తిరుపతి ఎడ్యుకేషన్: నేటి యువతే రేపటి దేశం. యువతకు మించిన గొప్ప శక్తి లేదు. యువత సంకల్పం అన్నింటి కన్నా బలమైనదని గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పారు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం (ఎస్వీ వెటర్నిటీ వర్సిటీ) 12వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. చాన్సలర్ హోదాలో గవర్నర్ హాజరై విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఆ యువత సరైన దిశలో గమ్యం వైపు పయనిస్తే బలమైన భారత్‌గా ఎదుగుతుందన్నారు.పశుపోషణ, పాడి పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో పాల ఉత్పత్తిని పెంచడంలో, పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తున్నట్టు తెలిపారు.
అమూల్ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుని గ్రామీణ మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. శ్రీవారి నైవేద్యాలకు, భక్తులకు అన్న ప్రసాదాల పంపిణీతో పాటు అన్ని అవసరాలకు సేంద్రియ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయడం శుభసూచకమన్నారు. రైతులు సహజసిద్ధమైన ప్రకృతి వ్యవసాయాన్ని అవలంభించేలా వారిని ప్రోత్సహించేందుకు ఎద్దులు, ఆవులను విరాళంగా అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే దేశీయ గోజాతులను రక్షించేందుకు టీటీడీ తీసుకున్న చర్యలు అభినందనీయమన్నారు.గురువుల మార్గనిర్దేశంలో క్రమశిక్షణతో విద్యనభ్యసించిన వెటర్నరీ విద్యార్థులు పశువైద్య నీతి సూత్రాలకు అనుగుణంగా ముందుకు సాగుతూ దేశం గర్వించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.
ఎస్వీ వెటర్నరి వర్సిటీ దినదినాభివృద్ధి చెందుతూ ఈ ఏడాదికి ప్రకటించిన ర్యాంకింగ్‌లో తన స్థానాన్ని మెరుగుపరుచుకుని 31వ స్థానంలో నిలవడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు పీహెచ్‌డీ పట్టాలను అందజేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు 35 బంగారు పతకాలు, రెండు రజతం, ఒకరికి నగదు బహుమతిని అందించారు. కేరళ వెటర్నరీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎంఆర్ శశీంద్రనాథ్, ఎస్వీ వెటర్నరీ వర్సిటీ వీసీ డాక్టర్ వి.పద్మనాభరెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అరుణాచలం రవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment