్ధరాత్రి నుంచి జీహెచ్ఎంసీ కార్మికుల సమ్మె
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలోని బీఎంఎస్ యూనియన్‌కు, అధికారులకు బుధవారం రాత్రి జరిగిన చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి దిగుతున్నట్లు యూని యన్ అధ్యక్షుడు కె. శంకర్ ప్రకటించారు. జీహెచ్ఎంసీలోని పారిశుధ్య విభాగంలోని కార్మికులతోపాటు రవాణ, ఎంటమాలజీ, బయోడైవర్సిటీ, వెటర్నరీ సహ మొత్తం 13 కేటగిరీల్లోని కార్మికులకు కూడా 27 శాతం ఇంక్రిమెంట్‌ను ఇవ్వాలనే ప్రధాన డిమాండ్‌తో పాటు ఇతరత్రా డిమాండ్లను యూనియన్ నాయకులు అధికారుల ముందుంచారు. తమ డిమాండ్లకు అధికారులు అంగీకరించనందున సమ్మె అనివార్యమైందని యూనియన్ నాయకులు శంకర్, శ్యాంబాబు, జి.మల్లికార్జున్,వినయ్‌కపూర్ చెప్పారు. ఆయా విభాగాలకు చెందిన దాదాపు 8 వేల మంది కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటార న్నారు. సమ్మెకు వెళ్లొద్దు: కమిషనర్ విజ్ఞప్తి రంజాన్ , బోనాల పండుగలు, వర్షాకాలం తరుణంలో బీఎంఎస్ నాయకులు సమ్మె ఆలోచన మానుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ యూనియన్‌కు విజ్ఞప్తి చేశారు. డిమాండ్ల పరిష్కారానికి అన్ని అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఒక ప్రకటనలో తెలిపారు. విధులను బహిష్కరించే కార్మికులపై ఎస్మా, ఆర్పీ యాక్ట్‌లకు సైతం వెనుకాడేది లేదన్నారు. నగరం పరిశుభ్రంగా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన జోనల్, డిప్యూటీ కమిషనర్లకు సూచించారు. -
పశువైద్యుల పోస్టుల భర్తీ
బొబ్బిలిటౌన్, న్యూస్‌లైన్: డివిజన్ పరిధిలోని 15 మండలాల్లో 11 పశువైద్యుల పోస్టుల భర్తీకి ఫ్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఇందులో భాగంగా నోటిఫికేషన్ కూడా వెలువడినట్లు పశుసంవర్థక శాఖ ఎ.డి. ఆర్.మురళీధర్ తెలిపారు. బుధవారం ఆయన బొబ్బిలిలో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సునందిని పథకం నాలుగు నుంచి 6 నెలల మధ్య వయస్సు కలిగిన దూడలకు ఎంతో లబ్ధి చేకూర్చి పాడి రైతుల పాలిట వరంగా మారుతుందన్నారు. కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా జన్మించిన లేగ దూడలకు నాలుగునుంచి 6నెలలలోపు వయ స్సు ఉన్న వాటికి పశు యాజమాన్యం తరఫున రూ.975 చెల్లిస్తే ప్రభుత్వం తరఫున రూ.4,025 చెల్లించడం జరుగుతుందన్నా రు. పశువులలో కాళసంచుల నివారణకు డివిజిన్ పరిధిలో 2లక్షల 64వేల పశువులకు టీకాలు వేయనున్నామని చెప్పారు. -
రాష్ట్రంలో లక్ష గొర్రెల మృత్యువాత
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: ‘‘ఈ సీజన్లో గొర్రెలు, మేకలకు ఎక్కువగా వ్యాధులు వస్తుంటాయి. కీలకమైన ఈ సమయంలో సమైక్యాంధ్ర సాధన కోసం పశువైద్యుల నుంచి పారా మెడికల్ సిబ్బంది వరకు సమ్మెబాట పట్టారు. సమ్మెకు దిగిన కాలంలో రాష్ట్రంలో లక్ష గొర్రెలు మరణించాయి. ఒక్క సీమాంధ్రలోనే 75 శాతం మృత్యువాతకు గురయ్యాయి. గొర్రెలు మరణిస్తుండటంతో వాటిపై ఆధారపడిన పెంపకందారులు తీవ్రంగా నష్టపోతున్నారు. పశువైద్యులను సమ్మె నుంచి మినహాయింపు ఇచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని’ ఆంధ్రప్రదేశ్ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ జమలయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఒంగోలు వచ్చిన సందర్భంగా స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సీజన్లో గొర్రెలు, మేకలకు గాలికుంటు, ఆంత్రాక్స్, నీలినాలుక, గిట్టపుండు వ్యాధులు వస్తాయన్నారు. నీలినాలుక, గిట్టపుండు వ్యాధులకు వ్యాక్సిన్ లేదన్నారు. గాలికుంటు వ్యాధికి వ్యాక్సిన్ ఉన్నప్పటికీ పై రెండు వ్యాధులను నియంత్రించలేరన్నారు. గొర్రెలు, మేకలు మృత్యువాత పడుతుండటంతో వాటిపై ఆధారపడిన పెంపకందారులు రోడ్డున పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పశువైద్యులు మానవతా దృక్పథంతో సేవలు అందించాలని కోరారు. నియోజకవర్గానికి ఒక మొబైల్ వ్యాన్ ఏర్పాటుచేసి పశువైద్యం అందించాలని సూచించారు. ప్రైవేట్ మందులకు రూ. 400 కోట్లు ఖర్చు గొర్రెలు, మేకలకు సంబంధించి ప్రభుత్వం అందించే మందుల్లో నాణ్యత లోపిస్తోందని జమలయ్య ఆరోపించారు. నాణ్యమైన నట్టల నివారణ మందు అందిస్తే కొన్నిరకాల వ్యాధులను నియంత్రించవచ్చన్నారు. రాష్ట్రంలో 8 లక్షల మంది పెంపకందారులున్నారని, ఒక్కో పెంపకందారుడు ఏటా 5 నుంచి 10 వేల రూపాయల మందులు కొనుగోలు చేస్తున్నారని, ఏడాదికి దాదాపు రూ. 400 కోట్లు వెచ్చిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం సరఫరా చేసే కొన్నిరకాల మందులు ప్రైవేట్ మెడికల్ షాపుల్లో విక్రయిస్తున్నారని, వాటిని ఔషధ నియంత్రణ అధికారులు అడ్డుకున్న దాఖలాలు లేవన్నారు. గొర్రెలు, మేకల పెంపకందారులకు ఈ ఏడాది రూ. 470 కోట్ల రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొందన్నారు. ఆరునెలలు గడుస్తున్నా ఇంతవరకు ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదన్నారు. నిధులు ఖర్చు చేయకుంటే క్రిమినల్ కేసులు పెట్టాలని ఆర్థిక శాఖ నిర్ణయించిందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెంపకందారుల సమస్యలపై గ్రామ స్థాయి నుంచి వివరాలు సేకరించి వాటిని పరిష్కరించాలని కోరుతూ నవంబర్‌లో అసెంబ్లీని ముట్టడించనున్నట్లు జమలయ్య వెల్లడించారు. విలేకరుల సమావేశంలో గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం జిల్లా కార్యదర్శి మొనపాటి రామకృష్ణ, సహాయ కార్యదర్శి తోట తిరుపతిరావు, లీగల్ అడ్వయిజర్ కే పిచ్చయ్య పాల్గొన్నారు.