విశ్లేషణ
అధికారిక డేటా ప్రకారం, దేశంలో పాల ఉత్పత్తి 2021–22లో 221 మిలియన్ టన్నులు. భారతదేశపు పాల ఉత్పత్తి మెజా రిటీ బర్రెల నుండి లభిస్తుండగా, ఆవు పాల వాటా పెరుగుతోంది. 2021 నాటికి ఆవు పాల వాటా 48.2%. 2019లో విడుదల చేసిన 20వ పశుగణన ప్రకారం, ఆవులు బర్రెలు, పాలు ఇచ్చేవి వట్టి పోయినవి కలిపి, దేశంలో మొత్తం పాడి పశువులు 12.57 కోట్లు. మునుపటి గణనమీద ఇది 6% పెరుగు దల. పాలు ఇచ్చే పశువుల సంఖ్య వేరుగా లేదు. వట్టి పోయిన పశువుల సంఖ్య పెరిగిందా, తగ్గిందా? పశువుల సంఖ్యలో పెరుగుదల ఎట్లా సాధ్యం? ప్రభుత్వం ఇస్తున్న లెక్కలకూ, క్షేత్ర పరిస్థితికీ మధ్య తేడా ఉన్నది.
పలుచనవుతున్న పాలు
దేశంలోని 110 బిలియన్ డాలర్ల పాడి పరిశ్రమలో డెయిరీ సహకార సంఘాలు, ప్రైవేట్ సంస్థలు, ‘అమూల్’, ‘మదర్ డెయిరీ’ వంటి ప్రభుత్వ సంస్థలతో కూడిన సంఘటిత రంగం వాటా కేవలం 30 బిలియన్ డాలర్లు. ఇది 30 శాతం కంటే తక్కువ.
భారతదేశంలోని పాల ఉత్పత్తిలో సగానికి పైగా ప్రాసెస్ అవుతున్నది. అంటే నెయ్యి వగైరా వాటికి లేదా ఇతర ఉత్పత్తులలో ఒక ముడి పదార్థంగా వాడతారు. మిగిలిన 48% పాలుగా అమ్ముతున్నారు. నిత్యం పాలు వాడే హోటళ్ళు, స్వీట్ దుకాణాలలో పన్నీర్ కొరకు కూడా డిమాండ్ పెరుగుతోంది. పెద్ద హోటళ్ళు వాళ్ళకు అవసరమైన పాలను అధిక ధరకు కొని, వినియోగ దారుల నుంచి వసూలు చేయగలవు.
దరిమిలా చిన్న హోటళ్ళు, చాయ్ దుకాణాలకు అంతగా పాలు దొరక కపోవచ్చు. లేదా ఆ ధర వాళ్ళు పెట్టలేరు. ముడి పాల కొరకు ఉన్న ఇటువంటి పోటీ గురించి, అంతర్గత డిమాండ్ గురించి, ఆ యా వినియోగ వర్గాలు చెల్లిస్తున్న ధరల గురించి విశ్లేషణలు లేవు. పోటీ పడలేని వ్యక్తులు, రంగాలు అసంఘటిత రంగంలోనే ఎక్కువ. పర్యవసానంగా, చాయ్ దుకాణాల చాయ్‌లో పాల ‘శాతం’ తగ్గుతున్నది. కొన్ని ఉత్పత్తులలో పాలు పలుచన అవుతున్నాయి.
చిన్న పిల్లల ఎదుగుదలకు ముడి పాలు అవస రమని వైద్యులు, పోషకాహార నిపుణులు నిత్యం వల్లెవేస్తున్న తరుణంలో ‘అందరికీ పాలు’ దొరకక పోవడం అన్యాయమే. పేద వాడికి పాలు అందక పోవడం మన ఆహార వ్యవస్థలో ఉన్న తీవ్ర లోపం. ఈ లోపాన్ని సరిదిద్దే ప్రభుత్వ చర్యలు కావాలి. ఒక ఊర్లో ఉత్పత్తి అవుతున్న పాలు, ఇతర ఉత్పత్తులు అక్కడే, లేదా ఆ ప్రాంతంలోనే వినియోగం అయ్యే పరిస్థితులు ప్రభుత్వం కల్పించాలి.
దిగుమతులతో దెబ్బతినే జీవనోపాధి
అమెరికా సహా వివిధ దేశాల నుంచి ఏటా రూ. 200–300 కోట్ల విలువైన పాల ఉత్పత్తులను మన దేశం దిగుమతి చేసుకుంటోంది. 2020లో భారత ప్రభుత్వం 10,000 టన్నుల స్కిమ్డ్ మిల్క్ పౌడర్‌ను దిగుమతి చేసుకోవడానికి అనుమతించింది. 2023 జన వరిలో, దేశంలోకి పాలు, క్రీమ్ దిగుమతులు మునుపటి సంవత్సరం కంటే వెయ్యి శాతం పైగా పెరిగి 4.87 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ దిగుమతులు ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్ వంటి దేశాల నుండి వచ్చాయి.
పాల ఉత్పత్తుల దిగుమతులను సరళీకృతం చేయా లని భారత్ మీద ఐరోపా కమ్యూనిటీ, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల నుంచి ఒత్తిడి ఉన్నది. డెయిరీ ఉత్పత్తుల దిగుమతుల మీద సుంకాలు తగ్గించాలని వాణిజ్య ఒప్పందాలలో భాగంగా చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో భారతదేశం నుండి డెయిరీ దిగుమతులకు నిబంధనలు పెట్టి రష్యా, యూరప్, మెక్సికో, చైనా అనుమతించడం లేదు.
డెయిరీ దిగుమతులపై 60–70% సుంకం విధిస్తున్న అమెరికా, భారతదేశం విధించే 30–60% సుంకాలను తగ్గించాలని కోరుతున్నది. ఇంకొక వైపు అమెరికా తన డెయిరీ రంగానికి సంవత్సరానికి 28 బిలియన్ డాలర్ల సబ్సి డీలను ఇస్తుంది. పాలు, పాల ఉత్పత్తుల దిగుమతులు పెరిగితే లక్షలాది మంది భారత చిన్న, సూక్ష్మ పాడి రైతుల జీవనోపాధి ఆగమైపోతుంది అనే ఆందోళన నెలకొంది.
విధానాలు అనుకూలమేనా?
ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశం వాటా 22%. జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఇది 5%. దాదాపు 7 కోట్ల మంది పాడి రైతులు ఉన్నారు. పాడి పరిశ్రమ జీవనోపాధులను, వాతావరణ మార్పులను, కులం, మతాలను వివిధ రకాలుగా ప్రభావితం చేస్తుంది.
వినియోగదారులు వివిధ రకాలగా పాలకు ధర చెల్లిస్తున్నారు. పంటల మాదిరే పాడి రైతుకు ఆ వినియోగం నుంచి వస్తున్న డబ్బులో ఎంత శాతం చేరుతున్నది అనే ప్రశ్న ఉన్నది. బర్రె మీద, ఆవుల మీద పెట్టాల్సిన ఖర్చుకు తగినట్టు ముడి పాలకు ధర లేదనీ, ఇంకా ఆదాయం సంగతి దేవుడెరుగు అనీ పాడి రైతులు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు అనేకం ఉన్నాయి. అందులో అనేకం చిన్న పాడి రైతులు అందుకోలేరు.
భారత పాడిపరిశ్రమలో సరళీకృత విధానం చిన్న రైతులకు ముప్పు కలిగిస్తుందని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. పాడి రైతులకు భూమి దొరికే అవకాశం తగ్గిపోతున్నది. పట్టణాలలో, పట్టణ శివార్లలో భూమి ధరలకు రియల్ ఎస్టేట్ వలన రెక్కలు రావడం వల్ల చిన్న పాడి రైతు మనగలిగే పరి స్థితులు లేవు.
సగటు రైతు ఆదాయం రూ. 7,000 అని ప్రభుత్వం అంటున్నది. పశుపోషణ ఉంటే అదనపు ఆదాయం వస్తుంది. దేశంలోని రైతులు తమ మొత్తం పశుపోషణ ఆదాయంలో దాదాపు 67% పాడి ద్వారా సంపా దిస్తున్నారు. ఇంకా అనేక రకాల ఉపయోగం పాడి పశువులతో ఉంది. పర్యావరణం వినాశనం అవుతున్న తరుణంలో పశువుల వైవిధ్యం, ఆహారం, సుస్థిర జీవనం మీద దృష్టి పెట్టడం ముఖ్యం.
పుడమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో పశు పోషణ ఇంకా సమస్యాత్మకంగా మారుతున్నది. హైబ్రిడ్ జాతులతో, పాశ్చాత్య పశు పోషణ పద్ధతుల వల్ల కాలుష్యం పెరుగుతున్నది. అనారోగ్య పశువుల సంఖ్య పెరుగు తున్నది. శుభ్రత పాటించని ఆధునిక డెయిరీల వల్ల పశువుల వ్యాధులు మానవులకు సంక్రమిస్తున్నాయి. పశువులకు సరైన ఆహారం, జీవనం లేని కారణంగా వాటి పాలలో కూడా పోషకాలు ఉండటం లేదు. విషాలు, రసాయనాలు, యాంటీ బయాటిక్స్ వాటికి ఇవ్వడం వలన, వాటి పాల ద్వారా అవి మనుషులకు చేరుతున్నాయి.
పశుపోషణలో సంప్రదాయ విజ్ఞానం, నైపుణ్యానికి చాలా విలువ ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాడి పశువులను ప్రకృతి వనరుగా పరిగణించాలి. ఈ సూత్రం ఆధారంగా విధానం తీసుకురావాలి. పథకాలు వాటి సుస్థిరతకు, విస్తృతికి ఉపయోగపడే విధంగా రూప కల్పన చెయ్యాలి. స్థానిక పాడి రైతులను స్థానిక మార్కె ట్లతో అనుసంధానం చెయ్యాలి. పాలు, పాల ఉత్పత్తులు గ్రామాలలో ప్రథమంగా అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలి.
పాడి రైతులకు ప్రతి ఏటా చట్టబద్ధంగా కనీస మద్దతు ధరను ప్రకటించి, అమలు చెయ్యాలి. పాల సహకార సంఘాల సంఖ్యను పెంచాలి. కేంద్రీకృత పాల మార్కెటింగ్ వ్యవస్థకు ఇచ్చే సబ్సిడీలు స్థానిక సహకార సంస్థలకు ఇవ్వాలి. భూమి వినియోగ విధానం రూపొందించి అందులో గడ్డి మైదానాలకు స్థానం కల్పించాలి. పశుగ్రాసానికి, దాణాకు సంబంధించి శాస్త్రీయ నిర్ణయాలు తీసుకోవాలి. పాడి రైతులకు భూమి ఇవ్వాలి. లేదా భూమి ఉన్న రైతుకు పాడి పశువులను అందజెయ్యాలి.
డా‘‘ దొంతి నరసింహా రెడ్డి
వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment